జ్ఞాన నేత్రం - అచ్చంగా తెలుగు

 జ్ఞాన నేత్రం

(మా జొన్నవాడ కథలు)

 

-       డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య, 9490400858 


"జొన్నాడ... జొన్నాడా... ఆకరు స్టేజీ... దిగాలమ్మా… దిగాల…" కండక్టరు కేకలకు ఉలిక్కిపడి మేలుకొంది జ్ఞానమ్మ.

          సమయం ఉదయం 11 గంటలవుతోంది. భక్తులంతా బస్సు దిగి దేవళానికి పరుగులు తీస్తున్నారు. జ్ఞానమ్మకు ఎక్కడికి వెళ్ళాలో అర్ధం కాలేదు. మెల్లిగా బస్సు దిగి పెన్నానదికి వెళ్ళి స్నానం చేసి తడిగుడ్డలతోనే వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడున్న ఒక అరుగుమీద కూర్చుంది. పూజారిగారు ఇంకా ఎవరైనా భక్తులు ఉన్నారా ప్రసాదం అమ్మకు నైవేద్యం పెట్టి దేవళం తలుపులు మూసేద్దామని చూస్తున్నాడు.

          ఇంతలో దూరంగా కూర్చున్న జ్ఞానమ్మను చూసి పిలిచాడు. "టైం అయిపోతున్నాది. బైటికిపోండింక " అని సైగచేశాడు. ఆయన దగ్గరకు వచ్చి రెండు కాళ్ళ మీద పడి పెద్దగా ఏడవడం మొదలు పెట్టింది. దేవళం సిబ్బంది వచ్చి ఏమైందా అని వింతగా చూస్తున్నారు. "లేమ్మా! లే! అమ్మను ప్రార్ధించు అన్ని కష్టాలు తీరిపోతాయి. శివయ్యకు మ్రొక్కుకో! బాధలేమీ ఉండవు లే!  " అన్నాడు.

          ఆమె దుఃఖం నుండి తేరుకుని లేచి నిలబడ్డ తర్వాత "చెప్పమ్మా!" అన్న మాటకు

              "అయ్యా! మాది వెంకటగిరి దగ్గర చిన్న పల్లెటూరు. అక్కడ ఇమడలేక వచ్చేశాను. నేను ఇక్కడ దేవళం ఊడ్చే పని, కడిగి ముగ్గులు పెట్టే పని చేస్తాను. నాకు ఆధరువు కల్పించండి"

              "అమ్మా! ఇక్కడ మా పెత్తనం ఏమీ ఉండదు. గవర్నమెంటు వాళ్ళ ఇష్టానుసారం మేం నడుచుకోవాలి"

              "నిజమే! నేనేమీ జీతం భత్యం ఆశించడంలేదు. నాకు గుడి ఊడ్చే అవకాశం కల్పించండి చాలు. బదులుగా ఇంత ప్రసాదం పెట్టండి చాలు"

          గుమాస్తా గుర్నాధం అందుకుని "ప్రసాదం గావాలంటే నువ్వు గుడి శుభ్రం చెయిబల్లా...పాడూ బల్లే... టయానికి ఈడకొచ్చావనుకో కడుపునిండా తినొచ్చు. రోజూ పులిహోరనో..దద్దోజనమో ఏదో ఉంటానే ఉంటాదీడ. గుడి ఊడ్చే దానికి రామమ్మ ఉళ్ళా..అది మళ్ళీ మా మీద బడి ఏడుసుద్ది."

              "నాకు ఉండడానికి ఏదైనా వసతి కల్పించండి" అన్న మాటకు ప్రసాదాలమ్మే సుబ్బమ్మ "మోవ్..నువ్వెవరో తెలవదు..నీకెట్టిస్తారిళ్ళు ఈడ! రచ్చబండమీద కూర్చోపో! దిక్కులేనోళ్ళకు రచ్చబండే…. ఊళ్ళో.. పో...ఆడికిబో....." అనింది. అంతే మారు మాట్లాడకుండా రచ్చబండమీదకెళ్ళి చతికిలబడింది.

