"బంగారు" ద్వీపం (అనువాద నవల) -6
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton
(కిర్రిన్ ద్వీపం తనకు చెందినదని జార్జి చెప్పిన మాటలను పిల్లలు నమ్మరు. ఆ చుట్టుపక్కల భూమంతా తమ అధీనంలోనే ఉండేదని, ఆర్ధిక యిబ్బందుల వల్ల ఈ ద్వీపం తప్ప అంతా అమ్మవలసి వచ్చిందని జార్జి చెబుతుంది. క్రమేపీ ఆమె మాటలను నమ్మిన పిల్లలు తమను అక్కడకు తీసుకెళ్ళమని కోరుతారు. తమకు తోడుగా తిమోతీని పిలుచుకు వస్తానని ఆమె పక్కనే కొండబాటలో వెళ్తుంది. తరువాత. . . .)
@@@@@@@@@@@@
"ఈ ప్రపంచంలో తిమోతీ ఎవరై ఉంటాడు?" జూలియన్ ఆశ్చర్యంగా అన్నాడు. "జాలరి కుర్రాడు. అందుకే జార్జి తల్లిదండ్రులు యిష్టపడరని అనుకొంటాను."
పిల్లలు మెత్తని యిసుకలో వెల్లకిలా పడుకొని ఎదురుచూస్తున్నారు. త్వరలోనే వారి వెనుక ఉన్న కొండ పైనుంచి జార్జి స్వరాన్ని వాళ్ళు స్పష్టంగా విన్నారు.
"రా! తిమోతీ! రా!"
తిమోతీ ఎలా ఉంటాడో చూడాలని వాళ్ళు లేచి కూర్చున్నారు. వాళ్ళకు జాలరి కుర్రాడు కనపడలేదు. దానికి బదులుగా పొడవైన తోక, నవ్వుతున్నట్లు కనిపించే వెడల్పైన మూతి గల సంకరజాతి కుక్క కనిపించింది! అది జార్జిని చుట్టేసి ఆనందంతో పిచ్చిగా గంతులేసింది. ఆమె పైనుంచి కిందనున్న వారి వద్దకు పరుగున వచ్చింది.
"తిమోతీ అంటే యిదే!" చెప్పిందామె. "ఇది పరిపూర్ణంగా ఉన్నట్లు మీరు అనుకోవటం లేదా?"
తిమోతీ మామూలు కుక్కకి విరుద్ధంగా ఉంది. దాని ఆకారమే తేడాగా ఉంది. దాని తల పెద్దది కాగా, చెవులు బాగా నిక్కబొడుచుకొని ఉన్నాయి. తోక బాగా పొడుగ్గా ఉంది. దాని వాలకాన్ని చూస్తే అది ఎలాంటి కుక్కో చెప్పటం చాలా అసాధ్యం. కానీ చూడగానే అందరూ పిచ్చిగా ఆరాధించేలా ఆకర్షించే జీవి.
"ఓ డార్లింగ్!" అంటూ అన్నె దాన్ని పట్టుకోగానే, అది ఆమె ముక్కుపై చిన్నగా నాకింది.
"ఇది గొప్పది ఎందుకు కాదు" అంటూ డిక్ దాన్ని ప్రేమగా ముద్దు పెట్టుకోగానే, కుక్క అతని చుట్టూ పిచ్చిగా తిరిగింది.
"నేను యిలాంటి కుక్కనే కోరుకొంటాను" నిజంగా కుక్కలను ప్రేమించేవాడు, తనకు స్వంతంగా ఒక కుక్క ఉండాలని ఎప్పుడూ కోరుకొనే డిక్ చెప్పాడు. "ఓ! జార్జి! బాగున్నాడు. ఈ కుక్క ఉన్నందుకు నీకు గర్వంగా లేదా?"
చిన్న అమ్మాయి నవ్వింది. ఆమె ముఖం ఒక్కసారిగా మారిపోయి తేజోవంతంగా ప్రకాశించింది. ఆమె యిసుకలో కూర్చోగానే కుక్క ఆమె ఒళ్ళో ఒదిగిపోయి జార్జి ఒళ్ళంతా నాకసాగింది.
"నేను దీన్ని విపరీతంగా ప్రేమిస్తున్నాను" అందామె. " ఏడాది క్రితం, యిది చిన్నపిల్లగా ఉన్నప్పుడు, నాకు చిత్తడి నేలలో కనిపించింది. అప్పుడు నేను దీన్ని యింటికి తీసుకెళ్ళాను. మొదట్లో అమ్మ దీన్ని యిష్టపడింది. కానీ యిది పెద్దయ్యాక కొంటెపనులు మొదలెట్టింది."
