పురాణం కధలు-బసవ పురాణం-28 - అచ్చంగా తెలుగు

పురాణం కధలు-బసవ పురాణం-28

Share This
పురాణం కధలు-బసవ పురాణం-28 
పి.యస్.యమ్. లక్ష్మి



28. తెలుగు బొమ్మయ్య కధ
పూర్వము తెలుగు బొమ్మయ్య అనే గొప్ప శివ భక్తుడుండేవాడు.  ఆయన భక్తి, సేవా తత్పరతలను చూసిన అందరూ ఆయనని కారణ జన్ముడు అనేవారు.  ఆ సమయంలోనే శ్రీశైలంలో శివానందుడనే ఒక ముని  ఆశ్రమం నిర్మించుకుని శిష్యులతో వుండేవాడు.  ఆయన ఒకసారి తపోనిష్టుడై చాలాకాలం అలాగే వుండేసరికి ఆయన చుట్టూ అంతా పుట్టలు పెరిగాయి.  అయినా దానిని కదపకుండా శిష్యులు జాగ్రత్తగా కాపాడేవారు గురువుగారి తపస్సుకి భంగం కలగకుండా.  

ఒకసారి గంధర్వులు కొందరు తమ భార్యలతో కూడా స్వేచ్ఛావిహారం సల్పుతూ ఆకాశ మార్గాన ఆ ప్రదేశం మీదనుంచి వెళ్తూ ఈ మహర్షి మీద పెరిగిన పుట్టలు చూసి ఇదేమిటో విచిత్రంగా వున్నది.  ఎత్తుగా వున్నాగానీ  కొండ కాదు.  అలాగని ఏదో పెరిగిన చెట్టు గుబురు కాదు.  లోపలనుంచి శబ్దాలు వినబడుతున్నాయి.  బహుశా అదేమన్నా కదలలేని ఎలుగు గొడ్డయి వుంటుందని తమలో తామనుకునే సమయమున విని ఆ శివానంద మునీశ్వరుని శిష్యుడు తమ గురువుని భల్లూకమన్నందుకు కోపగించి, వారి గర్వాన్ని అణచాలని వారిని ఇలా శపించాడు,  “ఓ గంధర్వులారా, మీరు గంధర్వులనీ, ఆకాశంలో విహరించగలమనీ గర్వంతో కన్నుమిన్నుగానక తపోనిష్టుడయ్యున్న మా గురువుగారిని మృగమని అనుకొని మాట్లాడుతున్నారు.  మీ గర్వమే మీకు వినాశకారి అయింది.  నేటినుంచి మీరంతా మీ భార్యలతో సహా జంతువులలాగా అరణ్యంలో తిరుగుతూ వుండండి” అని శపించాడు.  దానితో ఆ గంధర్వులు జరిగిన తప్పు తెలుసుకుని మేము మీ గురువుగారిని అవమానించటానికి అలా అనలేదు.  అదేమిటో తెలుసుకోలేని అమాయకత్వంతో  అలా అన్నాము. క్షమించమని అడిగారు.

దానికి ఆ మహర్షి శిష్యుడు నా వాక్కు అమోఘము.  ఆ శాపాన్ని అనుభవించక తప్పదన్నాడు.  అప్పుడా గంధర్వులు   మాకీ శాప విమోచనమెప్పుడు, ఎలా అవుతుందో చెప్పమని ప్రార్ధించారు.    అప్పుడా ముని శిష్యుడు మీరంతా కళ్యాణపురం సమీపంలోని అడవిలో వుండండి.  అక్కడికి తెలుగు బొమ్మయ్య అనే ఆయన వచ్చి మిమ్మల్ని వేటాడుతాడు.  అప్పుడు మీకు శాప విమోచనమవుతుంది అని చెప్పాడు.  శాపంవల్ల వారంతా లేళ్ళుగా మారి కళ్యాణ పురం సమీపంలోని అడవిలో సంచరించసాగారు.  అయితే వారికి పూర్వ జన్మ జ్ఞానం వుండటంతో తెలుగు బొమ్మయ్య ఎప్పుడు వచ్చి తమని వేటాడుతాడా, ఎప్పుడు తమకీ శాప విమోచనమవుతుందా అని ఎదురు చూడసాగారు.

