సత్యం వధ .. ధర్మం చెర!
కర్లపాలెం హనుమంతరావు
సుబ్బారావును అట్లా చూస్తానని కల్లో కూడా అనుకోలే. ప్రతివాది తరుఫున అవతలి ప్లీడరు ఏర్పాటు చేసుకొన్న సాక్షుల్లోవీడూ ఒకడు.
వకీలు వృత్తిలో ఉన్నవాణ్ణి, కేసు గెలుపు కోసం లాయరు కరవని గడ్డుండదని తెలుసు. బోనెక్కి సాక్షం చెప్పే వాళ్లంతా సత్యహరిశ్చంద్రుడి తమ్ముళ్ళని ఏ జడ్జీ అనుకోడు . ఎన్నో ఢక్కామొక్కీలు తినొస్తేనే ఆ ఎత్తు కుర్చీ ఎక్కే తాహతు ఏ ప్లీడరుకైనా దక్కేది. సరే, ఆ మతలబులన్ని అట్లా ఉంచి ఇప్పుడీ సుబ్బారావుగాడి కథేందో చూద్దాం!
మా పెదగంజాంలో ఉప్పుకొటార్ల లీజు మీద బతుకీడ్చే పోలిశెట్టి మూడో వంశోద్ధారకుడీ సుబ్బిగాడు. కాస్త అక్షరం ముక్కంటితే ఈ ఉప్పుటేరు యాగీలన్నీ తప్పిపోతాయన్న ఆ తండ్రి యావను అలుసుగా తీసుకొని హైస్కూలు చదువు నెపంతో ఒంగోలు వెళ్లి చెడతిరుగుళ్లు తిరిగేవాడీ భడవాయి. కొంప సగం మునిగిందాకా పుత్రరత్నం ఉద్ధారం నమ్మలేదు పిచ్చి పోలిశెట్టి . వీడి చదువుకు ధారపోసిన కష్టార్జితమంతా గోడక్కొట్టిన సున్నమేనన్న జ్ఞానం శెట్టికి అబ్బినాక అర్ధాంతరంగా వీడి షికార్లకు బ్రేకు పడ్డది. ఇంట్లోనే ఓ రెణ్ణెళ్లపాటు కుదురు నటించి, లీజు డబ్బు కంటబడ్డ మరుక్షణమే ఊళ్లో నుంచి జంపయిపోయాడీ ఘనుడు. బడుద్ధాయి కొడుక్కోసం పోలిశెట్టీ ఏ మాత్రమో ఓ మూడ్రోజులు కాస్త తహతహ నటించినా ఆనక తన సాగు ఝంఝాటాల్లో తాను మునిగిపోయాడు. మా స్కూలు రిజిప్టర్లో వాడి పేరు కొట్టేసిన దుర్వార్త పోలిశెట్టి చెవిలో మొట్టమొదటిసారి వేసిన ఘనత నాదే. సుబ్బిగాడి ఆ పోక పోక మళ్లీ ఇప్పుడు ఇట్లా బాపట్ల డిస్ట్రిక్టు కోర్టు బోనులో దొంగసాక్షిగా కనపడ్డమే!
మధ్యాహ్నం లంచ్ బ్రేకప్పుడు వాడే వరండాలో వెనకమాల్నుంచొచ్చి ' ఒరే.. రాంబాబుగా ! ' అని పోలికేకేయడంతో ఆగక తప్పింది కాదు నాకు . ఆ టైములో నా క్లయింట్ జీడిపప్పు వరప్రసాదుగారు పక్కనే ఉండిపోయారు. ఆయన మోహంలో రంగులు మారడం చూసి మా సుబ్బిగాడితో అపరిచితం నటించక తప్పలేదు. నిజానికి నాకూ వాడి కథా కమామిషూ గురించి కుతూహలం లేకపోలేదు; సందర్భం కలసిరాకే ఈ నటనంతా.
