అనసూయ ఆరాటం - 24 - అచ్చంగా తెలుగు

 అనసూయ ఆరాటం - 24 

చెన్నూరి సుదర్శన్ 


రవీందర్ రామాంతపూర్‌ల కొత్తగ కొన్న కొత్త ఫ్లాట్ల మూడో ఫోర్ల ఉంటాండు. సుస్మిత పీనుగను కార్లు పెట్టుకునే జాగల కింద సాపేసి పండబెట్టిండ్లు.


          రవీందర్ ఏడ్పు ఆపుడు ఎవరితరమైత లేదు. సుట్టు ముట్టు ఫ్లాట్లోల్లంత వచ్చి నలుగురు నాలుగు రకాల మాట్లాడుకోబట్టిండ్లు.


          బుచ్చయ్య, వీరమ్మ, రమేషు వచ్చే టాల్లకు దాదాపు పదయ్యింది.


          సుస్మిత పీనుగను సూడంగనే చాతంత గుద్దుకుంట వీరమ్మ.. బుచ్చయ్య మీద పడి రవీందర్ ఏడ్వబట్టిండ్లు.


          సురేందర్‌కు నిన్న నాత్రే తెలిసింది. జెమిని టీ.వీ.ల ‘సుస్మిత అనే అమ్మాయి హోటల్ పై అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది’ అని కింద లైన్ల  వత్తాందని ఆదిరెడ్డి ఫోను చేసి చెప్పిండు.  


          తెల్లారి ఈనాడు పేపర్ల మొదటి పేజీల ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ అనే హెడ్ లైను పెట్టి రాసిండ్లు. అది సదివే టాల్లకు సురేందర్‌కు సుస్మిత ఆత్మహత్య చేసుకున్న కారణం తెలిసింది. కాని గిట్ల జరుగక పోనుండే.. అని పానమంత కలి, కలి కాబట్టింది. ప్రమీలను తీస్కోని ఎంబడే బయల్దేరి వచ్చిండు.


          అప్పటికే ఆదిరెడ్డి, అనసూయను తీస్కోని కార్ల వచ్చిండు.  సుస్మితను దానం చేసే పనులన్నీ తయారు సేసి పెట్టిండు.


          పదకొండు గంటలకు పీనుగకు తానం చేయించి.. తతిమ్మ పనులన్నైనంక పాడె మీదకు లేపిండ్లు. సురేందర్ సుస్మిత సెవం కాళ్ళు పట్టుకొని లేపి బోయిండు. కాళ్ళు మూడు ముక్కలైనట్టు కూనంబట్టిండు. సుస్మిత పానం ఎంత అఘోరిచ్చిందోనని కండ్లెంబడి వట, వట నీళ్ళు కారబట్టినై.


          రవీందర్‌ను తల తానం సేయిచిం లుంగి కట్టిచ్చిండ్లు. మెడల పూల దండ ఒక చేతిల నిప్పుల కుండ.. ఇంకో చేతిల ఊదు బత్తీలు.. సూడంగనే అందరు ఒక్క సారి ఘొల్లుమన్నరు.


          పెండ్లి కాని పిలగాండ్లకు పాడె కట్టరు. ఒంటి కట్టెకు కట్టి తీస్కపోతరు. కాని ఇయ్యాల రేపు గవన్ని ఎవలు పాటిత్తాండ్లు. మల్ల చిన్న పిల్లనా.. ఏమన్ననా..! ఒంటి కట్టెకు ఆగుతదా.!!


          పాడె మీద గేటావల దాక తీస్కపోయి చిన్న వ్యానుల ఎక్కిచ్చిండ్లు. వ్యాన్ల దేవుని మీద స్లోకాలు పెట్టిండ్లు. 


           మెల్లంగ మెల్లంగ కాట్టాల గడ్డకు పోయేటాల్లకు కమస్కం అర్ధ గంట పట్టింది. కరంటు మిషిన్లేసి కాలబెట్టిండ్లు.


          అక్కడ్నే అందరు తానాలు సేసి ఇంటికచ్చేటాల్లకు రెండయ్యింది.


          చారన్నం తిని ఎక్కడొల్లక్కడ పోయిండ్లు.. దగ్గరి సుట్టాలు తప్ప.


రవీందర్ ఏడ్తనే ఉన్నడు. చారన్నంల చెయ్యి సుత పెట్టలేదు.

***

            మూడో రోజు పిట్టకు పెట్టచ్చిండ్లు.


          రవీందర్ ఏడ్తనే ఉన్నడు. వీరమ్మ ఎంత ఊకుండబెట్టినా ఊకుంట లేడు. ఒక్కగానొక్క బిడ్డ.. శాన పేమ తోటి పెంచుకునే.. రామయ్య కోచింగు సెంటర్ల నిత్తె ఎగిలిబారంగ తీస్కపోయి తీస్కచ్చుడు.. బిడ్డ డాక్టరు కావాలని ఎంతో ఆరాట పడ్డడు.


          దేవుని దయవల్ల డాక్టరు సీటి గాంధీ మెడికల్ కాలేజిల వచ్చింది. కనబడ్డోల్లకల్ల మిఠాయిలు పంచిండు.


బిడ్డకు చిన్న దవఖాన కట్టియ్యాలని కలలు గన్నడు..


ఇక తమ పానాలకు ఢోకా లేదనుకున్నడు కాని గిట్ల


తమను ధోకా చేసి పోతదని కలల సుత అనుకోలేదు.


ఒక్కొక్కటి యాది సేసుకుంట మూడు రోజుల సంది రవీందర్ ఏడ్తనే ఉన్నడు.. ఏడ్తనే ఉన్నడు.       


          రవీందర్ మాట్లాడేటట్లు లేడని.. “సుజయ్.. దినాలకన్నా వత్తడా..” అని రజితనడిగిండు బుచ్చయ్య.


          “సుజయ్ రాడు మామయ్య. వానికి కొత్త ప్రాజెక్టు వచ్చిందట.  అమెరికా నుండి రావాలంటే మాటలా.. రాను పోను లక్ష రూపాయలు కావాలె. వాడు వచ్చి మాత్రం ఏం చేత్తడు.


          ఇక్కడ జరిగేదంత వీడియ తీపిత్తాన. అది వానికి పంపిత్త”


          కోడలు మాటలు విని వీరమ్మ బీర్పోయి ముక్కు మీద ఏలేసు  కున్నది. బుచ్చయ్యకు లోపల మనాది ఉన్నది గాని బయట పడ్తలేడు. తను సుత ఏడ్సుకుంట ఓమూలకు కూకుంటే కొడుకు మరింత ఇదైతడని గుండె దిటవు సేసుకున్నడు.


          “రజితా.. సుస్మిత సంగతేంది.. ఎట్ల పడ్డది. తనకై తనే పడ్డదా. ఎవ్వలైనా నూకేసిండ్లా..” ఏదీ తెల్వనట్టే అదిగిండు బుచ్చయ్య. పది మంది పది రకాలుగ చిలువలు పలువలు సేసుకుంట మాట్లాడుకుంటాండ్లు. నిప్పు లేందే పొగ రాదు. కాని  ఏదైనా కోడలు నోటిగుండా ఇనాలని అనుకుంటాండు బుచ్చయ్య.


          “మామయ్యా.. సుత రజిత గిట్ల అన్నాలం సేసి పోతదని మేము సుత అనుకోలేదు. నచ్చ జెప్పినం.. బతిలాడినం.. కాల్మొక్కినం.. అయినా అది మన్సు మార్సుకోలేదు”  అని కండ్ల నీళ్ళు ఒత్తుకున్నది.


“మేము ఉప్పల్ల ఉన్నప్పటి సంగతి మామయ్యా.. మేము బంగ్ల మీద ఉండేటోల్లం. మాకింద సర్వేశం అని ఒక పోలీసు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కుటుంబముండేది. వాల్లు గౌండ్లోల్లు.  ఆయనకిద్దరు కొడుకులు. పెద్దోడు నిరంజన్‌గౌడ్ బి.కాం. డీగ్రీ చేత్తాండు. అందరు నిరంజన్ అనే పిల్సేటోల్లు. చిన్నోడు అంజన్‌గౌడ్ ఇంటర్  సదువుతాండు.. సుస్మిత దాక్టరు కోర్సు మూడో యడాది సదువుతాంది.. మాకు ఏమాత్రం అనుమానం రాకుంట నిరంజన్, సుస్మిత మెదిలేటోల్లు. కాని బైట వాల్లు కలిసి తిరిగేదన్న సంగతి తెలవది.. ఒక రోజు ఈయనకు కంపిని పని మీద నిజాం కాలేజీకి పోయిండు..”  అని ఆనాటి  సంది వాల్లింట్ల జరిగిన యవారమంత కండ్లకు కట్టినట్టు చెప్పసాగింది. 

(సశేషం)

No comments:

Post a Comment

Pages