డా.తాడేపల్లి పతంజలి
రేకు: 0351-05 సం: 04-301
పల్లవి:
కమనీయ శరణాగతవజ్రపంజరా
చ.1: కోదండదీక్షాగురుడ! రామచంద్ర
ఆదిత్యకుల దివ్యాస్త్రవేది
సోదించుమారీచునితలగుండుగండ
ఆదినారాయణ యసురభంజనా
చ.2: ఖరదూషణ శిరఃఖండన ప్రతాప
శరధిబంధన విభీషణవరదా
అరయ విశ్వామిత్రయాగసంరక్షణ
ధరలోన రావణదర్పాపహరణ
చ.3: పొలుపొంద నయోధ్యపుర వరాధీశ్వర
గెలుపుమీరిన జానకీరమణ
అలఘుసుగ్రీవాంగదాది కపిసేవిత
సలలిత శ్రీవేంకటశైలనివాసా
భావం
పల్లవి:
దశరథనందన! అందమైన వాడా !శరణమని కోరినవారికి విడిపించుకొనుటకు వీలులేని వజ్రపంజరము వంటివాడా!(శత్రువులు రాముని శరణుకోరిన వారిని ఏమీ చేయలేరని భావం)నీకు నమస్కారము. నమస్కారము. మమ్ములను నువ్వు రక్షించు.
చ.1:
కోదండదీక్షకు గురుడవు! రామచంద్ర!
సూర్యవంశమునందు జన్మించినవాడా ! దివ్యాస్త్రవేది(మంత్ర ప్రయోగాదులవలన శక్తినొంది శత్రు సంహారము చేయు దివ్యాస్త్రములు తెలిసినవాడా !)
లేడీరూపములో వెదికించిన మారీచునికి తలగుండుగండ(ప్రాణాంతకుడా !)
ఆదినారాయణుడా ! రాక్షస సంహారకుడా !
చ.2:
ఖరుడు దూషణుడు అను రాక్షసులయొక్క శిరస్సులను ఖండిరచు ప్రతాపము కలవాడా !
సముద్రమును బంధించిన వాడా ! విభీషణునికి వరము ఇచ్చినవాడా ! విశ్వామిత్రుని యాగము కాపాడినవాడా !
ఈ భూమిలో రావణుని దర్పమును హరించినవాడా !
చ.3:
అందమొప్పగా అయోధ్యపురమునకు చక్రవర్తీ !
అధికమైన గెలుపులు కలిగిన జానకీ రమణుడా !
అమిత పరాక్రమ వంతులైన సుగ్రీవుడు, అంగదుడు మొదలైన వానరములచే సేవింపబడినవాడా !
మనోహరత్వము కలిగినవాడా ! శ్రీవేంకటశైలనివాసా! రామా !
విశేషాలుజ:
కోదండదీక్షాగురుడ
కోదండరాముడు అని ప్రసిద్ధి. కాని అన్నమయ్య కోదండదీక్షాగురుడని ఒక చిత్రమైన ప్రయోగము చేసాడు. కవి సమ్రాట్ విశ్వనాథ నా రాముడు అను పుస్తకములో ఈ కోదండరాముని గూర్చి వ్రాసిన వాక్యాలు చదివితే అన్నమయ్య ప్రయోగ సారస్యము మనకు తెలుస్తుంది.
దేనిచేత క్రీడిరపబడుచున్నదో అది కోదండము. విలువిద్య నేర్చిన వారందఱి పేర్లకు వెనుక కోదండము చేర్చుటలేదు. శ్రీరాముని మాత్రమే కోదండ రాముడందుము.
శ్రీరాముడు తన కోదండముతో నిది చేయగలడిది చేయలేడని లేదు. ప్రదరము అనగా బాణము. లస్తకము వింటి మధ్యభాగము, ఎడమచేతి పిడికిలితో పట్టుకొనెడి చోటు. ధనుస్సును వంచి త్రాడు వదలి పెట్టగా నల్లెత్రాటి వేగము చేత బాణము పోవును. ఈ రామునకు లస్తకముతో పని లేదు. చాపాంతము చాపాది అనగా ధనుస్సు చివర మొదలు ధనుస్సులో నేభాగమైనను సరే ఆయనకు లస్తకమే.
ఆ విల్లు ముఖ్యమా తాను ముఖ్యమా? తానే ముఖ్యము. ఆ ధనుస్సువట్టి నిమిత్త మాత్రము. మరి విల్లెందుకు? తాను కోదండ రాముడగుటకు. ఆ విల్లు బుజాన నుండవలయును. దానితో సహా స్వామిని ధ్యానించవలయును. ఉపాసన చేయవలయును. కోదండరామమంత్రములో కోదండమునకు గూడ ప్రాధాన్యమున్నది.
స్వామి బాణ మెట్లైనను తిరుగును. ఏ విధముగా నైన వదలును. ఎక్కడ తగులవలయునో అక్కడే తగులును.
ఆయన బాణములు పోయెడు తీరులోని విలక్షణత్వము చెప్పినగాని యాయన కోదండరాముడన్న మాటలోని యర్థము తెలియదు. ఆ కోదండమాటవస్తువు. కోదండరాముడుపాసనామూర్తి. అంతే, విల్లులేదు. బాణము వేయుటలేదు. లోకములోని ధనుస్సులకులోకములోని బాణములకు శ్రీరామచంద్రుని ధనుర్బాణములకు సంబంధము లేదు. కోదండరాముడనగా నిది.
కోదండరాముడు ఉపాసనామూర్తి కనుకనే అన్నమయ్య కోదండదీక్షాగురుడని ప్రయోగించాడు.
No comments:
Post a Comment