వివక్ష
-ప్రతాప వెంకట సుబ్బారాయుడు
మయూరి ఫిల్మ్ అవార్డ్స్ నుంచి మొదటి అవార్డ్ జీవం సినిమాలో అందరి మనసులు కరిగించేలా కమ్మగా పాడిన కార్తికేయకు మేల్ సింగర్ అవార్డ్ ఇవ్వడం జరుగుతోంది. మీ అందరు చప్పట్లుకొట్టి అభినందనల సంగీత హర్షంలో వారిని తడిపి ముద్దజేయాలి" నవ్వుల పువ్వులు విరజిమ్ముతూ కోమలి అనౌన్స్ చేసింది.
కార్తికేయ డయాస్ మీదకు వచ్చి అవార్డ్ తీసుకున్నాడు.
"మీరు పాటలు పాడడంలో నెంబర్ వన్ అని తెలుసు, మరి మా కోసం ఓ నాలుగు మాటలు, ప్లీజ్"
"మాట్లాడతాను కాని ఇప్పుడు కాదు. కొద్ది సేపటి తర్వాత"
"మీరింత హేండ్ సమ్ గా, ఫెయిర్ గా ఉంటారు కదా! మరి హీరోగా..ప్రయత్నించలేదా?"
"అదీ చెబుతాను..కొద్ది సేపట్లో"
"ఓకే సర్, ఇప్పుడు మయూరి ఫిల్మ్ అవార్డ్స్ నుంచి తర్వాతి అవార్డ్.. అమ్మకోసం సినిమాలో ప్రదర్శించిన అత్యుత్తమ నటనకుగాను వాసుదేవ్ కు ఇవ్వడం జరుగుతోంది. వారు వేదిక మీదకి రావాలని కోరుకుంటున్నాను"
వాసుదేవ్ ఆహూతుల చప్పట్ల మధ్య వేదిక మీదకు చేరుకుని, ప్రముఖ యువ దర్శకుడు ప్రణయ్ నుంచి అవార్డ్ అందుకున్నాడు.
"సార్, వీక్షకుల కోసం మీరన్నా రెండు మాటలు.."
వాసుదేవ్ మైక్ అందుకున్నాడు "నేను అందవిహీనంగా కాదుగాని ఇదిగో ఇలా నల్లగా ఉంటాను. ఇప్పటిదాకా మీకెవరికీ తెలియని విషయం ఒకటి చెప్పబోతున్నాను. అది..అది..కార్తికేయ మా అన్నయ్య"
ఆ విషయం వినంగానే అందరూ షాకయిపోయారు.
"నాకు తెలుసు విషయం వినగానే మీరందరు అవాక్కయ్యారని, అందంగా హీరోలా ఉండే వాడెక్కడ? నల్లగా ఉండే నేనెక్కడ? అదేకదా మీ అనుమానం?"
'ఇప్పుడు నేను మాట్లాడతాను వాసుదేవ్' అని తమ్ముడి చేతిలోంచి మైక్ అందుకుని "చిన్నప్పట్నుంచి చూసేవాళ్ళ చూపుల్లో తేడా ఉండడం వల్ల మేము ఒక చోట పెరగలేక పోయాం. ఇంటికొచ్చిన ప్రతివాళ్ళు మా రంగు, అందం పోల్చి దాని గురించి మాట్లాడ్డమే. అంతేకాదు నల్లాడు, ఎర్రాడు అనే నిక్ నేమ్స్ పెట్టడం. అరే, ఒకే కడుపున పుట్టిన వాళ్ళు ఒకే కలర్ తో, అందంగా ఉండాలని ఉందా? లేదే. మరెందుకు అలా ప్రశ్నించి మనసులను విరిచేస్తారు? నిత్యకృత్యమైన ఈ విషయం ఎక్కడ తమ్ముడి మనసును పాడుచేసి, భవిష్యత్ లేకుండా చేస్తుందో అని నన్ను పిల్లల్లేని మా పెద్దనాన్నగారింట్లో ఉంచి పెద్ద చేశారు మా నాన్నగారు. వాళ్ళకీ పిల్లలుంటే అక్కడా నా బతుకు అద్వాన్నంగా ఉండేది. వాళ్ళు నన్ను దేవుడిచ్చిన పిల్లాడిలా చూసుకున్నారు.
అందంగా ఉన్నవాళ్ళే నటులా? కాదని ఎంతోమంది నిరూపించారు" కోమలి వంక చూస్తూ "మీరిందాక నేను హీరోగా ఎందుకు ప్రయత్నించలేదన్నారు. నాకు ఆ అదృష్టం లేదు. గాయకుడిగా నిలదొక్కుకున్నాను. యాక్టర్ గా వాడిని వాడు ప్రూవ్ చేసుకున్నాడు" అని కార్తికేయ కళ్ళుతుడుచుకుంటుంటే వాసుదేవ్ మైక్ అందుకుని "విన్నారుగా, మా ఇద్దరి రంగు, రూపురేఖలు వేరు కావచ్చు. ఒకే కడుపున పుట్టాం. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి పిచ్చి అభిమానం. కాని, సమాజం చూపులో వివక్ష ఉంది. దాన్ని తప్పించుకుని మనశ్శాంతిగా మమ్మల్ని మేము నిరూపించుకోడానికి వేరువేరుగా పెరిగాం. ఇక ఆ అవసరం లేదు. దయచేసి ఒక కడుపున పుట్టిన వారిలో ఉన్న తేడాలను పోల్చి, మానసికంగా హింసించి మీ సాడిజం ప్రదర్శించకండి. మీ మూలంగా కలసి పెరగాల్సిన వాళ్ళం విడివిడిగా పెరిగాం. ఇకనైనా మారండి. ఈ విషయం చెప్పడానికి ఇదే సరైన వేదికనుకున్నాం. రేపందరికీ ఇది మెసేజ్ గా రీచ్ అవుతుంది, మార్పు వస్తుందని ఆశిస్తూ" అన్నయ్యను ఆప్యాయంగా కౌగించుకున్నాడు.
ఆ దృశ్యం చూసిన అందరి మనసులు బరువెక్కాయి.
లేచి నుంచుని హాల్ దద్దరిల్లేలా చప్పట్లు కొట్టారు. మనుషుల్లో మార్పుకు విత్తనం పడింది.
***
No comments:
Post a Comment