అనసూయ ఆరాటం - 21 - అచ్చంగా తెలుగు

అనసూయ ఆరాటం - 21 

చెన్నూరి సుదర్శన్  


(పెళ్ళైన కొన్నేళ్ళకే భర్త పోవడంతో కొడుకు ఆదిరెడ్డి ని కష్టపడి పైకి తెస్తుంది అనసూయ. కొడుకు పట్నంలో ఎసి రిపైర్లు నేర్చి, వ్యాపారం చేస్తుంటాడు. అనసూయను కూడా పట్నానికి తెస్తాడు.)

‘పిల్లచ్చిన యాల్ల.. గొడ్డొచ్చిన యాల్ల’ అచ్చిరావాలంటరు. ఆదిరెడ్డికి బాగా అచ్చొచ్చింది. ఏ.సీ. ఫిట్టింగుల బేపారం ఆంధ్ర అంతా పాకింది. శివ లింగ కంపెనీల పని చేసేటోల్ల సంఖ్య ముప్పైకి పెరిగింది. 

 అనంతపురం పుట్టపర్తి సాయిబాబా మందిరంల ఏసీలు పెట్టే పనిని కాంట్రాక్ట్ తీసుకొని పెట్టిచ్చిండు. దోస్తాన్ల సోల్తి పట్టుకొను కర్ణాటకల పెద్ద పెద్ద ఆఫీసులల్ల పెట్టిచ్చిండు. అట్లనే తమిళ్నాడుల సుత ఆదిరెడ్డి పేరు శాన మందికి తెలిసి పోయింది.  

ఆదిరెడ్డి ఎక్కడికి పోతే అక్కడ ఆ బాస నేర్సిండు. 

ఇప్పుడు ఆదిరెడ్డి తెలుగు, ఉర్దూ, ఇంగ్లీసు, కన్నడం, తమిళం.. మొత్తం ఐదు బాసలు గడా, గడా మాట్లాడుతాండు. 

అప్పుడప్పుడు ఇంజనీర్ల కోసరమే కారును వాడే వాడు, పెండ్లాం సరిత వచ్చినంక సొంతానికి వాడుకం ఎక్కువయ్యింది. 

లక్ష్మీదేవి అండగ నిల్సింది.. సంపాదన పుట్ట పెరిగినట్టు పెరుగసాగింది.

***

ములుగుల ‘బూర బుచ్చయ్య & సబ్బని సమ్మయ్య’ దుకానం లింగారెడ్డి పోయిన కాన్నుంచి కళ తప్పింది.. రోజు రోజుకు మసకబార సాగింది.

సమ్మయ్య కొడుకులిద్దరికి సదువు అబ్బక జులాయి తిరుగుల్లు తిరుగబట్టిండ్లు. గిట్లైతే రేవుకు రారని  వాల్లకు పెండ్లిల్లు సేసిండు సమ్మయ్య. అది ఇంకా మిక్కుటానికి వచ్చింది. కర్సులు పెరిగినై.  దుకాన్లకెల్లి సమ్మయ్య పైసల వాడుకం ఎక్కువయ్యేటాల్లకు బుచ్చయ్యకు.. సమ్మయ్యకు పెద్ద లొల్లి మోపైంది.

బుచ్చయ్య, బుచ్చయ్య అల్లుడు రమేషు ఒక దిక్కు.. సమ్మయ్య, ఇద్దరు కొదుకులు ఇంకో దిక్కు. 

ఆకరికి దుకాన్లు పంచుకుందామనేకాడికి వచ్చింది. 

కిరాణ దుకానం బుచ్చి మల్లుకు.. బట్టల దుకానం సమ్మయ్యకని లాటరీ ఏసుకోని  పంచుకున్నరు. 

లింగారెడ్డి ఉంటే గిట్ల కాకపోయేదని ఊరంత చెప్పుకున్నరు.

సమ్మయ్య కొడుకులిద్దరు బట్టల దుకానం యాడాది నడిపేటాల్లకే ముక్కులకచ్చింది. ఉద్దెర ఇచ్చుడు ఎక్కువైంది. వసూల్లు తక్కువైనై.  అనుభవమున్న సమ్మయ్యను దుకాన్ల అడుగు పెట్టెనిచ్చేటోల్లు కాదు. ఎవని సక్కిన వాడు ఇట్టంచ్చినట్టు కర్సులు పెట్టేటాల్లకు దుకానం దివాల తీసింది. పొత్తుల పొత్తుల దుకానం అమ్మేసినా అప్పుల పాలైండ్లు. 

అప్పులు తీరుద్దామని చిట్ ఫండ్ యాపారం మొదలు పెట్టిండ్లు. అదో యాడాది నడ్సింది. చిట్టీ ఎత్తుకున్నోల్లు పైసలు కట్టక పోవుడు.. చిట్టీ ఎత్తుకున్నోనికి పైసలియ్యలేక చేతులెత్తేసిండ్లు.  

