బంగారు ద్వీపం - 10 - అచ్చంగా తెలుగు
 "బంగారు" ద్వీపం (అనువాద నవల) -10
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton


@@@@@@@@
(పడవలో కోట సమీపానికి వెళ్ళిన పిల్లలకు నీటి అడుగున ఓడ కనిపిస్తుంది. ఈత దుస్తుల్లో నీటిలోకి దూకిన జార్జి ఓడ సమీపానికి వెళ్ళి, ఊపిరి అందక తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. జూలియన్ కూడా నీటిలో ఓడ సమీపం వరకూ వెళ్ళి తిరిగి వస్తాడు. మరునాడు పిల్లల్ని వారి పిన్ని పిక్నిక్కుకి తీసుకెడుతుంది. ఐసుక్రీములు తింటూ వారు కిర్రిన్ ద్వీపం వెళ్ళటానికి ప్రణాళికలు వేసుకొంటారు. తరువాత. . . .)
@@@@@@@@@@@@@@@

భోజనానికి ముందు పిల్లలు తమను చక్కగా శుభ్రం చేసుకొందుకు పంపబడ్డారు. మర్నాటి ద్వీప సందర్శన గురించి వాళ్ళు ఆసక్తిగా మాట్లాడుకొన్నారు. అది విని వాళ్ళ పిన్ని నవ్వింది.

"బాగుంది, జార్జి మీతో కలిసినందుకు నేను సంతోషిస్తున్నాను" అందామె. " మధ్యాహ్న భోజనాన్ని మీతో తీసుకెళ్ళి, రోజంతా అక్కడ గడపాలని అనుకొంటున్నారా? అంత దూరం పడవలో వెళ్ళి అక్కడ దిగాక, కొన్ని గంటలైనా గడపకపోతే, యింత శ్రమ వృధాయే!"

"ఓ పిన్నీ! అక్కడకు భోజనం పట్టుకెళ్తే అద్భుతంగా ఉంటుంది!" అన్నె ఆనందంగా అరిచింది.

జార్జి తలపైకి ఎత్తింది. "అమ్మా! నువ్వు కూడా వస్తున్నావా?" అడిగింది.

"నన్ను రమ్మన్నట్లుగా నీ మాటలు లేవుగా!" కించపడ్డ స్వరంతో అందామె. "నిన్న నేను వస్తున్నట్లు నీకు అనిపించగానే, యిష్టం లేదన్నట్లు చూపులు పెట్టావు. నేను రేపు రాను. కానీ నీ తల్లిని నీతో రావటానికి యిష్టపడని చిత్రమైన మనిషివని, నీ గురించి నీ కజిన్లు అనుకొంటారని నేను అనుకొంటున్నాను."

జార్జి ఏమీ అనలేదు. తనను తిట్టినప్పుడు ఆమె ఒక్క మాట కూడా అనదు. మిగిలిన పిల్లలు కూడా ఏమీ అనలేదు. తన తల్లి రావటం జార్జి కి యిష్టం లేదని వాళ్ళకి బాగా తెలుసు. తిమోతి తమతో ఉండాలన్నదే ఆమె కోరిక.

"ఏమైతేనేం! నేను రావటం లేదు" ఫానీ పిన్ని చెప్పసాగింది, "నేను చూసుకోవలసిన తోట పని ఉంది. జార్జితో మీరు భద్రంగా ఉంటారు. ఆమె ఒక మగాడిలా పడవను నడపగలదు."

మరునాడు నిద్ర లేవగానే ముగ్గురు పిల్లలు వాతావరణాన్ని ఆసక్తిగా చూశారు. సూర్యుడు ప్రకాశిస్తున్నాడు, ప్రతి అంశం అద్భుతంగా ఉంది.

"ఈరోజు అద్భుతంగా లేదూ?" బట్టలను వేసుకొంటూ అన్నె జార్జిని అడిగింది. "మనం ద్వీపానికి వెళ్ళాలని చాలా ఆశతో చూస్తున్నాను."

"బాగుంది. నిజాయితీగా చెప్పాలంటే, మనం వెళ్ళకూడదని నేను అనుకొంటున్నాను" ఊహించని విధంగా జార్జి అంది.

"ఓ! కానీ ఎందుకు?" అన్నె నిరాశతో అరిచింది.

"తుఫాను లేదా మరేదో జరుగుతుందని నాకు అనిపిస్తోంది" జార్జి నైరుతి దిక్కుకు చూస్తూ అంది.

"కానీ జార్జి! ఎందుకలా అంటున్నావు?" అన్నె అసహనంతో అడిగింది. "సూర్యుణ్ణి చూడు. ఆకసంలో మేఘం కూడా లేదు."

