చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 28 - అచ్చంగా తెలుగు

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 28

Share This

చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 28

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
ఆంగ్ల మూలం : The moonstone castle mistery 
నవలా రచయిత : Carolyn Keene
 


(రహస్య ద్వారాన్ని పగులగొట్టి నాన్సీని ఆమె మిత్రులు రక్షిస్తారు.  తాను మెట్లు దిగుతుండగా రహస్య ద్వారం తెరుచుకొని వచ్చిన బుంగమీసాల ఆసామి తనకేదో వాసన చూపించి ఆ చిన్నగదిలోకి లాగాడని నాన్సీ చెబుతుంది.  బుంగమీసాల వ్యక్తిని బంధించి డేవ్ పోలీసు స్టేషనుకి తీసుకెళ్తాడు.  బురుజు పైభాగంలో నాన్సీకి మంచం కింద "మన సంకేతపదం చంద్రమణి లోయ అవుతుంది" అన్న చీటి దొరుకుతుంది.  బ్రాస్ కెటిల్ చేరిన నాన్సీ బృందానికి మిసెస్ హేంస్టెడ్ కనిపించదు. తరువాత. . . .)
@@@@@@@@@@@@@ 

తన తల్లికి ఆరోగ్యం బాగులేదని, అందువల్ల తన గదిలోనే ఉండిపోయిందని మిసెస్ హేంస్టెడ్ కూతురు చెప్పింది.  

  నాన్సీ తన సానుభూతిని తెలియపరచి, టీ రూంలోకి దారి తీసింది.  భోజనం చేసిన వెంటనే ఆరుగురు స్నేహితులు పోలీసు స్టేషనుకి వెళ్ళారు.  చీఫ్ బుర్కే దుండగుడిపై ఆరోపణలను దాఖలు చేయమని నాన్సీని కోరాడు.  

  "ఇప్పటికీ అతను తన పేరును చెప్పటం లేదు.  అతని దగ్గర డబ్బులేమీ లేవు" అధికారి చెప్పాడు.  

  నాన్సీ అంగీకరించి, నిర్దేశించిన ఫారంపై సంతకం చేసింది.  

  "ఓ మిత్రమా! నువ్వు అలా చేయాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఇప్పుడు ఆ చంద్రమణి లోయ ముఠా అంతా నీ వెంటపడటం ఖాయమని  నాకు అనిపిస్తోంది." 

  చీఫ్ బుర్కే కనుబొమలు ఎగరేసాడు.  "చంద్రమణి లోయ ముఠా?" అతను మరొకసారి అన్నాడు.  "అలాంటి  ముఠా గురించి నేను వినలేదు. వారి గురించి మీకేమి తెలుసు?"   

  ఖైదీ యొక్క పడకగదిలో తాను కనుగొన్న టైపు చేసిన చీటీని నాన్సీ  అతనికి యిచ్చింది.  అధికారి ఆశ్చర్యపోయి, ఆ చీటీని తన దగ్గరే వదిలి వెళ్ళమని కోరాడు.  "ఇది పోలీసుల దర్యాప్తుని ఆదేశిస్తుంది" అని తెలిపాడతను.  "అయితే విహారయాత్రకు వచ్చిన మీరు వీడి గురించి తెలుసుకొన్నందుకు నేను సంతోషిస్తున్నాను."

  "మీరు ఈ ఖైదీని శోధించినప్పుడు" యువ గూఢచారి అడిగింది, ""మీకు అతని దగ్గర ప్రత్యేకమైన ఆసక్తి కలిగించే దేదైనా దొరికిందా?" 

  చీఫ్ బుర్కే తన డెస్కుకి ఉన్న సొరుగుని తెరిచి, మలినమైన తెల్ల కాగితపు ముక్కను బయటకు లాగాడు.  "ఇది మాత్రమే," చెప్పాడతను.  "ఇది దేనికో సంబంధం ఉన్న క్లూ కావచ్చు, కానీ అది నాకు ఆర్ధం కాలేదు."

  "అదేమి చెబుతోంది?" నాన్సీ అడిగింది.   

  అధికారి ఆమెకు ఆ కాగితం ముక్కను యిచ్చాడు.  తక్షణం నాన్సీ రెండు పదాలను చూసింది. అది ఖచ్చితంగా ఒక కోడ్ సిగ్నల్ అని ఆమె నిర్ధారించుకొంది.   దానిపై యిలా ఉంది:

  తోడేలు కన్ను.

 @@@@@@@@@@@@@

నాన్సీ గాని, పోలీసు గూఢచారులు గానీ ఆ రహస్య పదాలపై ఎలాంటి వెలుగును ప్రసరించలేకపోయారు.  

"తోడేలు కన్ను."

