చీకటి వెలుగులు - అచ్చంగా తెలుగు
 చీకటి వెలుగులు
(మా జొన్నవాడ కథలు)
డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)



ఉదయం 11 గంటలైంది. జొన్నవాడ దేవళంలో జనం క్రమంగా పలచబడుతున్నారు. ఇంతలో ఐసైస్...పాలైస్...అంటూ మోగిన ఐసుబండి గంటశబ్దం విన్న పిల్లకాయలందరూ ఇంటర్వల్ అవడంతో గుంపులు గుంపులుగా ఎగబడ్డారు. 
"నా చిన్నప్పుడు ఐసు పది పైసలుండేది" అన్న రామయ్య మాటలకు "అవును అప్పుడు బియ్యం శేరు అర్ధరూపాయే" అంటూ శేఖరయ్య నవ్వాడు. 
"నిజమే బావా! కాలం మారిపోయింది. కలికాలం. ఐసు 10 రూపాయలంట!"
"చూట్టానికి చదువుకున్న అబ్బాయిలా ఉన్నాడు. ఐసమ్ముకుంటున్నాడు"
"ఈరోజుల్లో ఉద్యోగాలెక్కడ దొరుకుతున్నాయి? ఇంజినీరింగు చదివిన వాళ్ళే ఖాళీగా ఉంటూ ఐదువేల రూపాయలకు సచివాలయాల్లో పనిచేస్తూ ఉన్నారు"
"అదీ నిజమేలే! ఎవడి బతుకు వాళ్ళది. వస్తా! కాస్తా పనుంది."
ఈ సంభాషణంతా కిరణ్ వినకపోలేదు. ఒక్క సారి నిట్టూర్పు విడిచి, ఐసు బండి ఎలిమెంటరీ స్కూలు నుండి హైస్కూలు వైపుకు తిప్పాడు. అక్కడి ఇంటర్వల్ కూడా అయ్యాక ఒక ఇంటిముందున్న పెద్ద వేపచెట్టు నీడన విశ్రాంతిగా కూర్చున్న కిరణ్ ఆలోచనలో పడ్డాడు. ఇందాక వాళ్ళన్నదాంట్లో తప్పేముంది? బీఎస్సీ ఫెయిల్ అవకపోతే ఈపాటికి ఎమ్మెస్సీనో లేక ఏదైనా ఉద్యోగమో చేసుకుంటూ ఉండేవాణ్ణి. అనవసరంగా లెక్కలు సబ్జెక్టు తీసుకుని తప్పు చేశాను. సోమన్నకు హాయిగా బ్యాంకులో ఉద్యోగం వచ్చింది. తనేమో నాన్నచేత తిట్లుతింటూ ఈ బండి మీద ఐసమ్ముకుంటున్నాను.     
"ఏయ్ అబ్బాయి నిన్నే! ఎన్ని సార్లు పిలవాలి?" అన్న కేకకు ఉలిక్కిపడి లేచి "ఎన్ని ఐసులు కావాలి?" అన్నాడు. 
"మూడు" అంటూ డబ్బులిచ్చి ఐసులు తీసుకుంటూ "ఏందబ్బాయ్! నీ  అంగడి మా ఇంటిముందే పెట్టాల్నా? రోజూ ఇదే దరువైందే నీకు! ఇంకో చోట పెట్టుకోవచ్చుగదా!" అన్న మాటలకు ఏమీ బదులివ్వకుండా పైకి చూశాడు. 
"అందరూ నీడగా ఉందని మా ఇంటిముందే అంగడి పెడతారు. గెనుసుగడ్డల బండైనా ఇక్కడే!, యెర్రగడ్డల బండైనా ఇక్కడే! చెట్టు కొట్టిచ్చేస్తే పీడాపొయ్యేటట్టుంది!" అనుకుంటూ లోపలికి వెళ్ళింది. ఇంతలో బడి వదలిపెట్టడంతో కొంతమంది పిల్లలు గుంపుగా ఆ ఇంట్లోకి పోవడం చూసిన కిరణ్ ఇంతమంది లోపలకు పోతున్నారేంటబ్బా! అని ఆలోచిస్తూ ఉండగా ఒకబ్బాయి "ఐసొకటి…తొందరగా..." అన్నాడు. వాడికి ఐసు తీసిచ్చి "బాబూ! మీరంతా ఈ ఇంట్లోకి ఎందుకు పోతున్నారు?" అన్న ప్రశ్నకు "అక్క మాకు లెక్కలు ట్యూషను చెప్తుంది. మా మేస్టర్లకంటే సూపరుగా చెప్తుంది. మాకందరికి వందకు వంద లెక్కల్లో…. తెలుసా?" అంటూ లోనకు వెళ్ళిపోయాడు.
అవును తనకూ ఎమ్మెస్సీ అయిపోయేదీపాటికి. లెక్కలు ఒక్క సబ్జెక్టు మూడు సార్లు రాసినా ఫైల్‌కావడంతో పరీక్ష ఫీజు కట్టడం కూడా దండగని తండ్రి మందలించడంతో మానేశాడు. రోజుకు 400 పైన ఐసులమ్మితే నాలుగువేలొస్తాయి. రెండువేలు కంపెనీకి పోతే, బండికి ఐదొందలు పోతే పదిహేనొందలు  మిగుల్తాయి. నెలకు ఖర్చులు పోను ముప్పై వేలు మిగుల్తున్నాయి. నాన్న ఐసమ్ముకునేవాడివి నీకేం తెలుసు అంటూ సూటిపోటి మాటలు అంటూ ఉంటాడు. అన్న ఇంట్లో పదివేలిస్తే తను ఇరవై వేలిస్తున్నాడు. అన్న ఈమధ్య రెండు నెల్లనుంచీ డబ్బులివ్వడంలేదని, వారం వారం కూడా రావడం మానేశాడని బాధపడుతుంటే తనే అమ్మకు ఇంకో ఐదువేలు ఎక్కువిస్తున్నాడు. నాన్నకు చెప్పకు ఈ విషయం బాధపడతాడు అని అమ్మ అనింది. అయినా చిన్నచూపే నాన్నకు అని బాధపడుతూ, తెచ్చుకున్న క్యారియర్లో అన్నం తిని చెట్టుక్రింద కూర్చుని ఆలోచిస్తూ ఉండగా పిల్లలంతా బయటికి వచ్చేసి, ఐసబ్బాయి ఇక్కడే ఉన్నాడే  అంటూ ఆడపిల్లలు కొంతమంది మళ్ళీ కొనుకున్నారు. ఇంతలో లోపలనుంచీ ఆ అమ్మాయి రానే వచ్చింది బయటకు. వస్తూనే "ఇంకా కాలేదా నాయనా! నీ అమ్మకాలు" అనగానే నవ్వాడు. "ఏందబ్బయ్ నవ్వుతూ ఉన్నావు. నవ్వులాటగా ఉందా?" 
"లేదు...లేదు..మీరు లెక్కలు ట్యూషన్ చెబుతారా?"
"అవును ఐతే ఏంది?"
"బిఎస్సీ లెక్కలు కూడా చెబుతారా?"
"చెబుతాను కానీ స్టూడెంట్స్ ఎవరూ లేరు"
"నాకు చెబుతారా?" అనగానే ఆశ్చర్యపడి "నువ్వు బీఎస్సీ చదువుతున్నావా?"
"మానేసి రెండేళ్ళయింది" అంటూ అన్ని వివరాలు చెప్పి "నేను పాసవుతానా?" అన్నాడు.
"గ్యారంటీగా పాసవుతావు. రేపు నీ మార్కుల లిస్టులన్నీ తీసుకునిరా!" అనగానే బుద్ధిగా స్టూడెంట్ లాగా తలకాయ ఊపాడు.
"గుడ్! నువ్వు పరీక్ష తప్పిన పుస్తకాలు కూడా తీసుకునిరా! చూస్తా ఒకసారి.. నాకు బీఎస్సీ లో డిస్టింక్షన్ తెలుసా!" అని గర్వంగా!