              రోజూ తెల్లవారు ఝామునే నిద్రలేవడం పెన్నలో స్నానం చెయ్యడం, అమ్మణ్ణిని దర్శించుకోవడం, వాళ్ళు పెట్టిన ప్రసాదం తిని మళ్ళీ రచ్చబండ మీదకు చేరుకొని ధ్యానంలో మునిగిపోవడం జ్ఞానమ్మ నిత్య కృత్యమైంది. ఆమె అలా ధ్యానంలో ఉండడం చూసిన జనం ఆమెకు దగ్గరగా వచ్చి కూర్చునే వారు. జ్ఞానమ్మది దబ్బపండు ఛాయ. మంచి కళగల మొహం. మొహమంతా పసుపు రాచుకునేది. నుదుట రూపాయ బిళ్ళంత బొట్టు పెట్టుకునేది. ఆమె టైంలో కళ్ళు తెరిచినా సరే! జనం వచ్చి వాళ్ళ బాధలు చెప్పుకునేవారు. ఆమె మాత్రం నోరువిప్పి మాట్లాడేది కాదు. దగ్గరలో ఖాళీగా ఉన్న పాకలో వసారాలో పడుకునేది. ఇలా కొంతకాలం గడించింది.

              ఒకరోజు జొన్నవాడకు భగవాన్దాస్ వచ్చాడు. ఆయన ఈశ్వర భక్తుడు. నెల్లూరు దగ్గర ఆశ్రమంలో ఉంటాడు. జనానికి ఆయన మీద బాగా గురి. ఎంతో మంది ఆయనకు మ్రొక్కి సలహాలు తీసుకుంటున్నారు. భగవాన్దాస్ ఈమె వాలకం గమనించి, జనం అంతా వెళ్ళిపోయాక అడిగాడు. "ఎవరమ్మా...నువ్వు...ఎప్పుడూ ఈడ జూళ్ళేదే నిన్నూ... వాళ్ళేదేదో అడుగుతున్నారు. మీరు నోరువిప్పడంలేదు. వాళ్ళు బాధ పడుతున్నారు".

          ఆమె నవ్వి "స్వామీ! నేను ఏదో బాధల వల్ల వచ్చి ఇక్కడ తలదాచుకున్న దాన్ని. నాకు మంత్రాలు, మహిమలూ ఏమీ రావు. సామాన్య స్త్రీని. నేను వాళ్ళకు ఏమి చెప్పగలను?" అనితన భర్త అత్త్మామలు ఎలా నరకం చూపించారో చెప్పి పెద్దగా ఏడ్చింది.

              "బాధపడకు... నేను చెప్పేది విను...అందరూ ఏదో ఒక కారణంగానే సన్యాసాశ్రమంలోకి వస్తారు. వచ్చాక మళ్ళీ ప్రాణం పోయినా వెనక్కు వెళ్ళకూడదు" దుఃఖం ఆగాక మెల్లిగా అన్నాడు.

              "నేను నీకు ఒక మంత్రోపదేశం చేస్తాను. ఈమంత్రం రోజూ ఉదయం 108 సార్లు, సంధ్య వేళలో 108 సార్లు జపించు" అని ఏదో మంత్రం చెప్పి కాగితం మీద వ్రాసిచ్చి, వెళ్తూ ఒక మాట చెప్పాడు. "అమ్మా! ఎప్పుడూ సత్యమే చెప్పు! అబద్ధం చెప్పకు. నువ్వు ఎల్లవేళలా జరిగినదే చెబుతుంటే కొన్నాళ్ళకు నీవు చెప్పిన ప్రతిమాట కూడా  జరిగితీరుతుంది. ఇదీ నాకు మా గురువు బోధించిన రహస్యం. మొదటిసారి నీ అవస్థ చూసి నీకు చెప్పాను. నేను త్వరలో ఉజ్జయని శివయ్య దర్శనం కోసం వెళ్తున్నాను. నీకు మంచి వాక్సుద్ధినిమ్మని ఆ శివయ్యను ప్రార్ధిస్తాను తల్లీ...ఏం భయపడకు." అని వెళ్ళిపోయాడు.

