శ్రీ స్కంద పంచమి వైశిష్ట్యం! - అచ్చంగా తెలుగు

శ్రీ స్కంద పంచమి వైశిష్ట్యం!

Share This

 శ్రీ స్కంద పంచమి వైశిష్ట్యం!

-సుజాత.పి.వి.ఎల్.
సైనిక్ పురి, సికిందరాబాద్.




'కుమారేశసూనో గుహ స్కంద సేనాపతే శక్తిపాణేమయూరాధిరూఢ 
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్  
ప్రభో తారకారే సదా రక్ష మాంత్వమ్ !'
ఇలా భక్తితో స్మరిస్తే చాలు సర్వ రోగాలు, సర్ప దోషాలు తొలగి శరవణ స్వామి అనుగ్రహం కలుగుతుంది.
అసలు స్కందుని జననం, మరియు స్కంద పంచమి విశిష్టత తెలియాలంటే..
పూర్వము తారకాసురుడు, సూరపద్ముడు, సింహముఖుడు అనే రాక్షసులు ఉండేవారు. వారు అనేక వరాలను పొంది, బలగర్వితులై సకల లోకవాసులనూ హింసిస్తూ ఉండడంతో దేవతలందరూ కలసి బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి మొరపెట్టుకున్నారు. అందుకు ఆయన దేవతలకు  ప్రస్తుతం శివుడు తపస్సు చేస్తున్నాడు. ఆయన తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకుంటే వారికి జన్మించే పుత్రుడు అసురులను అంతమొందిస్తాడు అని మార్గ నిర్దేశం చేసాడు. శివుడు తపస్సు మాని పార్వతీదేవిని వివాహం చేసుకునేలా చేసేందుకు దేవతలు మన్మథుడిని పంపగా శివుడు మూడవ నేత్రం తెరిచి మన్మథుడిని భస్మం చేసాడు. అయితే తారకాసురుడిని అంతమొందించవలసిన అవసరాన్ని గుర్తించిన శివుడు పార్వతీదేవిని వివాహం చేసుకున్నాడు. శివ పార్వతులు కలిసిఉన్న సమయంలో శివుడి రేతస్సు పతనమై భూమిపై పడింది. దానిని భూమి భరించలేక అగ్నిలో పడేసింది. అగ్ని దానిని గంగలో వదలగా, దానిని గంగ తన తీరంలోని శరవణముపైకి అనగా రెల్లుగడ్డిపైకి తోసి వేసింది. అక్కడే కుమారస్వామి జన్మించాడు. శరవణమున జనించిన స్వామి కనుక ఆయనకు శరణభవుడు అనే పేరు వచ్చింది. ఈ విధంగా జన్మించిన కుమారస్వామిని పెంచేందుకు శ్రీమహావిష్ణువు ఆరుగురు కృత్తికలను నియమించాడు. కృత్తికల చేత పెంచబడటం వలన స్వామికి కార్తికేయుడు అనే పేరు వచ్చింది. దేవతలను, సకల లోకవాసులను రక్షించేందుకు శివుడి నుండి భాగమై వచ్చినవాడు కనుక కుమార స్వామికి స్కందుడు అనే పేరు ఎలా వచ్చిందంటే..శివుని మూడవ నేత్రం నుండి వెలువడిన ఆరు వెలుగు కిరణాలు నదిలో పడి తీరంలో ఆరుగురు శిశువులుగా మారాయి. ఆరుగురు కృత్తికలు వారిని పెంచటానికి నియమింపబడ్డారు. ఒకరోజు పార్వతీదేవి వారి వద్దకు వచ్చి ఆరుగురిని కలిపి ఒకే శిశువుగా మారుస్తుంది. అందుకే స్వామికి ఆరు ముఖాలు, పన్నెండు చేతులు ఉంటాయి. శివ పార్వతుల వద్దకు చేరిన కుమార స్వామికి దేవతలు దేవసేనాధిపత్యం ఇచ్చారు. దేవసేనాధిపత్యం స్వీకరించిన స్కందుడు తారకాసురుడిపై దండెత్తి అతన్ని, అతని సోదరుడైన సింహముఖున్ని అంతమొందించి దేవతలను, ప్రజలను రక్షించాడు. 
స్కంద పంచమినాడు సూరసంహారం జరిగింది. పురాణ కథనం ప్రకారం తారకాసురుడి సోదరుడు సూరపద్ముడిపై కుమారస్వామి దండెత్తి ఆరు రోజుల పాటు యుద్ధం చేసాడు. ఆ యుద్ధం కార్తీక మాస శుక్ల పాడ్యమి రోజున మొదలైంది. యుద్ధంలో ఆరవ రోజు సూరపద్ముడు పక్షి రూపాన్ని ధరించి తలపడ్డాడు. స్కందుడు శూలాయుధం ప్రయోగించి ఆ పక్షిని రెండుగా ఖండించగా ఒకటి నెమలిగా, రెండవది కోడిపుంజుగా మారాయి. వెంటనే స్కందుని పాదాలపై పడి శరణువేడాయి. స్వామి కరుణించి నెమలిని వాహనంగా, కోడిని ధ్వజంగా చేసుకున్నారు. ఆ రోజును సూరసంహారంగా, స్కంద పంచమిగా వేడుక జరుపుకుంటారు. స్కందపంచమి, షష్టి తిథులని మిగులు రోజు కాకుండా రెండూ కలిసి ఉన్న రోజే స్కంద పంచమి పూజావ్రతం చేసుకోవడం  వలన శుభఫలితాలు కలుగుతాయి. అందుచేత ఆషాఢ మాస శుక్ల పక్ష పంచమి, షష్ఠి పుణ్య దినాల్లో భక్తులు స్వామిని విశేషంగా సేవిస్తారు. వీటిని స్కంద పంచమి, కుమార షష్ఠి పర్వదినాలుగు జరుపుకుంటారు. స్కంద పంచమినాడు కౌమారికీ వ్రతాన్ని ఆచరించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. నాగదోషాలు తొలగిపోతాయి.

***

No comments:

Post a Comment

Pages