అనసూయ ఆరాటం - 20 - అచ్చంగా తెలుగు

అనసూయ ఆరాటం - 20 

చెన్నూరి సుదర్శన్ 


ఎన్కటి సంగతులు మాట్లాడుకుంట కూకున్నరు. అట్లిట్ల గంట గడిసే టాల్లకు బండి సప్పుడైంది.  మామయ్య  కాలేజీ నుండి వచ్చినట్టున్న దని లేచి ఎదురుంగ ఉర్కిండు ఆదిరెడ్డి చిన్న పోరని లెక్క. 

సురేందర్ బండి మీద వినయ్, విమలను తీస్కచ్చి దించబట్టిండు. 

“మామయ్యా.. నీకోసమే సూత్తాన” అన్కుంట  విమలను ఎత్తుకున్నడు. “నువ్వు సుత బడికి పోతానవా.. ఎన్నో తరగతి..” అన్కుంట ముద్దు పెట్టుకున్నడు. “హల్లో వినయ్.. హౌ ఆర్ యూ..” ఆదిరెడ్డి ఇప్పుడు ఇంగ్లీసుల బాగ మాట్లాడుతాండు. 

“అయాం ఫైన్.. థాంక్యూ..” అన్కుంట ఇంట్లకుర్కిండు. ఆదిరెడ్డి సంకలనుండి జర్రున జారి వినయ్ వెన్కాలనే ఉర్కింది విమల.

సురేందర్ బండి స్టాండు వేసి.. ఇద్దరు కలిసి ఇంట్లకు పోయిండు. 

ఆదిరెడ్డిని కుర్సిల కూకోమని చెప్పి సురేందర్ కాళ్ళు రెక్కలు కడుక్కుందామని హమాంకాన్లకు పోయిండు. 

ఇంతల ప్రమీల మల్ల ఇద్దరికి చాయె చేసుకచ్చి ఇచ్చింది. తువ్వాల తోటి మొకం తుడ్సుకుంట చాయె గిలాస అందుకున్నడు సురేందర్. 

ఆదిరెడ్డి మెల్లంగ శ్రీనివాసరావు చెప్పిన డీలర్ షిప్ సంగతి తీసిండు. 

“మామయ్యా.. ‘ఓ-జెనెరల్’ అని జర్మనీ వాల్లు తయారు చేసిన ఏ.సీ.లు. మన స్టేట్‌ల ఈ సందుల్నే వచ్చినై. నన్ను డీలర్-షిప్ తీసుకొమ్మని శ్రీనివాసరావు ఇంజనీరు ప్రోత్సహిస్తాండు. డిపాజిట్ ఎంతో కొంత తయారు చేసుకొమ్మంటాండు. నా వల్ల అయితదా” అన్కుంట నెత్తి గోక్కోబట్టిండు.

“రెడ్డీ .. నేనూ ఆ ఏ.సీ.ల గురించి పేపర్ల సదివిన. డీలర్‌షిప్ తీసుకుంటే భవిషత్ బంగారమైతది.. కాని డిపాజిట్ దాదాపు పది లకారాలు కావాలనుకుంట..” అవునా.. అన్నట్టు ఆదిరెడ్డి మొకం సూసిండు. 

“ఔను మామయ్యా.. మిజమే.. కాని నన్నెంతో కొంత ఇమ్మంటాండు. నా దగ్గర రెండు లక్షల దాకా ఉన్నై. ఓ అయిదన్నా ఇత్తే బాగుంటదని అనుకుంటాన” 

“నిజమే రెడ్డీ.. నువ్వేం ఎన్కకు పోకు. నేను ఆ పది లక్షలు సదురుతా.. నువ్వు చెయ్యి తిప్పుకున్నంక ఇత్తువు గాని. నీ వద్ద ఉన్న పైసల తోటి ఆఫీసుకు పగిడి.. సరంజామ కర్సులు సూసుకో..” అన్కుంట చాయె తాగిన గిలాస కింద పెడ్తాంటే.. ఆదిరెడ్డి లేచి సట్బ సురేందర్ కాల్ల మీద పడ్డడు. హోమ్ వర్క్ చేసుకునే వినయ్, విమల నోరు తెర్సి సూడబట్టిండ్లు.

