తీర్థయాత్ర
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు
మనసెప్పుడూ కోతే
విషయ కొమ్మల నుంచి కొమ్మలకు
దుడుకుగా దూకుతూ..క్షణం కుదురుగా ఉండదు
ఆధ్యాత్మిక యాత్రలోనన్నా
మనసును కట్టడి చేద్దామనుకున్నా..
కూర్చోడానికి కాస్త చోటివ్వనన్నాడని రైల్లో
ప్రయాణికుడితో వాగ్యుద్ధం చేశాను
కాళ్ళను చీపురు చేసి రైలుపెట్టెని తుడిచిన..
చేతుల్లేని బిచ్చగాడికి పైసా వేయకపోగా
చూపులతో చిరాకును, మాటలతో అసహనాన్ని వర్షించాను
కళ్ళు మూసుకుని తాదాత్మ్యంలో ఉన్న
కాషాయాంబరధారిని కపట సన్యాసని
ఈసడించుకుని
టికెట్టు లేకుండా ప్రయాణించే టెక్నిక్కదని వెక్కిరించాను
ఎప్పుడోసారి చేసే తీర్థయాత్రయినా
కొబ్బరికాయలబ్బీతో రూపాయికోసం
అరగంట బేరమాడాను
విడిచిన చెప్పులు, పెట్టిన సామాను
ఉంటాయో, ఉండవోన్న డోలాయమాన ఆలోచనల్తో
దర్శనం క్యూలో నా ఆకారం..
ఎప్పటికీ జనం అంగుళం ముందుకు కదలడం లేదన్న విసుగుతో,
భక్తులకు కనీస సౌకర్యాలు సమకూర్చడం లేదని
కనిపించని పాలకమండలిపై అక్కసు వెళ్ళగక్కాను
సకలాభరణాలతో, పట్టుపీతాంబరాలతో
చిరునవ్వు సహిత జగన్మోహనుడైన స్వామిని..
చంచల మనసుకు కళ్ళెమేసి ఆ క్షణమైనా చూడలేకపోగా
ముందుకు కదలండని తోసిన వ్యక్తిని తిట్టుకుంటూ
బయటకొచ్చాను
తీర్థయాత్రకన్నా విహారయాత్రకెళ్ళుంటే
బాగుండేదనుకుంటూ..తిరుగుప్రయా
***
No comments:
Post a Comment