అనసూయ ఆరాటం - 22
చెన్నూరి సుదర్శన్
సరిత దర్శకత్వంల అద్దిరెడ్డి నడువసాగిండు. తల్లి అనసూయ మాటను అటేటు పెట్టబట్టిండు.
ఒక రోజు తాత్పరంగ అనసూయను కూకోబెట్టి ఇక జరుగ బోయే తతంగమంతా కండ్లకు కట్టినట్టు చెప్పసాగిండు ఆదిరెడ్డి.
“అమ్మా.. తమ్ముడు సుత నాలెక్క వాని కాల్ల మీద వాడు నిబడాలె. అప్పుడే వానికి బతుకు విలువ తెల్తది. అవునా.. కాదా.. అందుకే తమ్మునికి ఉప్పల్ల ఒక ఆఫీసు సూసిన. ముందల ఆఫీసు కమ్ర.. ఎన్కాల రెండు కమ్రలల్ల మీరుండొచ్చు. వానికి వీడియోకాన్ కంపిని ఏసీల డీలర్‌షిప్ ఇప్పిస్తాన. కరారైంది.
జయమ్మకు.. వానికి పెండ్లి సంబంధాలు సూత్తాన. జయమ్మ అంటే అత్తరింటికి పోతది గాని నువ్వు వాని పెండ్లైనంక నా దగ్గరికే రా. అప్పటి వరకు ఒక ఇల్లు కట్టుకోవాలని ఉన్నది. ఇదీ నా ప్లాను. ఇంటికి పెద్ద దానివి. నిన్ను ఇసారించకుంట ఏ పనీ చెయ్య. అందుకే ముందుగాల నీ చెవ్వుల ఏత్తాన. ఇంకా సరితకు సుత చెప్పలే.. ఏమంటవ్..” అని రెండు చేతులు పట్టుకున్నడు.
“కొడుకా.. నువ్వు చెప్పేది బాగనే ఉన్నది కాని ఒక మాట సురేందర్ మామకు సుత చెప్పు” అన్నది అనసూయ.
“తాప, తాపకు మామయ్యను అడుగుడెందుకో.. ఇంకా నేను చిన్న పిలగాడినా..”
“గట్లంటే ఎట్ల కొడుకా.. ఇప్పుడు పెద్దోల్లమైనమని ఎన్కటి సంగతులు మర్సిపోదామా..’ఓడెక్కినంక ఓడ మల్లయ్య.. ఓడ దిగినంక బోడమల్లయ్య’ అనేరకమని మనం అనిపించుకోవద్దు. మన మంచీ చెడ్డలన్నీ సూసినోడు సురేందర్ మామయ్య. ఒక మాట చెపితే తప్పేంది”
“సరేలే.. నీ మాట ఎందుకు కాదనాలె.. ఫోన్ల మాట్లాడుత” అని నమ్మ పలికిండు ఆదిరెడ్డి.
మాట్లాడితే ఏది మీదపడ్తదో అని లోపల లోపల ఆదిరెడ్డిల భయమున్నది. ఒకవేళ తనకై తాను అడిగినా కర్సెన్క కర్సత్తాందని సర్ది చెబుదామనే భరోసా ఉన్నది.
పైసలకున్న తాకతే అంత. ఒక రూపాయి సంపాయించుడే మన వంతు. అటెన్క అదే సంపాయించుకుంట మనల్ని ఆటాడిత్తాంటది.
***
ఆదిరెడ్డి తన ప్లాన్‌ను పక్కాగ అమలు సేసిండు.
అనిమిరెడ్డి ఉప్పల్ల కొత్త ఆఫీసు.. కొత్త సంసారం. అనసూయ అనిమిరెడ్డి దగ్గర ఉంటాంది.
జయమ్మను ఉన్నోనికిత్తే.. కట్నం బాగా ఇచ్చుకునుడైతదని బీద ఇంట్ల పడేసిండు. నలుగురి తోటి మాట రాకుంట.. జయమ్మను, బావ రామిరెడ్డిని తను ఇదివరకున్న వారాసి గూడల ఒక ఇల్లు కిరాయ కిప్పిచ్చిండు. రామిరెడ్డికి తన ఆఫీసులున్న ఇస్టోర్ రూమును అప్పచెప్పిండు. ఆదిరెడ్డి ఎన్కట కాంట్రాక్టర్ దగ్గర పనిచేసినట్టు.. రామిరెడ్డి పనోల్లకు సామాను ఇచ్చి లెక్క రాసుకునుడు.. ఇంకా ఏసీలల్ల గ్యాసు నింపుడు సుత రామిరెడ్డికే అప్పజెప్పిండు.
అవ్వాల నాత్రి సరితకు, ఆదిరెడ్డికి జరంత కునుకు పట్టింది.
15
ఆదిరెడ్డికి తొల్సూరు కొడుకు పుట్టిండు.
అనసూయ ఆకాసమెత్తు ఎగిరింది సంబురంగ.
మనుమనికి తన పెనిమిటి పేరు పెట్టాలని ఆదిరెడ్డితోటి అనంగ సరిత కయ్యిమన్నది.
“గదేం పేరు. ఇవ్వాల రేపు గసోంటి పేర్లు ఎవరైనా పెట్టుకుంటాండ్లా.. మాగ చెప్పచ్చినౌ” అని గంజిల ఈగను తీసేసినట్టు తీసేసింది సరిత.
ఆదిరెడ్డి సుత తల్కాయె వంచుకొని ఇనీ ఇననట్టే మాట దాటేసిండు.
“నేను అడుగుడు తప్పే కొడుకా.. మీకొడుక్కు మీ ఇట్టమైన పేరు పెట్టుకొనుడే నాయం” అన్కుంట కడకొంగుతోని కంట్లె నీళ్ళు ఒత్తుకుంట వేరే పనిల పడ్డది అనసూయ.
ఆదిరెడ్డి కొడుకు ఇరవై ఒక్క దినం జోర్దారుగ చేసిండు. ములుగు వాడోల్లనెవ్వరినీ పిలువ పోయేటాల్లకు అనసూయ కొంచెం నారాజైంది. రవీందర్‌కు చెప్తే వచ్చెటోడో కాదో.. తెల్వదు గాని సురేందర్ తనకు పని ఉన్నదని ఫోన్ చేసిండు. అనిమిరెడ్డి ఆలుమొగలు, జయమ్మ, జయమ్మ పెనిమిటి తప్ప అంతా ఆదిరెడ్డి దోస్తులే.
ఇంకా సరిత తల్లిదండ్రులు.. వాల్ల దగ్గరి సుట్టాలు.
ఆదిరెడ్డి తన కొడుక్కు ‘సుశాంత్‌రెడ్డి’ అని పేరు పెట్టిండ్లు.
ఆ నాత్రంతా ఆదిరెడ్డి దోస్తులు తాగి.. తాగి తందనాలాడుడు.. అనసూయ తన జల్మల సూసూడు ఇదే మొదటి సారి. శవ్వా..రోత పాడుగాను అనుకున్నది మన్సుల.
***
No comments:
Post a Comment