పల్లవి:
తెలియడుగాక ద్రిష్టము జీవుడు
సులభమిదివో యిచ్చోటనే పరము
చ.1:
మనసునదలచిన మర్మములు గరగి
చొనుపుచు నింద్రియసుఖ మిచ్చు
అనువుగ నిటువలె హరిదలపోసిన
తనకు బ్రహ్మానందము సమకొనదా
చ.2:
మాటలాడినను మరిగి మానవులు
యీటున మెచ్చిత్తురేమైనను
నాట నిట్ల హరినామము నొడివిన
గాటపువరములు కలుగునె కాదా
చ.3:
చేసినపుణ్యము చేతజుట్టుకొని
రాసి వెనుతగిలి రక్షించు
వేసర కిటు శ్రీవేంకటేశ్వరుని
ఆసల కైంకర్యము ఫలించును
భావం:
పల్లవి:
దేవుడు తెలియడు( చూడబడినవాడు కాడు) కాని జీవుడు చూడబడినవాడు.
ఇచ్చోటనే(ఈ లోకంలోనే ) మోక్షమున్నది. ఇది చాలా సులభము.
చ.1:
మనసులో ఇష్టమయిన లౌకిక విషయాలు తలిస్తే ( కాంతా వ్యామోహము మొ.) మర్మములు కరిగి ఇంద్రియసుఖము కలుగుతుంది.
ఈ రకంగా హరిని తలిస్తే తనకు బ్రహ్మానందము లభించదా? ( లౌకిక విషయాలను తలిస్తే ఆనందం- హరిని తలిస్తే బ్రహ్మానందం లభిస్తుందని అందువల్ల హరిని కొలవాలని భావం)
చ.2:
మాటలాడితే ఆసక్తిగా పలికితే - మానవులు -పరిమితితో మెచ్చి ఏమైనా ఇస్తారు.
ఈ రకంగా హరినామము ఆసక్తిగా పలికితే- స్వామివలన - ఇంకా అధికమైన వరములు కలుగుతాయి కదా !
చ.3:
మనము చేసినపుణ్యము చేతిలో చుట్టుకొని(అందుబాటులో అని భావం) ఆ పుణ్యరాశి వెంబడిరచి రాబోయే జన్మలలో రక్షిస్తుంది.
శ్రమపడక ఇట్లు శ్రీవేంకటేశ్వరుని సేవిస్తే ఆశల కైంకర్యము (భగవంతునికిని భగవద్భక్తులకును చేసెడి ఊడిగము.) ఫలిస్తుంది. (చేసే పుణ్యాలకంటె శ్రీవేంకటేశ్వరుని సేవ అధికమైన ఫలితాన్ని ఇస్తుందని భావం)
***
No comments:
Post a Comment