"అలాగా!" అన్నాడు.
***
"గుడ్! నీకు 25-30 దాకా వస్తున్నాయి. నీకొచ్చినవి కాకుండా మిగతా 3-4 చాప్టర్సు చదివితే ఐపోతుంది. బడి పిలకాయలు మధ్యాహ్నం పూట రారు. నిన్న శనివారమని వచ్చారు. నువ్వు మధ్యాహ్నం 2 నుంచీ 3 వరకూ రా చెప్తాను. 
"ఫీజు?"
"ఎక్కువేం తీసుకోనులే బాధపడకు!  ఒక ఖాళీ నోట్స్ తెచ్చుకో చాలు"
"సరే మేడం!"
"నీకంటే ఒక సంవత్సరం చిన్నదాన్నే నేను. మొన్నే ఫైనల్ ఎమెస్సీ రాశాను. నాపేరు సూర్యకుమారి" అంది.
"నాపేరు కిరణ్ కుమార్" అని చిన్నగా "మొత్తానికి సూర్య-కిరణాలు ఒకచోట కలుసుకున్నాయి" అని గొణుక్కున్నాడు.
"ఏంది? అర్ధం కాలేదు" అన్న ఆమె మాటలకు “నాకు బీఎస్సీ పాసయ్యే రోజులొచ్చినట్టున్నాయి అని అన్నాను"
"అంతేనా నాకు మరోలా వినబడిందిలే. తలతిక్క మాటలు మానేసి శ్రద్ధగా చదువుకో! మంచి భవిష్యత్తుంది నీకు... సరేలే! రేపటినుండి రెండుకల్లా ఇక్కడుండాలి. మళ్ళీ తర్వాత నాకు పనులుంటాయి"
"సరే మేడం!"
అలా మొదలైన కోచింగు ద్వారా సిలబస్ రెండు సార్లు రివిజన్ చేసుకొని పరీక్షకు కట్టాడు. రెండు నెలల్లో పరీక్షలు.
ఒకరోజు కుమారి ఉన్నట్టుండి ఒకరోజు "బీఎస్సీ అయ్యక ఏంచేస్తావు?" అని అడిగింది.
"మొదట పాసవనివ్వండి చూద్దాం"
"అలా కాదు. గోల్… అంటూ ఒకటి ఉండాలికదా?"
"పాస్ అయితే బ్యాంకు పరీక్షలు రాస్తాను. మా అన్నకు స్టేట్ బ్యాంకు క్లర్క్‌గా ఉద్యోగం దొరికింది. నేను మాత్రం ఇలా...ఐసైస్ పాలైస్" అని….. తనమీద తనే జోక్ వేసుకుని పెద్దగా నవ్వాడు.
"నువ్వు మీ అన్నకంటే పైమెట్టులోనే ఉంటావు కొద్ది నెలల్లో..దిగులు పడకు! బ్యాంకాఫీసర్ పోస్టుకు ట్రై చెయ్యి. నేను ఇంగ్లీషు, లెక్కలు చెప్తాను"
"హమ్మో! ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానన్నటు ఉంటుంది"
"లేదు చాలా సులభం. ఇప్పటినుండే ప్రాక్టీసు చెయ్యి. వచ్చే సంవత్సరం తప్పక నోటిఫికేషన్ వస్తుంది. వేరే బ్యాంకు వద్దు. స్టేట్ బ్యాంకుకే ప్రయత్నించు"
"మరి మీరు?"
"నేను లెక్కల్లో పిహెచ్.డి చేస్తాను. ప్రొఫెసర్‌గా వెళ్ళాలని ఉంది"
"గుడ్. మీ సలహా బాగానే ఉంది. బ్యాంకాఫీసర్ కు ట్రై చేస్తే కనీసం క్లార్క్ అన్నా ఈజీగా వస్తుంది"
"అలా అనుకోవద్దు. చావోరేవో… తేల్చుకునేట్టు ప్రిపేర్ అవ్వాలి. రెండు మూడు బ్యాంకు పరీక్ష పుస్తకాలు కంప్లీటుగా చెయ్యాలి."
