తీరిన కోరిక! - అచ్చంగా తెలుగు
తీరిన కోరిక!
G.S.S. కళ్యాణి



సీతారామపురం ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో రాధామాధవ, గంగాధర అని ఇద్దరు యువకులుండేవారు. రాధామాధవ అంటే ఆ గ్రామంలో అందరికీ వల్లమాలిన అభిమానముండేది. ఎందుకంటే ఆ గ్రామంలో ఎవరికి ఏ కష్టమొచ్చినా తనకు తోచిన సహాయాన్ని అందించడంలో ముందుండేవాడు రాధామాధవ. కష్టకాలంలో తను ధైర్యంగా ఉంటూ, తన చుట్టూ ఉన్నవారికి కూడా ధైర్యాన్ని ఇచ్చే గుణం రాధామాధవది. గ్రామస్థులకు ఉపకారం చెయ్యడానికి ఎంతటి సాహసానికైనా రాధామాధవ వెనుకాడేవాడు కాదు. రాధామాధవపై గ్రామస్థులు కురిపించే ప్రేమను చూస్తే గంగాధరకు అసూయ కలుగుతూ ఉండేది. తను కూడా ఏదోఒకటి చేసి గ్రామస్థుల దృష్టిని ఆకర్షించాలనీ, వారి ప్రేమాభిమానాలు పొందాలనీ, తనను కూడా అందరూ గొప్పవాడిగా గుర్తించాలనీ కలలు కంటూ ఉండేవాడు గంగాధర. అయితే, గంగాధరకు ఉన్నదీ రాధామాధవకు లేనిదీ పూర్వీకులు కూడబెట్టిన ఆస్తిపాస్తులు! వాటిని ఉపయోగించుకుని మంచి పేరు తెచ్చుకోవాలని అనుకున్న గంగాధర, తనకున్న ఆస్తిలో కొంత భాగాన్ని ఖర్చు చేసి తమ ఇంటికి కొత్త రంగులు వేయించి, హంగులను అద్ది రాజభవనంలా తీర్చిదిద్దాడు. ఆ ఇంటిని చూసి గ్రామస్తులంతా మొదట 'అబ్బో!' అన్నారు. ఆ తర్వాత 'తాతల ఆస్తి ఖర్చు చెయ్యడం అంత గొప్పవిషయమేమీ కాదే!', అని అనుకుని గంగాధర ఇంటిని పట్టించుకోవడం మానేశారు!  ఒకరోజు గంగాధర పట్నానికి వెళ్లి ఖరీదైన బట్టలూ, చలువ కళ్ళద్దాలూ తెచ్చి వాటిని ధరించి గ్రామమంతా తిరిగాడు. అందరూ గంగాధర వంక ఆశ్చర్యంగా చూశారు. గంగాధరకు గర్వంగా అనిపించింది. కానీ, ఆ రోజు సాయంత్రం మామూలు దుస్తుల్లో బయటకు వెళ్తే గ్రామస్థులంతా గంగాధరను చూసీచూడనట్లుగా ప్రవర్తించారు!
"ఒరేయ్ గంగాధరా! అభిమానం డబ్బుతో కొనలేనిదిరా! మంచి మనసు ఉన్నవారిని అందరూ ప్రేమిస్తారు! అలా గెలిచిన ప్రేమ కలకాలం నిలుస్తుంది!", అని అవకాశం దొరికినప్పుడల్లా గంగాధరకు చెప్తూ ఉండేది అతడి తల్లి ఉమ. తన తల్లి మాటలు పెద్దగా పట్టించుకునేవాడు కాదు గంగాధర. 
ఒకసారి పట్నానికి వెళ్ళినప్పుడు బోలెడు డబ్బులు ఖర్చుపెట్టి ఒక పడవలాంటి కారును కొని ఇంటికి పట్టుకొచ్చాడు గంగాధర. సీతారామపురం గ్రామంలోని పిల్లలూ,పెద్దలూ అందరూ గంగాధర కొన్న కారును ఎంతో ఆసక్తిగా చూశారు. గంగాధరకు చాలా ఆనందం కలిగింది. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు! కొద్దిరోజుల తర్వాత గ్రామస్థులకు కారు మీద మోజు పూర్తిగా పోయింది!! ఊరివాళ్ల దృష్టిని ఎలాగైనా మళ్ళీ తనవైపు తిప్పుకోవాలని అనుకున్నాడు గంగాధర.  
