పవిత్రమైన మనస్సే దేవాలయం
రచన: సి.హెచ్.ప్రతాప్
మానవుడి జ్ఞానేంద్రియాలు మరియు కర్మేంద్రియాలు కాక మరొక అద్భుతమైన శక్తి మనసు. ఇది నిక్షిప్తంగా ఉంటూ మనిషి చేత ఎన్నో విచిత్రాలు, విన్యాసాలు చేయిస్తూ ఉంటుంది. మనిషి జీవితానే్న నియంత్రిస్తున్న ఒక అద్భుత శక్తి మనసు. మనిషి జీవన పథం ఈ మనసు నిర్దేశించినట్లు నడుస్తుంది. కాబట్టి మానవుడు మృగత్వం విడిచి దివ్యత్వం వైపు పయనించాలంటే మానసిక పవిత్రత ఎంతో అవసరం అని మన ప్రాచీనులు చెప్పారు.
శారీరక శుభ్రత కన్నా మానసిక పరిశుద్ధత కలిగి ఉండటం చాలా ముఖ్యం. స్వచ్ఛమైన హృదయమే ఆధ్యాత్మికతకు మూలం.ఇంద్రియాల ద్వారా మనసుకు అందే విషయాల్లోనూ ఎటువంటి కల్మషం లేకుండా చూసుకోవాలి అన్నది పతంజలి మహర్షి తన యోగసూత్రాలలో స్పష్టంగా చెప్పారు.
నిరంతరం భగవధ్యానమువలన ఎప్పటికప్పుడు ఈ మనసుని మనము ప్రక్షాళన చేసుకొని పవిత్రమైన సంకల్పంతో, సద్బుద్ధితో లోక కళ్యాణము, సర్వమానవ శ్రేయస్సు దిశగా ప్రయత్నిస్తే మనసు మీద మనకు ఒక నియంత్రణ తప్పక ఏర్పడుతుంది.
అహింస, బ్రహ్మచర్యం, సత్యపాలన, అస్తేయం,అపరిగ్రహం ( ఇతరుల నుంచి ఏమీ తీసుకోకపోవడం,శౌచం మనసు పవిత్రంగా ఉండటం, తపస్సుద్వారా ఇంద్రియ నిగ్రహం, స్వాధ్యాయం అంటే సత్ గ్రంథపఠనం మరియు శరణాగతి ద్వారా మానసిక పవిత్రత సాధించవచ్చునని పతంజలి మహర్షి నిర్దేశించారు.
మన నుండి వచ్చే పవిత్రమైన తరంగాలనే సూక్ష్మసేవ అని అంటారు. ప్రేమ, శాంతి, ఆనందము, విజ్ఞానము – ఇవి పవిత్రమైన తరంగాలు.
ఎక్కడైతే మన ఆలోచనలు, కర్మలు దివ్యంగా ఉంటాయో అక్కడ ఈ పవిత్రమైన తరంగాలు ప్రపంచంలోకి వ్యాపిస్తాయి. కావున మన ప్రతి క్షణాన్నీ పవిత్రంగా చేసుకోవాలని ప్రముఖ తాత్వికవేత్త జిడ్డు కృష్ణమూర్తి అంటారు.
సత్యాన్వేషణ యాత్రలో ముందుగా ‘అంతరంగం’ శుద్ధి కావాలి. అంతరంగమంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాల కలయిక. మనసు మాలిన్యం పోగొట్టాలంటే మనసుకు మూలమైన ఆలోచన, సంకల్పం సక్రమంగా ఉండాలి. స్పష్టంగా, స్వచ్ఛంగా ఉండాలి. మానవ సంబంధాలన్నీ మనోమయాలే! మన సంబంధాల పవిత్రత, పటిష్ఠత.. మన ఆలోచనలను బట్టే ఉంటాయి అన్నది విస్పష్టం.సాత్వికమైన మనసు వలన మంచి బుద్ధి ఏర్పడుతుంది. సాత్త్విక స్థితి అంతా ఆనందం, ప్రశాంతత, నిశ్చలత, నిర్మలత్వమే. పవిత్రమైన ఆలోచన వలన, పవిత్రమైన మనసు, దాని నుండి ప్రకాశవంతమైన బుద్ధి ఏర్పడతాయి.
శ్రీకృష్ణ్భగవానుడు అర్జునుడికి గీతలో ఎవడు ఇంద్రియములన్ని మనసుచే నియమించి వానిచే కర్మయోగమును సంగములేనివాడై ఆచరించునో, అతడుత్తముడు అని ప్రవచించాడు. దీనిబట్టి మానసిక పవిత్రత సాధించడం ఎంతో అవసరం అని అర్ధం అవుతోంది.
***
No comments:
Post a Comment