ఉద్ధవ - శ్రీకృష్ణ సంవాదం - అచ్చంగా తెలుగు

ఉద్ధవ - శ్రీకృష్ణ సంవాదం

Share This
ఉద్ధవ - శ్రీకృష్ణ సంవాదం 

( రెండవ భాగం )

శ్రీరామభట్ల ఆదిత్య 




పద్మనాభా! కమలలోచనా! చతుర్వర్ణములు చతురాశ్రమములు వాటి ధర్మములు నిర్ణయించి చెవులకింపు అయ్యేలా చెప్పు వింటాను.” ఇలా అడిగిన ఉద్ధవుడికి శ్రీకృష్ణుడు నాలుగు వర్ణాల పుట్టుక; నాలుగు ఆశ్రమాలకూ తగిన పద్ధతులు; నాలుగు వేదాలలో చెప్పిన ధర్మాలు; ప్రవృత్తి నివృత్తి హేతువులయిన పురాణములు, ఇతిహాసములు, శాస్త్రములు; వైరాగ్య విజ్ఞానములు; మొదలైనవన్నీ తెలిపాడు. “సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ” ధర్మంబులు సకలం విడిచి నన్నొక్కనినే శరణు పొందు అనే ఉపనిషత్తులతో సమానమయిన గీతాప్రవచనం ప్రకారం. నాయందు మనస్సు కలిగి ప్రవర్తించేవాడు నేనని చెప్పబడతాడు. పలువిధాలైన వాదాలెందుకు ఇతరత్రా మనస్సు లగ్నం కానీయకుండా, నామీదనే తలపు కలిగి నడచుకో. అనగా ఉద్ధవుడు ఇలా అన్నాడు.

బ్రహ్మదేవుడి కన్నతండ్రి! భక్తులు నమస్కరించే పాదద్వయం కల శ్రీకృష్ణా! తెలియనివి కొన్ని చెప్పావు. ఇంకా తెలియవలసినవి ఏవైనా ఉంటే తెలుపు. వాటిని తెలుసుకుని కృతార్ధుడను అవుతాను.”

ఉద్ధవుడు ప్రశ్నలు అడుగగా జ్ఞానాత్మకుడైన శ్రీకృష్ణుడు ఇలా చెప్పసాగాడు. “ఉద్ధవా! నీ ప్రశ్నలు సామాన్య మైనవి కావు. అయినా విను, చెప్తాను. యమ నియమాలూ శమదమాలు మొదలైనవి ఏవి? తపమనగా ఏమి? సుఖదుఃఖాలు స్వర్గనరకాలూ ఏవి? దరిద్రుడు అంటే ఎట్టివాడు? ఈశ్వరు డంటే ఎవరు? అని నీవు అడిగిన విషయాలన్నీ విడివిడిగా వివరిస్తాను.

మౌనవ్రతము, బ్రహ్మచర్యము, ఓర్పు, జపము, తపము, అతిధులను సత్కరించుట, పరహితము, దొంగతనమూ మొదలైనవి లేకుండుట, ఇటువంటివి నియమాలు అనబడతాయి. ఇంద్రియాలను వశంలో ఉంచుకోవటం, శత్రువులందు మిత్రులందు సమభావంతో ఉండటం శమము. మూఢులకు జ్ఞానాన్ని ఉపదేశించటము, కోరికలను వదలటం, సమదర్సనం, వైష్ణవభక్తి, ప్రాణాయామం, మనోనిర్మలత్వం వీటిని విద్య అంటారు. శమదమాది గుణాలు లేకపోవటం, నామీద భక్తి లేకపోవటం, అవిద్య అంటారు, చిత్తశుద్ధి కలిగి ఎప్పుడు తృప్తిగా ఉండటం దమము. ఇటువంటి నియమాలు గుణాలు కలిగి, నామీద భక్తి కలిగి ఉండటమే సుఖము. నన్ను తెలుసుకోలేక తమోగుణముతో ఉండటమే దుఃఖము. బంధువులందు గురువులందు భేదబుద్ధి పొంది శరీరాన్ని తన ఇల్లుగా భావించేవాడే దరిద్రుడు. ఇంద్రియాలను జయించి గుణసంగములలో విరక్తుడైన వాడే ఈశ్వరుడు.

నా మీద మనసును నిలిపి కర్మయోగమందు, భక్తియోగమందు అభిమానం కలిగిన జనక మహారాజు మొదలైన వాళ్ళు మోక్షం పొందారు. భక్తియోగం సాధించి బలి, ప్రహ్లాదుడు, ముచుకుందుడు మున్నగువారు పరమపదాన్ని పొందారు. కనుక, ఈ విషయాల్ని తెలుసుకుని ఎప్పుడూ భక్తియోగాన్ని ఎక్కువగా నీ మనసులో నింపుకో. మట్టికుండకు చిల్లుపడితే నీళ్ళు కారిపోవునట్లు దినదినము ఆయువు తరిగిపోతూ చావు దగ్గరపడుతు ఉంటుంది. కాబట్టి, ఇది ఎరిగి ఎప్పుడూ ఏమరక నన్ను స్మరిస్తూ ఉండేవాడు, నాకు ప్రియుడు.

ఉద్ధవా! గర్భంలో ఉన్నప్పుడు జీవుడికి పూర్తి జ్ఞానం ఉంటుంది. కడుపులోంచి భూమిమీద పడగానే ఆ జ్ఞానమంతా పోతుంది. అందుచేత, మానవుడు పసివానిగా కాని, పిల్లవానిగా కాని, యువకునిగ కాని, పెద్దవాడు అయిన పిమ్మట కాని నన్ను తెలుసుకుంటే కృతార్థుడు అవుతాడు. సంపదలు ఉన్నాయని గర్వంతో గ్రుడ్డివాడు అయితే చీకటిబావిలో పడతాడు. అటువంటివాడిని దరిద్రునిగా చేస్తే, జ్ఞాని అయి నా పాదపద్మాలకు నమస్కరించాలనే అభిలాష కలుగుతుంది. మోక్షం పొందుతాడు. శరీరము మీద అభిమానము వదలి ఈ లోకానికి పరలోకానికి చెందిన సుఖాలను కోరక మనస్సును నిగ్రహించుకొని, ఎల్లవేళలా నన్ను స్మరించేవాడు వైకుంఠాన్ని పొందుతాడు. నేనూ అతనిని విడచిపెట్టలేక వాని వెనువెంటనే వెళ్ళుతుంటాను. నారదుడు మున్నగు మునులు భక్తిభావం వలన నా సారూప్యం పొందారు.” అని శ్రీకృష్ణుడు ఉద్ధవుడికి చెప్పగా అతడు మరల ఇలా అన్నాడు.

స్వామీ! దేవదేవా! వాసుదేవా! జనార్ధనా! నీవు సర్వజ్ఞుడవు. సృష్టికర్తను ఎవరు నేర్పుతో నడుపుతాడో ఆనతీయవలసింది. అనగా శ్రీహరి ఉద్ధవుడితో ఇలా అన్నాడు. “ఆవిధంగా నాచేత ప్రేరేపించబడి మహత్తు మొదలైన గుణాలు అన్నీ కలసి ఒక అండంగా ఏర్పడ్డాయి; ఆ అండం నుంచి నేను పుట్టాను; అంతట నా నాభిలో నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. సముద్రాలు, అరణ్యాలు, నదులు, నదములు మొదలైన ప్రపంచ మంతా అతని చేత నేనే నిర్మింప చేసాను. ఆ బ్రహ్మదేవుడికి నూరేండ్లు నిండిన తర్వాత భూమి గంధంలో అణగిపోతుంది; గంధం నీటిలో కలుస్తుంది; ఆ నీరు రసములో లీనమవుతుంది; ఆ రసం తేజస్సు రూపాన్ని ధరిస్తుంది; ఆ తేజస్సు రూపము నందు సంక్రమిస్తుంది; ఆ రూపం వాయువులో కలుస్తుంది; ఆ వాయువు స్పర్శగా మారుతుంది; ఆ స్పర్శగుణం ఆకాశంలో లయమవుతుంది; ఆ ఆకాశం శబ్ద తన్మాత్రచే లోగొనబడుతుంది; ఇంద్రియాలు మనోవికార గుణాలతో కూడి ఈశ్వరునిలో లీనమై ఈశ్వర రూపాన్ని ధరిస్తాయి.

భగవంతుడనైన నేను రజస్సు సత్త్వము తమస్సు అనే మూడు గుణాలతోకూడి మూడుమూర్తులు ధరించి సృష్టి పుట్టుకకూ, ఉనికికీ, నాశనానికి కారణుడై వర్తిస్తాను. ఈ రహస్యాన్ని నీకు ఉపదేశించాను. కాబట్టి, పరమ పావనుడవు పరమ భక్తియుక్తుడవు కావలసింది.” ఇలా చెప్పిన కృష్ణుని పలుకులు విని ఉద్ధవుడు ఇలా ప్రశ్నించాడు.
రూపంలేని నీకు యోగులు ఒక ఆకారాన్ని రూఢీగా నిలిపి స్థిరమైన భక్తితో నిన్ను కొలుస్తూ ఉంటారు. నీవు వారి కోరికలు ఎలా తీరుస్తావు. నాకు తెలుపుము.”

ఇంకా ఉంది...

No comments:

Post a Comment

Pages