          మరునాడు కళ్ళు తెరిచే సరికి ఐదుగురు భక్తులు కూర్చొని ఉన్నారు. ఆమె మొట్టమొదటి సారి నోరు విప్పి "చెప్పండి!" అంది ఒకాయన్ను చూస్తూ.

"అమ్మా! మాకు ఒక్కగా నొక్క బిడ్డ. బాగా చదవడంలేదు. గాలి తిరుగుళ్ళు తిరగతా ఉన్నాడు"

"అతి గారాబం చేశారేమో!"

"అవును తల్లీ.. ఒక్క కొడుగ్గదా అని అడిగినవన్నీ కొనిచ్చాం. కాని వాడు" ఆయన కళ్ళవెంట కన్నీళ్ళు కారుతున్నాయి.

"భయం లేదు దారికొస్తాడు. మెల్లిగా  చెప్పండి. వింటాడు. అమ్మకు అర్చన చేయించండి. మీ కోరిక అమ్మకు చెప్పండి" అనేసరికి వాళ్ళు సాష్టాంగ నమస్కారం చేసి ఏవో పండ్లూ అవీ ఇవీ యిచ్చి వెళ్ళిపోయారు.

          ఇలా ఒక సంవత్సరం సాగింది. లోపు ఆమెకు వాక్సుద్ధి ఉందని గ్రహించిన ఊరిజనం, ఆమెకు సౌకర్యవంతంగా పెన్న ఒడ్డున కుటీరం కట్టించి ఇచ్చారు. ఎక్కువ శాతం ఆమె చెప్పినవి జరగడంతో జనం దూర ప్రాంతాల నుంచీ కూడా రావడం ప్రారంభించారు. ఆమెకు నలుగురు శిష్యురాళ్ళు కూడా ఏర్పడ్డారు.

-          ఒకరోజు

కళ్ళు తెరిచే సరికి ఒకాయన పెద్ద గడ్డంతో చింపిరి జుట్టుతో, మురికి బట్టలతో కనిపించాడు.

"చెప్పు నాయనా!"

“మహాపరాధం చేశానమ్మా!" చెంపలు వాయించుకున్నాడు.

ఆమె అతన్నే మౌనంగా చూస్తోంది.

“నా భార్య నన్ను వదలిపెట్టి వెళ్ళిపోయింది. అన్ని ప్రాంతాలు గాలించాను. వెదకని చోటులేదు" కన్నీళ్ళు కారిపోతున్నాయి.

"ఒక సారి తప్పు చేస్తే సరి దిద్దుకోవడం చాలా కష్టం. నీకు తెలియదా!"

"నిజమే! అందుకే పశ్చాత్తాపంతో అడుగుతున్నాను. నా భార్య తిరిగి వస్తుందా? కాపురం చేస్తుందా? చెప్పు తల్లీ...నీ పాదాలు పట్టుకుంటాను" అనేసరికి, జ్ఞానమ్మ ఆగమని సైగచేస్తున్నా వినకుండా, ఆమె శిష్యురాళ్ళు "అవతలికి వెళ్ళు కంపు గొడుతోంది… అంటూ ఆయన్ను ప్రక్కకు పంపించేశారు. అందరూ వెళ్ళిపోయినా ఆయన అక్కడే తారట్లాడుతూ ఉండేవాడు. అందరూ రోజూ శిష్యురాళ్ళు  అవతలికిపొమ్మని బలవంతంగా నెట్టేస్తూ ఉండేవారు.