అయినా, వాడు ఓ పట్టాన వదిలే ఘటం కనకనా! కేంటిన్లో ఒంటరిగా ఉన్నప్పుడు పట్టుకున్నాడు. 'నీది గుంటూరులో ప్రాక్టీసన్నాడే మన నల్ల సాంబిగోడు . నువ్విక్కడ ఇట్లా ప్రత్యక్షం కావడం నిజంగా దైవఘటనే మిత్రమా! నీతో అర్జంటుగా మాట్లాడాల్సిన ఇపార్టెంటు మేటర్లు బోలెడున్నాయి. రా.. పోదాం ! ' అంటుండగానే దూరంగా నా క్లయింట్ ఇటే వస్తూ కనిపించాడు. 'అట్లాగే మాట్లాడుకొందాంలే . అవతల టైమయింది . సాయంకాలం కోర్టు కట్టేశాక కలుద్దాంగా !' అని క్లెయింట్ వైపుకు తప్పుకు వెళ్లిపోయాను.
టంచనుగా వాడు కోర్టు మెయిన్ గేటు ముందే నా కోసం కాపేస్తూ కనిపించాడు. అప్పటికే దాదాపు కోర్టు ఆవరణంతా ఖాళీ అయింది . కనక, చొరవగా కారెక్కి నా పక్కన కూర్చున్నా వాడి అతిచనువును భరించగలిగా ! అడక్క ముందే వాడే అన్నీ లొడలొడా వాగడం మొదలెట్టాడు .
వాడి గోల వల్ల చాలా కొత్త విషయాలే బైటపడ్డాయి. తండ్రి పోయాక తన వాటాకొచ్చిన పెంకుటింటిని తెగనమ్ముకొని చెన్నయ్ చెక్కేయడం దగ్గర్నుంచి , థియేటర్లలో రీలీజవక ముందే పెద్ద సినిమాలకు పైరేటెడ్ కాపీలు తీసి గల్ఫ్ తరహా కంట్రీసుల్లో రోటేషన్ కు తిప్పే ఓ కిలాడి ముఠా మాయకు చిక్కడం , నెత్తి మీదకు గుడ్డ వచ్చిం తర్వాత ముంబయి పారిపోవడం, అక్కడా ఓ బ్లేడ్ బేచితో తిరిగి కేసుల్లో ఇరుక్కోడంతో సహా ఈ బాపట్ల ఏరియాకొచ్చి పడ్డం వరకు .. సర్వం గుక్క తిప్పుకోకుండా ఏకరవు పెట్టేసాడు .. బలవంతంగా అయ్యరు హోటలు డాబా రెస్టరెంటులో ఉల్లట్టు వంకతో కట్టేసి మరీ .
చీకటి పడే లోపు ఇంటికెళ్లి పోవాలని నా తహతహ . 'చాలా కాలానికి కలుసుకున్నాం గదరా! అయినవాళ్లతో మాటా మంతీ చెప్పుకొని మనసుకు పట్టిన తుప్పు వదిలించుకొనే ఛాన్సిప్పించాడిప్పుడీ భావనారాయణుడు . అరేయ్ . . రాంబాబుగా! నువ్విట్లా గొప్ప లాయరయితే అయివుండొచ్చు కానీ, పెదగంజాం చిన్నబళ్లో ముక్కు పంతుల పేం బెత్తం దెబ్బలు నీకు బదులుగా నేను తిన్న రోజులు మర్చిపోతే ఎట్లారా ? ఈ ఒక్క నైటుకైనా మా ఇంట్లో ఉండి తీరాలి . తప్పదు. మా సుమతిని చూపిస్తా ' అంటూ నా రెక్క పట్టుకు ఈడ్డుకొచ్చి నా కారులో నే కుదేసాడు. అప్పికట్ల కెట్లా పోవాలో వాడే డ్రయివరుకట్లా పురమాయిస్తుంటే కాదనడానికి ఇక నాకు మాత్రం నోరెట్లా వస్తుందీ !
'వీడి మిసెస్ పేరు అదేదో సీతారత్నం అనుకుంటా! మధ్యలో ఈ సుమతి ఎక్కణ్ణుంచి ఊడిపడ్డట్లు!' అడిగితే మళ్లా ఏ దేవీ భాగోతమో ఎత్తుకొంటాడని నోరు నొక్కుక్కూర్చున్నా . కానీ, ఇట్లా కోర్ట్ల వెంటబడి దొంగ సాక్ష్యా ల్లాంటి దిక్కు మాలిన పన్లకు ఎందుకు పూనుకున్నట్లో కనుక్కోవాలని మాత్రం ఉంది. !
