మానసవీణ - 45
అమరజ్యోతి
"అమ్మా!"
"మానసా తల్లీ!"
ఆ పిలుపు వినిపించిన వైపు
చూసింది
మానస.
ఏదో ఆలోచిస్తూ నడుస్తోంది స్కూటీ దగ్గరకు.
ఎంతో ఆత్మీయంగా ఆ పిలుపు కాళ్ళను కట్టేసింది. నవ్వుతూ... ఇద్దరు ఆడవాళ్లు వస్తున్నారు.
దగ్గరగా వచ్చి"అమ్మా! సుశీలమ్మ
మీకు తోడుగా వెళ్ళమన్నారమ్మా!" అని చెప్పారు. "అరే ఇక్కడే కదా
రోడ్" అని నవ్వింది. "సుశీలమ్మ కు మీరంటే
కూతురు లెక్క" అంది ఒకామె.
"అది సరే
సుశీలమ్మ గారిని అప్పలనాయుడు
ఎలా చూసేవారు" అడిగింది మానస.
"బాగానే చూసేవారమ్మా! డబ్బుకీ, ధనానికీ
లోటులేనిల్లు, కాలు కింద పెట్టనివ్వని మనుషులు
ఇంటినిండా." అని, కానీ... అంది. ఆమె వైపు చూసింది
చెప్పమన్నట్లు. "కానీ
ఆయమ్మకు ఇయ్యన్నీ
సంతోషం ఇవ్వలేదమ్మా" అంది.
"మరి?" అంది
మానస కళ్ళు పైకెత్తి.
"పైకి నిండు దేవతలా ఉన్నా, మనశ్శాంతి లేక తల్లడిల్లిపోయేది"
అందామె.
"పిల్లలు లేరనా?" అడిగింది మానస.
"అదెలాగూ ఉన్నా, తమ్ముడు,
చెల్లెళ్ళు, బంధువులు అందరి పిల్లలనూ సొంత
పిల్లల్లాగే పెంచింది పిచ్చితల్లి. చెప్పాలంటే పిల్లల గురించి
మరిచేపోయిందాయమ్మ" అందామె విచారంగా...
"మరి ఎందుకు అంత మానసిక వ్యధ?"
అడిగింది మానస ఆశ్చర్యపోతూ.
"ఇంకేముందమ్మా! అతగాడు చేసే ఇలాటి
దుర్మార్గపు పనులు నచ్చక, గూడెపోళ్ళ ఉసురు కొట్టేలా, అప్పులిచ్చి, ఎక్కువ వడ్డీలకు పీడించి, ఇల్లూ, ఆస్తులు
తాకట్లు పెట్టుకుని, ఇవ్వలేకపోతే సొంతం
చేసుకుని, పదో పరకో చేతిలో పెట్టి
తరిమేసేవోడు. తినడానికి తిండి, చేయటానికి పనీ
లేక
వాళ్ళు మూటా,ముల్లె సర్ధుకుని పట్నాలకు వలస
పోయేవారు.
పిల్లలని పస్తులుంచలేక పుస్తెలమ్మిన తల్లుల దగ్గరా జాలి,
దయా లేకుండా... కరాఖండిగా ఉండేవాడు.
ఈ దారుణాలన్నింటికీ
ఈ సుశీలమ్మ తల్లి తల్లడిల్లి
ఏడ్చేది నిద్రలేకుండా" అంది కళ్ళు వత్తుకుంటూ.
కాస్సేపు ఆగి అంది మానస, "ఎప్పుడూ అతనికి ఇలా వద్దు అని చెప్పలేదా?"
"చెప్పకపోవడమేటమ్మా! రోజూ ఇదే గొడవ. ఎంత
చెప్పినా, ఎంత బెదిరించినా వినలేదు. ఇంకా ఈవిడ మీద నిఘా కూడా
పెట్టారు."