ప్రమీల “ఏంది అల్లుడూ.. లే.. బలే ఉన్నవ్. ఆమాత్రానికే కాల్ల మీద పడ్తవేంది. మనుషులమన్నంక ఒకలకొకలు సాయం చేసుకోకుంటే ఎట్ల” అన్నది.

“అల్లుడూ. గిట్ల కాల్ల మీద పడుడు నాకు నచ్చదు లే..” అన్కుంట బలవంతంగ లేపిండు సురేందర్. 

ఆదిరెడ్డి కండ్ల పొంటి నీళ్ళు కాల్వలై కారుతానై. 

“వద్దు రెడ్డి.. ఏడ్వకు. ఏ పనికి పూనుకున్నా.. దైర్నంగ ముదుకు అడుగేయాలె. ఏడ్సుకుంట పని మొదలు పెట్టద్దు” 

“మామయ్యా.. నువ్వు నిజంగా దేవుడువి” అని ఎక్కెక్కిపడి ఏడ్వబట్టిండు. 

“దేవుడు మనుషుల్లనే కాదు.. పనిల ఉంటడు. నీ పనిని మెచ్చుకొనే మీ నాయ్న ఎవరో ఒకరి రూపంల దేవుని లెక్క సాయపడ్తాండు. నువ్వు ముందుగాల శ్రీనివాసరావు సారుకు ఫోన్ చేసి చెప్పు. డిపాజిట్  కడ్తనని. డీలర్ షిప్ ఇప్పియ్యమను.. ఏగిరపెట్టు. ఇంకో విషయం.. ఆఫీసు, ఇల్లు దగ్గర దగ్గర ఉండెటట్టు సూసుకో.. ” అనుకుంట ఓదార్సిండు  సురేందర్.

“అయితే మామయ్యా.. నేను ముందుగాల ఇంజనీరు సారును సయంగ కలిసి చెపుతా..” అని సెలవు తీసుకొని ఇంటికి బైలెల్లిండు ఆదిరెడ్డి.

***  

  సీతాఫల్‌మండి నామాల గుండు దగ్గర ‘శివ లింగ – ఎయిర్ కండీషనర్’ అఫీసు ఖులాయించిండు ఆదిరెడ్డి. దాని కింద ‘ఆదిరెడ్డి ఓ-జెనరల్ డీలర్’ అని ట్యాగులైను పెట్టిచ్చిండు. అటు తన ఇష్టదైవమైన శివుని పేరు.. నాయ్న పేరు కలిసింది. ఇటు తన పేరూ వాడుకున్నట్లైంది. కాని జనమంతా ఆదిరెడ్డి ఏసీ షాపనే పిలిసేటోల్లు. 

ముందుగాల రాంబాబు, సారంగంలను పనిల పెట్టుకున్నడు. వాల్లకు ఇద్దరు పిలగాండ్లను చేతి కిందికిచ్చి ఓ-జెనెరల్ విండో.. స్లిట్ ఏ.సీ.లు ఫిట్టింగులు మొదలు పెట్టిండు.

