కలహాల (తో) కాలక్షేపం
బి.ఎన్.వి.పార్థసారధి
అదొక బాల్య మిత్రుల వాట్స్ అప్ గ్రూప్. అందులో నలభై అయిదు మంది బాల్య మిత్రులు సభ్యులు. వాళ్ళ పరిచయం యాభై ఏళ్ల నాటిది. అందరూ అరవై ఏళ్ళు దాటిన వాళ్ళే. వాళ్ళు ఒకే పాఠశాల లో చదివారు. ఆ నలభై అయిదు మందిలో పదిమంది విదేశాల్లో వుంటున్నారు. చిత్రం ఏమిటి అంటే బాల్యం లో ప్రాణ మిత్రులుగా వున్న కొంతమంది ఇప్పుడు వాట్స్ అప్ గ్రూప్ లో రోజూ దెబ్బలాడుకుంటున్నారు. వాళ్ళు ఇప్పుడు దెబ్బలాడుకోవటానికి కారణం-మతపరమైన అంశాలమీద అన్య మతస్థులని కించపరిచే విధంగా వివాదాస్పదమైన వార్తలని వాట్స్ అప్ గ్రూప్ లో కొందరు పెట్టడం, దానిని మరికొందరు ఖండించడం.
ఇది దాదాపు దైనందిన చర్య గా మారటంతో చిలికి, చిలికి గాలివానగా మారింది. ఇద్దరు సభ్యులు తమ వాదనలని కేవలం వాట్స్ అప్ మెసేజులకి పరిమితం చేయకుండా, అదేపనిగా ఒకరికొకరు ఫోన్ చేసి మరీ తిట్టుకోవటం మొదలుపెట్టారు. తత్ఫలితంగా ఒకరోజు ఒకడికి బీపీ బాగా పెరగటం తో వారం రోజులు హాస్పిటల్ పాలయ్యాడు.
దానితో కొన్నాళ్ళు అందరూ తమ ఆవేశాలని తగ్గించుకుని శాంతియుతంగా మసలసాగారు. మళ్ళీ షరా మామూలే. చైనా వాడు మన భూభాగాన్ని ఆక్రమించుకుంటున్నా ఇప్పటి ప్రభుత్వం నిమ్మకి నీరెత్తినట్టు ఉందని ఒకడు పోస్ట్ పెట్టాడు. (అది వాడి సొంత పోస్ట్ కాదు. గాలికి దేశమంతా వాట్స్ అప్ గ్రూపుల్లో ప్రయాణించి ఒకరోజు వాడి మొబైల్ లో వాలిన గాలి కబుర్లలో ఒకానొక పోస్ట్). దానికి మరొకడు స్పందించి, 1962 లో చైనా వాడు దండెత్తి నప్పుడు అప్పటి ప్రభుత్వం వైఫల్యం వల్ల ఘోర పరాజయం చవిచూడలేదా? అని ఎదురు ప్రశ్నించాడు. దానికి ప్రతిస్పందిస్తూ మొదటి వాడు ' 1962 లో అప్పటి ప్రభుత్వం యుద్ధం చేసి ఓడిపోయింది. ఇప్పటి ప్రభుత్వం కనీసం ప్రతిఘటన కూడా చెయ్యలే'దని వెటకారం చేసాడు.
ఉక్రెయిన్ రష్యా యుద్ధం లో భారత దేశం రష్యా కి మద్దత్తు ఇవ్వటం అనైతిక చర్య అని ఒకడు పోస్ట్ పెట్టాడు. (అది కూడా దేశ సంచారం చేసి గాలివాటంతో అతని మొబైల్ కి వచ్చిన మేఘ సందేశమే.)’ రష్యా వాడు మనకి చిరకాల మిత్రుడు కాబట్టి రష్యా కి మద్దతు ఇవ్వటం తప్పు కాదు. అమెరికా వాడు అవకాశ వాది. పాకిస్తాన్ విషయంలో మనల్ని మోసం చేసాడు’ అని మరొకడు స్పందించాడు. దానికి మొదటివాడు ' మరి నీ కొడుకు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు కదా! ముందు వాడిని ఉద్యోగం మాని మన దేశానికి తిరిగి రమ్మను. ఆతరవాత నువ్వు అమెరికా వాడిమీద కామెంట్ చెయ్యి' అని చురక అంటించాడు.