"అలాగే చేస్తాను. బీఎస్సీ పాసవ్వగానే మా నాన్నకు చెప్పాలి. పరీక్షకు కడుతున్నట్టు చెప్పలేదు. పాస్ అయి సర్‌ప్రైజ్ చేద్దామని"
"బీఎస్సీ అవగానే చెప్పొద్దు. జాగ్రత్తగా విను… ఏందుకంటే నువ్వు దేనికీ పనికిరావని కదా అన్నారు. బ్యాంకాఫీసర్ అయ్యాక సర్‌ప్రైజ్ చెయ్యాలి ఒకేసారి.  మీ అన్నగారికంటే పై పొజిషనులో ఉంటేనే నీకు గౌరవం. అప్పటిదాకా నువ్వు ఐసమ్ముతున్నట్టే అందరూ అనుకోవాలి."
"ఇదీ బాగానే ఉంది. భయం వేసే టార్గెట్ అయినా మీరున్నారన్న ధైర్యంతో దిగుతాను"
"రేపటినుంచీ 3 నుండి 4 వరకూ బ్యాంకాఫీసర్ పరీక్షకు కోచింగ్"
"సరే!"
***
రోజులు చాలా త్వరగా గడిచిపోతున్నాయి. పరీక్షలకోసం ప్రిపేర్ అవుతున్నప్పుడు, పరీక్షరోజుల్లోను ఐసు అమ్మకుండా, మిగతా రోజుల్లో కొంచెం ఎక్కువ శ్రమపడి రోజంతా తిరిగ్ అమ్మేవాడు. పరీక్ష రాయడం పాసవడం జరిగినా ఇంట్లో చెప్పలేదు. బ్యాంకు పరీక్షకోసం ప్రాక్టీసు ఇంట్లో కాకుండా స్నేహితుడింటికి వెళ్ళి చదువుకుంటున్నాడు.
"ఒరేయ్..కిరణూ..ఈమధ్య నువ్వు ఐసు బండి రెగ్యులర్‌గా పెడుతున్నట్టు లేదు" అన్న తండ్రి ప్రశ్నకు ఉలిక్కిపడ్డ కిరణ్ "లేదు నాన్నా వెళ్తున్నాను" అన్నాడు.
"ఐసుబండి ఇంతకు ముందు మనింటిదగ్గరే పెట్టేవాడివి. అప్పుడప్పుడూ కనిపించడంలేదు"
"అదా నాన్నా..ఎక్కువ మిగిలిపోయినప్పుడు వాళ్ళకు బండి అప్పజెబితే వాళ్ళు కోల్డ్ స్టొరేజీలో పెట్టి ప్రక్కరోజు ఇస్తారు. అంతే ".
"సరే! జొన్నవాడలో పూజారి గారింటికి వెళ్తున్నావట? ఎందుకు?"
"నాన్నా మధ్యాహ్నం సమయంలో అక్కడే కూర్చుంటాను. వాళ్ళమ్మాయి ట్యూషన్లు చెబుతుంది. నాకు లెక్కలు చెప్పమని అడిగాను. పాస్ అవ్వాలంటే కనీసం రెండు మూడేళ్ళు లెక్కలు నేర్చుకోవాలట."
"ఓహో..అదా..పట్టువదలని విక్రమార్కుడిలాగా ప్రయత్నిస్తున్నావన్నమాట! ఒసే భాగ్యం..విన్నావా! మూడు సార్లు తప్పినా మళ్ళీ ట్రై చేస్తున్నాట్ట..” అని పెద్దగా నవ్వాడు.
"ఊరుకోండి. ఈ సారి పాసవుతాడేమో చూద్దాం. నవ్విన నాపచేనే పండొచ్చు!"