ఆ డౌటే బైటపెడితే , అప్పటి దాకా వసపోసినట్లు వాగిన గాడిద ఒక్కసారి గమ్మునయిపోయాడు. 'గతుకుల రోడ్డు బాబూ! చీకటి! కాస్త చూసుకొని నడుద్దూ ! రోజుకో యాక్సిడెంటవుతుందీ మధ్య మరీ ' అంటూ డ్రైవరు వంక చూసి మాట మార్చేశాడు.
ఇరుకు సందులో నడపడం కుదరక వీధి మొగల్లోనే కారాగిపోయింది .
అప్పటికే రాత్రి తొమ్మిదవుతుంది. 'ఇంటికి పోయి ఇట్లా అని సమాచారం చేరెయ్ రహీమ్ ! ఫోన్లో చెప్పినా అనుమానం వదలదు మీ అమ్మగారికి ' అని డ్రయివరకు పురమాయిస్తుంటే 'అదృష్టవంతుడివిరా! అతిగా నమ్మే పెళ్లాంతోనే అనర్థమంతా ' అన్నాడు సుబ్బారావు.
వాడి మాటల్లోని అంతరార్థం ఇంటికెళ్లి భోజనాలవీ కానించి వరండాలోని విడి గదిలో పడక మీద చేరిన తరువాత గానీ బోధపడింది కాదు. సుబ్బిగాడు అల్లింది కట్టుకథ కాని పక్షంలో ఇట్లాంటి ఘోరాలు గుట్టుచప్పుడు కాకుండా మధ్య తరగతి సంసారల్లోనూ చిచ్చు రేపుతున్నాయన్న మాట.
ఈ సుబ్బి చేసుకొన్న సీతారత్నం బొత్తిగా పల్లెటూరి ఈడీ ఈడేరని పిల్ల. పూర్తిగా బామ్మ పడకలో పెరిగినందు వల్ల కట్టుకున్న మొగవాడు కట్టెదుట తిరిగే దేవుడన్నట్లుండేది. ఈ దగుల్బాజీని అతిగా నమ్మింది. ఆ పిచ్చి మనిషి చేసుకొన్న ఏ వ్రతంలో పొల్లు దొర్లిందో గాని, సుబ్బిగాడిని వాడి వంకర బుద్ధి ఉప్పుకల్లు సాగు వంకతో పెళ్లాం వంటి నగలన్నింటినీ వలిపించేసి చెన్నయ్ దొంగ వ్యాపారాల గంగలో ముంచేసింది. విషయం సర్వం తేటతెల్లమయేసరికి అమ్మలక్కలంతా ఈమె మీదకే సూటిపోటి మాటలు వదలడంతో, దరితోచక స్నానానికని సముద్రానికి వెళ్లినట్లు వెళ్లి నిర్జీవంగా ఒడ్డుకొచ్చిపడిందీ సీతారత్నం.
అప్పటి ఆ ఏడుపులూ మొత్తుకోళ్ల మధ్యనే ఇప్పటి ఈ సుమతి తల్లి వీడి దిక్కుమాలిన బతుకులో భాగం పుచ్చుకునేందుకు దిగబడిందని అర్థమయింది .
ఏ మాట కా మాటే , ఈ సుమతిని చూస్తే సుబ్బారావు చెప్పిందంతా నిజమేనని నమ్మబుద్ధి కావడంలే. రాత్రిపూట చీకట్లోనే కాదు పగలు వెలుతుర్లో కూడా ఆమె నడతా నడవడికా చూసిన కళ్లకు తనట్లా పెళ్లయిన పరాయి మగాడి జీవితంలోకి దొడ్డిదారిన చొరబడే కిలాడి కాదనే అనిపిస్తుంది. అధాటున పరాయి మగాడు కంటపడితే అట్లా తడపడ్డం వగలాడికాని ఆడదాని వల్లయ్యే చిత్రకళ కాదు.
సుబ్బిగాడి మగతనం నాకు కొత్తేం కాదు గానీ, కడుపుతో ఉన్న ఈ ఇల్లాలి అవసరాలు సవ్యంగా తీర్చే సౌకర్యం ఒక్కటైనా కొంపలో ఏర్పరచకపోవడం దారుణం అనిపించింది. అయ్యవారి నట్టిల్లు మాదిరిగా ఉన్న ఇంటి వైభోగం చూపించటానికా వీడిట్లా పిలిచుకొచ్చి మరీ పీడించడానికి ?!
మర్నాడు తెల్లారి స్నానానికెళ్లినప్పుడు తడికవతల్నుంచి ఎవరో మగ మనిషి పెద్ద గొంతేసుకొని గయ్ గయ్ మనటం వినిపించింది. ఎంత వద్దనుకున్నా ఆ అరుపులు చెవిన బడక మాన్తాయా !ఆ మనిషి గోలంతా.. తన పర్మిషనేవీ లేకుండానే ఈ సుబ్బిగాడు ఎవరెవరో బేవార్సు గాళ్లను పద్దాకా కొంప మీదకు తోలుకురావటం మీద !
'నీతి తక్కువ జాతికి ఇంత చోటివ్వడం పాపమయిపోయింది ! తెగ నమ్మించి బాడుక్కు జమేసుకొందామన్నా నీ ఆడమనిషి మెళ్లో పసుప్పోగు తప్ప లేకపాయ! ఇదిగో ఇదే లాస్ట్ వార్నింగ్! తిరుపతి వెళ్తున్నాం . ఈ సందు చూసుకుని ఏ మిండగాణ్ణి తెచ్చయినా పడుకోబెట్టావో .. అరదండాలే నీకూ, నీ పెళ్లానికీ . ఇంట్లోఆడాళ్ల పోరు పళ్లేకుండా ఉన్నా గానీ వచ్చే వారం కల్లా ఇల్లు ఖాళీచెయ్! '
గోల చల్లబడ్డ సందు చూసుకొని మెల్లగా ఎట్లాగో బైటపడ్డా!
సుబ్బిగాడు కంటపడ్డ మొదటి ఘడియలోనే ఇట్లాంటి పిడుగేదో నెత్తిమీద పడ్డానికి సిద్ధంగా ఉందనుకొన్నా. ఆ పిడుగుపాటుకు నా మాడే బుద్దలవుతుందని ఊహించలేక పోయా !
మూడంతా పాడయింది. ముభావంగా కారెక్కుతున్న ప్పుడు ఇంత కథా నడిపించిన ఈ సిగ్గులేని వెధవ మాత్రం ఎప్పట్లానే వెర్రినవ్వులు నవ్వుతూ కారెక్కి కూర్చున్నాడు . ఆ సుమతి తల్లి మాత్రం మళ్లీ మొహం చూపించింది కాదు.
వళ్లంతా తేళ్లూ జెర్రులూ పాకుతున్నట్లుంది నాకు . వీడి పీకులాటంతా ఆ పాడు డబ్బు కోసమేననుకుంటా! పీడెట్లా వదిలించు కొందాం భగవంతుడా అని నేను మధన పడుతుంటే వాడు మాత్రం చుండూరు సెంటర్లో తాపీగా కారాపించి ' ఒన్ మినిట్ ' అంటూ రోడ్డు పక్క సందులో కనిపించే ఓ టిక్కీ ఆసుపత్రిలోకెళ్లి ఐదు నిమిషాల్లో తిరిగొచ్చాడు. ఇప్పుడు వాడి మొహంలో అదో రకమైన ఆందోళన.
'రాంబాబూ! ఓ రెండు వేలుంటే సర్దరా ముందు ! అర్జంట్! ఆనక వివరాలన్నీ చెబుతాగా ! ' అని దేబిరింపు మొగం పెట్టేస్తే కాదనటం ఎట్లా ?
ఇచ్చిన నోట్లు లెక్కైనా పెట్టుకోకుండానే మళ్లా ఆసుపత్రిలోకి పరిగెత్తాడు వాడు .
మనసునేదో కీడు శంకించింది. వీడు డబ్బు గుంజటానికే ఈ ప్లానేదో వేసాడు. ఇంతప్పట్నించీ వీడి నైజం తెలిసిన వాణ్ణి. నమ్మించి మోసం చేయడం తప్పించి వీడికింకో బతుకు తెరువు కళ తెలీదు . ఇంతటితో ఈ కథ ముగించి ముందు కెళ్లి పోవడం మంచిదనిపించింది .
'వాడేడుపు వాడేడుస్తాళ్లే ! పద ! అవతల చూడాల్సిన కేసులింకా బండెడు పడున్నాయి ' అనటమే తడవుగా రహీం కారును ముందుకు దూకించాడు.
