పురాణ కధలు-బసవ పురాణం-32
పి.యస్.యమ్. లక్ష్మి
32. అరియమాఖ్యుని కధ
బసవేశ్వరుడు బిజ్జల రాజుకి అరియమాఖ్యుడనే
శివ భక్తుడు కధ ఇలా చెప్పసాగాడు. వీర
శైవులు శివ లింగాన్ని తమ అర చేతిలో వుంచుకుని పూజిస్తారు. వారు పార్వతీ మాతని కూడా పూజించరు. వారికి తమ శివుడు అంటే మాత్రమే అఖండ భక్తి
శ్రధ్ధలు. అట్టి ఒక భక్తుని గాధ ఇది.
పూర్వము మహేంద్ర మంగళ పురమున అరియమాఖ్యుడనే
ఒక వీర శైవ భక్తుడు వుండేవాడు. ఆయనకి ఎవరైనా
సరే తన ముందు శివ నామము తప్ప ఇంకొకటి పలుకరాదు.
అలా పలికినవారి శిరస్సు ఖండిస్తాననే భీకర వ్రతమొకటున్నది. ఒకసారి వారి ఇంటికి ఒక బ్రాహ్మణ భిక్షువు శివ
నామోచ్చరణ చేస్తూ భిక్షకి వచ్చాడు. ఈయన
కూడా భిక్ష తీసుకు వెళ్ళి భిక్షకుని జోలెలో వేస్తుండగా పొరపాటున కొంత అన్నము కింద
పడింది. వెంటనే ఆ భిక్షకుని నోటినుంచి
వేరే దైవం పేరు వచ్చింది. దానికి భక్తుడు
కోపగించి తన వ్రత నియమానుసారం అక్కడ దొరికిన ఒక తెడ్డుతో ఆ భిక్షకుని పొట్టలో
పొడవగా అతను చనిపోయాడు.
అది చూసినవారంతా ఇతనికింత అతిశయమా!? భిక్షకి వచ్చిన బ్రాహ్మణుని చంపుతాడా? దీనికి తగిన శిక్ష పడవలసినదేనని రాజుగారికి
ఫిర్యాదు చేస్తారు.
రాజు కూడా అతనిని పిలిచి విచారించాడు. దానికతడు నేనెందుకట్లా చేశానో ఆ శివుడికే
తెలుసుగానీ, మీకు తెలియదని చెప్పాడు.
దానికి రాజు కోపగించి ఆ చచ్చిన బ్రాహ్మణునితోపాటు ఇతనిని కూడా చంపమని
ఆజ్ఞాపించాడు.
రాజభటులు అతనిని చంపుటకు తీసుకుని
వెళ్తుండగా ఆ భక్తుడు నన్ను చంపమనటానికి ఆ ఈశ్వరుడు కర్తగానీ మీరు చంపగలరా?
నేను మీచేతిలో చచ్చేవాడినా?
అని పలుకుతూ దోవలో కన్పడిన ఒక శివాలయంలో చొరబడి శివుడిని పరిపరి విధముల
ప్రార్ధించసాగాడు. శివా, నీ వీరశైవ
మతస్తుడనగు నేను, నా శపధము భంగముకాకుండ అన్య దైవాన్ని స్మరించిన ఆతనిని బ్రాహ్మణుడనే అనుమానం కూడా లేకుండా చంపి నా
వ్రత పాలనం చేసుకున్నాను. ఈ బ్రాహ్మణులంతా
నేను చేసినది అపరాధమని నన్ను చంపటానికి వస్తున్నారు. నన్ను నువ్వే కాపాడాలి. నువ్వే శరణని ప్రార్ధిస్తుండగా శివుని ఉదరము
విచ్చుకుని శివుడు పలుకులు వినిపించాయి.
వీరశైవ భక్తుడవైన నువ్వు ఆ బ్రాహ్మణునితో చావనవసరం లేదు. నా ఉరమున వుండమని. శివుని ఉరము విచ్చుకొనగా అరియమాఖ్యుడు దానిలో
చొరబడ్డాడు. లింగము మళ్ళీ మామూలుగా
అయింది. అరియమాఖ్యుని ఉత్తరీయము లింగముపైన
శివుని ఆభరణములమీత కప్పబడి వుంది.
రాజభటులు ఎంత వెదికినా అతనిని కనుగొనలేక వెళ్ళి రాజుకావిషయం చెప్పారు.
ఆ కాలంలో వీరశైవమతంలో ఇలాంటి కధలు ఎన్నో.
No comments:
Post a Comment