వీళ్ళ వాట్సప్ గ్రూప్ కి నలుగురు అడ్మిన్ లు వున్నారు. అందులో ఇద్దరు విదేశాల్లో వుంటారు. ఆ నలుగురు అడ్మిన్ లకి తల బొప్పికట్టి చివరికి వాళ్ళు గ్రూప్ లో అందరు సభ్యులని అడ్మిన్ లని చేశారు.
గ్రూప్ లోని నలభయ్ అయిదు మందిలో ఆరుగురు తీవ్ర వాదులు. వీరు మతపరంగా, రాజకీయ పరంగా బలమైన అభిప్రాయాలు కలవాళ్ళు. వీళ్ళు పోస్టు లు, ప్రతి పోస్ట్ లు పెట్టి దెబ్బలాడుకుంటూ వుంటారు. వాళ్ళని శాంతింపచేయడానికి మరో నలుగురు రోజూ ఫైర్ ఇంజిన్ ఆపరేటర్ల లాగా రంగంలోకి దిగుతూ వుంటారు. ఈ పదిమంది అందించే నవరసాల వినోదం తిలకిస్తూ మిగతా వాళ్ళు కాలక్షేపం చేస్తారు. అలా కాలక్షేపం చేసేవాళ్ళలో ముగ్గురు ఖతర్నాక్ గాళ్ళు వున్నారు. ఏ రోజన్నా గ్రూప్ లో తుఫాన్ లేకుండా ప్రశాంత వాతావరణం నెలకొన్నప్పుడు ఈ ముగ్గురు కవ్విస్తూ వుంటారు. దానితో మళ్ళీ ఆ ఆరుగురు తీవ్రవాదులు పేట్రేగి పోతూ వుంటారు.
గ్రూప్ లో ఒకేఒక్క సభ్యుడు కేవలం ప్రేక్షక పాత్రకి పరిమితమయ్యాడు. అతను గ్రూప్ లో కనీసం మిత్రులకి పుట్టినరోజు శుభాకాంక్షల మెసేజ్ కూడా పెట్టడు. అతని పుట్టినరోజుకి మిత్రులు గ్రూప్ లో శుభాకాంక్షలు పెడితే వాటికి మాత్రం ముక్తసరిగా కృతజ్ఞతలు చెబుతాడు. అతనిపేరు మాణిక్య రావు. అతనికి ఒక కొడుకు, ఒక కూతురు. ఇద్దరికీ పెళ్లిళ్లు అయ్యాయి. ఇద్దరుకూడా విదేశాల్లో ఉంటారు.
గ్రూప్ లోని ఆరుగురు తీవ్రవాదులకి మాణిక్య రావు ప్రవర్తన వింతగా అనిపించింది. ఈ ఆరుగురు తీవ్రవాదులకు ఒక్కరోజు చేతిలో సెల్ ఫోన్ లేకపోతే నీళ్లలోంచి నేలమీద పడ్డ చేపలాగ్గా విలవిలలాడిపోతారు. అటువంటిది చేతిలో సెల్ ఫోన్ ఉండికూడా, అంటీ ముట్టనట్టు తామరాకుమీది నీటిబిందువులా మాణిక్య రావు వాట్సాప్ గ్రూప్ లో ఎలా ఉండగలుగుతున్నాడా అని ఆశ్చర్యం, సందేహంకూడా కలిగింది. ఒకసారి మాణిక్యరావు దగ్గరకి వెళ్లి తమ సందేహం నివృత్తి చేసుకుందామని అనిపించింది వాళ్లకి. మాణిక్యరావు పదవీ విరమణ చేసాక తన స్వగామానికి వెళ్ళిపోయాడు. ఎలాగైతేనేమి మాణిక్యరావు తన స్వగ్రామం లోనే వున్నాడని నిర్ధారించుకున్నాక, తాము వాళ్ళ ఊరికి వస్తున్నట్టు చెప్పకుండా, ఒకరోజు ఈ ఆరుగురు మాణిక్యరావు ఊరికి బయలుదేరారు.
