కలిప్రభావం
రచన:సి.హెచ్.సాయిప్రతాప్
కలియుగ ఆరంభ కావడంతో దోపిడీలు, పాపాలు పెరగడంతో పరీక్షిత్తు మహారాజు ఆగ్రహం వ్యక్తం చేశాడు.కలిని అంతమందించడానికి బయలుదేరగా కలి అతని ప్రతాపానికి లొంగిపోయి శరణాగతి చేసాడు. బ్రహ్మదేవుని ఆడేశం మేరకు పరీక్షిత్తు యుగ ఆరంభం చేయమని కలికి అనుమతి ఇచ్చాడు. కానీ కేవలం నాలుగు ప్రదేశాలకు మాత్రమే అనుమతి ఇస్తానని అన్నాడు.ఇందులో మొదటిది మద్యం అమ్మే స్థలం. రెండోది వ్యభిచార గృహాలు. మూడోది హంతకులు, జంతువులను క్రూరంగా హింసించే ప్రదేశాలు. నాలుగోది జూద గృహాల్లో ఉండాలని పరీక్షిత్తు ఆదేశించాడు. దీనికి అంగీకరించిన కలి ఓ రాజా ఇవన్నీ చెడు ప్రాంతాలు కాబట్టి మంచి వారు రారు. కనీసం గౌరవంగా ఉండే ఒక ప్రాంతంలో చోటు కల్పించాలని కోరాడు. కలికి కోరిక ప్రకారం బంగారంలోనూ ఉంటావని పరీక్షిత్తు అన్నాడు. పరీక్షిత్తు మహారాజు అలా చెప్పగానే కలి ఆయన కిరీటంలోకి దూరిపోయాడు. ఈ విషయాన్ని అతడు కూడా గమనించలేదు. తన కుటుంబం కూడా చాలా పెద్దదని, ఇందులో కామం, కోపం, దురాశ, అసత్యం, అహంకారం, అసూయ, లోభం సభ్యులని పరీక్షిత్తుకు తెలిపాడు
ఈ కలియుగంలో కలి పురుషుడు ప్రభావం చాలా దారుణంగా ఉంటుందని సాక్షాత్తు బ్రహ్మదేవుడే తెలిపాడు. అనేక దుష్పరిణామాలు సంభవిస్తాయి. ధర్మం కుంటి కాలిపై నిలబడుతుంది. మానవులు కామ, క్రోధ, లోభాది అరిషడ్వర్గాలకు పూర్తిగా లోబడిపోతారు. కలి పురుషుని ప్రభావంవల్ల దేవతలకు హవిస్సులందవు. వేదము అవమానింపబడుతుంది.శాస్త్రాలు అవహేళన చేయబడతాయి. పితృదేవతలకు శ్రాద్ధం పెట్టరు. ధర్మం, భూమాత, గోమాత అవమానింపబడతాయి. ద్వాపరయు గంలో అన్న చెల్లెళ్లకు పుట్టినవాడే కలిపురుషుడు. ఇతని కాలాన్నే కలియుగం అని పిలవబడుతుంది. ఈ యుగం మిగతా యుగాల కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ యుగం అయిపోయాక సృష్టి అంతమైపోయి తిరిగి యుగాలు ప్రారంభమవుతాయి. కలి ప్రభావంవల్ల మనుషులలో నీతి నిజాయితీ ఉండదు. దాన ధర్మాలు ఉండవు. తల్లిదండ్రులు, అత్తమామలు, అక్కాచెల్లెళ్లు, అనే అనుబంధాలు తగ్గిపోతాయి. చివరికి కలి వైపరీత్యంతో ఆకలి చావులు వచ్చి యుగం అంతమైపోతుంది.కలి కాలంలో కలి ఎలాగైనా వెంటాడి తీరతాడు. ఈ యుగంలో ధర్మ అడుగంటి ఉంటుంది కావున ఎవరికైనా చిన్న సాయం చేసిన కలి నుండి కొంత తప్పుతుంది. మన స్ఫూర్తిగా రోజుకు ఒక్కసారైనా దైవ స్మరణ, దాన ధర్మాలు చేయడం. పెద్దల శ్రాద్ధ కర్మలు మర్చిపోకుండా చేయడం, నోరు లేని జీవాలను ఆదరించడం. దైవ సంబంధ మైన చర్చల్లో భజనలలో, పాల్గొన్నా చాలు. కలి పురుషునికి దూరంగా ఉండవచ్చు.
No comments:
Post a Comment