దారిలో సెల్ రింగయితే తీసి చూశా. ఏదో తెలీని నెంబర్ ! గొంతు మాత్రం సుబ్బిగాడిదే ! వాడి వాయిస్ లో ఇప్పుడా తేడా లేదు . మునుపటి ధోరణిలోనే చెప్పుకు పోతున్నాడు 'ఇప్పుడే బైటికొచ్చారా . నీ కారు కనిపించలా! తెల్సులే! పొద్దుట్నుంచీ నీ ధోరణి గమనిస్తూనే ఉన్నా! ఏం చేస్తాం బ్రదర్! అందరి జాతకాల్లో నీకు మల్లే శ్రీచక్రం రాసుంటుందా? పోనీలే, నువ్వన్నా పైకొచ్చావ్ ! బాబాయ్ అదృష్టవంతుడు! ఇంతకీ ఈ కాల్ చేసిందెందు కంటే .. ఇందాక నువ్విచ్చిన టూ థౌజండూ తిరిగివ్వలేనని చెప్పటానికేరా! టయానికి చాలా హెల్ప్ చేసావ్. . ఆ దేవుడు పంపించినట్లొచ్చి! ఇటువైపు ఇంకెప్పుడైనా వస్తే గిస్తే ఇంకో త్రీ థౌజెండ్ ఈ అసుపత్రి కౌంటర్లోనే కట్టి పోరా . . ఇట్లా అని నా పేరు చెప్పి . నీ ఉపకారం ఏదో విధంగా తీర్చుకొంటాలే ! ' అని ఫోన్ కట్ చేసాడు.
'కొద్ది మంది మనుషుల్లో ఎన్నటికీ మార్పు రాదు! చిన్నప్పట్నించీ తెల్సిన వాణ్ణని కూడా లేదు. నేరుగా అడిగితే ఇవ్వనంటానా? వెధవ డబ్బు కోసం ఇన్ని తింగరి వేషాలా ? ' అనిపించింది. మళ్లీ వాయిదాకు బాపట్ల వెళ్లినప్పుడు కనపడ్తాడుగా! కడిగేస్తే సరి . . సిగ్గులేని వెధవని ' అనుకొన్నానిప్పటికి.
అనుకున్న వాయిదాకు వాడు హాజరే కాలేదు! ఎన్ని సార్లు పిలిచినా బోనెక్కి సాక్ష్య మిచ్చే పక్షి కనిపించనప్పుడు లాయరెంత గింజుకున్నా ఫలితం సున్నా. ఆ రకంగా మా సుబ్బిగాడు నా క్లయింట్ పాలిటి దేవుడయ్యాడు. మళ్లా పై కోర్ట్ల కెళ్లినా ఏ ప్రయోజనం లేనంత టైట్ గా ఫేవరబుల్ తీర్పొచ్చేసరికి వేటపాలెం వరప్రసాదుగారి సంతోషానికి హద్దుల్లేవు . అనందంతో తబ్బిబ్బయిపోతూ వాళ్లూరి దాకా తీసుకెళ్లి అనుకొన్న ఫీజుకు మరి కొంత చేర్చిచ్చి డబ్బాడు జీడిపప్పు కారులో కుక్కి పంపించాడు.
దారిలో అప్పికట్ల తగిలినప్పుడు సుబ్బారావు కోరుకొన్న త్రీ థౌజండ్ మేటర్ గుర్తుకొచ్చింది. వాడి వల్లే సగం ఈ కేసు గట్టెక్కింది. కొద్ది ఇబ్బందయితేనేం గానీ, ఆ సందులోని ఇల్లు గుర్తు పట్టగలిగాను. కానీ, సుబ్బిగాడున్న వాటాలో కొత్త వాళ్లింకెవరో కనిపించారు. వివరాలు వాకబు చేస్తుంటే ఆ మునుపటి ఆ ఇంటి పెద్దమనిషి మధ్యలో దూరొచ్చి బండబూతులు లంకించుకొన్నాడు. విన్లేక వెనక్కి తిరిగొచ్చేశా.