తను ఖర్చు చేసిన డబ్బు అనుకున్న విధంగా తనకు ఉపయోగపడలేదని విచారంగా కూర్చున్న గంగాధరకు, 'ఏదో సాధించాలన్న ఆశయంతో మొదలుపెట్టిన పనిని, అది ఎంతకూ పూర్తికావడంలేదన్న నిరాశతో మధ్యలో వదిలిపెట్టెయ్యకూడదురా! నువ్వు తలపెట్టిన పనిలో నీకు విజయం కలిగేదాకా నువ్వు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఆపై భగవంతుడి దయ ఉంటే ఏదో ఒకరోజు నువ్వనుకున్నది తప్పక సాధిస్తావు!' ,అని తన తల్లి ఉమ తనకెప్పుడూ చెప్తూ ఉండే మాటలు గుర్తుకొచ్చాయి.    
గంగాధర వెంటనే లేచి, 'ఈ ఊరివాళ్ళు మా ఇంటికి వచ్చి నా కారును పొగడకపోతే నేనే కారును తీసుకుని వాళ్ళ మధ్యకు వెడతాను! అప్పుడు నా అందమైన కారును, దాని యజమానినైన నన్నూ వాళ్ళు గొప్పగా చూడక తప్పదు!!', అని అనుకుంటూ కారులో గ్రామమంతా తిరిగేందుకు బయలుదేరాడు.  అలా గ్రామంలోని వీధులన్నీ కారులో తిరుగుతూ ఊరి చివరనున్న చెరువు దగ్గరకు చేరుకున్నాడు. అక్కడ గ్రామప్రజలంతా గుమిగూడి ఉన్నారు. అందరూ ఏదో విషయంలో చాలా కంగారు పడిపోతూ అరుస్తున్నారు. సంగతేమిటో చూద్దామని కారు దిగి వారి దగ్గరకు వెళ్ళాడు గంగాధర. అక్కడ తడిముద్దల్లాంటి దుస్తులలో ఉన్న ఒక పిల్లవాడు, “మాధవ మామయ్యను కాపాడండీ!”, అంటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. రాధామాధవ అక్కడి గడ్డిలో స్పృహతప్పి పడి ఉన్నాడు. అతడి దుస్తులు కూడా తడిసిపోయి ఉన్నాయి. 
"ఏంటీ? ఏం జరిగిందీ?", అడిగాడు గంగాధర.
అప్పుడు ఆ పిల్లవాడి తల్లి ఏడుస్తూ గంగాధర వద్దకు వచ్చి, "నాయనా! నా బిడ్డ మిగతా పిల్లలతో  కలిసి చెరువు గట్టుపైన ఆడుతూ చెరువులో పడిపోయాడు. ఆ దారిన వెడుతున్న మాధవబాబు వెంటనే చెరువులోకి దూకి నా బిడ్డను ఒడ్డుకు చేర్చాడు. కానీ ఆ ప్రయత్నంలో మాధవబాబు పట్టుజారి చెరువులోపడి మునిగిపోయాడు. మేమంతా కలిసి మాధవను బయటకు తీయగలిగాము. కానీ అతడిని ఎన్నిసార్లు పిలిచినా కళ్ళు తెరవట్లేదు! అందరికీ ఉపకారం చేసే మంచి మనసున్న మా మాధవకు ఏమీ కాకూడదు! అతడి ప్రాణం నిలవాలి నాయనా! నిలవాలి!!", అంటూ దుఃఖంతో కూలబడిపోయింది. 
గంగాధర ఇంకేమీ ఆలోచించకుండా రాధామాధవను చేతులతో ఎత్తి తన కొత్త కారులో పడుకోబెట్టుకుని ఆ కారును సాధ్యమైనంత వేగంగా నడుపుతూ పట్నంలోని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. 