చిట్టీలేసినోల్లంత ఒక రోజు సమ్మయ్య ఇంటి మీద పడ్డరు. కొడుకులిద్దరు పరారైండ్లు.

సమ్మయ్య ఇజ్జతికి ఉరేసుకొని పానాలు తీసుకున్నడు.

***

ఆదిరెడ్డి పెండ్లైనంక శాన మారిండు. ఆలోసనలల్ల గొప్పతనం తరుగసాగింది. 

ఇన్నాల్లూ తన నాయ్న లింగారెడ్డి ఆశీర్వాద బలం అబుకునేటోడు.. ఇప్పుడు ఇదంతా తన  పెండ్లాం సరిత గొప్పతనమే అని ముర్వబట్టిండు. ఇదే సంగతి తాప, తాపకు అనసూయ చెవుల ఊదబట్టిండు. మొదటి సారి అవునన్నది అనసూయ. రెండవ సారి నిజమే అన్నది. మూడవసారి ముక్కుర్సింది. నాల్గవసారి పెండ్లానికి భజనచేత్తాండని మన్సులనుకున్నది. ఐదవ సారి నోరిప్పకచ్చింది. ఆరోసారి.. 

“అరేయ్ ఆదిరెడ్డి.. ఇదే ఆకరి సారి చెప్తాన. ఇంకో సారి నీ పెండ్లాం గొప్పతనం సంగతి నా ముందల చెప్పకు “ అని కసిరింది.

అనసూయ అన్న అదే మాట ఎట్లన్నదో  అట్ల తన పెండ్లాం సరిత చెవుల పాడిండు ఆదిరెడ్డి.

ఆడోల్లు కొందరు కొన్ని మాటలను అల్కగ తీసి పారేత్తరు వాల్లు అమాయకులు. కొందరు మాటకు మాటంటరు. వీల్లు బడ, బడ మాటకారోల్లు. కొదరు మన్సుల పెట్టుకొని కుమిలి పోతాంటరు.. చాదస్తులు. మరి కొందరు వినీ విననట్టే ఉన్నా.. పగబడ్తరు. ప్రతీకారం కోసరం ఎదురు సూతాంటరు. వీల్లు నల్లికుట్లోల్లు. అందుకే నల్లికుట్లోల్లను నమ్మరాదంటరు.  

***

పెండ్లాం మైకంల ఉన్నప్పుడే  ఆదిరెడ్డిని తన కొంగుకు ముడేసుకొని బొడ్లె దోపుకోవాలె అనుకున్నది సరిత.

ఓ రోజు నాత్రి ఆదిరెడ్డికి సర్గ సుఖాలు సూయించి మెల్లంగ తన మన్సులోని కోరిక బయట పెట్టింది.

“ఆదీ.. మనం ఎన్నాండ్లని ఈ కిరాయి ఇండ్లల్ల ఉంటం. తుర్తిగ పండుకున్నట్లే లేదు” అన్నది. ఆమె మాటల్ల ‘మనం వేరే ఉంటే ఇంకా కొత్త, కొత్త రుచులు సూయించుతా’ అన్నట్టు ఆదిరెడ్డికి ఇనరాబట్టింది. 

“అవును నాకు సుత గట్లనే ఉన్నది” సరితను ఇంకొంచెం గట్టిగ కావలిచ్చుకున్నడు ఆదిరెడ్డి.

తన లైన్లకత్తాండని.. సరిత లోపల, లోపల సంబుర పడుకుంట అసలు విషయం బయట పెట్టింది. “మనం సొంతంగ ఒక ఇల్లు కట్టుకుందాం” వేరే సంసారం పెడ్దామని మొదలే అంటే బాగుండదని.

“సరితా.. ఇది నా మన్సుల లేదనుకుంటానవా.. ఏంది? నేను అదే పనిల ఉన్న. అయితే కట్టేదేదో కొంచెం పెద్దగ కట్టుకుందామని  అనుకుంటాన” అన్కుంట లేసి హమాంకాన్లకు పోయిండు. మల్ల బైటికి వచ్చేటాల్లకు ఏం అడగాల్నో మోపు చేసి పెట్టుకున్నది సరిత.

ఆదిరెడ్డి వచ్చుడు వచ్చుడే.. “సరితా.. ముందుగాల అనిమిరెడ్డి పెండ్లి, జయమ్మ పెండ్లి చేత్తే ఒక పనై పోతది. ఆ తరువాత ఇల్లు సంగతి” 

తాను అడుగుదామన్నది ఆదిరెడ్డే అనేటాల్లకు సరిత నోరు తెరవ లేదు. 

***


No comments:

Post a Comment

Pages