"బంగారు" ద్వీపం (అనువాద నవల) -9 - అచ్చంగా తెలుగు

"బంగారు" ద్వీపం (అనువాద నవల) -9

Share This
"బంగారు" ద్వీపం (అనువాద నవల) -9
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton


(అలిగిన జార్జి వద్దకు అన్నె జున్ను పళ్ళాన్ని పట్టుకొస్తుంది. అది తిన్న జార్జి కోపం శాంతించి తనతో పాటు అన్నెను ద్వీపానికి తీసుకెళ్తానంటుంది. అనుకొన్నట్లుగానే నలుగురు పిల్లలు, కుక్క పిల్ల తిమోతీ ద్వీపానికి బయల్దేరుతారు. దూరంగా కొండ శిఖరం మీద ఉన్న కోటను చూసి ఆనందిస్తారు. వారికి సముద్రంలొ ములిగిపోయిన ఓడ యొక్క శిధిలాలను చూడాలని కోరిక కలుగుతుంది. తరువాత. . . .)

ముగ్గురు పిల్లలకు నీటి అడుగున బాగా లోపల ఏదో కనిపించింది.

"అది ఓడ శకలమే!" జూలియన్ అత్యుత్సాహంతో దాదాపుగా పడవలోంచి నీటిలోకి పడిపోయేలాగ వంగాడు. "నేను విరిగిన ఓడ తెరచాప కొయ్యను చూడగలుగుతున్నాను. చూడు డిక్! అదిగో!"

కుక్కతో పాటు నలుగురు పిల్లలు స్పష్టమైన నీటిలోకి ఆసక్తిగా చూసారు. కొద్దిసేపయ్యాక, విరిగిన తెరచాప కొయ్యతో నిలచిన ఓడ యొక్క రూపురేఖలను వాళ్ళు గమనించగలిగారు.

"ఇది ఓడకు ఒక వైపు మాత్రమే!" అన్నాడు జూలియన్. "నిర్భాగ్యమైన పాత ఓడ! అక్కడ పడి ఉండటాన్ని ఎంత అసహ్యించుకొంటోందో, క్రమంగా ముక్కలుగా విడిపోతోంది. జార్జి! నేను నీటిలోకి దూకి దాన్ని చాలా దగ్గరగా చూడాలని అనుకొంటున్నాను."

"ఎందుకు చూడకూడదు?" అంది జార్జి. "నువ్వు నీ ఈత దుస్తులను వేసుకో! నేను తరచుగా ములుగుతూనే ఉంటాను. నీకిష్టమైతే, నేను నీతో వస్తాను. అయితే పడవ యిక్కడనుంచి కొట్టుకుపోకుండా డిక్ చూడాలి. ప్రవాహం వచ్చి పడవను సముద్రంలోకి లాక్కుపోవాలని చూస్తుంది. డిక్! ఈ తెడ్డుతో పడవ నీటిలో కొట్టుకుపోకుండా ఒకే చోట ఉంచటానికి నువ్వు కొద్దిగా కష్టపడాలి."

ఆ అమ్మాయి జూలియన్ లాగే తన పాంటు, జెర్సీని విప్పేసింది. వాళ్ళిద్దరూ అప్పటికే స్నానపు దుస్తులను లోపల కలిగి ఉన్నారు. జార్జి పడవలోని ఒక చివర నుండి మార్గదర్శిలాగ నీటిలోకి దూకి బాగా లోతుకు ఈదుకొంటూ వెళ్ళింది. మిగిలిన వాళ్ళు ఊపిరిని బిగబట్టి బలంగా నీటిలోపలకు ఈదుకెళ్తున్న ఆమెను చూస్తున్నారు.

కొంతసేపయ్యాక దాదాపుగా ఊపిరి ఆగిపోతుందన్నట్లు అనిపించి ఆమె వేగంగా నీటి పైకి వచ్చేసింది. ఆయాసపడుతూ గుండెలనిండా గాలి పీల్చుకొంది. "సరె! దాదాపుగా నేను శిధిలాల వరకు వెళ్ళాను" చెప్పిందామె. "నత్తగుల్లలు, యితర వస్తువులతో కూడిన సముద్రపుపాచి పట్టేసి, అది ఎప్పటిలాగే ఉంది. నేను ఓడ లోపలకు వెళ్ళాలని అనుకొన్నాను. కానీ అంతవరకూ నిలిపి ఉంచే శ్వాస నాలో లేదు. జూలియన్! ఇప్పుడు నువ్వు దిగు."

జూలియన్ వెళ్ళాడు. కానీ జార్జి లా నీటిలో లోతుకి ఈతకొట్టడం అతనికి రాదు, అందువల్ల అతను జార్జి వెళ్ళినంత దూరం వరకూ కూడా వెళ్ళలేకపోయాడు. నీటిలో కళ్ళు ఎలా తెరవాలో అతనికి తెలుసు. అందువల్ల అతను శిధిలమైన ఓడ డెక్ ను బాగా చూడగలిగాడు. అది బాగా దెబ్బ తిని విచిత్రంగా అనిపించింది. జూలియన్ దాన్ని నిజంగా పెద్దగా యిష్టపడలేదు. అది అతనికి బాధాకరమైన అనుభూతిని కలిగించింది. అతను తిరిగి నీటిపైకి చేరుకోగలిగినందుకు సంతోషించాడు. దీర్ఘంగా గుండెల నిండా గాలి పీల్చుకొన్నాడు. భుజాలను సూర్యరశ్మి తాకగానే వెచ్చని అనుభూతిని పొందాడు.

అతను పడవలోకి ఎక్కి, "ఉత్తేజకరంగా ఉంది" అని చెప్పాడు. "ఏదో శిధిలాలను అలా చూసి వచ్చేయటమంటే నాకు యిష్టం ఉండదు. నీకు తెలుసా! డెక్ కింద ఉన్న కేబిన్లలోకి వెళ్ళి చుట్టూ చూడాలి. ఓహ్! అలా చేస్తే, మనం నిజంగా బంగారు పెట్టెలను కనుక్కోగలమని భావిస్తున్నాను!"

"అది అసాధ్యం" జార్జి చెప్పింది. "బాగా ఈత వచ్చినవాళ్ళే దాని కిందకు వెళ్ళి ఏమీ కనుక్కోలేకపోయారని మీకు చెప్పానుగా! ఇప్పుడు సమయం ఎంతయింది? మనం యిప్పుడు త్వరగా వెనక్కి వెళ్ళకపోతే, బాగా ఆలశ్యమవుతుందని చెప్తున్నాను!"

వేగంగా వెనక్కి వెళ్ళిన వాళ్ళు టీ వేళకు అయిదు నిమిషాలు ఆలశ్యమయ్యారు. తరువాత వారంతా తిమోతి తమను అనుసరిస్తుండగా, చిత్తడి నేలలో వరుసలో నడిచారు. నిద్రపోయే సమయానికి బలవంతంగా కళ్ళను తెరిచి ఉంచాలన్నా అసాధ్యమయ్యేంతగా నిద్ర ముంచుకొచ్చింది.

"శుభరాత్రి జార్జి!" అంటూ అన్నె తన మంచం మీద ముడుచుకొని పడుకొంది. "మనం మనోహరమైన రోజును గడిపాం. నీకు ధన్యవాదాలు!"

"నాకు కూడా రోజు మనోహరంగా గడిచింది" చిరచిరలాడే గొంతుతోనే అంది జార్జి. "నీకు ధన్యవాదాలు. మీరంతా వచ్చినందుకు సంతోషిస్తున్నాను. మనం వేడుక చేసుకోబోతున్నాం. నువ్వు నా కోటను, నా చిన్న ద్వీపాన్ని ప్రేమిం చావా?"

"ఓ! అవును!" అంటూ అన్నె నిద్రలోకి జారుకొంది. ఆ నిద్రలో వందలకొద్దీ శిధిలాలు, కోటలు మరియు ద్వీపాలు ఆమె కలల్లో చోటుచేసుకొన్నాయి. జార్జి వాళ్ళను తన చిన్న ద్వీపానికి ఎప్పుడు తీసుకెళ్తుందో!

@@@@@@@@@@

మరునాడు ఆ పిల్లల పిన్ని వాళ్ళ కోసం ఒక పిక్నిక్కుని ఏర్పాటుచేసింది. స్నానం చేయటం, కాసేపు పడవలో మనస్ఫూర్తిగా తిరిగి రావటం కోసం, వాళ్ళందరూ దూరంగా లేని సముద్రపాయకు వెళ్ళారు. వారికదొక అద్భుతమైన రోజు.

కానీ జూలియన్, డిక్ , అన్నెలు జార్జి ద్వీపాన్ని చూడాలని మనసులో కోరుకొంటున్నారు. ఆ పని తప్ప మరే పని చేయాలని వారికి లేదు.

జార్జి పిక్నిక్కి వెళ్ళటానికి యిష్టపడలేదు. ఆమెకు పిక్నిక్కులు యిష్టం లేక కాదు. అక్కడకు ఆమె తన కుక్కను తీసుకెళ్ళలేదు. పిల్లలను తీసుకొని ఆమె తల్లి వెళ్ళింది. జార్జి తనకు ప్రియమైన తిమోతి వెంట లేకుండా రోజంతా గడపాల్సివచ్చింది.

"దురదృష్టం" ఆమె మనోవిచారాన్ని ఊహించుకొన్న జూలియన్ అన్నాడు. "పాత టిం గురించి మీ అమ్మకు నువ్వు ఎందుకు చెప్పలేకపోతున్నావో నేను ఊహించలేకపోతున్నాను. నీకోసం మరొకరు ఆ కుక్కను చూస్తూండటాన్ని ఆమె అంతగా పట్టించుకోదని ఖచ్చితంగా చెప్పగలను. మా అమ్మయితే పట్టించుకోదని నాకు తెలుసు."

"నేను నీకు తప్ప ఈ విషయం ఎవరికీ చెప్పను" చెప్పింది జార్జి. "నేనెప్పుడూ యింట్లో భయంకరమైన సమస్యలతో సతమతమవుతాను. ఇది నా తప్పే అని ధైర్యంగా చెప్పగలను. కానీ దీనిపై నేను కొద్దిగా విసిగిపోయాను. చూడు. నాన్న తను వ్రాసిన పాండిత్య పుస్తకాలతో పెద్దగా డబ్బు సంపాదించడు. కానీ తాను భరించలేని ఖరీదైన వస్తువులను కొని నాకు, అమ్మకు యివ్వాలనుకొంటాడు. అందుకే అది తనను కర్కోటకుడిలా మార్చేస్తోంది. అతను నన్ను మంచి పాఠశాలకు పంపించాలనుకుంటాడు, కానీ అతని వద్ద తగినంత డబ్బు లేదు. నేను సంతోషంగా ఉన్నాను. నేను స్కూలుకి వెళ్ళటానికి యిష్టపడను. ఇక్కడ ఉండటమే నాకు యిష్టం. తిమోతితో ఎడబాటుని నేను భరించలేను."

"బోర్డింగు స్కూలుని నువ్వు యిష్టపడతావు" అన్నె అంది. "మేమంతా వెళ్తున్నాం. చాలా సరదాగా ఉంటుంది."

"లేదు, అదేం కాదు" జార్జి గద్దించి చెప్పింది. "జనం మధ్యలో కలిసి ఉండాలంటే భయంకరంగా ఉంటుంది. చుట్టూ ఉన్న మిగిలిన అమ్మాయిలు గట్టిగా నవ్వుతూ, అరుస్తూ ఉంటారు. దాన్ని నేను ద్వేషిస్తాను."

"లేదు. నువ్వలా చేయలేవు" అన్నె చెప్పింది. "అదంతా చాలా సరదాగా ఉంటుంది. జార్జి! అది నీకు మంచిదని నేను అనుకొంటున్నాను."

"నాకు మంచి ఏమిటో నువ్వు చెప్పటం మొదలెడితే, నేను నిన్ను ద్వేషిస్తాను" అంటున్న జార్జి అకస్మాత్తుగా చాలా ఆగ్రహంగా కనిపించింది. "అవి నాకు మంచివని అమ్మానాన్నలు ఎప్పుడూ నాకు చెబుతూనే ఉంటారు. కానీ అవి ఎప్పుడూ నాకు యిష్టం ఉండవు."

" సరె సరె!" అంటూ జూలియన్ చిరునవ్వు నవ్వాడు. "అయ్యో దేవుడా! చుట్టూ కమ్మిన పొగ నుంచి నువ్వెలా బయటపడతావు? నిజం చెప్పాలంటే, నీ కళ్ళలో చిందే నిప్పుకణాలతో ఎవరైనా సిగరెట్టు ముట్టించుకోవచ్చని నాకు అనిపిస్తోంది."

అనుకోకుండానే జార్జి కి నవ్వు వచ్చింది. మంచి స్వభావం ఉన్న జూలియన్ పై చిరాకు పడటం నిజంగా అసాధ్యం.

ఆరోజు అయిదవ సారి వాళ్ళు సముద్రంలో స్నానం చేయటానికి వెళ్ళారు. త్వరలోనే వాళ్ళంతా ఆనందంతో చిందులేయసాగారు. అన్నె ఈత కొట్టడానికి సాయం చేసే అవకాశం జార్జి కొచ్చింది. చిన్నపిల్లేమో! తను సరిగా ఈదలేకపోతోంది. జార్జి తనకు నేర్పుతుంటే, నిజంగానే ఆమెకు గర్వంగా అనిపించింది.

"ఓ ధన్యవాదాలు!" తీవ్రంగా ప్రయత్నిస్తూనే అన్నె అంది. "నేను ఎప్పటికీ నీ అంత బాగా ఉండలేకపోవచ్చు. కానీ అబ్బాయిలలాగే మంచిగా ఉండాలనుకుంటున్నాను."

వాళ్ళు యింటికి వెళ్తుండగా, "నువ్వెళ్ళి స్టాంపు గాని మరేదన్నా కొనాలనుకొంటున్నావా?" జార్జి జూలియన్ని అడిగింది. "అప్పుడు నేను నీతో వచ్చి నా తిమోతిని చూసి వస్తాను. ఈరోజు తనను ఎందుకు బయటకు తీసుకెళ్ళలేదని చూస్తూ ఉంటాడు."

"సరె!" చెప్పాడు జూలియన్. "నాకు స్టాంపులు అవసరం లేదు. కానీ ఐసుక్రీం తెస్తాను. డిక్, అన్నె మీ అమ్మతో కలిసి సామాన్లు మోసుకొని యింటికి వెళ్తారు. నేను మీ అమ్మ దగ్గరకు యిప్పుడే వెళ్ళి చెప్పి వస్తాను."

అతను తన పిన్ని దగ్గరకు పరిగెత్తాడు. "పిన్నీ! నేను ఐసుక్రీములు కొనటానికి వెళ్తే నీకు అభ్యంతరం లేదు కదా?" అడిగాడతను. "ఈరోజు ఒక్కటి కూడా తినలేదు. ఎంతో దూరం వెళ్ళను. జార్జిని కూడా నాతో తీసుకెళ్ళవచ్చా?"

"తను నీతో వస్తుందని అనుకోను" ఫానీ అంది. "కానీ నువ్వు తననే అడుగు."

"జార్జి! నాతో రా!" అంటూ అరిచి, పక్కనే ఉన్న చిన్న గ్రామం వైపు వేగంగా జూలియన్ నడిచాడు. అకస్మాత్తుగా జార్జి చిరునవ్వు నవ్వి, అతని వెనకాల పరుగెత్తింది. ఆమె అతన్ని అందుకొని, కృతజ్ఞతగా నవ్వింది.

"ధన్యవాదాలు" అందామె. "నువ్వెళ్ళి ఐసుక్రీములు కొనుక్కు రా! నేను టింని చూసి వస్తాను."

వారు విడిపోయారు. జూలియన్ నాలుగు ఐసుక్రీములు కొని, యింటి వైపు తిరిగాడు. కొన్ని నిమిషాల్లో తన కోసం ఎదురుచూస్తున్న జూలియన్ వద్దకు జార్జి వచ్చి కలిసింది. ఆమె ముఖం వెలిగిపోతోంది.

"కుక్క బాగానే ఉంది" చెప్పిందామె. "నన్ను చూదగానే ఎంత మురిసిపోయిందో నువ్వు ఊహించుకోలేవు. దాదాపుగా నా తలపైకి దూకింది. నేను చెప్పేది. . .నాకు మరొక ఐసుక్రీం కావాలి. జూలియన్! నీకు నిజంగా సమయస్ఫూర్తి ఎక్కువే! త్వరలోనే నీతో ఏదో ఒకటి పంచుకొంటాను. రేపు నా ద్వీపానికి వెళ్తే ఎలా ఉంటుంది?"

"అయ్యో!" జూలియన్ కళ్ళు ఆనందంతో వెలిగాయి. "అద్భుతంగా ఉంటుంది. రేపు నిజంగానే తీసుకెళ్తావా? పద! మిగిలినవాళ్ళకి కూడా చెబుదాం."

నలుగురు పిల్లలు ఐసుక్రీములు తింటూ కూర్చున్నారు. జార్జి చెప్పిన విషయాన్ని జూలియన్ వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు సంబరపడ్డారు. జార్జి సంతోషించింది. కిర్రిన్ ద్వీపాన్ని చూడటానికి పిల్లలెవర్నయినా తీసుకెళ్ళటానికి అహంతో నిరాకరించే ఆమె, తన బంధువులను అక్కడకు పడవలో తీసుకెళ్ళటానికి అంగీకరించటం చాలా మంచి విషయమే!

"నాకు యిష్టమని అనిపించిన పనులను చేయటం చాలా మంచిదని నేను ఎప్పుడూ అనుకొంటూంటాను" తన ఐసుక్రీం చివరి ముక్కను జుర్రుకొంటూ ఆమె అనుకొంది. "కానీ జూలియన్, అతని వాళ్ళతో సరదాగా గడపటం ఆనందాన్ని యిస్తుంది."

భోజనానికి ముందు పిల్లలు తమను చక్కగా శుభ్రం చేసుకొందుకు పంపబడ్డారు.

(ఇంకా ఉంది)


No comments:

Post a Comment

Pages