బంగారు ద్వీపం (అనువాద నవల) -11
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton
(భోజన సమయంలో తాము మరునాడు కిర్రిన్ ద్వీపంలో కోటకు వెళ్తున్నట్లు పిల్లలు ఫానీకి చెబుతారు. మరునాడు ఆమె తయారు చేసిన భోజనాన్ని కిట్-బేగ్ లలో సర్దుకొని పిల్లలు బయల్దేరుతారు. తుఫాన్ వచ్చేలా ఉందని జార్జి అనుమానించినా, ఆలోగా వచ్చేయాలని ఆమె అనుకుంటుంది. చివరికి పిల్లలంతా హుషారుగా ద్వీపంలో అడుగు పెడతారు. తరువాత........)
@@@@@@@@@@####
జార్జి పడవను యిసుకపైకి లాగింది.
"ఇంతవరకు ఎందుకు లాగాలి?" ఆమెకు సాయపడుతూ జూలియన్ అడిగాడు. "అలల ఆటుపోట్లేమీ యిక్కడ లేవు కదా! అంతేగాక యిక్కడ అలలు ఖచ్చితంగా అంత దూకుడుగా చొచ్చుకు రావు."
"తుఫాను వస్తుందని నేను అనుకొంటున్నట్లు చెప్పాను కదా!" అంది జార్జి. "అదే జరిగితే, అలలు ఈ గొందిలోకి చొచ్చుకు వస్తాయి. మనం మన పడవను పోగొట్టుకోలేం కదా?"
"ఈ దీవినంతా కలియదిరుగుదాం ... ఈ ద్వీపాన్ని చూసొద్దాం" సహజ నౌకాశ్రయంగా ఉన్న కొండ వైపు చూసి అన్నె అరుస్తూ అక్కడ ఉన్న రాళ్ళను పట్టుకొని పైకెక్కింది. "ఓ! రండి."
అందరూ ఆమెను అనుసరించారు. ఆ ప్రాంతమంతా నిజంగా ఉత్తేజకరంగానే ఉంది. ఎక్కడ చూసినా కుందేళ్ళే! ఈ పిల్లల్ని చూడగానే అవి దూరంగా పారిపోయాయి. కానీ అవి తమ కలుగుల్లోకి పోలేదు.
"అవి బాగా మచ్చికైనట్లు లేవూ?" జూలియన్ ఆశ్చర్యపోయాడు.
"బాగుంది. నేను తప్ప యిక్కడకు మరెవరూ రారు" అంది జార్జి. "నేను వాటినెప్పుడు భయపెట్టను. టిం! టిం ! నువ్వు ఆ కుందేళ్ళ వెంట పడితే, నిన్ను వాయిస్తాను."
టిం జార్జి వైపు విచారంగా చూసింది.. కుక్క, జార్జి- యిద్దరికి కుందేళ్ళు తప్ప మిగిలిన విషయాల్లో ఏకాభిప్రాయం ఉంది. టిం కుందేళ్ళ విషయంలో వెంటాడాలని చూస్తాడు. దీనికి జార్జి ఎందుకు ఒప్పుకోదో కుక్కకి అర్ధం కాదు. తనను ఎలాగో నిగ్రహించుకొని ఆ పిల్లల వెనుక గంభీరంగా నడిచింది టిం. తన కళ్ళు మాత్రం హుషారుగా పరుగెడుతున్న ఆ కుందేళ్ళను ఆశతో చూస్తున్నాయి.
"నా చేత్తో ఏదైనా పెడితే, అవి తింటాయని నాకు అనిపిస్తోంది" జూలియన్ అన్నాడు.
కానీ లేదన్నట్లు తలూపింది జార్జి. "లేదు. నేను వాటికి పెట్టాలని ప్రయత్నించాను" అందామె. "అవి తినవు. ఆ చిన్న వాటిని చూడు. ఎంత ముద్దొస్తున్నాయో!"
“ఊఫ్!" అంటూ టిం చిన్నగా మూలుగుతూ వాటి వైపు కొన్ని అడుగులు వేసింది. జార్జి తన గొంతుతో హెచ్చరిస్తున్నట్లు శబ్దం చేయగానే, టిం తోక ముడిచి, వెనకడుగు వేసింది.
"కోట అక్కడ ఉంది!" జూలియన్ అన్నాడు. "ఇప్పుడు మనం దానిలో వెతుకుదామా? అలా చేయాలని నాకు అనిపిస్తోంది."
"అవును. మనం చూద్దాం" అంది జార్జి. "చూడు. అక్కడే ప్రవేశద్వారం ఉండేది. బాగా విరిగిపోయిన ఆ కమాను గుండా."