 "అయితే మీరు దీని అర్ధం కనుక్కొంటే దయచేసి నాకు తెలియజేయండి" నాన్సీ అభ్యర్ధించింది.  "ఖైదీ చెప్పినదేమైనా ఉంటే, అది కూడా. . .నా దొంగిలించబడిన కారు గురించి ఏదైనా సమాచారం ఉంటే, దాన్ని. . ." 

  చీఫ్ బుర్కే మాటిచ్చాడు.  నాన్సీ కారు విషయంలో తన మనుషులు ఒక్క అడుగైనా ముందుకు వెళ్ళలేకపోయినందుకు అతను విచారం వ్యక్తపరిచాడు.  

  "నేను ఖచ్చితంగా దాన్ని పోగొట్టుకున్నట్లే!" అంది నాన్సీ.  "అయితే ప్రస్తుతానికి మాకు రవాణా సౌకర్యం ఉంది" అంటూ కృతజ్ఞతాపూర్వకమైన చూపుని నెడ్ వైపు పడేసింది.  దాన్ని గమనించి అధికారి నవ్వాడు.  

  నాన్సీ, ఆమె మిత్రబృందం మోటెలుకి చేరుకోగానే, జోడీ ఆరంస్ట్రాంగ్ వాళ్ళతో ఫోనులో మాట్లాడటానికి రోజంతా ప్రయత్నిస్తూనే ఉందని మిసెస్ థాంప్సన్ చెప్పింది. 

  "తన యింటి దగ్గర వనభోజనానికి మీ అమ్మాయిలను ఆమె పిలిచింది."

   "అది ఆమె సహృదయత" అంది నాన్సీ.  "ఇప్పుడే ఆమెకు ఫోను చేస్తాను." 
   
  ఇతరులకు వినబడనంత దూరం వెళ్ళి, జోడీకి ఫోను చేసింది నాన్సీ.  ఆమె ఆహ్వానానికి ధన్యవాదాలు చెప్పాక, తన స్నేహితులు మరో ముగ్గురు రాత్రి ఉంటారని, అందువల్ల ఆమె ఆహ్వానాన్ని మన్నించలేనని నాన్సీ చెప్పింది.  

  "ఓహ్! వాళ్ళని కూడా తీసుకురా!" చెప్పింది జోడీ.  "ఎంత ఎక్కువమందైతే అంత ఆనందం!" 

  "ఇది అమ్మాయిల వనభోజనం కదా?" నాన్సీ సందేహిస్తూ అడిగింది.  

  "ఓహ్! కాదు" జోడీ బదులిచ్చింది.  "ఇది కోయెడ్ పార్టీ!" అంటూ ఆమె ముసిముసి నవ్వులు నవ్వింది. "నీ స్నేహితులు అబ్బాయిలేనా?" 

  "అవును, వాళ్ళే!" 

  "అద్భుతం!" జోడీ ఆనందంగా అరిచింది.  "మీరంతా ఏడు గంటలకు యిక్కడ ఉండాలి." 

  విషయం విని అబ్బాయిలు ఆనందించారు.  నెడ్ కళ్ళలో మెరుపు విరిసింది.  "నువ్విలా ఒకసారి విశ్రాంతి తీసుకోవటం చూసి నాకు చాలా సంతోషంగా ఉంది నాన్సీ!  వనవిహారం వద్ద ఖచ్చితంగా మిస్టరీ ఏమీ ఉండదనే అనుకొంటున్నాను."

ముగ్గురు అమ్మాయిలు ఒకరినొకరు చూసుకొన్నారు.  వాళ్ళు అబ్బాయిల కేమీ చెప్పలేదు, కానీ జోడీ ఆరంస్ట్రాంగ్ దత్తత విషయంలో తమకేదో క్లూ దొరకవచ్చుననే ఆశిస్తున్నారు.

ఆరంస్ట్రాంగ్ పెరడు అందంగాను, ఆకర్షణీయంగాను ఉంది.  అందమైన ముకమలు-ఆకుపచ్చ రంగుల మిశ్రమంగా ఉన్న పచ్చిక బయలు చుట్టూరా దట్టమైన పూలశయ్యలతో ముచ్చటేస్తోంది.  గులాబీ పూల పరిమళం వెచ్చని రాత్రి గాలిలో విస్తరించింది.  