-          ఒక వారం అనంతరం

              ఒకరోజు తెల్లవారుఝామున నాలుగు గంటలకే ఎవరో తట్టిలేపినట్టు మెలుకువ వచ్చింది. ఆమె గదిలోనుండి హాల్లోకి వచ్చి చూస్తే శిష్యురాళ్ళు ఆదమరచి నిద్రపోతున్నారు.  చూరుకు వేలాడుతున్న లాంద్ర గాలికి అటూ ఇటూ ఊగుతున్నది. "ఒకసారి వచ్చాక మళ్ళీ ప్రాణం పోయినా వెనక్కు వెళ్ళకూడదు" అన్న భగవాన్ దాస్ మాటలే చెవుల్లో రింగులు తిరుగుతున్నాయి.  ఏదో ఒక చీటీ తలుపు సందుల్లోంచి దూర్చినట్లు కనిపిస్తుండగా తీసుకొన్నది. గదిలోకి వెళ్ళి బుడ్డిదీపం వెలుగులో చదవసాగింది.

              "జ్ఞనమ్మా!  నేనెంత నిర్భాగ్యుణ్ణి. నీలాంటి మంచి భార్యను వదులుకొన్నాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. నిన్ను ఇబ్బంది పెట్టిన మా అమ్మ నాయనా ఆర్నెల్ల క్రితం తిరుపతికి వెళ్ళి  తిరిగి ఇంటికి వస్తూ, ఆటోను లారీ గుద్దడంతో అక్కడికక్కడే మరణించారు. దేవుడావిధంగా వాళ్ళకు పెద్ద శిక్షే వేశాడు. తరువాత వాళ్ళ దినానికి వచ్చిన మీ అమ్మ నాయన మా అమ్మాయి ఏమైందని నన్ను నిలదీశారు. తెలియదని చెప్పాను. నమ్మకుండా పోలీసు కంప్లెయింటు ఇచ్చారు. కొన్నాళ్ళు జైలు జీవితం గడిపాను. కొన్నాళ్ళు ఊరు ఊరూ తిరిగాను. తర్వాత ఇక్కడ మహిమలుగల అమ్మవారివయ్యావని తెలిసింది. అందుకే వచ్చాను. నేను నువ్వు నా భార్య అని నలుగురికి ధైర్యంగా చెప్పుకోలేని దుస్థితి అనుభవించడం ఎంత కష్టమో నీకు అర్ధమవకపోదనుకుంటాను. నీతో మాట్లాడి ఎలాగైనా ఇంటికి తీసుకుని వెళ్దామనుకున్నాను. కానీ విధి ఒక్కరోజులో ఎంత మార్పు తెచ్చిందో తెలుసా?

          నేను నిన్నరాత్రి రచ్చబండపై నిద్రపోతున్న వేళ ఎవరో ఒక వస్తాదు లాంటి వ్యక్తి వంటినిండా విబూధి రేఖలున్న ఆయన నన్ను నిద్రలేపాడు. "నీకు ఇక్కడ పనిలేదు వెంటనే ఊరు వదలి వెళ్ళిపో! లేదా" అని ఆగ్రహంగా చూశాడు. ఆయన కాలభైరవుడో, యమకింకరుడో తెలియదు. అందుకని రేపు ఉదయాన్నే వెళ్ళిపోతానని చెప్పి ఉత్తరం వ్రాసి మీ కుటీరంలో పెట్టి వెళ్తున్నాను. జన్మలో మళ్ళీ మనం కలుస్తామని అనుకోవడంలేదు. శలవు. ఇట్లు - నీకు ఏమీ కాని సుబ్బయ్య"

          కన్నీళ్ళు ధారాపాతంగా కురుస్తున్నాయి. వెంటనే పెన్నకు వెళ్ళి స్నానం చేసింది. కన్నీళ్ళూ.. పెన్ననది నీళ్ళూ కలిసిపోయాయి.

-0o0-

 

No comments:

Post a Comment

Pages