"గాలి సరిగా లేదు" చెప్పింది జార్జి. "నా ద్వీపానికి దగ్గరగా ఉన్న అలలపై ఆ తెల్లని నురుగును చూడలేదా? అది ఎల్లప్పుడూ చెడుకి సంకేతం."

"ఓ జార్జి! ఈరోజు మనం వెళ్ళకపోతే అది మన జీవితాల్లో పెద్ద నిరాశ అవుతుంది" అంది అన్నె. చిన్నదైనా, పెద్దదైనా నిరాశను ఆమె భరించలేదు. "అంతేగాక, తుఫాను భయంతో మనం యింటినే అంటిపెట్టుకొని ఉంటే, యిష్టమైన టింని మనతో ఉంచుకోలేము" అని జార్జి వైపు వక్రంగా చూసింది.

"అదీ నిజమే" అంది జార్జి. "సరే! వెళ్దాం. కానీ తుఫాను వస్తే, నువ్వు చిన్నపిల్లలా ప్రవర్తించకూడదు. ఏమాత్రం భయపడకుండా దాన్ని కూడా ఆనందంతో స్వీకరించటానికి ప్రయత్నించాలి."

"అలాగే! నేను తుఫాన్లను అసలు యిష్టపడను" చెబుతున్న అన్నె, జార్జి ఎగతాళి చూపులను చూసి ఆగిపోయింది.

వాళ్ళు అల్పాహారానికి కిందకు వెళ్ళారు. ముందనుకొన్నట్లు తమతో పాటు తినటానికి ఏమన్నా పట్టుకెళ్ళవచ్చా అని జార్జి తన తల్లిని అడిగింది.

"అలాగే!" అంది తల్లి. "నువ్వు, అన్నె శాండ్విచ్చుల తయారీలో నాకు సాయం చేయండి. మీ అబ్బాయిలు తోటలోకి వెళ్ళి మీతో పట్టుకెళ్ళటానికి కొన్ని పండిన రేగుపళ్ళను కోసుకోండి. జూలియన్! నువ్వు ఆ పని పూర్తి చేసాక, ఊళ్ళోకి వెళ్ళి నిమ్మరసం లేదా అల్లం బీరు, నీకేది నచ్చితే అది, సీసాలను కొని తే!"

"నాకు అల్లం పాప్, ధన్యవాదాలు" చెప్పాడు జూలియన్. మిగిలిన వాళ్ళు అదే చెప్పారు. వాళ్ళంతా ఆనందంగా ఉన్నారు. వింతైన ఆ చిన్న ద్వీపానికి వెళ్ళటం, వాళ్ళెంతో అద్భుతంగా భావించారు. టింతో రోజంతా గడపవచ్చునని జార్జి సంతోషించింది.

చివరికి రెండు కిట్-బాగుల్లో ఆహారాన్ని పట్టుకొని వాళ్ళు బయల్దేరారు. టిం ని తీసుకు రావటం వాళ్ళు చేసిన మొదటి పని. అది జాలరి కుర్రాడి యింటి పెరట్లో కట్టేసి ఉంది. అక్కడే ఉన్న జాలరి కుర్రాడు జార్జిని చూసి చిరునవ్వు నవ్వాడు.

"శుభోదయం మాస్టర్ జార్జ్!" అన్నాడతను. జార్జినాని 'మాస్టర్ జార్జ్' అని అతను పిలవటం మిగిలిన వాళ్ళకు వింతగా అనిపించింది. "టిం తలవంచి అదేపనిగా మొరుగుతున్నాడు. ఈరోజు తన కోసం నువ్వు వస్తున్నట్లు దానికి తెలిసిందని నేను ఊహించాను."

"కావచ్చు" అంటూ జార్జి దానికి కట్టిన తాడును విప్పింది. వెంటనే ఆ కుక్క తోక ముడిచి, చెవులను నిక్కించి పిచ్చెక్కిట్లుగా ఆ పిల్లల చుట్టూ పరుగెత్తసాగింది.

"ఇది గ్రేహౌండ్ అయితే ఏ పందాన్నయినా గెలుస్తుంది" అన్నాడు జూలియన్. "ఏమాత్రం జంకు లేక ముందుకి ఉరుకుతుంది. టిం! హాయ్ టిం! వచ్చి మాకు శుభోదయం చెప్పు!"