రెణ్ణెల్లు పోయేటాల్లకు ఎండకాలం సీజన్ మొదలయ్యింది. పనోల్లు పది మందికి పెరిగిండ్లు. సెలవులల్ల మన ఇంటోడు ఒకడుండాలని అనిమిరెడ్డి సుత పనికి పోబట్టిండు. ఇస్టోర్‌ల సామానిచ్చుడు.. పుచ్చుకునుడు అనిమిరెడ్డే సూసుకునేటోడు. లెక్కలు రాసుకునుడు.. పనోల్లకు వారం.. వారం పైసలు అందరిమీద నిగరాని పెట్టుడు ఆదిరెడ్డి పని. ఏసీలు ఫిట్టింగులైనంక ఆదిరెడ్డి సయంగ పోయి చెకింగు చేసేటోడు. కస్టమర్ల తోటి మాట్లాడి వాల్లు తుర్తయిందీ కానిదీ తెల్సుకునేటోడు. దాంతోటి ఆదిరెడ్డికి మంచి పేరచ్చింది. ఇదువరకు ఎవ్వలూ అడిగేటోల్లు కాదని.. రిపేరుకత్తే జల్దిన చేసేటోల్లు కాదని.. తెల్సుకున్నడు. ఆలోటు రావద్దని పనోల్లకు మరీ మరీ చెప్పేటోడు. 

ఇంజనీర్లు చెకింగులకు వచ్చినప్పుడు వాల్ల కార్లల్ల, లేకుంటే.. తన బండి మీద తీస్క పోయేటోడు. కొందరు ఇంజనీర్లు బండి మీద రావాలంటే నారాజు పడేటోల్లు. 

ఇట్లైతే పని కాదని.. అదే సీజన్ల బ్యాంకుల లోను తీస్కోని ఒక కారు కొన్నడు ఆదిరెడ్డి. దాన్ని ఇంజనీర్ల కోసమే వాడేటోడు.  తనకు, తమ్మినికి బండి. 

రెండు సీజన్లు పోయినై..

ఆదిరెడ్డి కొంచెం చెయ్యి తిప్పుకున్నడు. ఎప్పటికైనా ఒక ఇల్లు కట్టుకోవాలని ఐదు వందలగజాల జాగ ఒక తాన.. రెండు వందల గజాల జాగ మరోతాన అగ్గువకత్తాంటే నాచారంల కొన్నడు.  

ఆఫీసుకు మరింత దగ్గర నామాల గుండుకెదురుంగ ఇంకో పెద్ద ఇల్లు తీసుకున్నడు.

ఆదిరెడ్డికి సెనం తీరిక దొరుకుత లేదు. మున్పటి లెక్క సురేందర్ దగ్గరికి సుత పోవుడు వీలైత లేదు. 

గిట్లైతే పురంగ కొడుకు తబియత్ కరాబైతదని.. పెండ్లి సేసుకుంటే.. కొంచెం నిమ్మలంగ ఉంటడని.. అనసూయ పెండ్లి చేసుకొమ్మని ఆదిరెడ్డి చెవుల జోరీగై సొచ్చింది

***

ఆదిరెడ్డికి పిల్లను పోలీసు రాజయ్య ధర్మసాగర్‌ల సరిత అనే పిల్లను సూసిండు. పిల్లా.. పిలగాడు నచ్చిండ్లు. సంబంధం ఖాయం చేసుకున్నరు.   

ఆదిరెడ్డి బస్సు మాట్లాడిండు. పిలగాన్ని తీస్కపోను వచ్చినోల్లు.. పిలగాడు కార్ల, ములుగు వాడోల్లు,  దోస్తులు, చుట్టాలంతా బస్సుల.. ధర్మసాగర్ పోయిండ్లు.  పెండ్లి మాజోరుగ జరిగింది.  

రవీందర్.. బుచ్చయ్య, సమ్మయ్య సేట్లు.. మొక్కుబడికి వచ్చినట్టు వచ్చి అచ్చంత లేసి పోయిండ్లు. పెండ్లి. పనులన్ని సూసుకున్నది.. చేదోడు వాదోడుగా ఉన్నది సురేందర్.

పోలీసు రాజయ్య, బతుకమ్మలు తమ కొడుకు సురేందర్ పెండ్లికంటే తక్కువేం చెయ్యలేదని పద్మనగర్ కాలనీ వాల్లంత అనుకున్నరు. 

అనసూయ పానం జరంత నిమ్మలమైంది. 

(సశేషం)


No comments:

Post a Comment

Pages