పురాణం కధలు-బసవ పురాణం-2
పి.యస్.యమ్. లక్ష్మి
29. షోష్టలదేవు బాచయ్య కధ
పూర్వం బిజ్జలరాజు దగ్గర షోష్టలదేవు బాచనార్యుడనే మంత్రి వుండేవాడు.ఆయన అత్యంత శివ భక్తుడు. అయిననూ రాజాస్ధానంలో తన బాధ్యతలు అత్యంత శ్రధ్ధగా నిర్వహించేవాడు. ఆయన కళ్యాణపురం ఆస్ధానంలో మంత్రిగా వున్నప్పటికీ ఆయనకి ఒకే శివలింగాన్ని పూజించే నియమం వుండటం వల్ల ప్రతి రోజూ సౌరాష్ట్రకు వెళ్ళి అక్కడ శివుణ్ణి అర్చించి వచ్చేవాడు. ఇలా జరుగుతూండగా శివరాత్రి వచ్చింది. బాచయ మంత్రి రాజు అనుమతితో సౌరాష్ట్రకి వెళ్ళి తాను పూజించే శివుని పూజించి రావాలని రాజుని అనుమతి అడిగాడు. రాజు ఇక్కడ జమా ఖర్చులు చూసే పని చాలా వున్నది. పైగా మన నగరంలో కూడా శివరాత్రి ఉత్సవాలు జరిపించాలి. అదంతా నీ బాధ్యత, నీవు చూసుకుంటావనుకుంటే నువ్వు వెళ్తే ఎలాగు? ఒక్కొక్కసారి ఒక్కొక్క పని చూసుకోవాలిగానీ అన్ని పనులూ ఒకేసారంటే ఎలా అవుతాయి? నువ్వు నా పనులు పూర్తిగా చేసి దైవ సేవకి వెళ్ళు. లేకపోతే ఈ కొలువు మానుకుని వెళ్ళు..నేను వేరే ఎవరితోనైనా ఈ పనులు చేయించుకుంటాను. అయినా ఆ సౌరాష్ట్ర శివుడు ఇక్కడికి వస్తే మనమంతా కూడా ఆయనని సేవించి తరించవచ్చుకదా అన్నాడు. అది విని బాధపడ్డ బాచయ మంత్రి తనని గురించి గిట్టనివారెవరో రాజుకు చెడుగా చెప్పి వుండవచ్చు. అందుకే రాజు తనమీద కోపంగా వున్నాడు. ఇప్పుడు నేనితని మాట వినకుండా వెళ్ళటం మూర్ఖత్వమవుతుంది. పైగా చెడు మాటలు చెప్పేవారికి ఇంకా అవకాశం ఇచ్చినవాడినవుతాను. రాజు చెప్పినట్లు సౌరాష్ట్రలోని శివుడే ఇవాళ ఇక్కడికి వచ్చి నా పూజలందుకుంటాడు, లేకపోతే నన్ను తనదగ్గరకి తీసుకువెళ్ళే మార్గమేదన్నా చూపిస్తాడుగానీ నా నియమ భంగం కావించడుకదా. అనుకొని శివుడి మీద అచంచల భక్తితో రాజాస్ధానమున తన పనులు చూసుకోసాగాడు.
అంతలో బాచామాత్యుని దగ్గరకు ఒక పరిచారకుడు నంది ముద్రగల ఒక లేఖను తీసుకువచ్చి
ఆయనకిచ్చి నేను సౌరాష్ట్ర సోమనాధుని పరిచారకుడను.
ఈ రోజు శివరాత్రి. స్వామివారు
ఇక్కడికి వేంచేస్తారు. మూలనున్న ఒక గాదె
చూపించి సాయం సంధ్యా సమయంలో ఆ మూలనున్న గాదె కింద సోమనాధలింగమూర్తి
సాక్షాత్కరిస్తాడు. కనుక ఆ గాదెని ఒక
మూలకు తోయించి జాగ్రత్తగా చూస్తూవుండండి.