అది సుడిగాలిలా తిరుగుతూనే పైకి ఎగిరి జూలియన్ ఎడమ చెవిని నాకింది. తరువాత వాళ్ళు సముద్రతీరానికి వెళ్తుంటే, అది ప్రేమగా జార్జి వెనుక పరుగెత్తింది. మధ్య మధ్యలో అది జార్జి కాళ్ళను నాకుతుంటే, ఆమె దాని చెవులను సున్నితంగా లాగుతోంది.

వాళ్ళంతా పడవను ఎక్కగానే, జార్జి దాన్ని నీటిలోకి నెట్టింది. జాలరి కుర్రాడు వీడ్కోలుగా చేతిని ఊపాడు. "మీరు ఎక్కువసేపు అక్కడ ఉండరుగా?" అతను గట్టిగా అరిచాడు. "తుఫాను వచ్చేలా ఉంది. అదీ అధ్వాన్నంగా ఉండొచ్చు కూడా!"

"నాకు తెలుసు" జార్జి అరిచి చెప్పింది. "కానీ అది ప్రారంభమయ్యే ముందే మేము తిరిగి వస్తాము. అది ఇంకా చాలా దూరంలో ఉంది."

జార్జి ద్వీపానికి చేరేవరకూ పడవను నడిపింది. టిం పడవలో ఆ చివరినుంచి ఈ చివరకు తిరుగుతూ, ప్రతి అంచుపైన కాళ్ళు ఉంచి కాసేపు నిలబడి చూస్తోంది.

అలలు పైకి లేచినప్పుడల్లా అది మొరుగుతోంది. ద్వీపం తమను సమీపించటాన్ని పిల్లలు చూసారు. పూర్వం కన్నా అది ఈరోజు మరింత ఉత్తేజకరంగా అనిపించింది.

"జార్జి! పడవను ఎక్కడ ఆపాలనుకొంటున్నావు?" జూలియన్ అడిగాడు. “ఈ భయంకరమైన రాళ్ళ మధ్య గట్టుకి వెళ్ళటానికి, వెనక్కి రావటానికి దారి నీకెలా తెలుస్తుందో నేను ఊహించలేకున్నాను. ప్రతి క్షణం మనం వాటిని గుద్దుకొంటామేమోనని భయపడుతున్నాను!"

"గతంలో నీకు చెప్పినట్లు, చిన్న గొందిలో నేను పడవను ఆపుతాను" అంది జార్జి. "దానికి ఒకటే దారి ఉంది. అది నాకు బాగా తెలుసు. అది ద్వీపానికి తూర్పు వైపున ఉంది. అది బయటకు కనపడదు."

ఆ అమ్మాయి దారిలో ఉన్న రాళ్ళ మధ్యకు పడవను పోనిస్తూ, వాటిని ఢీకొట్టకుండా బయటపడుతూ చురుకుగా నడుపుతోంది. అకస్మాత్తుగా పదునైన రాళ్ళతో చిన్న గోడలా ఏర్పడిన ప్రాంతానికి చేరుకొన్నాక, ఆ పిల్లలకు ఆమ్మాయి చెప్పిన గొంది కనిపించింది. అది సహజంగా ఏర్పడిన చిన్న నౌకాశ్రయంలా ఉంది. పరుచుకొన్న యిసుకతీరం వరకు నిశ్చలంగా ఉన్న సన్నని నీటి దారి, ఎత్తైన రాళ్ళ నీడలో ముందుకు సాగుతోంది. పడవ కొండరాళ్ళ నీడలోకి చేరి చిన్న కుదుపుతో ఆగింది. అక్కడ నీరు గాజులా నిశ్చలంగా ఉంది. నీటిలో చిన్న సుడి కూడా లేదు.

"నేను చెబుతున్నాను. ఇది బాగుంది" అన్నాడు జూలియన్. అతని కళ్ళు ఆనందంతో మెరుస్తున్నాయి. అతని వైపు చూసిన జార్జి కళ్ళు సంద్రంలో నీటిలాగే ప్రకాశించాయి. ఆమె తన విలువైన ద్వీపానికి ఎవరినైనా తీసుకెళ్లడం ఇదే మొదటిసారి, మరియు ఆమె దానిని ఆస్వాదిస్తోంది.

వారు మృదువైన పసుపు రంగు ఇసుక మీద దిగారు. "మనం నిజంగా ద్వీపంలోనే ఉన్నామా!" అంటూ అన్నె ఆనందంగా గంతులేయసాగింది. ఆమెకి జోడిగా టిం కూడా ఆమెలాగే గెంతసాగింది. అది చూసి మిగిలిన వాళ్ళు నవ్వుకొన్నారు. జార్జి పడవను యిసుకపైకి లాగింది.

(ఇంకా ఉంది)


No comments:

Post a Comment

Pages