"బంగారు" ద్వీపం (అనువాద నవల) -7 - అచ్చంగా తెలుగు

"బంగారు" ద్వీపం (అనువాద నవల) -7

Share This

"బంగారు" ద్వీపం (అనువాద నవల) -7

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton
 



(జార్జి చెప్పిన తిమోతి కుక్క అని పిల్లలకు తెలుస్తుంది. చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఆ కుక్క తనకు దొరికిందని, తల్లిదండ్రులకు యిష్టం లేక దాన్ని యింట్లోంచి పంపేయమన్నారని, అందువల్ల తను కుక్కను మత్స్యకారుడు ఆల్ఫ్ వద్ద దాన్ని ఉంచానని జార్జి చెప్పింది. జూలియన్ కొనిచ్చిన ఐసుక్రీముని జార్జి తిరస్కరిస్తుంది. తమకు తెలియని విషయాలను చెప్పి, జార్జి ఆ ఐసుక్రీము తీసుకొమ్మంటాడు జూలియన్. తరువాత. . . .)
@@@@@@@@@@@@@@

"మీరు పంచుకోవాలన్న విషయాలు నా దగ్గర ఏమున్నాయి?" జార్జి ఆశ్చర్యపోయింది.

"నీ దగ్గర ఒక కుక్క ఉంది" అంటూ జూలియన్ ఆ సంకరజాతి జంతువును మెల్లిగా తట్టాడు. "మేము దాన్ని నీతో పంచుకోవాలని చూసేంత చనువైంది. నీకు సుందరమైన ద్వీపం ఉంది. అప్పుడప్పుడు దానిలో ఆనందాన్ని పంచుకోనిస్తే మేము పులకరిస్తాం. నీకు శిధిలమైన ఓడ ఉంది. మేము దాన్ని చూడటమే కాక పాలు పంచుకోవాలని అనుకొంటున్నాం. ఐసుక్రీములు, తీపి పదార్ధాలు వాటి అంత విలువైనవి కావు. కానీ వాటికి మారుగా వీటిని ఒకరితో ఒకరు పంచుకొంటే మంచిగా ఉంటుంది."

జార్జి తన కళ్ళలోకి సూటిగా చూస్తున్న గోధుమరంగు కళ్ళను గమనించింది. జూలియన్ పై యిష్టాన్ని ఆమె కాదనలేకపోతోంది. ఏ విషయమైనా యితరులతో పంచుకోవటం ఆమె స్వభావం కాదు. ఆమె తన యింట్లో ఏకైక సంతానం కావటం, ఒంటరి, త్వరగా అపార్ధం చేసుకొనే నైజం వల్ల కోపిష్టి స్వభావం, చిరాకు మనస్తత్వం ఆమెలో చోటు చేసుకొన్నాయి. ఆమెకు స్నేహితులంటూ ఎవరూ లేరు. తిమోతి జార్జి కి చాక్లెట్టులాంటి దేదో అంది స్తున్న జూలియన్ని గమనించింది. వెంటనే అది అతని మీదకు దూకి, ఆ బాలుణ్ణి మురిపెంగా నాలుకతో నాకసాగింది.

"ఇప్పుడే చూసావుగా ! టిం మాతో పంచుకోవాలని అనుకుంటోంది" జూలియన్ నవ్వుతూ చెప్పాడు. "అతనికి ముగ్గురు కొత్త స్నేహితులు ఉంటే బాగుంటుంది."

"అవును. దానికిష్టమే" అంటూ జార్జి ముందుకొచ్చి, అకస్మాత్తుగా చాక్లెట్టుబార్ ని తీసుకొంది. "ధన్యవాదాలు జూలియన్! నేను మీతో పంచుకొంటాను. కానీ నేను తిమోతిని యింకా వదిలిపెట్టలేదని ఇంట్లో ఎవరికీ చెప్పనని మాటివ్వాలి."

"అలాగే మేము మాటిస్తాం" జూలియన్ చెప్పాడు. "కానీ టిం మీ యింట్లో ఉండనంత కాలం, మీ అమ్మ లేదా నాన్న పట్టించుకొంటారని నేను ఊహించలేను. ఐస్ ఎలా ఉంది? బాగుందా?"

"ఓహ్! నేను యిప్పటివరకు రుచి చూసిన వాటిలో మధురమైనది" జార్జి దాన్ని కొరుకుతూ చెప్పింది. "ఇది చాలా చల్లగా ఉంది. ఈ ఏడాది ఒక్కటీ తినలేదు. చాలా రుచిగా ఉంది."

తిమోతి కూడా దాన్ని కొరకటానికి ప్రయత్నించింది. జార్జి చివరలో అతనికి కొన్ని ముక్కలు యిచ్చింది. తరువాత ఆమె వెనక్కి తిరిగి ముగ్గురు పిల్లల్ని చూసి నవ్వింది.

"మీరు బాగున్నారు" అందామె. "మీరు వచ్చినందుకు సంతోషిస్తున్నాను. ఈ మధ్యాహ్నం ఒక పడవను తీసుకొని శిధిలమైన ఓడను చూడటానికి, ఆ దీవిని చుట్టి వద్దాం. వెళ్దామా?"

"అలాగే!" ముగ్గురూ ఒక్కసారిగా అన్నారు. తిమోతి కూడా తనకేదో అర్ధమైనట్లు తోకను ఆడించింది.

@@@@@@@@@@@

ఆ రోజు ఉదయం వాళ్ళంతా స్నానం ముగించారు. తామందరి కన్నా జార్జి బాగా ఈదుతుందని వాళ్ళు గ్రహించారు. ఆమె చాలా బలంగా, వేగంగా ఈదటమే గాక, నీటి అడుగున కూడా ఈదుతుంది; ఊపిరిని బిగబట్టి చాలా సేపు ఉండగలదు.

"నీలో ఉత్సాహం బాగా ఉంది" జూలియన్ మెచ్చుకొన్నాడు. "అన్నెకు దానిలో కొంచెమైనా నైపుణ్యం లేకపొవటం జాలిగొలిపే విషయం. అన్నె! నువ్వు స్విమ్మింగు స్ట్రోకులను కఠినంగా శిక్షణ పొందాల్సి ఉంటుంది. లేదంటే ఎంతకాలమైనా నువ్వు ఈతలో నైపుణ్యం సాధించలేవు."

భోజన సమయానికి వారంతా విపరీతమైన ఆకలితో ఉన్నారు. తినటానికి చాలా దొరుకుతుందన్న ఆశతో వాళ్ళు కొండ దిగి యింటికి వెళ్ళారు. వారు భావించినట్లే కావలసినంత ఉంది! చల్లని మాంసం, సలాడ్, రేగుపళ్ళతో చేసిన వంటకం, పాలు-గుడ్లతో చేసిన మిఠాయి, చివరలో జున్ను. పిల్లలు ఆబగా వాటిని తిన్నారు.

"ఈ మధ్యాహ్నం మీరేం చేస్తారు?" జార్జి తల్లి అడిగింది.

"ద్వీపానికి మరొక వైపున శిధిలాలను చూడటానికి జార్జి మమ్మల్ని పడవలో తీసుకెడుతోంది" అన్నె చెప్పింది. వాళ్ళ పిన్ని చాలా ఆశ్చర్యపోయింది.

"జార్జి మిమ్మల్ని తీసుకెళ్తుంది!" నమ్మలేనట్లు అంది. "ఎందుకు జార్జి . . .నీ మీదకు ఏం వచ్చింది? ఇంతకు ముందు, నేను నీకు డజన్ల కొద్దీ చెప్పినా, ఒక్క వ్యక్తిని కూడా తీసుకెళ్ళలేదు!"

జార్జి బదులీయలేదు, కానీ రేగుపళ్ళ వంటకాన్ని తినసాగింది. తింటున్నంతసేపు ఆమె ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆమె తండ్రి బల్ల దగ్గరకు రాకపోవటంతో, పిల్లలు మరింత ఉపశమనం పొందారు.

"సరె జార్జి ! మీ నాన్న చెప్పినట్లు చేయటానికి నువ్వు ప్రయత్నిస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను" అని ఆమె తల్లి మళ్ళీ ప్రారంభించింది. కానీ జార్జి తలను అడ్డంగా ఊపింది.

"నేను చేసి తీరాలి కాబట్టి యిది చేయటం లేదు" అంది ఆ పాప. "నేను చెయ్యాలనుకొన్నాను కాబట్టి చేస్తున్నాను. నా శిధిలాలను చూడటానికి నేనెవర్నీ తీసుకెళ్ళను; నాకు నచ్చకపోతే, యింగ్లండుకి రాణీ అయినా తీసుకెళ్ళను."

దానికి ఆమె తల్లి నవ్వింది. "సరె! నువ్వు నీ కజిన్లను యిష్టపడటం శుభవార్త" అందామె. "వాళ్ళు కూడా నిన్ను యిష్టపడుతున్నారని ఆశిస్తున్నాను."