వైద్యుడు రాధామాధవకు అత్యవసర వైద్య సేవలను అందించి, "రాధామాధవను సమయానికి తీసుకొచ్చారు. లేకపోతే అతడి ప్రాణాలు నిలపగలిగేవాడిని కాదు! ఇప్పుడు అతడు ప్రాణాపాయ స్థితినుండీ బయటపడినట్లే! శెభాష్!", అని గంగాధరను మెచ్చుకున్నాడు. 
రాధామాధవ కోలుకునేదాకా గంగాధర ఆసుపత్రిలోనే ఉండి అతడికి కావలసిన సేవలు చేశాడు. ఆ తర్వాత రాధామాధవను తీసుకుని సీతారామపురం చేరుకున్నాడు. గ్రామప్రజలంతా వారి రాక కోసం వేయికళ్లతో ఎదురుచూస్తూ ఉన్నారు. గంగాధర, రాధామాధవలు కారు దిగగానే, రాధామాధవ కాపాడిన పిల్లవాడు గంగాధర వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి ప్రేమతో అతడి కాళ్ళను గట్టిగా వాటేసుకున్నాడు. 
ఆ పిల్లవాడి తల్లి, "బాబూ! నీకేమిచ్చినా నా ఋణం తీరదు!!", అంటూ గంగాధరకు కృతజ్ఞతతో నమస్కరించింది.  ఆ తరువాత  గ్రామప్రజలందరూ గంగాధర, రాధామాధవలను చుట్టుముట్టేసి, ఆనందంతో కేరింతలు కొడుతూ వాళ్ళను కౌగలించుకుని, వారిరువురినీ తమ భుజాలపై మోసుకుంటూ గ్రామమంతా ఊరేగించారు. తను ఎప్పుడూ పొందాలని అనుకునే గ్రామస్థుల ప్రేమా, ఆదరాభిమానాలూ, గౌరవమూ, ఈ విధంగా లభిస్తాయని గంగాధర కలలో కూడా ఎన్నడూ అనుకోలేదు! గంగాధర అమితానందంతో ఉబ్బితబ్బిబ్బైపోతూ ఇల్లు చేరుకొని ఆరోజు జరిగిన సంఘటనను తన తల్లి ఉమకు చెప్పాడు. 
అంతా విన్న ఉమ చిరునవ్వు నవ్వి, "నాన్నా గంగాధరా! నువ్వు చెప్పినది వింటూ ఉంటే నాకు సుమతీ శతకంలో 'ధీరులకుజేయు మేలది సారంబగు నారికేళ సలిలము భంగిన్, గారవమును మఱిమీదట భూరిసుఖావహము నగును భువిలో సుమతీ!' అనే పద్యం గుర్తుకొస్తోంది!! మంచివారికి మనం సహాయపడినట్లైతే, కొబ్బరినీళ్లు మన ఆరోగ్యానికి ఎంత మంచిని చేస్తాయో అంతటి మంచి మనకూ కలుగుతుందనీ, ఆ మంచితోపాటు బంగారంలాంటి సుఖమూ మనకు లభిస్తుందనీ ఆ పద్య సారాంశం! నీ విషయంలో అదే జరిగింది! రాధామాధవ నిస్సందేహంగా చాలా మంచివాడు! ఇతరులకు సహాయపడటంలో తనకు కలిగే కష్టానికి వెరవని ధైర్యవంతుడు! అటువంటి ధీరుడికి మేలు చెయ్యడంద్వారా నువ్వు మన ఊరిప్రజల మనసులను గెలిచి, వారి ప్రేమాభిమానాలను పొందగలిగావు! నీ చిరకాలవాంఛను తీర్చుకోవడానికి ఆ పరమాత్ముడు నీకిచ్చిన సువర్ణావకాశాన్ని నువ్వు సరిగ్గా వినియోగించుకోగలిగావు! ఇక నీకు అంతా శుభమే!!", అంది గంగాధర తలను ప్రేమతో నిమురుతూ!   
     
*****

No comments:

Post a Comment

Pages