"ఏం చేసింది?" అన్నె అడిగింది.
"అదే. . .విచిత్రంగా కనిపించిందల్లా నమిలేసే కుక్కలా తయారైంది" జార్జి చెప్పింది. "అమ్మ కొన్న రగ్గు, ఆమె అందమైన టోపీ, నాన్న చెప్పులు, కొన్ని ఆయన కాగితాలు, యిలాంటివెన్నో వస్తువులను చప్పరించేసింది. విపరీతంగా మొరిగింది కూడా. నేను దాని అరుపును యిష్టపడ్డాను. కానీ నాన్నకు నచ్చలేదు. ఇది తనను దాదాపుగా పిచ్చెక్కిస్తోందని చెప్పాడు. తిమోతీని ఆయన బాగా కొట్టాడు. అది నాకు కోపం తెప్పించింది. అందుకే నేను అతనితో చాలా అసభ్యంగా ప్రవర్తించాను."
"నిన్ను బాగా కొట్టారా?" అన్నె అడిగింది. "మీ నాన్నతో మొరటుగా ఉండటాన్ని నేను యిష్టపడను. అతను చాలా కోపంగా కనిపిస్తాడు."
జార్జి సముద్రం వైపు తలను తిప్పింది. ఆమె మళ్ళీ ముఖం ముడుచుకొంది. "సరె! నాకు ఏ శిక్ష వేసారన్నది ముఖ్యం కాదు" చెప్పిందామె. “కానీ అన్నింటి కన్నా చెడ్డదేమిటంటే, నేను తిమోతీని యింట్లో ఉండనీయనని నాన్న చెప్పినప్పుడు అమ్మ ఆయనకు మద్దతు పలికింది. టిం తప్పక వెళ్ళిపోవాలని చెప్పింది. కొన్ని రోజులపాటు నేను కొట్లాడాను. నేను అసలు ఏడవలేదని మీకు తెలుసా? ఎందుకంటే అబ్బాయిలు అలా చేయరు; నేను అబ్బాయిలా ఉండటానికి యిష్టపడతాను కదా!"
"అప్పుడప్పుడు అబ్బాయిలు ఏడుస్తారు" డిక్ వైపు చూస్తూ అన్నె అంది. మూడు, నాలుగు సంవత్సరాల క్రితం అతనికి ఏడుపుగొట్టు అనే పేరు ఉండేది. డిక్ ఆమెను మోచేత్తో పొడవటంతో ఆమె వివరాలను చెప్పలేదు.
జార్జి అన్నె వైపు చూసింది.
"అబ్బాయిలు ఏడవరు" అంటూ ఆమె మొండిగా వాదనకు దిగింది. "ఏమైనా, నేను ఎప్పుడూ ఒక్కణ్ణి కూడా చూడలేదు. నేను కూడా ఎప్పుడూ ఏడవటానికి ప్రయత్నించలేదు. అది చిన్నతనం. కానీ తిమోతీ యిల్లు వదిలి వెళ్ళిపోయినప్పుడు మాత్రం నేను ఆగలేకపోయాను. ఇది కూడా బాగా ఏడిచింది. “
పిల్లలు తిమోతి వైపు ఎంతో గౌరవంగా చూశారు. ఒక కుక్క ఏడుస్తుందని అంతకు ముందు వారికి తెలియదు.
"అంటే ఇది కంట్లోంచి నీళ్ళొచ్చేలా ఏడిచిందా?" అన్నె అడిగింది.
"లేదు. అలా లేదు" జార్జి చెప్పింది. "ఆ విషయంలో దీనికి బాగా ధైర్యం ఉంది. ఇది మోర సాచి అదే పనిగా బాగా అరిచింది. ఆ సమయంలో చాలా దయనీయంగా కనిపించింది. అలా దాదాపుగా నా హృదయాన్ని ముక్కలు చేసింది. ఆ తరువాత దీన్ని విడిచి నేను ఉండలేనని నాకు తెలిసివచ్చింది."
"తరువాత ఏం జరిగింది?" జూలియన్ అడిగాడు.
నాకు తెలిసిన ఒక మత్స్యకారుడు ఆల్ఫ్ వద్దకు వెళ్ళాను, " అని జార్జి అంది. "నేను టింని నా కోసం తన దగ్గర ఉంచుకొంటాడేమోనని అడిగాను. నాకు అమ్మానాన్నలిచ్చే పోకెట్ మనీ మొత్తం తనకు యిచ్చేస్తే చూస్తానని చెప్పాడు. అతను చూస్తానని చెప్పాడు గనుక అలాగే చేస్తున్నాడు. అందుకే ఖర్చు పెట్టడానికి నా దగ్గర అసలు డబ్బు ఉండదు. అదంతా టిం కోసమే యిచ్చేస్తాను. అతను చాలా భయంకరంగా తింటున్నట్లు అనిపిస్తోంది, అంతేనా టిం?"