"ఆ! అవును!" అసాధారణ ప్రవృతి గల తన బంధువు పక్కన నిలబడాలని ఆత్రుతగా చెప్పింది అన్నె. "మేము జార్జి ని యిష్టపడుతున్నాం, యింకా చెప్పాలంటే తి. . ."

తిమోతి అని చెప్పాలని ఆమె నోటి దాకా వచ్చింది, కానీ జార్జి తన చీలమండపై బలంగా తన్నటంతో, బాధతో గట్టిగా కేక పెట్టి కళ్ళలో నీళ్ళు పెట్టుకొంది. జార్జి ఆమె వైపు కళ్ళు మిటకరించి చూసింది.

"జార్జి? నీ గురించి తను అంత మంచిగా చెబుతూంటే, అన్నేని ఎందుకలా తన్నావు?" తల్లి కేకలేసింది. "తక్షణం బల్ల దగ్గర నుంచి వెళ్ళిపో! నాకలాంటి ప్రవర్తన నచ్చలేదు."

జార్జి మాటాడకుండా బల్ల దగ్గర నుంచి లేచింది. ఆమె బయట తోటలోకి వెళ్ళింది. ఆమె కొద్దిగా రొట్టె ముక్కను తీసుకొని తనకు యిచ్చిన జున్నును కోసుకొంది. అవన్నీ పళ్ళెంలోనే ఉండిపోయాయి. మిగతా ముగ్గురు బాధగా వాటివైపు చూసారు. అన్నె కలవరపడింది. టిం గురించి ప్రస్తావించవద్దన్న విషయాన్ని మరచిపోయేటంత తెలివితక్కువగా తానెలా ప్రవర్తించింది?

"ఓ! దయచేసి జార్జి ని తిరిగి పిలవండి!" కోరిందామె. "ఆమె నన్ను కావాలని తన్నలేదు. ప్రమాదవశాత్తూ తగిలింది."

కానీ ఆమె పిన్నికి జార్జి మీద చాలా కోపం వచ్చింది. "మీ భోజనం ముగించండి" మిగిలినవాళ్ళకు చెప్పిందామె. "జార్జి యిప్పుడు కోపం లోకి వెళ్ళి ఉంటుందని భావిస్తున్నాను. పిల్లలూ! అది మొండి పిల్ల!"

జార్జి అలకలోకి వెళ్ళిందన్న దాని గురించి మిగిలినవాళ్ళు పట్టించుకోలేదు. వాళ్ళు పట్టించుకున్నది ఏమిటంటే, జార్జి ఇప్పుడు శిధిలాలను చూపించటానికి వారిని తీసుకెళ్లడానికి నిరాకరించవచ్చు.

వాళ్ళు మౌనంగా భోజనం ముగించారు. క్వెంటన్ బాబాయి తినటానికి యింకా ఏమన్నా కావాలేమో కనుక్కొందుకు వాళ్ళ పిన్ని వెళ్ళింది. అతను గ్రంధాలయం గదిలో తనకు తానే వడ్డించుకొని భోజనం చేస్తున్నాడు. పిన్ని ఆ గదిలోంచి బయటకు వెళ్ళగానే, జార్జి పళ్ళెంలోని రొట్టె, జున్ను తీసుకొని బయట తోటలోకి వెళ్ళింది అన్నె.

అబ్బాయిలు ఆమెను తిట్టలేదు. అన్నె తరచుగా నోరు జారుతుందని వాళ్ళకు తెలుసు. కానీ ప్రతిసారీ తరువాత తన తప్పును దిద్దుకొందుకు ప్రయత్నిస్తుంది. ప్రస్తుతం ఆమె జార్జి ని చూడటానికి వెళ్ళటం చాలా సాహసమని వాళ్ళు భావించారు.

జార్జి తోటలోని ఒక పెద్ద చెట్టు కింద వెల్లకిలా పడుకొని ఉంది. అన్నె ఆమె దగ్గరకెళ్ళింది. "దాదాపుగా నేనొక తప్పును చేసినందుకు నన్ను క్షమించు జార్జి!" అందామె. "ఇదిగో నీ రొట్టె, జున్ను. దీన్ని నీ కోసమే తెచ్చాను. టిం గురించి యింకెప్పుడూ ప్రస్తావించనని నేను మాటిస్తున్నాను."

జార్జి లేచి కూర్చుంది. "శిధిలాల దగ్గరకు నిన్ను తీసుకెళ్ళకూడదని తీర్మానించుకొన్నాను" చెప్పిందామె. "మందబుద్ధీ!"

అన్నె హృదయం జారిపోయింది.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages