దేవుఁడు వరమిచ్చినా... - అచ్చంగా తెలుగు

దేవుఁడు వరమిచ్చినా...

Share This

 దేవుఁడు వరమిచ్చినా...

                                                                        (మా జొన్నవాడ కథలు)

                                                                             - డా.టేకుమళ్ళ వెంకటప్పయ్య (9490400858)


 "ఏం రామ్మూర్తీ ఎట్టాగున్నావు? కనబడ్డంలేదే ఈమధ్య...కూచో..కూచో.."

"ఏంలేదు...ఈసారన్నా రాబోయే అమ్మణ్ణి తిర్నాళ్ళకు నా మైకుసెట్లు పెట్టించుకుంటారని నెల రోజులు ముందే కనబడ్డా గుర్నాధమా...పోయినేడు అణ్ణాబత్తి ఆర్ముగానికిస్తివి కాంట్రాక్టు. ఇక్కడోణ్ణి నన్ను గాదని అరవోళ్ళకెందుకు ఇవ్వడం" అని దణ్ణం పెట్టాడు.

"చూడు పంతులా...నువ్వంటే ద్వేషంగానీ.. ఆర్ముగమంటే ప్రేమగానీ.. నాకేమీ లేవబ్బా... చెప్పాడని ఇవ్వాల్సొచ్చింది. అంతే"

"ఈసారి కూడా . గార్ని అడుగుతాడేమో అణ్ణాబత్తి గాడు"

"చూడు.. . గారి పెద్దమ్మాయి ఉండేది ఆర్ముగం ఇంటి ప్రక్కన్నే… పెరంబూరులో. ఆమె గారి రెకమండేషన్"

"అట్నా...మళ్ళీ వాడేనంటా అయితే.. నాకు బొచ్చేనంటావ్?"

"కాదు. నేను ఈసారి వాణ్ణి కాలు గూడా పెట్టనివ్వను ఈడ దేవళంలో"

"గుర్నాధమా! . చెబితే కాదనే దమ్ముందా నీకు?"

" అణ్ణాబత్తిగాడు ఉత్త... దొంగముండాకొడుకు...ఐదువేలు కర్చులకడిగితే..... నడిగి ఇస్తానని నాతోనే ఎకచకాల మాటలు మాట్లాడాడు. సామాన్యుడు గాదు వాడు"

". అండ ఉండంగా నువ్వూ నేనూ ఏమీ చెయ్యలేము" అని అంటుండగానే, గుర్నాధం బీరువాలోంచీ ఒక ఫైల్ తీసి కొన్ని పేపర్ కటింగులు జెరాక్సు కాపీలు రామ్మూర్తి  ముందుంచి... "ఇవి చదవ్వయ్యా పంతులా." అన్నాడు.

చదివిన రామ్మూర్తి “ఇదేందయ్యా ఇదీ..మైకులు పొయినేడాది బాగానే ఉన్నాయన్నారు. మరి ఈ పేపర్లలో నాసిరకం మైకులని, వినబడలేదని అదీ ఇదీ రాసుంది..."

"నేను పేపరోళ్ళకి దగ్గరుండి దర్శనాలు చేయించి, గిఫ్టు బాక్సులిచ్చీ.. ప్రసాదాలిచ్చీ.... మాదిరి రాయించా" అని నవ్వాడు.

"నువ్వు అణ్ణాబత్తిని మించినోడివయ్యా గుర్నాధమా!. మంచి దెబ్బ గొట్టావు యెదవని. ఇంతకీ ఏంజెయ్యాల మనమిప్పుడు" ఆనందం పట్టలేక చప్పట్లు కొట్టి లేచి నిలబడ్డాడు.

"కూచో సామీ! నిదానంగా విను..నేను జెబితే బాగుండదు గానీ.. నువ్వు . కాడికి బొయ్యి కాంట్రాక్ట్ అడుగు. అయ్యా గత చానా సంవత్సరాలుగా చేసుకుంటున్నానని బతిమిలాడుకో. ఎట్టాగూ ఆయన అర్ముగం ఉన్నాడు గదా అంటాడు. నువ్వు అణ్ణాబత్తికి చెడ్డపేరు ఉందని చెప్పి పేపరు కటింగులు జెరాక్స్ కాపీలు ఆయనకివ్వు చాలు. వెంటనే నీకు పచ్చ జెండా ఊపుతాడు"

"అట్టాగే గుర్నాధమా...నీ సంగతి నేను జూసుకుంటా! మాదిరి సాయం జేస్తా ఉండు చాలు" అని పేపర్లు తీసుకుని మహదానందంగా వెళ్ళిపోయాడు.

*  *   *

              తిర్నాళ్ళ పదిహేను రోజులుందనంగా ఆర్ముగం వచ్చి, గుమాస్తా గుర్నాధం ముందు చేతులు కట్టుకుని నిలబడ్డాడు.

"ఏం అణ్ణాబత్తీ. బాగుండావా? అమ్మణ్ణి దరిసెనం అయిందా? కూచోబ్బా నిలబడ్డావేంది. పెద్ద పేరున్న కాంట్రాక్టరువు" అంటూ వ్యంగ్యంగానే కుశల ప్రశ్నలు వేశాడు ఏమీ తెలియనట్టు.

"బాగున్నాను. . గారు ఎందుకో నాతో  మాట్లాడలేదు. మొహం చాటేస్తున్నాడు. చెన్నైలో ఉన్న ఆయన కూతురుగూడా మానాన్నతో మాట్లాడు...నాదేముందీ... అంటున్నాది. నేనేం తప్పు జెయిలా తెలిసి.. తెలిసి"

"ఓహో..మైకుల కాంట్రాక్టు గురించా నువ్వు మాట్లాడేది. అర్ధం గాలేదబ్బా..నాకు.."

"గుర్నాధంగారూ మీరే ఏట్టానో సాయం జెయ్యాల. ఫస్టు్క్లాసు మైకులు మనవి. కాళహస్తిలో గూడా మనవే..."

"నిజమే గానీ... జెప్పినోళ్ళకే కదా  కాంట్రాక్టులు. నీకు తెలవందేముందీడ చెప్పు?"

"నువ్వు జెప్పి ఆయన్ను ఒప్పించు. పుణ్యం ఉంటుంది. అవునూ.. పొయినేడాది ఏదో కర్చులకు డబ్బులడిగావు. నేను నాపన్లలో ఉండి మరిచిపోయాను. సారి నువ్వడిగినదానికి రెట్టింపు డబ్బులిస్తా..నా సంగతి చూడు గుర్నాధమా..." చేతులు నలుపుకున్నాడు.

ఇంకో వారంలో మీటింగు ఉండాది యీడ..నా ప్రయత్నం నేను జేస్తా. వారం రోజుల తర్వాత కనబడు"

"ఇదిగో స్వీట్లు నీకోసమే దెచ్చా..చెన్నై నుంచీ...బెమ్మాండంగా ఉంటాయి. నన్ను కాస్తా గుర్తుబెట్టుకో గుర్నాధమా.. మర్చిపోబాక...పిల్లలు గల్లోణ్ణి! " అని మళ్ళీ దణ్ణంపెట్టి పాకెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు.

*  *   *

              "గుర్నాధం..ఏందని సంగతి? ఆర్ముగం వచ్చి వంగి వంగి నమస్కారాలు పెడతా ఉన్నాడు  పొయినేడు..పెద్ద గీర జూపిచ్చాడు. హ్యాండ్ మైకు గావాలంటే లేదని నా మొహమ్మీదే చెప్పాడు. ఏందట యవ్వారం?" పూజారిగారడిగిన ప్రశ్నకు చిన్నగా నవ్వి...ఈసారి అలవాటుగా ఇచ్చే రామ్మూర్తికే మైకులపని ఇస్తున్నాం. అందుకని.."

"మరి . అడిగితే..."

"అడగడు. అలా చేశాం"

"అట్నా...పోనీలే రామ్మూర్తి మంచోడు"

"అందుకనే..రామ్మూర్తిని ఖాయం జేశాం"

పూజారికి ఆర్ముగం అవకాశం ఎలా పోగొట్టుకున్నాడో, ఎందుకు వదులుకున్నాడో అర్ధంగాక పొయినా ఇందులో గుర్నాధం హస్తం ఉందని అర్ధమై వెళ్ళిపోయాడు.

*  *   *

          వారం తర్వాత, రామ్మూర్తి ఆడిన ఆటలో తను చిత్తుగా ఓడిపోయానని తెలుసుకుని, లక్షపై చిలుకు ఆదాయం పోయిందని తెగ బాధపడ్డాడు. గుర్నాధాన్ని, పూజారిగారిని పొయినేడాది నిర్లక్ష్యం చేసినందుకు మనసులో కుమిలిపోయాడు. . ను కలవకుండా చేసింది రామ్మూర్తేనన్న అభిప్రాయానికి వచ్చి పగ పెంచుకున్నాడు. ఆర్ముగానిది అసలే క్రిమినల్ బ్రెయిన్. రామ్మూర్తిని ఎలా పడగొట్టాలా అనే విషయం ఆలోచించి ఆలోచించి, చివరకు ఎలక్ట్రికల్ లైన్ ఇన్స్పెక్టరు రంగరాజన్ దగ్గరకు వెళ్ళిఎంత కాదనుకున్నా ఒక ఊరోళ్ళం. రామ్మూర్తి పెట్టే మైకులకు కరెంటు సప్లై సరిగా చెయిబాక! సకల ఇబ్బందులు పెట్టు. నా కాంట్రాక్ట్ గొట్టేశాడు. ఎదవ!" అని తిట్టి.. ఒక వెయ్యిరూపాయలు చేతులో పెట్టాడు.

          తిరునాళ్ళ సమయంలో అన్నీ సజావుగా సాగిపోతున్నాయని తెలుసుకున్న ఆర్ముగం రంగరాజన్కు ఫోన్ చేసి పరామర్శ చేశాడు. రెండు రోజులముందు . గారు. ఎం.ఎల్. గారు మీటింగ్ పెట్టి, ఉత్సవాల మధ్యలో  కరెంటు ఒక్క క్షణం పోయినా ఊరుకునేది లేదని,  రాపూరు అడవులకు ట్రాన్స్ఫర్ చేస్తామని వార్నింగు ఇచ్చారని, తను నిస్సహాయుడననీ చెప్పి వాపోయాడు. అన్నివిధాల నష్టపోయిన ఆర్ముగానికి దేవుడు వరమిచ్చినా, పూజారి సహాయం లేనిదే  ఆ వరం ఫలితానివ్వదన్న సత్యం బోధపడింది.

-0o0-

 

No comments:

Post a Comment

Pages