శ్రీసువర్చలావల్లభ మారుతీ శతకము - ముదిగొండ సీతారామమ్మ - అచ్చంగా తెలుగు

శ్రీసువర్చలావల్లభ మారుతీ శతకము - ముదిగొండ సీతారామమ్మ

Share This

శ్రీసువర్చలావల్లభ మారుతీ శతకము - ముదిగొండ సీతారామమ్మ

పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం 



కవి పరిచయం:
కవియిత్రి ముదిగొండ సీతారామమ్మ (26-07-1949-??) నిడుమోలు కామేశ్వరమ్మ, శ్రీరామమూర్తి దంపతులకు క్రిష్నాజిల్లాలోని మచిలిపట్నంలో జన్మించారు. వీరి భర్త ముదిగొండ నాగ మల్లికార్జున రావు. వీరిప్రాథమిక విద్యాభ్యాసం మచిలిపట్నంలోను, చిట్టి గూడూరులోను గుంటూరులోను జరిగింది. సంస్కృత భాషాప్రవీణ మరియు ఎం.ఏ(తెలుగు) వరకు వీరి చదివిన వీరు మచిలిపట్నంలోని సాహితీ మిత్రులు సంస్థలో కార్యవర్గ సభ్యులుగా (పది సంవత్సరాలు) మరియు కోశాధికారిగా (10సంవత్సరాలు)పనిచేసారు. అనేక అవధాన ప్రక్రియలో పృచ్చకురాలిగా పాల్గొన్నారు. విరూ అనేక కవితలపోటీలలో పాల్గొని పురస్కారాలను కూడా పొందారు. వీరు బహుగ్రంథములను రచించారు. 1. మల్లికార్జున శతకము, 2. తెలుసుకొనర నీతి తెలుగువాద (శతకము), 3. మానస శతకము, 4. నచయుగాల బాట నారి దిపుడు (శతకము), 5. శ్రీ సువర్చలావల్లభ మారుతీశతకము, 6. పొడుప్ కథలు (పద్యాలలో. ప్రమిదలో ప్రచురితం) 7. తిరుప్పావై ((సీసపద్యాలలో), 8. తిరువెంబావై (సీసపద్యాలలో), 9.పుస్తక సమీక్షలు.

శతక పరిచయం:
"మారుతీ" అనే మకుటంతో చంపకోత్పలమాల వృత్తాలలో రచింపబడిన ఈశతకం భక్తిరస ప్రధానమైనది. ఈశతకము కృష్ణా జిల్లాలోని ఉయ్యూరు నందు వేంచేసియున్న శ్రీసువర్చలఆంజనేయస్వామి వారిని ఉద్దేశించి వ్రాయబడినది. అందుచేత ఈశతకానికి ఈ నామకరణం. ఈశతకములో ఆంజనేయునిలీలలుమరియు స్వామికి సంభందించిన కథలు ముఖ్యంగా రామాయణంలోని మారుతి పాత్రను మనోహరంగా వర్ణించారు. ఇప్పుడు కొన్ని పద్యాలను చూద్దాం.

చం. వరమున పుట్టినావు వరవర్ణిని యంజని మాతకీవు, ఓ
సురవర వందితా కొనుము సొంపగు నుత్పల చంపకంబులన్
మరిమరి వేడుచుంటినయ మన్ననచేయుము నాదుపద్యముల్
వరమది నాదుజన్మకును భాగ్యముగా తలపోతు మారుతీ!

ఉ. భావన చేతు నామదిని భావజ సంహారుడవీవె యంచు నా
భావన మందు నిల్చి నిను భావన చేసెడి యోగమిమ్ము నా
భావ భవాంధకారమును బాపుము భాగ్యమదే గడింపగా
భావమెరుంగుమా దయ సువర్చల గూడుచు దివ్య మారుతీ!

ఆంజనేయ జననము, బాల్యము గురించిన ఈ పద్యాలను చూడండి.

ఉ. తాపసియైన కశ్యపుడు ధ్ర్మము తప్పక చేసెపూజలన్
ఆ పరమేశ్వరుండు దయ నాతని వరంబు పుత్రుడై
తాపము తీర్తునేననుచు ధైర్యము చెప్పెను తోషమందగా
రూపము మారుతంబుగను రుద్రుడెపుట్టెను దివ్య మారుతీ!

ఉ. ఈశునిపుత్రునిగ బడీయనెంతయు వేడిరి వాయువగ్నులున్
ఈశుడు తీర్చె కోర్కెనిల నెంతయు వేడ్కను రామకార్యమై
ఆశివుడే జనించె తనుదాస్యము చేయగ రామమూర్తికిన్
ఈశునివంటి దైవమిలనెందును కానము దివ్యమారుతీ!

చం. గ్రహణము పట్టువేళ యది రాహువు పట్టగ వచ్చుచుండగా
సహనమే లేక యాకలిని సాగుచుపట్టెను సూర్యబింబమున్
గ్రహమపుడల్గి యింద్రునటు రమ్మనిపిల్చెను నాతశుగ్రుడై
సహనమువీడి కొట్టగనె సత్యము హన్మవునైతి మారుతీ!

చం. హనుమను తాకె వజ్రహతి యప్పటినుండియు నీవు హన్మవై
జనమన మందు నిల్చితివి జై హనుమంతుడటంచు గొల్వగన్
నినుగన సంతసింత్రుమది నీరసముల్తొలగంగ మానవుల్
అనయము నినుగొల్చెదరు అంజని నందన భక్త మారుతీ!

ఉ. పార్థు రథంబుపై నిలిచి పావన గీతను వింటివీవు మా
ప్ర్ర్థన నాలకించి పరమార్ధము చూపుము నీ దిక్కువై
అర్ధులచేయబోకుము పరార్ధము కోర సువర్చలాపతీ
అర్ధము నీవెదేవ శివ"ఆశ్రిత" వత్సల మారుతీ!

రామాయణకావ్యంలోని ముఖ్య సంఘటనలపైని కొన్ని పద్యాలను చూద్దాము.

ఉ.వానరసేన నాయకుడ వారధి కట్టితివీవు సీతకై
మానుష కార్యమే యిదియుమంచిని చేయగ దేవతాళికిన్
మానవురాము సేవకయి మారుతి విట్టుల మర్కటంబుగా
దానవసేన గూల్చితివి దైవము నీయవ దివ్యమారుతీ!

ఉ. రాముని మెప్పు పొందితివి లంకను సీతమజాడ తెల్పగన్
ఆమని చూపినావుగద ఆయమసీతకు రామబంటువై
నేమముగాంచి నిన్నిలను నిత్యుని చేసెను కార్యదీక్షయే
ఓమహనీయరూపదయనున్నతి జూపుము దివ్యమారుతీ!

ఉ. వాయుకుమారుడై పరగి వానరరాజుకు మంత్రివైతివే
మాయలెరింగి నట్టిమహిమాన్వితదేహుడు మంత్రమూర్తినే
సాయమె మేలుకూర్చినది సక్యతపెంచెను వానరాళితో
కాయము కాంతివంతమగు కాపవుభక్తి దివ్యమారుతీ!

ఇటువంటి చక్కని పద్యాలతో అలరారే ఈశతకం అంతరూ తప్పక చదవ వలసినది. మీరూ చదవండి. మీ మిత్రులతో చదివించండి.

No comments:

Post a Comment

Pages