మీరు చూస్తూ వుండగానే లింగాకారం సోమసూత్ర సహితంగా ఒక్కమారు పైకి
లేస్తుంది. ఈ రోజు సాయంత్రం
సోమనాధుడిక్కడికి తప్పకుండా వస్తాడు. కనుక
జాగ్రత్తగా చూస్తూవుండండి. అని అందరూ వినేటట్లు పెద్ద స్వరంతో చెప్పి, అందరూ
చూస్తూ వుండగానే అదృశ్యుడయ్యాడు.
అదివిన్న అందరూ బాచయామాత్యుని దగ్గరకు చేరి అమాత్యా, ఈ వచ్చినవాడు సౌరాష్ట్ర ఈశ్వరుడే! పరిచారకుడి వేషంలో వచ్చి తన రాక గురించి చెప్పి వెళ్ళాడు. మీరెందుకలా నిశ్చేష్టులై వున్నారు? భగవంతుడు మీ భక్తికి మెచ్చి మీకోసం మన నగరానికి వస్తున్నాడు. మీ భక్తిని మీరు తక్కువ చేసుకోవద్దు. భక్తాగ్రేసరులని చెప్పేవారి ఇళ్ళకు శివుడు మారు వేషంలో వెళ్ళి, వారిని పరీక్షించిన తర్వాత దర్శనమిచ్చాడు. కానీ మీ భక్తికి మెచ్చి మీరు కోరకనే తనంత తాను వచ్చి తన రాకను ముందుగా మీకు తెలిపి, వేచి వుండమని హెచ్చరించి వెళ్ళాడు. మీ అంత పుణ్యాత్ములు వుండరు. తొందరగా రాజకార్యములు పూర్తి చేసి స్వామి చెప్పిన చోట గాదె తీసి, శుధ్ధి చేసి, అలంకరించి స్వామికి స్వాగతమివ్వటానికి సిధ్ధంగా వుండండి అని ప్రోత్సహించారు.. బాచయ్యమంత్రి కూడా తన పనులు తొందరగా పూర్తి చేసుకుని, రాజాజ్ఞతో నగరము, రాజప్రసాదమంతా స్వామి స్వాగతానికి తగువిధంగా అలంకరించమని, బిల్వ, ఫల, పుష్పాదులు సేకరించమని కొందరికి ఆజ్ఞాపించి, స్వామి సాక్షాత్కరించే ప్రదేశాన్ని శుభ్రం చేయించి, అలంకరించి, పూజా ద్రవ్యాలతో స్వామి సేవకు రాజు, బసవన మంత్రి, బాచయ్య మంత్రి, పురజనులు అందరూ వేచి చూడసాగారు. అప్పుడు అందరూ చూస్తుండగానే, ఒక్క క్షణంలో అంతకు ముందు గాదె వున్నభూ భాగం బద్దలయి సోమనాధుని లింగమూర్తి ఉద్భవించింది. అందరూ భక్తి ప్రపత్తులతో పూజించారు. రాజు, బసవామాత్యులు బాచామాత్యుని అనేక విధముల పొగిడారు. తాను రమ్మని పిలవకనే, భక్తుని అనుగ్రహించుటకు పరమ శివుడు ముందుగా భృత్యుని ద్వారా తన ఆగమన వార్తను అందజేసి తరువాత చెప్పిన చోట ప్రత్యక్షమవటం బాచనామాత్యుని భక్తికి నిదర్శనం కదా. అని అందరూ అనేక విధాల బాచనామాత్యుని పొగిడారు.
రాజు కూడా అలా ప్రత్యక్షమయిన సోమనాధునికి మంచి మందిరం నిర్మింపచేసి నిత్య
పూజలకోసం అనేక కానుకలు ఇచ్చి పూజారులను నియమించెను.
భగవంతునియందు అచంచల విశ్వాసముంచితే భక్తులు ఏమీ కోరకుండానే సర్వమూ
సమకూర్చే కరుణామయుడాయన.
No comments:
Post a Comment