పురాణ కధలు-బసవ పురాణం -31 - అచ్చంగా తెలుగు

పురాణ కధలు-బసవ పురాణం -31

Share This
 పురాణ కధలు-బసవ పురాణం -31
 పి.యస్.యమ్. లక్ష్మి



31. వైజకవ్వ కధ
పూర్వము వైజకవ్వ అనే గొప్ప శివ భక్తురాలు వుండేది.  ఆవిడ భర్త జైనుల నాశ్రయించి, వారి మతమవలంబించి, వారితో కలసి మెలసి తిరుగుతూ వుండేవాడు.  భర్త జైనులలో కలిసినా వైజకవ్వ మాత్రం శివభక్తి విడువలేదు.  
ఒకసారి వైజకవ్వ భర్త జైనులకి విందు చేయ సంకల్పించి ఇంట్లో వైజకవ్వచేత రుచికరమైన వంటలన్నీ తయారు చేయించి, తాను జైనులను తీసుకు రావటానికని వెళ్ళాడు.  వైజకవ్వ శివ భక్తురాలు కదా.  ఆవిడకి తానింత కష్టపడి చేసిన వంటలు శివ భక్తులు కాకుండా ఎవరో వచ్చి తిని పోవటం నచ్చలేదు.  వారు వచ్చే లోపల ఒక్కశివ భక్తుడికైనా తాను తయారుచేసిన భోజన పదార్ధాలు ముందు పెట్టి, తర్వాత జైనులకు పెట్టాలని నిశ్చయించుకుని, శివుని ప్రార్ధించి, ఇంటి వెలుపలికి వచ్చి వెతక సాగింది.  భక్తుల కోర్కెలు తీర్చే పరమేశ్వరుడు తన భక్తురాలి కోరిక తీర్చటానికి ఒక ముని వేషంలో సదాశివ స్మరణ చేస్తూ వచ్చాడు.

అతనిని చూసి వైజకవ్వ ఆతనికి నమస్కరించి, స్వామీ, నా భర్త జైనులకు విందుచేయ సంకల్పించి వారిని తీసుకురావటానికి వెళ్ళాడు.  శివ భక్తురాలినైన నేను ఒక్క శివ భక్తునికైనా ముందు భోజనం పెట్టాలనుకున్నాను.  నా భర్త వచ్చేలోపల మీరు భిక్ష తీసుకుందురుగాని రండి అని లోపలకి పిలుచుకుని వెళ్ళి  అతనికి సాదరంగా భోజనం వడ్డించింది.  అతను కూడా భోజనం చెయ్యటం మొదలు పెట్టి  జైనులందరికోసం వండిన పదార్ధాలన్నీ ఒక్క నిముషములోనే తానొక్కడే పూర్తిగా తిని అదృశ్యమయ్యాడు.

ముని రూపంలో వున్న సదాశివుడుని ఇంటికి రాగానే చూసిన వైజకవ్వ భర్త అతను మళ్ళీ కనిపించకపోయేసరికి  వైజకవ్వ వేరే మతమనుసరించటమేగాక ఎవరినో తీసుకువచ్చి, తనకి నమ్మక ద్రోహం చేస్తున్నదనే చెడు ఆలోచనతో ఆమెను నానా దుర్భాషలాడసాగాడు.  ఎంతో కష్టపడి జైనులకోసం తెచ్చిన ఆహార పదార్ధాలన్నీ ఒక మునికి పెట్టటం   అతనికి చాలా కోపం కలిగించింది.   ఆమెని కొప్పు పట్టుకుని ఈడుస్తూ, కాళ్ళతో తన్నుతూ, నేలమీద ఈడుస్తూ, తిడుతూ రోడ్లమీద తిప్పసాగాడు.  ఆమె శరీరంనుంచి రక్తం ధారలుగా కారసాగింది.  ఆ మహాసాధ్వి మాత్రం కొంచెమయినా భయ పడక, బాధ పడక భర్త పెడుతున్న బాధలన్నీ సహిస్తూ, “పార్వతీశా, శంభో, శంకరా, భక్త పరిపాలకా, నీ భక్తురాలిని కాపాడే భారం నీదే” అని ధ్యానించసాగింది.
అప్పుడు దయాళువైన పరమ శివుడు ఒక బాలుని రూపములో వచ్చి,  ఆమె భర్త కొట్టే దెబ్బలు ఆమెకు తగలకుండా చేతులు  అడ్డుపెడుతూ ఆ జన సమర్దములో వారితోబాటు నడవ సాగాడు.   కోపగించిన ఆమె భర్త ఆ బాలుని కూడా కొట్టగా చిత్రముగా ఆ దెబ్బలు అతనికి తగలకుండా అక్కడవున్న రాజ భటులకు తగిలి వారు అక్కడనుండి పారిపోయిరి.  
ఇదంతా చూస్తున్న ఒక జైన భక్తుడు వైజకవ్వ భర్తని ఆపి, “ఆమె గొప్ప భక్తురాలు. అందుకే నువ్వు కొట్టే దెబ్బలు ఆమెకి తగలటం లేదు. అనుమానంతో ఎందుకు ఆమెని బాధపెడతావు.  నీకు ఇష్టం లేకపోతే ఆమెని ఆమె ఇష్టం వచ్చినట్లు వెళ్ళనివ్వుగానీ ఇలా బాధించకు” అని నచ్చచెప్పాడు.  వైజకవ్వని కూడా సముదాయించాడు.  “అమ్మా, నీ మగడు నిన్ను  అంగీకరించకపోతే నీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళమ్మా” అని ఆమెని భర్త నించి విడిపించాడు.
వైజకవ్వ ఈ రాత్రి వేళ ఎక్కడికి వెళ్తాను ఆని ఆలోచిస్తూ నడుస్తుండగా ఒక జైన దేవాలయం కనబడింది.  ఆ చీకటిలో దానిని శివాలయంగా భావించి లోపలకి వెళ్ళి, దుఃఖమాగక ఒక జైన శిల్పాన్ని శివ లింగమనుకుని కౌగలించుకుని తన దుఃఖాన్ని వెళ్ళబోసుకుంది.  
ఆశ్చర్యమేమిటంటే ఆ జైన దేవాలయం శివాలయంగా మారింది.  ఆ జైన ప్రతిమ శివ లింగంగా మారింది.  అది భక్తి మహిమ!

***

No comments:

Post a Comment

Pages