చెప్పా పెట్టకుండా ప్రత్యక్షమైన తన బాల్య స్నేహితులని చూసి సంభ్రమం తోపాటు ఎంతో ఆనందాన్ని పొందాడు మాణిక్యరావు. ఉదయం వెళ్లి సాయంత్రానికి మళ్ళీ తిరుగు ప్రయాణం కడదామనుకున్న మిత్రులని బలవంతంగా వారించి ఆరోజు రాత్రి కూడా వుండి మర్నాడు వెళ్ళమని అభ్యర్ధించాడు మాణిక్యరావు. సరేనని అంగీకరించారు మిత్రులు.
మాణిక్యరావు ఉదయాన్నే నాలుగింటికి నిద్ర లేస్తాడు. అరగంట సేపు యోగా సాధన చేసి ఆనక స్నానం చేసి అరగంట పూజ చేస్తాడు. మాణిక్యరావు కి అతని తండ్రి ద్వారా సంక్రమించిన పదెకరాల పొలం వుంది. ఆరింటికల్లా చద్దన్నం తిని పొలానికి వెడతాడు. పొలం పనులు చూసుకుని మధ్యాన్నం ఒంటిగంటకి ఇంటికి చేరుకుంటాడు. భోంచేసి ఒక గంట సేపు చిన్న కునుకు తీసి మూడింటికి నిద్ర లేస్తాడు. మాణిక్యరావు భార్య ఇంటిచుట్టూతా మొక్కలు పెంచింది. ఒక అరగంట సేపు భార్యా భర్తలు చెట్లకి నీళ్లు పట్టటం, ఇంటి చుట్టూతా శుభ్రం చేయటం ఇత్యాది పనులు చేస్తారు.
సాయంత్రం అయిదు గంటలనుంచి ఏడు గంటల వరకు మాణిక్యరావు ఊర్లోని జనాలకి హోమియో వైద్యం చేస్తాడు. మాణిక్యరావు చాలామందికి హోమియో వైద్యం ఉచితంగానే చేస్తాడు. అతను ఉద్యోగంలో వున్నప్పుడే హోమియోపతి వైద్యం చదివి పట్టం కూడా పొందాడు. ఎవరైనా పదో పరకో ఇస్తే తీసుకుంటాడు. తనంతట తాను వైద్యం కోసం వచ్చిన ఎవ్వరినీ కూడా డబ్బులు ఇవ్వమని అడగడు. వాళ్ళ ఊరికి దగ్గరలోనే ప్రభుత్వ ఆసుపత్రి ఉన్నప్పటికీ ఊర్లో ని ప్రజలు చాలామంది మాణిక్యరావు దగ్గరకే వస్తారు. మాణిక్యరావు కి తన ఊర్లోనే కాకుండా చుట్టుపక్కల గ్రామాల్లో కూడా హోమియో డాక్టర్ గా చాలా మంచి పేరు వుంది.
సాయంత్రం ఏడింటివరకు హోమియో వైద్యం చేసి ఎనిమిది గంటలకల్లా మాణిక్యరావు అతని భార్య భోంచేసి ఇద్దరూ డాబా మీద అరగంట పచార్లు చేసి రాత్రి తొమ్మిదికల్లా నిద్రకుపక్రమిస్తారు. ఇది మాణిక్యరావు దినచర్య. మాణిక్యరావు ఇంట్లో మూడు కుట్టు మిషన్లు వున్నాయి. ఉదయం మాణిక్యరావు పొలం మీదికి వెళ్ళగానే అతని భార్య ఒక మూడు గంటల సేపు ఇరుగు పొరుగు మహిళలకి టైలరింగ్ ఉచితంగా నేర్పిస్తుంది.
మాణిక్యరావు మిత్రులతో పిచ్చాపాటీ మాట్లాడుతూ ఆ రోజు రాత్రి అందరూ నిద్రించే సమయానికి పదకొండు గంటలయ్యింది. మర్నాడు ఉదయం మిత్రులు ఆరింటికి నిద్ర లేచే సరికి అప్పటికే మాణిక్యరావు కాలకృత్యాలు నెరవేర్చుకుని తన భార్యకి వంటింట్లో సహాయం చేస్తున్నాడు. మిత్రులు మొహాలు కడుక్కొని వచ్చేసరికి వేడి వేడి కాఫీ, ఉప్మా సిద్ధంగా వున్నాయి. అవి సేవించి మిత్రులు బయలుదేరటానికి సిద్ధమవుతుండగా వారిని వారించి, భోజనాలయ్యాక మధ్యాహ్నం వెళ్ళమని బలవంతం చేసాడు మాణిక్యరావు. ఒంటి గంటకి భోంచేసి రెండింటికి బయలుదేరారు మిత్రులు.