"నీ మొహం…. వీడి మొహానికి చదువొకటి..ఐసమ్ముకునేవాడికి పిల్లను కూడా ఇవ్వరు" అని పెద్దగా నవ్వాడు. నాన్నకు తనమీద ఉన్న నమ్మకానికి ఆశ్చర్యపడకపోయినా నిజం చెప్పకపోవడమే మంచిదైందని కుమారి మాట నిజమని అర్ధమైంది. ఇంకా కసి పెరిగిందే తప్ప తగ్గలేదు.
"ఈ విషయం  వెంటనే మీ అన్నకు చెప్పాల్రా! మాకు కొద్ది రోజులు నీ మాటలే కాలక్షేపం!" అంటూ తండ్రి పెద్దగా నవ్వుతూ ఉండగా కిరణ్ బయటికి వెళ్ళిపోయాడు.
***
కాలం బలీయం. ఎప్పుడూ ఒకేలా నడవదు. ముఖ్యంగా నది నడకా, మనిషి నడకా ఎప్పుడూ ఒకే తీరుగా ఉండవన్నట్టు, కిరణ్ అన్న సోము కులాంతరం వివాహం చేసుకుని ప్రక్క ఊరుకు ట్రాన్స్‌ఫర్ చేయించుకొని అక్కడ కాపురం పెట్టాడు. కిరణ్ రాత్రిపూట స్నేహితుడి రూములో కూర్చొని కష్టపడి చదువుతూ పగలు ఐసమ్ముతూనే ఉన్నాడు. తండ్రి ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసి రిటైర్ అవడంతో కుటుంబ భారం కూడా మీద పడే సరికి ఉక్కిరి బిక్కిరౌతున్నాడు. ఇవన్నీ వెంటవెంటనే జరగడంతో తండ్రిలో కూడా కొంచెం మార్పువచ్చి  భూమి మీద నిలబడడం మొదలు పెట్టాడు. 
***
ఒక రోజు ఉదయాన్నే కిరణ్ బయలుదేరుతుండగా "ఒరే కిరణూ.. నీకు నిన్న ఏదో కవరొచ్చిందిరా! బహుశః స్టేట్ బ్యాంకు ఏ.టి.ఎం  ర్డేమో! పోస్ట్‌మ్యాను ఇచ్చాడు" అంటూ ఇచ్చాడు. వెంటనే ఉత్తరం చింపి చూడకుండా, ఎక్కడనుండి వచ్చిందో గమనించి, జేబులో పెట్టుకుని గబగబా బయటికి వెళ్ళిపోయాడు. "అదేమిట్రా! కనీసం చింపి చూడు…" అంటున్నా వినకుండా బయటికి వెళ్ళిపోతున్న కొడుకును ఆశ్చర్యంగా చూశాడు.
బయటకువచ్చి ఆ ఉత్తరం విప్పి చూసిన వెంటనే ఆటో ఎక్కి "జొన్నవాడకు.. అర్జెంటు.." అన్నాడు. సరాసరి అమ్మవారి దర్శనానికి వెళ్ళి పూజారిని ఆ ఉత్తరం అమ్మవారి దగ్గర ఉంచి ఇవ్వమని అడిగి, తీసుకుని కుమారిని కలిసి ఉత్తరం చూపించి వలవలా కన్నీరు కారుస్తూ నిలబడి "వీధుల్లో ఐసమ్ముకునే అబ్బాయి నీవల్ల ఆఫీసరయ్యాడు" అన్నాడు. 
"చూడు కిరణ్...ఇందులో బాధ పడాల్సింది ఏమీ లేదు. జీవితమనేది మనం నడిచే దారిలాంటిది. మనకు తోడుగానడిచే వాళ్ళుంటారు. కానీ మనబదులుగా నడిచేవాళ్ళెవరూ ఉండరు. మనకు మనమే నడవాలి. ఎంతకష్టమైనా! నీ నడక ఇంతటితో ఆగిపోకూడదు. నడుస్తూనే ఉండాలి. జీవితాంతం" అన్నమాటకు జీవిత సత్యం బోధపడిందన్నట్టు తలాడించాడు.
-0o0-

No comments:

Post a Comment

Pages