"వూఫ్!" అంటూ టిం బొచ్చు ఉన్న కాళ్ళను గాలిలోకి లేపి వీపు మీదకు దొర్లింది. జూలియన్ కుక్కకు చక్క్లిలిగింతలు పెట్టాడు.
"నీకు ఏదైనా స్వీట్లు, ఐసుక్రీములు కావాలనుకొన్నప్పుడు ఏం చేస్తావు?" అన్నె అడిగింది. తన జేబులో డబ్బును ఆమె వాటికే ఎక్కువ ఖర్చుపెడుతుంది.
"నేనేమీ చేయను?" జార్జి చెప్పింది. "నేను అవి లేకుండానే గడిపేస్తాను."
ఐస్‌క్రీమ్‌లు, చాక్లెట్లు మరియు స్వీట్‌లను ఇష్టపడే ఇతర పిల్లలకు ఇది చాలా విచిత్రంగా అనిపించింది. వాటిలో చాలా మంచివి ఉన్నాయి. వారు జార్జిని తెల్లబోయి చూసారు.
"అదిసరే! బీచ్‌లో ఆడే వేరే పిల్లలు తమ స్వీట్లు మరియు ఐస్‌లను మీతో కొన్నిసార్లు పంచుకుంటారని అనుకుంటాను, లేదా?" అడిగాడు జూలియన్.
"నేను దానికి అనుమతించను" జార్జి చెప్పింది. "ఎప్పుడూ నేను వారికి యివ్వలేనప్పుడు, వారి నుంచి తీసుకోవటం సరైనది కాదు. కాబట్టి నేను వద్దని చెబుతాను."
దూరంగా ఐసుక్రీము మనిషి గంట గణగణమంటూ మోగింది. జూలియన్ జేబులో డబ్బులు ఉన్నట్లు పోల్చుకొన్నాడు. వెంటనే అతను తటాలున లేచి జేబులో డబ్బులను చప్పుడు చేసుకొంటూ పరుగెత్తాడు. కొద్ది క్షణాల్లో అతను లావుగా ఉన్న చాక్లెట్ బార్ లను పట్టుకొని వెనక్కి వచ్చాడు. అతను ఒక దాన్ని డిక్ కు, మరొకదాన్ని అన్నెకు యిచ్చాడు. తరువాత ఒకదాన్ని జార్జి కి యివ్వబోయాడు. ఆమె దాని వైపు చాలాసేపు చూసి వద్దని తలాడించింది.
"వద్దు, ధన్యవాదాలు" అందామె. "నేను యిప్పుడే ఏమి చెప్పానో మీకు తెలుసు. వాటిని కొనటానికి నా దగ్గర డబ్బు లేదు. కాబట్టి దానిని మీతో పంచుకోలేను. మీ నుంచి ఏమీ తీసుకోలేను కూడా. అంటే మనం కొంచెమైనా వెనక్కి యివ్వలేనప్పుడు ఎదుటి వారి నుంచి ఏమీ తీసుకోకూడదు."
"నువ్వు నా నుంచి తీసుకోవచ్చు" అంటూ జూలియన్ జార్జి గోధుమరంగు చేతిలో పెట్టబోతాడు. "మనం చుట్టాలం."
"వద్దు, ధన్యవాదాలు" జార్జి మళ్ళీ చెప్పింది. "నేనేమనుకొన్నా, అది నీ మంచితనం."
ఆమె నీలి కళ్ళతో జూలియన్ వైపు చూసింది. ఆ మొండి అమ్మాయిని కోపంగా చూస్తే ఐసుక్రీము తీసుకొంటుందని భావించాడు. తరువాత చిరునవ్వు నవ్వాడు.
"విను" అన్నాడతను. "మేము గాఢంగా కోరుకొంటున్నదేదో నీ దగ్గర ఉంది. వాస్తవం చెప్పాలంటే, నువ్వు మమ్మల్ని అనుమతిస్తే, నీ నుంచి మేము తెలుసుకొనే విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాలను మాకు పంచిచ్చి, ఐసుక్రీములాంటివి నువ్వు మాతో పంచుకో. సరేనా?"
"మీరు పంచుకోవాలన్న విషయాలు నా దగ్గర ఏమున్నాయి?" జార్జి ఆశ్చర్యపోయింది.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment