రుస్తుమ్ ఎ హింద్ "పహిల్వాన్ గామా" - అచ్చంగా తెలుగు

రుస్తుమ్ ఎ హింద్ "పహిల్వాన్ గామా"

Share This

 రుస్తుమ్ ఎ హింద్ "పహిల్వాన్ గామా"

అంబడిపూడి శ్యామసుందరరావు 


మన భారతీయులకు కుస్తీ పోటీలు లేదా మల్లయుద్దము అంటే చాలా ఇష్టము. మన పురాణాలలో కూడా వీటి ప్రస్తావన ఉంది. భాగవతంలో బలరామ కృష్ణులను చంపటానికి కంసుడు చారణకుడు, ముష్టికుడు అనే ఇద్దరు మల్లయోధులతో కుస్తీ పోటీ ఏర్పాటు చేస్తాడు. అలాగే భారతములో భీముడు కీచకుడు జరాసంధుడు వంటి వారిని మల్ల యుద్దములో సంహరిస్తాడు. పూర్వము రాజులు జమీందారులు వారి వినోదము కోసము కుస్తీ పోటీలను నిర్వహిస్తూ పహిల్వానులను ప్రోత్సహిస్తూ ఉండేవారు.


ప్రస్తుతము రెజిలింగ్ అనే అట ఒలంపిక్స్ లో కూడా ఉంది. దంగల్ అనే పేరుతొ వచ్చిన హిట్ హిందీ సినిమా కుస్తీ బ్యాక్ గ్రౌండ్ తో తీసిందే  20 వ శతాబ్దము ఆరంభములో బ్రిటిష్ ఇండియాలో గామా, రుస్తుమ్ ఏ హింద్ గా ప్రసిద్ధి చెంది అపజయము అంటే ఎరుగని మల్లయోధుడు కుస్తీ పోటీల వీరుడు గులామ్ మొహమ్మద్ భక్ష్ భట్ (గామా)  మే 22,1878న పంజాబ్ ప్రావిన్స్ లోని అమృతసర్ జిల్లా జబ్బోవల్ అనే గ్రామములో పంజాబీ మాట్లాడే కాశ్మీరీ మల్లయోధుల కుటుంబములో జన్మించాడు రుస్తుమ్ ఎ హిందూ(ఇండియా చాంపియన్) అలాగే రుస్తుమ్ ఎ జమానా (ప్రపంచ చాంపియన్) గా ప్రసిద్ధి చెంది నేడు పూర్తిగా భారతీయులు మరచిపోయిన మల్లయోధుడు గామా  పదేళ్ల వయస్సులోనే జోద్పూర్ లో  జరిగిన బలాఢ్యుల పోటీలో ప్రవేశించాడు ఈ పోటీలో కఠినమైన గుంజీలు లాంటి వ్యాయామాలు ఉండేవి ఈపోటీకి 400 మంది మల్ల యోధులు పాల్గొనగా చివరి 15 మందిలో నిలిచి జోధ్ పూర్ మహారాజ చే విజేతగా పేర్కొనబడ్డారు. 

కానీ వయస్సు తక్కువగా ఉండటం వలన దాటియా మహారాజ చే తర్ఫీదుకు తీసుకోబడ్డాడు. 1895లో 17 ఏళ్ల వయస్సులోనే గామా ఆనాటి ఇండియన్ మల్లయుద్ధ చాంపియన్ గుజ్రాన్ వాలా (పంజాబ్ ప్రావిన్స్) చెందిన కాశ్మిరీ రహీమ్   భక్స్ సుల్తాన్ వాలా తో తలపడ్డాడు. అప్పటికి అతనికి చాలా తక్కువ గెలుపు ఓటమిల రికార్డ్ ఉంది ఆతను 7 అడుగుల పొడగరి రహీమ్ 5 అడుగుల 7 అంగుళాలు ఉన్న గామను సులభముగా ఓడించవచ్చు అని భావించాడు. కానీ రహీమ్ లోపము అతని వయస్సే.


తను గామా కన్నా చాలా పెద్దవాడు. ఇంచుమించు గా అతని కెరీర్ చివరకు వచ్చాడు. ఈ కుస్తీ పోటీ కొన్ని గంటల పాటు సాగి చివరకు డ్రా గా ముగిసింది.కానీ ఈ కుస్తీ పోటీ గామా కెరీర్ లో పెద్ద మలుపు  ఎందుకంటే అప్పటి నుండి ఇండియన్
రెజిలింగ్ చాంపియన్ లేదా రుస్తుం ఏ హింద్ పోటీలలో గట్టి పోటీదారుడు గా గామను  ప్రజలు భావించటం మొదలు పెట్టారు.రహీమ్ బక్స్ తో జరిగిన పోటీలో మొదట ఆత్మ రక్షణకు ప్రాధాన్యత ఇచ్చాడు తరువాత ఎదురు దాడి ప్రారంభించాడు. ఈ పోటీలో ముక్కు వెంబడి చెవుల నుండి గాయాలై  నెత్తురు కారుతున్న పోటీ నుండి విరమించ  కుండా పోరాడాడు.


1910 నాటికి గామా భారతదేశములోని ప్రసిద్ధి చెందిన మల్లయోధులను చాలా మందిని ఓడించాడు. ఆ తరువాత అతని దృష్టి మిగతా ప్రపంచములోని మల్లయోధులపై పడింది. తన చిన్న తమ్ముడు ఇమామ్ భక్ష్ ను వెంటబెట్టుకొని నౌకలో ఇంగ్లండ్ కు పాశ్చాత్య మల్లయోధులతో పోటీ పడటానికి బయలుదేరాడు.కానీ గామా ఎత్తు తక్కువగా ఉండటం వలన అతనికి ఎంట్రీ లభించలేదు.అటువంటి పరిస్థితిలో గామా లండన్ లో  తానూ ఒకేసారి 30 నిముషాలలో ముగ్గురు మల్లయోధులను మట్టి కరిపిస్తానని ఛాలెంజ్ చేసాడు.కానీ ఇదో ఒక జోక్ గా భావించిన పాశ్చత్య మల్లయోధులు ఎవరు ఇతని ఛాలెంజ్ ను స్వీకరించలేదు.ఈ స్తబ్దతను బ్రేక్ చేయటానికి గామా మరో ఛాలెంజ్ ముఖ్యముగా హెవ్వి వెయిట్ మల్లయోధులకు చేసాడు. అది ఏమిటి అంటే గామా అప్పటి ప్రముఖ మల్లయోధులైన స్టాన్సిలాస్ బైస్జ్కొ మరియు ఫ్రాంక్ గోచ్ లను కుస్తీ లో ఓడిస్తానని లేని పక్షంలో ఆ ప్రయిజ్ సొమ్మును వారికి వదిలి ఇంటికి వెళ్లిపోతానని సవాలు చేసాడు.

గామా సవాలును స్వీకరించిన మొదటి ప్రొఫెషనల్ కుస్తీ వీరుడు అమెరికన్ బెంజిమన్ రొల్లర్. ఈ పోటీలో గామా రొల్లర్ ను మొదటి రౌండ్ లో 1నిముషము 40 సేకనులలో మట్టి కురిపించాడు.రెండవ రౌండ్ లో 9 నిముషాల 10 సెకన్లలో చిత్తూ చేసాడు. రెండవరోజు గామా 12 మంది మల్లయోధులను ఓడించాడు ఆ విధముగా గామా అఫీషియల్ టోర్నమెంట్  లో ఎంట్రీ సాధించాడు. గామా ప్రపంచ చాంపియన్ అయిన స్టాన్స్లిలస్ బిడ్జ్కో తలపడవలసి వచ్చింది. ఈ కుస్తీపోటీ 1910 సెప్టెంబర్ 10న జరిగింది.నాటికే గామా ప్రత్యర్థి బిస్జ్కో ప్రపంచములోని ప్రముఖ కుస్తీ వీరుడుగా పేరున్నవాడు.అయన గామా ఛాలెంజ్ ను స్వీకరించి అప్పటివరకు ఓటమి ఎరుగని గామా తో పోటీకి సిద్ధపడ్డాడు.ఫ్రాంక్ గొట్చ్ అనే మల్లయోధుడు పోటీనుండి తప్పుకోవటం వల్ల లండన్ లో జరిగే జాన్ బుల్ వరల్డ్ చాంపియన్ షిప్  ఫైనల్స్ లో గామా
బిస్జ్కో తో తలపడవలసి వచ్చింది.ఈ పోటీలో విజేత కు లభించే ప్రయిజ్ మనీ 250 పౌండ్లు మరియు జాన్ బుల్ బెల్ట్.ఆశ్చర్యకరమైన విషయము ఏమిటి అంటే ఒక్క నిముషములో గామా ప్రత్యర్థిని పడగొట్టాడు పడిపోయిన బిస్జ్కో 2 గంటల 35 నిముషాల వరకు లేవలేక పోయినాడు తనకున్న అపార అనుభవంతో బిస్జ్కో మధ్యలో లేస్తూ డిఫెన్సివ్ స్ట్రాటజీతో గామా తో పోరాడుతూ మూడు గంటలపాటు పోరాడి బిస్జ్కో పోటీని డ్రాగా ముగించాడు.ఈ పోటీలో బిస్జ్కోపెర్ఫార్మెన్స్ చాలా మంది అయన అభిమానులకు కోపము తెప్పించింది.

ఈ ఇద్దరు మళ్ళా 17, సెప్టెంబర్ 1910లో తలపడ్డారు ఈసారి బిస్జ్కో తన పెర్ఫార్మెన్స్ ను సరిగా ప్రదర్శించలేకపోయినాడు. అందుచేత గామాను విన్నర్ గా ప్రకటించారు ప్రయిజ్ అమౌంట్ 250 పౌండ్లు మరియు జాన్ బుల్ బెల్ట్ గామాకు దక్కినాయి.ఈ బెల్ట్ సాధించటం వల్ల గామా "రుస్తుమ్ ఎ జమానా"లేదా ప్రపంచ చాంపియన్ గా గుర్తింపు వచ్చింది కానీ గామా సాంకేతిక పరముగా ప్రపంచ చాంపియన్ ల వరుసలో చేరలేకపోయినాడు కారణము గామా బిస్జ్కో ను రింగ్ లో ఓడించలేకపోవటమే ఈ పర్యటనలో గామా చాలా మంది ప్రముఖ మల్లయోధులను కుస్తీ
పోటీలలో ఓడించాడు.


గామా ఓడించిన ప్రముఖ మల్లయోధులలో అమెరికాకు చెందిన బెంజిమన్ రోల్లెర్,స్విట్జార్ల్యాండ్ కు చెందిన మారిస్ డెఱియాజ్, యూరోపియన్ చాంపియన్ అయిన జోహాన్ లెమ్ ఉన్నారు.రోల్లెర్  తో జరిగిన పోటీలో గామా రోల్లెర్  ను  15 నిముషాల పోటీలో 13 సార్లు క్రింద పడవేసాడు గామా ప్రపంచ చాంపియన్షిప్ కోసము పోటీపడదలచుకున్నారో వారందరికీ ఛాలెంజ్ విసిరాడు. ఈ ఛాలెంజ్ జపాన్ జూడో చాంపియన్ టారో మియాకే, రష్యాకు చెందిన జార్జ్
హక్కెన్స్చమిడిట్ మరియు అమెరికాకు చెందిన  ఫ్రాంక్ గొట్చ్ వంటి వారికి వర్తిస్తుంది. వీరందరూ గామా ఛాలెంజ్ ను తిరస్కరించారు ఎవరు కూడా రింగ్ లోకి ప్రవేశించి గామా తో తలపడటానికి సిద్ధపడలేదు ఎందుచేతనంటే తలపెడితే
ఓడిపోతామని వారి నమ్మకము. కొన్ని సందర్భాలలో గామా పోటీలలో తానె స్వయముగా ఒకరి తరువాత ఒకరు చొప్పున
25 మంది ఇంగ్లీష్ మల్లయోధులతో తలపడతానని అందరిని ఓడిస్తానని తానె గనుక ఓడిపోతే వారికి ప్రయిజ్ మని చెల్లిస్తానని ప్రకటించాడు కానీ ఎవరు కూడా ఈ ఛాలెంజ్ ను స్వీకరించలేదు అంటే వాళ్లందరికీ గామా శక్తి సామర్ధ్యాల మీద అంత నమ్మకము.ఇంగ్లాండ్ నుంచి తిరిగివచ్చినాక గామా అలహాబాద్ కు చెందిన రహీమ్ భక్ష్ సుల్తాని వాలను ఎదుర్కొన్నాడు వీరి ఇద్దరిమధ్య పోటీ భారతీయ కుస్తీ పోటీలకు రెండు మూలస్తంభాలైన వ్యక్తుల మధ్య జరిగినట్లుగా అందరు భావించారు.కాలము గామాకు అనుకూలముగా ఉండటం వలన గామయే గెలిచి రుస్తుమ్ ఎ హింద్ టైటిల్ ను దక్కించుకున్నాడు. 

తరువాతి రోజుల్లో గామను"మీరు బలమైన ప్రత్యర్థిగా ఎవరిని భావిస్తున్నారు " అని అడిగితె గామా తడువుకోకుండా "
రహీమ్ భక్ష్ సుల్తాని వాలా" అని చెప్పేవాడు.అది గామా తన ప్రత్యర్థికి ఇచ్చే గౌరవము.ఆ తరువాత గామా పండిట్ బిద్దు అనే పహిల్వాన్ ను కూడా ఓడించాడు. 1922 లో ఇంగ్లాండ్ నుండి ప్రిన్స్ అఫ్ వేల్స్ ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు గామాకు రజత దండాన్ని బహూకరించాడు.1927 వరకు గామాకు ప్రత్యర్థి అంటూ ఎవరు లేరు.1928లో జనవరి 1928లో గామా బిస్జ్కో తో తలపడవలసి వచ్చింది శారీరకంగా గామా ప్రత్యర్థి ముందు బలహీనంగా కనిపించిన ఒక్క నిముషములో గామా ప్రత్యర్థిపై విజయము సాధించాడు ఆ సందర్భముగా బిస్జ్కో గామను టైగర్ గా ప్రశంసించాడు.ఆ విధముగా గామా 48 ఏళ్ల  వయస్సులో భారతదేశములోని గొప్ప మల్లయోధుడిగా "గ్రేట్ రేజిలర్ అఫ్ ఇండియా" గా గుర్తింపు పొందాడు. గామా  1929లో జెస్సి పీటర్ సన్ తో పోరాడి గెలిచాడు. ఇదే అతని ఆఖరి కుస్తీ పోటీ.