కనీసం చుండూరు అసుపత్రిలో అయినా మూడు వేలు చెల్లిద్దామని వెళ్లి విచారిస్తే 'సుబ్బారావెవరో తెలీదు సార్! తెల్లగా ఉండే ఓ ఆడమనిషి.. సుద్దాల సుమతి ఆమె పేరు ..తనతో పాటే వస్తుండే నల్లటాయనేనా మీ సుబ్బారావంటే? ఆయన డీటెయిల్సయితే మాత్రం ఇక్కడేవీ లేవండీ.. ఒక్క హజ్ బండ్ అని తప్ప' అనేసింది కౌంటర్లోని పిల్ల. చెల్లించిన బిల్లుకు రిసీట్ రాసిస్తూ ' ఇంకా సెవెన్ థౌజెండ్ డ్యూ ఉంది సార్! ఎప్పటిలోగా సెటిలవుతుందో చెప్పండి సార్! అప్ టు డేట్ అడ్రస్ కూడా రికార్డు చేసుకోవాలి ' అంది.
అడ్రసుతో పాటు నోటికొచ్చిన డేటొకటి చెప్పి బైటపడ్డానే గానీ, సుబ్బారావును గురించిన మిస్టరీ తరచిన కొద్దీ చిక్కబడ్డం ఆశ్చర్యం అనిపించింది.
విషయం మొత్తం విన్న శ్రీమతి 'ఇర్రెలెవెంట్ మేటర్స్ మీద టైం వేస్టు చేయద్దు . భాగ్యలక్ష్మి అగ్రహం రాసుంటే మీ ఫ్రెండే మళ్లీ మీ కళ్లబడతాడు.. ' అని సలహా పారేసింది.
తథాస్తు దేవతలున్నారంటారు . శ్రీమతి చెప్పినట్లే ఆ సంఘటన తటస్థించింది ఆర్నెల్లు గడిచినాక..
ఆసారి కోర్టు సమ్మర్ వెకేషన్లో రిలీఫ్ కోసమని ఫ్యామ్లీతో కొడైకెనాల్ వెళ్లా. అక్కడ కనిపించాడు మహానుభావుడు. వులెన్ వరల్డ్ ఎక్స్పో .. మెయిన్ గేట్ బైట గడ్డ కట్టే చలిలో .. వంటి నిండా సందు లేకుండా వెండి రంగు పూత పూసుకొని! బొడ్లో గడియారం .. చేతికర్ర మార్కుతో అచ్చంగా బాపూజీ స్టాట్యూ మాదిరి నీలుక్కు పోయున్న వాడు బతికున్న మా సుబ్బారావేనని రూఢిచేసుకోడానికని వెనక మాలునెళ్లి వీపు వంక చూశా! పెదగంజాం చిన్న బళ్లో నా అల్లర్ని తన మీదేసుకొని ముక్కు పంతులు చేత చావు దెబ్బలు తిన్న పేం బెత్తం వాతలు పర్మినెంటుగా మిగిల్చిన గుర్తులు సృష్టంగా కనిపించాయ్ ! గడ్డకట్టే మైనస్ మూడు సెల్సియస్ డిగ్రీల చలిలో కూడా వూలు దుస్తుల టూరిస్టుల వినోదార్థం వాడు మెళ్లో వేలాడ దీసుకొన్న అట్టముక్క మీది ఎర్ర రంగక్షరాలు చూసి ఏడవాలో నవ్వాలో తెలీని పరిస్థితి నాది .
speak the truth.. live the righteous life !
సత్యం వద.. ధర్మం చర
కోర్టుల్లో దొంగ సాక్షాలూ, అమాయక స్త్రీల జీవితాలతో చెలగాటాలూ! వీడి బతుకు తెరువుకూ , వీడు వల్లించే హితవులకూ మధ్య పొంతనేమన్నా ఉందా?
పిల్లలు సరదా తీర్చేందుకు గాంధీ విగ్రహానికి ముందు నిలబడి సెల్ఫీలు తీసుకోడంలో మునిగిపోయివుంది శ్రీమతి. వస్తూ వస్తూ అక్కడున్న హుండీలో చిన్నోడి చేత ఓ వెయ్యి నోటు వేయించబోతే ఆపించి అక్కణ్ణుంచి అందర్నీ బైటకు లాక్కొచ్చేశా !
తిరిగొచ్చే సమయంలో గేటు దగ్గరున్న ఆ వెండి గాంధీ సుబ్బారావు వంక చూడకుండా మాత్రం ఉండలేకపోయాను !
***
వెకేషన్ ట్రిప్ పూర్తిచేసుకొని గుంటూరు వచ్చిన రెండు వారాలకు ఇన్వర్డ్ పోస్టులో వచ్చిన ఆ లావాటి కవరు చూసి ఆశ్చర్యంగా తెరిచి చూశా.
ముత్యాలు పేర్చినట్లు రాసివున్న ఆ ఉత్తరం ఇచ్చిన షాక్ అంతా ఇంతా కాదు . సుమతి అనే ఆ అప్పికట్ల ఆడమనిషి సుబ్బారావును అడ్రస్ చేస్తూ చుండూరు ఆసుపత్రికి రాసిన లెటర్ అది!
'అడ్రసీ నాట్ ఎవైలబుల్ ' రిమార్కుతో తన అడ్రసుకు రిటనొచ్చిందా ఎన్వలప్!
కవర్లో కొన్ని ఫోటోలు ! లెటర్ ఆసాంతం చదివిన తరువాత ఆ పాలబుగ్గల బంగారు పసిది అమె కూతురేనని తెలిసింది .. కానీ సుబ్బారావుకు కన్నది మాత్రం కాదు .
ఆ రోజు రాత్రి సుబ్బారావు తనను అప్పికట్ల తీసుకెళ్లి చూపించిన సుమతి వాడి భార్య కాదు. చెన్నయ్ - హైదరాబాద్ సూపర్ డీలక్స్ ఎక్స్‌ప్రెసు నుంచి నెల్లూరులో దిగిన వీడికి రైల్వే స్టేషన్లో కనిపించిన ఆడమనిషి. ఆ అర్థరాత్రి చీకట్లో సిమెంట్ బెంచీమీద అట్లా బిక్కు బిక్కు మంటూ వంటరిగా కూర్చోనున్న ఆమెను చూసి జాలిపడి విచారించాట్ట సుబ్బారావు. ఆమె భోరున ఏడ్చేస్తూ 'కడుపులో పెరిగేది ఆడబిడ్డని తెల్సి మొగుడు మాయమాటలు చెప్పి ఫ్లాట్ ఫామ్ మీదట్లా వదిలేసిపోయిన విషయం చెప్పుకొచ్చిందట . ఆడవాసన పసిగట్టిన మగతోడేళ్ల బారిన పడితే కాబోయే ఈ తల్లి బతుకు ఎంతలా ఛిద్రమవుతుందో తెలీనంత అమాయకుడు కాదుగా ఈ సుబ్బిగాడు!
అప్పికట్ల అద్దె ఇంటికి భార్యగా ఆమెను తెచ్చి ఆర్నెల్లపాటు కాపాడిన వైనం ఆ సుమతి రాసిన ఉత్తరం వల్ల గాని తెలిసింది కాదు నాకిప్పుడు . నెలలు నిండిన ఈమెను తన స్తోమతకు తగ్గ చుండూరు ఆసుపత్రిలో చూపించుకొస్తూనే ఇరుగుపొరుగుల్తో అంతలేసి మాటలు పడ్డం నా వరకు సుబ్బిగాడి జీవితనాణెంలోని బొమ్మ పార్శ్వం.
తనది కాని సంసారాన్ని సాక్కొచ్చే నిమిత్తమే కోర్టుల్లో అట్లా దొంగ సాక్ష్యాల్లాంటి దౌర్భాగ్యప్పన్లకు దిగినట్లు ఇప్పుడు తలకెక్కింది . బిడ్డతో సహా అత్తారింటికి చేరిన ఈ తల్లిని మొగుడు చేరదీయడాని క్కారణం కూడా సుబ్బారావే! అద్దెకు తీసుకున్న ఎస్తై డ్రస్సుతో ఆమె అత్తారింటికెళ్లి గట్టిగా బెదిరించడంతో ఈ అభాగ్యురాలి కాపురం చక్కబడిందిట.
మా సుబ్బిగాడి మేలు జన్మలో మరిచిపోనని ఆమె రాసిన ఆ థేంక్యూ లెటర్ చుండూరు అడ్రసు కెళ్లడాని క్కారణం సమతికి తెలిసిన ఆఖరు అడ్రసు అదేకావడం !
బిల్లు కట్టేటప్పుడు నేను నా గుంటూరు అడ్రసు ఇవ్వకుంటే ఆసుపత్రి వాళ్ల కిట్లా ఈ లెటర్ నాకు రీడైరెక్ట్ చేసే అవకాశం ఉండేది కాదు.
మా సుబ్బిగాడిని నేనింకా శాపనార్థాలు పెడుతూనే ఉండేవాణ్ణి.
***
No comments:
Post a Comment