  ఆ స్థలంలో ఒక పక్కన పొడవైన బల్ల మీద ఊరించే సలాడ్ గిన్నెలు, స్నాక్స్ నింపిన పళ్ళాలు ఉన్నాయి.  మధ్యలో అతిశీతల పానీయంతో నింపిన ఒక పెద్ద గిన్నె ఉంది.  దూరంగా  తోట వైపు ఆరుబయట వంట చేయటానికి రాళ్ళతో కట్టిన పొయ్యి ఉంది.  అక్కడ చిరునవ్వులు చిందిస్తూ సుమారు పద్దెనిమిది సంవత్సరాల కుర్రాడొకడు  నిలబడి ఉన్నాడు. అతడు తన రొమ్ముని మూసేలా ఒక పెద్ద తెలుపురంగు బట్టను మెడకు కట్టుకొన్నాడు.  తలపై చెఫ్ టోపీని పెట్టుకొన్నాడు..

నాన్సీ, ఆమె మిత్రబృందం వచ్చేటప్పటికే అక్కడ చాలామంది యువజనులు గుమిగూడి ఉన్నారు.  ఉదార హృదయం గల దాత, జోడీ, వెంటనే ఆ బృందాన్ని పరిచయం చేసింది. వారు చెఫ్ వద్దకు వచ్చినప్పుడు జోడీ ముసిముసి నవ్వులు నవ్వింది.  "ఇతను నా కజిను, హార్వే స్మిత్.  ఇలాంటి పార్టీల్లో వంటలు చేయటంలో ఈ మండలంలోనే మంచి ప్రావీణ్యం ఉన్నవాడు.  అతను, ఆ దుస్తులు మనకు వినోదాన్ని కలిగించటం లేదూ?"   

 హార్వీ తన పరిచయానికి కృతజ్ఞతలు చెప్పాడు.  "అన్ని పార్టీలకు ఆహ్వానం పొందటానికి యిదొక మార్గం!" అని కిలకిలా నవ్వాడు.  

  నాన్సీ, నెడ్, మిగిలినవాళ్ళు యితర అతిథులతోపాటు మైదానంలో పరచిన చాపల మీద కూర్చున్నారు.

వాళ్ళు ఆ సాయంత్రం పూర్తిగా ఆనందించారు.  హార్వీ వండిన మాంసాహారం చాలా బాగుందని, తన జీవితంలో ఎప్పుడూ అంత రుచికరమైన దాన్ని తినలేదని బర్ట్ ప్రకటించాడు.  మిగిలిన మెనూలో ఉన్నవి ఏమిటంటే బంగాళాదుంప చిప్స్, అనేక రకాల సలాడ్, తాజా పళ్ళను పైన అలంకరించిన వెనిల్లా ఐస్ క్రీం మరియు కేక్.  

  "కడుపునిండా తిన్నాను!" కేక్ చివరిముక్కను పూర్తిచేసి, డేవ్ మూలిగాడు.  

  అతను మాట్లాడుతుండగా, గిటారు తీగలను సవరిస్తున్న శబ్దం వినిపించింది.  తల పైకెత్తిన రివర్ హైట్స్ సందర్శకులకు, వాళ్ళ సంరక్షకులకు  గుంపు చివర నిలబడ్డ యువకుడు కనిపించాడు.  ఆ సంగీతకారుడు పాడటం ప్రారంభించాడు.  ఒక గిరిజనుడు దుకాణంలో బూట్లు కొన్న ఘట్టానికి చెందిన హాస్య గీతాన్ని మొదట పాడాడతను.  ప్రతి పద్యం "అయ్యో!  వాళ్ళు గిల్లారు!  అయ్యో! వాళ్ళు బాధించారు!" అని ముగుస్తోంది.  

  వెంటనే అతను బాగా పేరున్న పాటలను వాయించాడు.  పిక్నిక్కులో ఉన్న వారంతా గొంతు కలిపారు.  తరువాత ఒక జంటచే ఉల్లాసభరితమైన హాస్య ప్రదర్శన యివ్వబడింది.  వారు ఓడలో కలిసిన యిద్దరు ప్రయాణీకులకు ప్రాతినిధ్యం వహించారు.  ఒకరి భాష ఒకరికి రాదు.  కానీ యిద్దరూ కూడా రెండవ వానికి అదే హోటలుకి తిరిగి ఎలా వెళ్ళాలో, దారి చెప్పటానికి ప్రయత్నిస్తున్నారు.  దానిలో సమయం కూడా మరచి లీనమైపోయారంతా.  ఇంతలో జోడీ స్నేహితుల్లో ఒకడు "అయ్యో దేవుడా!  ఇప్పుడు దాదాపు పన్నెండు కావస్తోంది!" అన్నాడు.  

  అది అందరూ వెళ్ళిపోవటానికి సంకేతంలా కనిపించింది.  నాన్సీ, ఆమె మిత్రబృందం తమకు ఆతిథ్యమిచ్చిన వాళ్ళకు శుభరాత్రి చెప్పటానికి వెళ్ళారు.

(సశేషం)

No comments:

Post a Comment

Pages