ఒకసారి బొమ్మయ్య శివ పూజ కోసం బిల్వ పత్రాలకోసం ఆ అడవికి వచ్చాడు.  ఆయనను చూడగానే ఈ మృగాలన్నింటికీ చాలా సంతోషం కలిగిందిట.  దానితో వారు ఆయన తమ శాపనివారణార్ధం వచ్చిన తెలుగు బొమ్మయ్యగా భావించి అందులో ఒకరు బొమ్మయ్య దగ్గరకు వెళ్ళి తమ గురించి, తమ శాపం గురించి, దాని నివారణోపాయం గురించి తెలియజేసి తమని వేటాడి తమకి శాపవిముక్తి కలిగించమని ప్రార్ధించాడు.  బొమ్మయ్యకు తమ మాటలు నిజమని నమ్మటానికి మేము ఇతర వేటగాళ్ళ చేతికి దొరకము.  నీ ఆయుధాలతోనే ప్రాణం వదులుతాము.  అప్పుడే మాకు శాప విముక్తి అని పలికాడు.

బొమ్మయ్య కూడా తన యోగ దృష్టితో అదంతా నిజమని గ్రహించి సరేనని చెప్పి తన నగరానికి వెళ్ళి మర్నాడు  మరి కొందరు వేటగాళ్ళని తీసుకుని వేటకు కావాల్సిన సరంజామాతో ఆ అరణ్యానికి వేటకి వెళ్ళారు.  మిగతా వేటగాళ్ళు ఎంత ప్రయత్నించినా ఒక్క మృగమైనా కనబడలేదు.  శాపవశాత్తూ మృగాలైన గంధర్వులంతా బొమ్మయ్యకి ఎదురు వెళ్ళి ఆయన చేతిలోని ఆయుధాలతో మరణించి శాప విముక్తులై గంధర్వ రూపంలో ఆకాశ మార్గాన వెళ్ళటం చూసి మిగతా వేటగాళ్ళంతా వారు ఏదో కారణంగా మృగాలుగా జన్మించినవారని గ్రహించారు.  బ్రహ్మయ్య కూడా  రోజుకి ఏడు మృగాలని మాత్రమే వధించి శాప విమోచనం గావించాడు.

ఈ వృత్తాంతమంతా చారులద్వారా విని రాజు, బసవేశ్వర మంత్రి బొమ్మయ్య వేటని చూడాలని బయల్దేరారు.  అప్పుడు బసవేశ్వరుడు రాజుకీ, పుర జనులకీ చెప్పాడు.  గురు భక్తి, దైవ భక్తి వున్న మనుష్యులకి అసాధ్యం ఏదీ లేదు. బొమ్మయ్యకి ఆ జంతువులని చంపటం అతి సులభమైన పని.  కానీ ప్రకృతి ధర్మాన్ననుసరించి రోజుకి కొన్నిటినే చంపుతున్నాడు.  ఆయనకున్న భక్తి ప్రపత్తులవల్ల గంధర్వులు ఆయన చేత సంహరింపబడి శాప విముక్తులవుతున్నారు.

దీనివల్ల మనం గ్రహించ వలసినది గురువుగారి పైన వున్న అచంచల భక్తి వల్ల శిష్యుడికి గంధర్వులని కూడా శపించే శక్తి వచ్చిందనీ, ఎంత గంధర్వులైనా, ఖేచరులైనా అహంకారంవల్ల నాశనం తప్పదనీ,  భక్తి ప్రపత్తులూ, దాన ధర్మాలూ మనిషి విలువని పెంచుతాయని.

***

No comments:

Post a Comment

Pages