-ప్రతాప వెంకట సుబ్బారాయుడు
కిరణ్ వాళ్ళ నాన్నకు సీతాపురానికి బదిలీ అవడంతో, కిరణ్ అక్కడి ప్రభుత్వ పాఠశాలలోని ఆరవ తరగతిలో చేరాడు.
మైదటి రోజు తరగతికి వచ్చిన అతడిని చూసిన పిల్లలందరి ముఖాల్లో విచారం, కళ్ళలో జాలి. దానిక్కారణం పోలియో వల్ల పట్టుకోల్పోయిన అతడి కాళ్ళకు క్లిప్పర్లు ధరించాడు.
అయితే కిరణ్ ముఖంలో ఎటువంటి దిగులు వాళ్ళకు కనబడలేదు.
"నాకు పోలియో వచ్చి కాళ్ళు చచ్చుబడిపోయాయి. ఇలా జరిగిందేమిటని ఏనాడూ బాధపడలేదు. కుంగిపోలేదు. దీన్నొక సవాల్ గా తీసుకున్నాను. మా అమ్మానాన్నలు నన్నలా పెంచారు. క్లిప్పర్స్ ధరించగలిగినందుకు, వాటితో అందర్లా కాకపోయినా, కాస్త నిదానంగా అయినా ఎవరి మీదా ఆధారపడకుండా నా కాళ్ళ మీద నేను నిలబడి పనులు చేసుకోగలుగుతున్నందుకు గర్విస్తున్నాను. నేను మిమ్మల్ని కోరేదొకటే, నన్ను మీలో ఒకడిగా భావించండి. అంతేకాని నా పట్ల ఎటువంటి ప్రత్యేకతా చూపవద్దు. ఒకవేళ నా పనులు నేను సరిగా చేసుకోలేకపోతున్నా, ఎలాంటి సహాయం చేయవద్దు. అలా చేయడంవల్ల నాకు ఒకరిమీద ఆధారపడే తత్వం అలవడుతుంది. వ్యక్తిత్వం కుంటుబడుతుంది. అసలు మీ మధ్య నేనిలా ఉన్నానన్న భావన నాకు కలగకుండా చూసుకోండి అది చాలు. నానుండి మీకు ఎటువంటి సహాయం కావలసివచ్చినా నిరభ్యంతరంగా, నిస్సంకోచంగా అడగండి. చదువుకొని జీవితంలో పైకి ఎదగాలనుకుంటున్నాను. అందరం ఒకరికొకరం సహకరించుకుందాం" అన్నాడు.
అందరూ చప్పట్లుకొట్టారు.
సంవత్సరకాలం పూర్తయింది.
ఆరవతరగతి పిల్లలందరు ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణత పొందారు. అది ఆ స్కూళ్ళో నమోదైన అరుదైన సంఘటన. పిల్లలను అభినందిస్తూ ప్రధానోపాధ్యాయుడు ఒక సభ ఏర్పాటు చేశాడు. అందులో ఆరవ తరగతి నాయకుడు శ్రీకర్ మాట్లాడుతూ "కిరణ్ మాతో కలిశాక అవయాల గొప్పతనం, సమయం విలువ, చదువు ప్రాముఖ్యత, జీవితానికో ధ్యేయం ఉండాలని తెలిసింది. అంతవరకు చిన్న చిన్న సాకులు చెప్పి పాఠశాలకు ఆలస్యంగా రావడం, ఎగ్గొట్టడం, మాస్టార్లు చెప్పే పాఠాలు శ్రద్ధగా వినకపోవడం ఇలా విద్య అలక్ష్యంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు చిన్న వయసులోనే జీవితం విలువ తెలిసింది. ఇక మా భవిష్యత్తు బంగారమే" అంటూ ముగించాడు.
పిల్లల ఆలోచనలు పరిణతిచెంది ఆదర్శవంతంగా ఉంటున్నాయి. ఇంక మేము చెప్పేదేముంది మిమ్మల్ని ఉన్నతులు, ఉత్తములు అవమని దీవించడం తప్ప" అంటూ సభ చాలించాడు ప్రధానోపాధ్యాయుడు.
పిల్లలు, పెద్దల కరతాళధ్వనులతో పాఠశాల దద్దరిల్లిపోయింది.
***
No comments:
Post a Comment