ఈతడు విష్ణుడు రిపు లెక్కడ చొచ్చేరు మీరు
(అన్నమయ్య కీర్తనకు వివరణ)
డా.తాడేపల్లి పతంజలి
రేకు: 0352-04 సం: 04-306
పల్లవి:
ఈతడు విష్ణుడు రిపు లెక్కడ చొచ్చేరు మీరు
చేత చక్రమెత్తినాడు శ్రీవేంకటేశుడు
చ.1:
జలధులు చొచ్చిచొచ్చి సారె బ్రతాపించినాడు
చలమున బాతాళము సాధించినాడు
బలుభూమిదూరి వొక్కకొలికికి దెచ్చినాడు
నిలిచి యంతరిక్షమునిండి భేదించినాడు
చ.2:
చేరి బ్రహ్మాండము తూటుసేసి చూచినాడు
వీరుడై రాచమూకల వెదకినాడు
ఘోరపుత్రికూటాదికొండలు జయించినాడు
వారించి చక్రవాళపర్వతము దాటినాడు
చ.3:
మట్టి దైత్యపురాల మర్మాలు విదళించినాడు
చుట్టువేడెమున యింతా సోదించినాడు
యిట్టె శ్రీవేంకటాద్రినిరవై యెక్కినవాడు
రట్టుగాదనదాసులనిట్టె రక్షించినాడు
భావం:
పల్లవి:
ఈతడు విష్ణుదేవుడు. ఓ శత్రువులారా ! శ్రీవేంకటేశుడు చేతిలో చక్రమును ఎత్తినాడు. ఎందులో మీరు ప్రవేశిస్తారు? ఈయనని తప్పించుకు పారిపోలేరు.
చ.1:
వేదాలను దొంగిలించి సముద్రములో దాగిన సోమకుని సంహరించి ప్రతాపము చూపించాడు.( మత్స్యావతారం)
అమృతమునకై దేవతలు, రాక్షసులు కీరసాగరమును మధించునపుడు మందరాద్రిని నిలబెట్టి పాతాళమును జయించాడు.(కూర్మావతారం).
హిరణ్యాక్షుడు భూమిని చాపచుట్టగా జుట్టి పాతాళములోకి తోసినప్పడు ఆ రాక్షసుని చంపుటకు భూమిలోకి దూరి అతనిని సంహరించి వ్యవహారము ఒక కొలిక్కి తెచ్చాడు.
(వరాహావతారం) ప్రహ్లాదుని మాట దక్కించటానికి స్తంభములో నిలిచి, ఆకాశములో నిండి హిరణ్యకశిపుని చీల్చిచెండాడాడు.( నరసింహావతారం).
చ.2:
దేవతలనుద్దరించటానికి బలిని దానమడిగి బ్రహ్మాండముకు రంధ్రము చేసాడు (మూడు లోకాలను ఆక్రమించాడని భావం. వామనావతారం)
వీరుడై ఇరువదొక్కసార్లు యుద్ధరంగంలో క్షత్రియులను భూమిని స్వాధీనము చేసుకొని దానిని అంతా కశ్యపునకు దానమిచ్చినాడు.(పరశురామావతారం).
రావణుని చంపటానికి ఘోరమైన త్రికూటము మొదలయిన పర్వతాలను దాటి శత్రువులను జయించినాడు.(త్రికూట పర్వతము మీద ఉన్న లంకను జయించాడని భావం) (రామావతారం).
వారించి చక్రవాళపర్వతము దాటినాడు.
చ.3: త్రిపురాసురవనితల పాతివ్రత్యాభిమానములను తొక్కివేసాడు( బుద్ధావతారం)
దుష్టులను సంహరించటానికి చుట్టువేడెమున(గుర్రాన్ని ఎక్కి) భూమినంతా శోధించాడు.(కల్క్యావతారం)
ఈ విధంగానే శ్రీవేంకటాద్రిని స్థానంగా చేసుకొని శ్రీ వేంకటేశుడు భక్తుల హృదయ పీఠాలపై ఎక్కాడు. తనదాసులను రక్షించినాడు.
***
No comments:
Post a Comment