పిల్లలు విశాలంగా ఉన్న పాత కమాను ద్వారం వైపు చూశారు. ఇప్పుడు అది సగం విరిగిపోయింది. దాని వెనుక కోట మధ్యకు తీసుకెళ్ళే శిధిలమైన రాతి మెట్లు ఉన్నాయి.
"దాని చుట్టూ బురుజుతో ఉన్న రెండు బలమైన గోడలు ఉన్నాయి" జార్జి చెప్పింది. “మీరు చూస్తున్నట్లు, ఒక బురుజు దాదాపుగా కూలిపోయింది. కానీ మరొకటి అంత బాగా దెబ్బ తినలేదు. జాక్డా కాకులు దాని లోపల ప్రతి ఏడు గూడు కట్టుకొంటూ ఉంటాయి. అవి దాన్ని పూర్తిగా పుల్లముక్కలతో నింపేసాయి!"
రెండింటిలో మంచిగా ఉన్న బురుజు దగ్గరకు వాళ్ళు రాగానే, జాక్డాలు వాళ్ళ చుట్టూ ఎగురుతూ, "చాక్! చాక్! చాక్!" మని అరవసాగాయి. టిం తాను వాటిని అందుకోగలనన్నట్లుగా గాలిలోకి ఎగరసాగాడు. కానీ అవి దానికి దొరక్కుండా అరుస్తూ కుక్కను ఆట పట్టించసాగాయి.
వాళ్ళు శిధిలమైన ద్వారం గుండా ఒక విశాలమైన ఆవరణలోకి అడుగుపెట్టారు. "ఇది కోట మధ్య భాగం" చెప్పింది జార్జి. దాని రాతితలుపుకి గడ్డి, అనేక రకాల లతలు అల్లుకుపోయాయి.
"ఇక్కడ ప్రజలు నివసించేవారు. గదులు ఎక్కడ ఉన్నాయో మీరు చూడవచ్చు. అటు చూడండి. అక్కడ దాదాపు పూర్తిగా ఉన్న గది అదొక్కటే! ఆ చిన్న తలుపు గుండా లోనికెళ్ళి మీరు చూడొచ్చు."
వాళ్ళు గుంపుగా ఆ ద్వారాన్ని దాటుకొని లోనికెళ్ళగానే, రాతి గోడలు, రాతి పైకప్పు గల చీకటి గదిలో తాము ఉన్నట్లు గ్రహించారు. దానికి ఒక మూల పొయ్యి ఉన్న ప్రదేశం కావచ్చు. పక్కపక్కనే ఉన్న రెండు కిటికీలనుంచి గదిలో వెలుతురు పడుతోంది. అది వింతగాను, చమత్కారంగాను కనిపించింది.
"అంతా శిధిలమైపోయింది, ఎంత దారుణం!" బయటకు వచ్చి చుట్టూ తిరుగుతూ జూలియన్ అన్నాడు. "పడిపోకుండా ఉన్నది ఆ గది ఒక్కటే కనిపిస్తోంది. అక్కడ యింకా గదులు ఉన్నాయి కానీ, వాటన్నింటికీ పైకప్పు లేదా ఒకటి లేదా మిగిలిన గోడలు కూలిపోయినట్లు కనిపిస్తున్నాయి. అదొక్కటే నివాసయోగ్యంగా ఉన్నట్లు ఉంది. ఈ కోటలో పై అంతస్తు ఏమన్నా ఉందా జార్జి?"
"ఉన్నాయి" చెప్పింది జార్జి. "కానీ పైకి తీసుకెళ్ళే మెట్లు పోయాయి. చూడు. అక్కడ మీకు మేడ మీద ఒక గది కనిపిస్తోందా? దానిలో కొంతభాగం ఆ జాక్డా కాకులు ఉన్న బురుజు నుంచి చూడవచ్చు. మీరు అక్కడకు వెళ్ళలేరు. ఒకసారి నేను ప్రయత్నించాను. పైకి వెళ్ళలేకపోయాను సరికదా దాదాపుగా మెడను విరక్కొట్టుకొన్నాను. రాళ్ళు అలా విరిగిపోతాయి."
"నేలమాళిగలు ఉన్నాయా?" అడిగాడు డిక్.
"నాకు తెలియదు" అంది జార్జి. "కానీ యిప్పుడు వాటిని ఎవరూ కనుక్కోలేకపోయారు. ప్రతిచోటా గడ్డీ గాదం బాగా పెరిగిపోయింది."
గడ్డీ గాదం నిజంగానే బాగా పెరిగిపోయింది. పెద్ద పెద్ద బ్లాక్ బెర్రీ పొదలు అక్కడక్కడ పెరిగాయి. ముళ్ళపొదలు ఖాళీ జాగాల్లోకి, మూలల్లోకి చొచ్చుకు పోయాయి. మోటగా ఉండే పచ్చగడ్డి ప్రతిచోట పొడుచుకొచ్చింది. భూమి పగుళ్ళనుంచి, కన్నాల నుంచి లేత ఎరుపు పూల మొక్కలు పుట్టుకొచ్చి నేలపై పరుచుకొన్నాయి.
"బాగుంది. ఇది చాలా అందమైన ప్రాంతమని భావించాను" చెప్పింది అన్నె. "ఖచ్చితంగా, పరిపూర్ణంగా అందమైనదే!"
"నువ్వు నిజంగానే అంటున్నావా?" జార్జి ఆనందంగా అడిగింది. "నాకు చాలా ఆనందంగా ఉంది. అటు చూడండి. మనం ద్వీపానికి రెండవ వైపు, సముద్రముఖంగా ఉన్నాం. విచిత్రమైన పెద్ద పక్షులు కూర్చున్న ఆ రాళ్ళను చూస్తున్నారా?"
పిల్లలు అటు చూశారు. కొన్ని నిటారుగా ఉండటాన్ని గమనించారు. వాటిపై బాగా నల్లగా మెరిసే పక్షులు విచిత్రమైన భంగిమల్లో కూర్చున్నాయి.
"అవి సముద్ర కాకులు" జార్జి చెప్పింది. "అవి తమ ఆహారంగా చేపలను పుష్కలంగా పట్టుకొంటాయి. ఆ రాళ్ళ మీద కూర్చుని వాటిని అరిగించుకొనే ప్రయత్నం చేస్తాయి. హల్లో! అవన్నీ దూరంగా ఎగిరిపోతున్నాయేంటి? ఎందుకు పోతున్నాయో అని ఆశ్చర్యపోతున్నాను."
ఎందుకంటే నైరుతి నుండి అకస్మాత్తుగా కీడును సూచించే ఉరుము ఉరిమినట్లు ఆమెకు త్వరలోనే అర్ధమైంది.
"ఉరుము!" జార్జి చెప్పింది. "అది తుఫాను. నేను అనుకొన్న దాని కన్నా ముందే వస్తోంది!"
@@@@@@@@@@@
నలుగురు పిల్లలు సముద్రం వైపు తెల్లబోయి చూస్తున్నారు. అద్భుతమైన ఆ పాత కోటను శోధించాలన్న ఆసక్తిలో తమ చుట్టూ ఉన్న వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చిన మార్పుని పిల్లలు గమనించలేకపోయారు.
మరొక ఉరుము ఉరిమింది. ఆకాశంలో మరొక పెద్ద కుక్క గుర్రుమన్నట్లు ధ్వనించింది. అది విన్న టిం తానొక చిన్న ఉరుము అన్నట్లు గుర్రుమన్నాడు.
"అరె దేవుడా! దీనికోసమే మనం యిక్కడకు వచ్చినట్లుంది" అంటున్న జార్జిలో కొద్దిపాటి బెదురు చోటు చేసుకొంది. "మనం సమయానికి తిరిగి పోలేము. ఇది ఖచ్చితం. గాలి తీవ్రత కూడా ఎక్కువగా ఉంది. ఆకాశంలో యిలాంటి మార్పుని మీరు ఎప్పుడైనా చూసారా?"
వాళ్ళు బయల్దేరినప్పుడు ఆకాశం నీలం రంగులో ఉంది. అదిప్పుడు మబ్బు కమ్మినట్లు ఉంది. మేఘాలు చాలా తక్కువగా వేలాడుతున్నట్లు ఉండేవి. ప్రస్తుతం ఎవరో తరుముకొస్తున్నట్లు పరుగులు తీస్తున్నాయి. గాలి కూడా ఎవరో దుఃఖాన్ని ఆపుకోలేక పెడబొబ్బలు పెడుతున్నట్లు చప్పుడు చేస్తోంది. ఆ శబ్దానికి అన్నె బాగా భయపడిపోయింది.
"వాన మొదలవుతోంది" బయటకు చాచిన తన చేతిపై తుంపర పడుతున్న అనుభూతితో జూలియన్ చెప్పాడు. "మనకు మంచి నీడ దొరికింది, కాదంటావా జార్జి? లేకుంటే మనం తడిసిపోతాము."
"అవును, ఒక్క నిమిషంలో పోదాము" అంది జార్జి. "నేను చెప్పేదేమిటంటే, ఆ పెద్ద అలలు వస్తున్నాయి చూడండి. నా మాట ప్రకారం వచ్చేది పెద్ద తుఫానే అవుతుంది. అయ్యో! ఎంత పెద్ద మెరుపు!"
నిజంగానే అలలు చాలా ఎత్తుకు లేస్తున్నాయి.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment