చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 30
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
ఆంగ్ల మూలం : The moonstone castle mistery
నవలా రచయిత : Carolyn Keene
(నాన్సీ మిత్రులను జోడీ తన బంధువుకి పరిచయం చేసి, నాన్సీని ఒంటరిగా మేడ మీద తన గదికి తీసుకెళ్తుంది. అక్కడ జోడీ నాన్సీకి తన చిన్ననాటి ఫొటోలను చూపిస్తుంది. ఇంతలో పెంపుడు తల్లి పిలవటంతో జోడీ కిందకు వెళ్తుంది. అప్పుడు నాన్సీ ఆఖరి పెట్టెలో ఉన్న జోడీ చిన్నప్పటి ఫోటోని, తన పర్సులో ఉన్న ఫొటోతో పోల్చి చూస్తుంది. తప్పిపోయిన జోనీయే జోడీ అని గ్రహించిన నాన్సీ విస్తుపోతుంది. ఈ విషయాన్ని విన్న బెస్, రహస్యం బయటపడింది గనుక యింటికి వెళ్ళిపోదామంటుంది. నాన్సీ ఈ కుట్ర మొత్తం బయటపడేవరకూ అక్కడే ఉందామంటుంది. తరువాత. . .)
@@@@@@@@@@@
ముగ్గురు స్నేహితులు అబ్బాయిలకు వీడ్కోలు చెప్పటానికి ముందుగానే నిద్ర లేచారు. నెడ్, మిగిలిన అబ్బాయిలు తమ గూఢచర్యంలో జాగ్రత్తగా ఉండమని అమ్మాయిలను వేడుకొన్నారు.
"ఆ వ్యక్తిని పట్టుకోవటంలో నీకు సహాయం చేయటానికి మేమిక్కడ ఉన్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది" చెప్పాడు నెడ్. "కానీ ఒంటరిగా ఆ కోటకు వెళ్ళటానికి మీరు ప్రయత్నించకండి."
నాన్సీ నవ్వింది. "మరోసారి నేను ఒక అందమైన యువ పోలీసుని తీసుకెళ్తాను" అని ఆటపట్టించింది.
అబ్బాయిలను పంపించేసాక, నాన్సీ ఫోను వద్దకెళ్ళి తన తండ్రితో మాట్లాడటానికి ప్రయత్నించింది. కానీ అతనింకా శాన్ ఫ్రాన్సిస్కో హోటలుకు తిరిగి రాలేదు. ఆ తరువాత ఆమె రివర్ హైట్స్ లోని తన యింటికి ప్రయత్నించింది. ఆమె తన ఉత్తేజకరమైన శోధన గురించి హన్నా గ్రూకి చెప్పి, కాలిఫోర్నియాలోని మిస్టర్ డ్రూతో మాట్లాడటానికి ప్రయత్నించి, ఈ సమాచారాన్ని అతనికి అందజేయమంది.
"నేను ప్రయత్నిస్తూనే ఉంటాను" హౌస్ కీపర్ ఆమెకు వాగ్దానం చేసింది. "ఈ విషయం నిన్న నాకు తెలియకపోవటం చాలా చెడ్డ విషయం. నిన్న రాత్రి మీ నాన్న ఫోను చేసాడు. ఆయన నీ కోసం లాంగ్ వ్యూకి ప్రయత్నించానని చెప్పారు. కానీ మీరు బయటకు వెళ్ళారని చెప్పారట. ఆయన తన పేరును అక్కడ యివ్వలేదు. అందువల్ల నాకు కొంత ఆసక్తికరమైన సమాచారాన్ని యిచ్చి నీకు అందజేయమన్నారు."
"ఏమిటది?" నాన్సీ ఆత్రుతగా అడిగింది.
మిస్టర్ డ్రూ తూర్పు ప్రాంతంనుంచి వచ్చిన జోనీ హోర్టన్ని కనుగొన్నారని మిసెస్ గ్రూ చెప్పింది. "ఆమె యిప్పుడు జాన్ టాబర్ని పెళ్ళాడింది. మీ నాన్నకు యింతకు మించి వివరాలు తెలియవట. కానీ ఆమెను చూడటానికి ఆయన ప్రయత్నిస్తున్నాడని నేను అనుకొంటున్నాను."
"ఆమె మోసగత్తె కావచ్చు" నాన్సీ ఉద్రేకంతో చెప్పింది.
"అదే నేనూ అనుకొంటున్నాను" హన్నా అంగీకరించింది. "అయ్యో! ఈ కేసు ముగిసిపోయేలా నాకు అనిపిస్తోంది."
"ఓహ్! అది అద్భుతం కాదంటావా?" నాన్సీ ఆశ్చర్యపోయింది.
"ఏది ఏమైనా మీరు యింటికి వస్తేనే నేను సంతోషిస్తాను" హౌస్ కీపర్ విచారంగా అంది, "సందడి లేక యిల్లంతా నిశ్శబ్దంగా ఉంది."
"ఖచ్చితంగా ఇది ఎంతోకాలం పట్టదని నేను అనుకొంటున్నాను" నాన్సీ సంతోషాన్ని వ్యక్తపరిచింది. "సరె! నీకు గుడ్ బై."
ఈ విషయాన్ని బెస్, జార్జ్ లకు చెప్పగానే, వాళ్ళు కూడా ఉద్రేకానికి లోనయ్యారు. "ఇప్పుడు మనమేం చేయాలి, కెప్టెన్ డ్రూ?" జార్జ్ అడిగింది.
నాన్సీ ఒక్క క్షణం ఆలోచించి, తరువాత బదులిచ్చింది. "బ్రాస్ కెటిల్లో మనం పెందరాళే భోజనం చేద్దాం. మిసెస్ హేంస్టెడ్ అక్కడ ఉంటే, ఈ చుట్టుపక్కల మిస్టర్ సీమన్ ఉన్నాడా అని నేను అడుగుతాను."
"కానీ మనమింకా టిఫినే తీసుకోలేదు" బెస్ చెప్పింది. "ఇప్పటికి, భోజన సమయానికి మధ్యలో మనం ఏమి చేయబోతున్నాం?"
నడక అమ్మాయిలకు మంచి చేస్తుందని నాన్సీ సూచించింది. "మనం ఆ పాక హోటలుకి నడిచి వెళ్దాం."
అమ్మాయిలు రుచికరమైన అల్పాహారం తిన్న తరువాత, "పోలీసు కార్యాలయానికి వెడితే ఎలా ఉంటుంది? చీఫ్ బుర్కెని కలిసి వార్తలు ఏమన్నా ఉన్నాయేమో తెలుసుకోవచ్చు."
ముగ్గురు అమ్మాయిలు పోలీసు కార్యాలయానికి ఆత్రంగా నడిచి వెళ్ళారు. వెంటనే వాళ్ళకి పోలీసు చీఫ్ కార్యాలయం చూపబడింది.
చీఫ్ బుర్కె వాళ్ళను తల్లెత్తి చూసి, ఉల్లాసంగా ఆహ్వానించాడు. "మీరు మనసులను చదివే వాళ్ళయి ఉండాలి. నేనిప్పుడే మీకు ఫోను చేద్దామనుకొంటున్నాను."
"మీ దగ్గర మా కోసం ఏమన్నా వార్తలు ఉన్నాయా?" నాన్సీ అడిగింది.
"అవును నిజమే! మీ బుంగమీసాల ఖైదీ మాట్లాడాడు!"
@@@@@@@@@@@
"ఆ ఖైదీ తన నేరాన్ని అంగీకరించాడా?" నాన్సీ ఆసక్తిగా పోలీసు చీఫ్ ని అడిగింది.
"పూర్తిగా లేదు" అధికారి చెప్పాడు. "కానీ అతను తన పేరు చెప్పాడు. అది జేక్ సగ్స్."
"మరి అతను కోటలోనే ఉంటున్నాడా?"
"అవును."
అకస్మాత్తుగా ఆ ఖైదీ ఒక గార్డుని పిలిచి, ఆ హత్యతో తనకు సంబంధం లేదని అరిచినట్లు చీఫ్ ఆమెకు చెప్పాడు.
ఆ మాటలకు ఆశ్చర్యంతో నాన్సీ కళ్ళు విప్పారాయి. బెస్, జార్జ్ ల పరిస్థితి అలాగే ఉంది.
"హత్య!" నాన్సీ తిరిగి అంది.
"అతను చెప్పింది అదే!" చీఫ్ బుర్కె కొనసాగించాడు. "అప్పుడు ఈ మనిషి సగ్స్ చెప్పిందేమిటంటే, 'కోటలోని సెల్లార్లో ఒక మనిషి దాచబడ్డాడు. అతను అనారోగ్యంతో ఉన్నాడు! మీరు అతన్ని అక్కడనుంచి బయటకు తీసుకొని రాకపోతే, ఆ వ్యక్తి చచ్చిపోతాడు!"
"మీరు అతన్ని బయటకు తీసుకొచ్చారా?" అడిగిన బెస్ కి ఊపిరి ఆడలేదు.
అధికారి తలూపాడు. "ఇప్పుడు యిక్కడ పెద్ద ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఆ సెల్లార్లో ఉన్న ఖైదీ మిస్టర్ వీలర్!"
అమ్మాయిలు నిశ్చేష్టులయ్యారు. చివరకు నాన్సీ కోలుకొంది. "అంతా దేవుడి దయ. అతనెలా ఉన్నారు?"
మిస్టర్ వీలర్‌ని హాస్పిటలుకి తరలించామని, ప్రస్తుతం ఆయన భారీ బందోబస్తు నడుమ ఉన్నారని చీఫ్ బుర్కె చెప్పాడు. బందీగా ఉన్న సమయంలో సగ్స్ అతన్ని బాగా చూసుకొని తిండి పెట్టేవాడు. కానీ వీలర్ కోటనుంచి తప్పించుకోలేనంత బలహీనపడ్డాడు.
"ఇది గాక సగ్స్ నుంచి గానీ, మిస్టర్ వీలర్ నుంచి గానీ మరేదైనా తెలుసుకొన్నారా?" నాన్సీ అడిగింది.
"కొంచెం కూడా లేదు. మిస్టర్ వీలర్‌ని ఆసుపత్రినుంచి తీసుకెళ్ళడానికి ముందు నుంచి, కోట సెల్లార్‌లోని చీకటి గదికి చేర్చేవరకు అతన్ని నిద్రమత్తులో మునిగేలా చేసారు. ఎవరూ అతన్ని ప్రశ్నించలేదు. అతని సంరక్షణకు సగ్స్ తీసుకొన్న శ్రద్ధను మినహాయిస్తే, రిటైరైన న్యాయవాది చీకటి గదిలో ఒంటరిగానే మిగిలిపోయాడు. సగ్స్ కేవలం తెలియపరచిన విషయాలేమిటంటే, కొంతమంది వ్యక్తులు మిస్టర్ వీలర్‌ని కోటకు తీసుకొచ్చారు. న్యాయవాది సంరక్షణ కోసం తనకు కొంత సొమ్ము చెల్లించారు."
"ఎవరు వాళ్ళు?" నాన్సీ అడిగింది.
"నాకు తెలుసుననే అనుకొంటున్నాను" చీఫ్ బుర్కె చెప్పాడు.
అప్పుడు అధికారి యొక్క కఠినమైన ముఖవైఖరి కొద్దిగా సడలి, కొద్దిగా చిరునవ్వు నవ్వాడు. "సగ్స్ కథలో గబ్బిలాల ప్రమేయం గురించి మీకు ఆసక్తిగా ఉందని నేను అనుకొంటున్నాను" అన్నాడతను.
"కోటలో ఎవరూ భయంతో చొరబడకుండా ఉంచటానికే, అతను వాటిని అక్కడ ఉండనిచ్చాడు."
బేస్ ముసిముసిగా నవ్వింది. "వాళ్ళు బాగానే చేసారు" భయపెట్టిన ఆ సంఘటన గుర్తుకొచ్చి, భుజాలెగరేస్తూ అసహ్యంగా అందామె.
నాన్సీ వైపు చీఫ్ తిరిగాడు. "మిస్ గూఢచారీ! మిస్టర్ వీలర్‌ని కోటకు తీసుకెళ్ళిందెవరో మీకేమైనా అనుమానం ఉందా?"
"లేదు. కానీ వాళ్ళెవరో ఖచ్చితంగా తెలుసుకోవాలని అనుకొంటున్నాను."
"నాన్సీ తప్పకుండా తెలుసుకొంటుందని నా పందెం" జార్జ్ నిస్సంకోచంగా అంది.
పైకి చెప్పే దాని కన్నా సగ్స్ కి చాలా ఎక్కువే తెలుసునని తాను భావిస్తున్నట్లు నాన్సీ అంది. "ఉదాహరణకు, మిస్టర్ వీలర్ కిడ్నాపు కావటానికి ముందు, జార్జ్, నేను కోట దగ్గరకు వెళ్ళాం. మేము కోటలో ప్రవేశించబోతుంటే ఎవరో మమ్మల్ని దూరంగా పొమ్మని హెచ్చరించారు. అంతే గాకుండా, అదే రోజు ఒక కారు కోటను వదిలిపోవటం మేము కనుగొన్నాం. అలాగే కొండ మీద నుంచి బైనాక్యులర్ల ద్వారా సగ్స్ ఎవరికో సంకేతాలివ్వటం నేను చూసాను. నా మిత్రుడు నెడ్ నికర్సన్ యీ సగ్స్ ను బంధించిన రోజు సెల్లార్లో వెతికాడు. కానీ అతను మిస్టర్ వీలర్‌ని చూడలేదు."
"అదేమంత ఆశ్చర్యపోయే విషయం కాదు" అధికారి అన్నాడు. "పైకి కనిపించని తలుపు గల గదిలో మిస్టర్ వీలర్ ఉన్నాడు."
(సశేషం)
No comments:
Post a Comment