మరో వారం రోజులకి వాట్స్ అప్ గ్రూప్ లోని మిత్రులందరికీ మాణిక్యరావు ఉచితంగా చేస్తున్న హోమియో వైద్యం గురించి తెలిసింది. గ్రూప్ లోని మిత్రులందరూ (విదేశాల్లో ఉంటున్న పదిమందితో సహా) మాణిక్యరావు కి సహకారంగా భారీగా విరాళాలు పోగుచేసి ఇద్దామని తలపోశారు. ఈ సంగతి మాణిక్యరావు కి తెలిసింది. అతను వారిని సున్నితంగా వారించి, వారి విరాళాన్ని స్వీకరించటానికి నిరాకరించాడు. ' మీలో ప్రతిఒక్కరు మీ వంతుగా మీకు చేతనయినంత సామాజిక సేవ చెయ్యండి. అంతే గాని ఎదో విరాళాలు ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. అలా విరాళాలు ఇవ్వటానికి ఎంతోమంది వున్నారు. కానీ సేవ చేయటానికి తక్కువమంది చొరవ చూపిస్తున్నారు. మనందరం పదవీ విరమణ చేసి ఖాళీగా ఇంట్లో కూర్చుని కాలక్షేపం చేస్తున్నాం. వాట్సా ప్ గ్రూప్ లో సామాజిక అంశాలపైన చర్చ పేరుతో బాల్యమిత్రులయ్యుండి కూడా పరస్పరం కొట్టుకుంటున్నాం. దానికి బదులు ఈ కలహాల కాలక్షేపానికి స్వస్తి పలికి సీనియర్ సిటిజెన్ గా మనవంతు సామాజిక బాధ్యతని కొంతయినా నెరవేరిస్తే అది మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మన వాట్సాప్ గ్రూప్ లో జరిగే కలహాల కాలక్షేపం వల్ల ఇప్పటికే ఇద్దరు బాల్యమిత్రులు దెబ్బలాడుకుని వాళ్లలో ఒకడికి బీ పీ పెరిగి హాస్పిటల్ కి కూడా వెళ్ళాడు. ‘అన్నాడు మాణిక్యరావు.
నెలరోజుల్లో మాణిక్యరావు ఇంటికి వెళ్లిన ఆరుగురు మిత్రుల దినచర్య లో చాలా మార్పు వచ్చింది. వాళ్ళు వాట్స్ అప్ గ్రూప్ లో కొట్టుకోవటం కాదుకదా, కనీసం మెసేజీలు కూడా పెట్టటం బాగా తగ్గించారు. ఆ ఆరుగురిలో ముగ్గురు ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్నత పదవుల్లో వుండి రిటైర్ అయ్యారు. మరో ముగ్గురు రిటైర్డ్ బ్యాంకర్లు. ఆరుగురు కలిసి ఒక ఫేస్బుక్ పేజీ ప్రారంభించారు. అందులో తమ రంగాలకి సంబంధించి " ప్రశ్నలు సమాధానాలు ' అనే శీర్షికన ప్రజలకి ఉపయోగపడేవిధంగా ఎన్నో విషయాలని అందులో షేర్ చెయ్యడం మొదలు పెట్టారు. మరో రెండు నెలలకి వాట్స్ అప్ గ్రూప్ లోని మిగతా బాల్య మిత్రులు అందరూ ఈ పేస్ బుక్ పేజీ లో చేరారు. ఇప్పుడు ఆ పేస్ బుక్ పేజీ లో అనేక అంశాలమీద ప్రజలకి ఉపయోగపడేవిధంగా పోస్ట్ లు, ప్రశ్నలకి సమాధానాలు చెప్పటం మొదలుపెట్టారు. ఏడాది తిరిగేసరికి ఆ పేస్ బూక్ పేజీ లో రెండువేలమంది ప్రజలు సభ్యులయ్యారు. ఇప్పుడు బాల్యమిత్రుల వాట్స్ అప్ గ్రూప్ పూర్తిగా క్లోజ్ అయ్యింది.
డాక్టర్. బీ. యన్. వీ. పార్ధసారధి
No comments:
Post a Comment