"అవునా! అయినా పాపం ఆమె అంతకంటే ఏమి చేయగలుగుతుందిలే" బాధగా అంది. "అవునమ్మా ఇన్నాళ్ళకి మీ రూపంలో ఆ దేవుడు కరుణించాడంటోంది. మీ ద్వారా ఎవరి సొత్తు వాళ్ళకి వెళ్ళిపోతే అంతే చాలు అనుకుంటోంది. ఈ ఇంటికి పట్టి ఉన్న ఆ దీనుల ఆక్రోశాలు, శాపనార్థాలు అన్నీ పోవాలని ఆశపడుతుందమ్మా!" అంది.
"సుశీలమ్మ గారికి మళ్ళీ చెప్పండి, ఆమె కోరుకున్నది జరుగుతుంది. ఆమె ప్రశాంతంగా
మిగిలిన జీవితం గడుపుతుంది. నేను వెళ్ళి పెద్దవాళ్ళతో మాట్లాడి,గవర్నమెంట్ పరంగా
ఏ ఇబ్బందులు రాకుండా, ఎవరిద్వారా ఎలా ఆ డాక్యుమెంట్లు, బంగారం పంపిణీ చేయాలో తెలుసుకుని,
మా జి.టి.ఆర్ అంకుల్, కృషీవలరావు(మంత్రి) గారితో కలిసి పకడ్బందీ ఏర్పాట్లతో వస్తాం. వలస పోయిన వాళ్ళ వివరాలు సేకరించి, వాళ్ళందరినీ రప్పించి అందరికీ న్యాయం చేద్దాం. ఇది నా హామీ అని చెప్పండి" స్కూటీ ఆన్ చేస్తూ... అంది.
ఉంటామమ్మా.
"చల్లగుండు తల్లీ! అన్ని నువ్వన్నట్లే
అయిపోతే
అందరికీ మంచి జరిగాక నూకాలమ్మ తల్లి సంబరం చేసుకుందాం తల్లీ"
అన్నారు
ఆకాశంలోకి చూస్తూ దండం పెడుతూ... నవ్వుతూ బండి ముందుకు
పోనిచ్చింది మానస.
బయట గేటు దగ్గరే ఉన్న శ్రావణి "అమ్మా !వచ్చేశావా ?" అంటూ చేయిపట్టుకుని లోనికి తీసుకెళ్ళింది.
"ఎందుకమ్మా ఇలా రెస్ట్ తీసుకోకుండా
ఎదురుచూపులు?
ఇలా అయితే నీ ఆరోగ్యం ఎలా మెరుగవుతుంది?" అంది ప్రేమగా మందలిస్తూ.
"నువ్వు మళ్లీ ఎప్పుడు వచ్చావో అప్పుడే
అందరి ఆరోగ్యాలూ బాగుపడ్డాయి. ఒక గంట కూడా నిన్ను వదలి
ఉండలేనమ్మా"
అంటూ
కళ్ళలోకి ప్రేమగా చూసింది. తల్లి కళ్ళలోని ఆర్ద్రతకు కరిగిపోయి,
ఆమె ఒడిలో తలదాచుకుంది మానస.
ఉదయం నుంచి పడ్డ శ్రమంతా దూదిపింజెలా ఎగిరిపోయింది.
అనిరుధ్ కు "రేపు కలుసుకుని మాట్లాడుకోవాలి" అని మెసేజ్ పెట్టింది నిద్రపోయేముందు. షవర్ స్నానంతో సేదతీరి, అమ్మ తినిపించిన ముద్దలతో కడుపు నిండి, మనసు నిండా సంతోషంతో హాయిగా నిద్ర పోయింది. మానస గొంతు వినాలనిపించి చేసినా, సైలెంట్ లో పెట్టిన మానస వినలేకపోవటం వలన బుంగమూతి పెట్టుకుని పడుకున్నాడు అనిరుధ్.
***
"సమీరా! మీతో మాట్లాడాలి రేపు రాగలరా? ఎక్కడ కలుసుకుందాం" అన్న దినేష్ మెసేజ్ కు "శారదానది గట్టు దగ్గరున్న శివాలయం దగ్గర" అని జవాబిచ్చింది సమీర. ఇక ఇలా మాట్లాడుకుని, ఒకరి ఇష్టాఇష్టాలు తెలుసుకుని ఒక ఒప్పందానికి రావాలి. తన ఆశయానికి దినేష్ సపోర్ట్ ఉంటుంది అనే ఆశ. అసలు అతని వ్యక్తిత్వానికే తను ఆకర్షింపబడింది. అయినా అతని నోటి వెంట ఆ హామీ వింటే దిగులే ఉండదు. ఒకపక్క మన ఆశయాలు సాధిస్తూ... మరోపక్కన కాపురం కూడా సజావుగా సాగాలంటే... కత్తి మీద సామే!
కానీ, అదే, ఆశయాలు గల ఆదర్శపురుషుడితో ఉంటే... రెండూ సాధ్యమే. 'అంత్య నిష్టూరం కన్నా, ఆది నిష్టూరం మేలని', ముందే అన్నీ అరమరికలు లేకుండా చెప్పేసుకుని, ఒప్పేసుకుని ఒకటైతే ఆ సంసారం స్వర్గధామంలా ఉండదూ!? తన ఆలోచనలకు తానే నవ్వుకుంది. పెళ్ళయ్యాక వాదనలు, గొడవలు అంటే చాలా భయం సమీరకు. ఏదేమైనా తన మొదటి ప్రాధాన్యత "సమీర ఐ.పి.ఎస్." సాధించడమే. స్ధిరమైన నిర్ణయంతో నిద్రాదేవిని అల్లుకుపోయింది సమీర.
ప్రేమ ,ఆరాధన
కలగలిసిన ఆ చూపులు కళ్ళ
ముందు నిలువగా
మనసంతా మధురోహల మయమై... చిరునవ్వుకు
చిరు సిగ్గు తోడై, అనిరుధ్
ని తలుచుకుంటూ... లేచింది మానస.
పూజ గదిలోంచి అమ్మ పాడుతోన్న
మంగళహారతి, ఘంటానాదంతో మిళితమై
వినబడగా... అలౌకికానందానుభూతికి లోనైంది కొద్ది
క్షణాలు.
అమ్మ ఎంత త్వరగా మామూలు స్థాయికి చేరుకుంది? అంతా భగవంతుని దయ. మనసులో స్మరించుకుంది.
ఫోన్ లో మెసేజ్ శబ్ధానికి చూసి, 'అమ్మో త్వరగా ఫ్రెష్ అయి, నాన్నతో, జి.టి.ఆర్ అంకుల్ తో, కృషీవలరావు గారితో సుశీలమ్మ గారు చెప్పిన గూడెం వాళ్ళకి వాళ్ళ డాక్యుమెంట్లు ఇవ్వటం, స్కూల్ నడిపే సంగతి, ఆయుర్వేద వైద్యం వంటి విషయాల గురించి చర్చించాలి. చిన్నప్పుడు ప్రేమలతాశ్రమానికి జగ్గయ్య తాత వచ్చి, గాయాలకు ఆకు పసరు పూసి, నయం చేయటం గుర్తొచ్చింది. వాళ్ళ పిల్లలు మందు తయారీ చేసి, బజార్లో షాపు నడుపుతున్నట్లు వంటవాళ్ళు చెప్పగా విన్నది.
అవును, వాళ్ళ ద్వారా కూడా సమాచారం సేకరించి, సుశీలమ్మ చెప్పినట్లు అక్కడ గూడెం వాళ్ళకూ ఉపాధి కల్పిస్తూ... ఆయుర్వేద వైద్యం తెలిసిన వారికీ తగిన గౌరవం, వేతనాలు లభించే అవకాశాలు కల్పించవచ్చు.
ఈ ఆలోచనలతో మానస హుషారుగా లేచింది రెడీ కావటానికి.
(సశేషం)
No comments:
Post a Comment