స్వాతంత్రము తరువాత దేశవిభజన వల్ల గామా పాకిస్తానుకు వెళ్ళిపోయాడు. పాకిస్తాన్ లో అనేక కార్యక్రమాలు మొదలు పెట్టి దేనిలో సక్సెస్ కాలేదు. కరాచీలో గామా ట్రాన్స్పోర్ట్ కంపెనీ మొదలు పెట్టి నష్టపోయినాడు చివరి రోజులు ఆయనకు భారంగానే గడిచాయి. 5 గురు కొడుకులు 4 గురు కూతుళ్లు అందరు చిన్న వయస్సులోనే మరణించారు చిన్నకొడుకు జలాలుద్దీన్ మరణము ఆయనను బాగా క్రుంగ దీసింది ఆ బాధతో కొన్నాళ్ళు మాట కూడా రాలేదు.  దేశవిభజన అనంతరము పాకిస్తాన్లో హిందువులపై జరిగిన దాడుల్లో గామా కొన్ని వందల హిందువుల ప్రాణాలను కాపాడాడు.1952 వరకు కుస్తీ పోటీలనుండి విరమించుకోక పోయినా సరిఅయిన ప్రత్యర్ధులు ఆయనకు ఎదురు కాలేదు. ఆయన తన మేనల్లుడు బోలు పహిల్వాన్ ను కుస్తీ పోటీలకు తర్ఫీదు  ఇచ్చి ఆతనిని  దాదాపు 20 ఏళ్ళు పాకిస్తాన్ రెజిలింగ్ చాంపియన్ గా నిల బెట్టాడు.ప్రభుత్వమూ ఇచ్చే పెన్షన్ తో చివరిరోజులు గడిపాడు.పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ భార్య కుల్సుమ్ నవాజ్ గామా మనుమరాలు.గామా 1960 మే 23న లాహోర్ లో మరణించాడు.


గామా తన కెరీర్ 52 ఏళ్ల కాలములో ఐదు వేల  పోటీలలో పాల్గొని అపజయము అంటే ఎరుగని గ్రేటెస్ట్ ఇండియన్ రేజిలర్ గా నేటికీ రికార్డ్ స్థాపించాడు. కరాటే వీరుడు బ్రుస్ లీ గామా అభిమాని,.గామా ఉపయోగించిన టెక్నీక్స్ ను
తానూ చూసి నేర్చుకున్నానని చెప్పేవాడు.గామా ఉపయోగించిన 100 కేజీల బరువు ఉండే హస్లీ అనే పేరు గల ఎక్సర్ సైజ్ డిస్క్ నేటికీ పాటియాలలో ఉన్న నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ లో ప్రదర్శనకు ఉంచబడింది. గామా రోజు
ఒకటిన్నర  పౌండ్ల (ముప్పావు కేజీ) బాదంపప్పులు పిండి చేసి 2 గెలన్ల(సుమారు ఏడున్నర లీటర్లు) పాలలో కలిపి ఇతర పండ్ల రసాలతో పాటు తీసుకునేవాడు. అయన డైట్ లో 6 చికెన్ లను తినేవాడు. రోజు 3000 పుష్ అప్స్ 5000 గుంజీలు తీసేవాడు క్రమబద్ధమైన క్రమశిక్షణ తో కూడుకున్న జీవితాన్నిగడిపేవాడు.ఒకసారి గామా గ్వాలియర్ వెళ్ళినప్పుడు అక్కడ 1200కేజీల బరువు ఉండే బండ రాయిని ఎత్తి క్రీడాభిమాని అయినా బరోడా మహారాజూ మహారాజా శాయోజీ రావు ముందు తన బలాన్ని ప్రదర్శించి అయన మెప్పు పొందాడు ఆ బండరాయి నేటికీ బరోడా మ్యూజియం లో ఉంది దానిని ప్రస్తుతము కదపాలి అంటే 25 మంది కావాలి నేడు దానిని కదపటానికి హైడ్రాలిక్ మెషిన్ వాడుతున్నారు ఇదండీ ఒకనాటి మల్లయుద్ధ ప్రవీణుడు గామా జీవిత గాధ.

No comments:

Post a Comment

Pages