మానసవీణ - 47
నవ్యతేజ
అలోచిస్తూ స్కూటీ డ్రైవ్ చేస్తోంది మానస... జగ్గయ్య తాత ఇల్లు గూడెం లో
ఎక్కడో కనుక్కుంటూ వెళుతూంది. తను అశ్రమంలో చూసిన జగ్గయ్య తాత రూపాన్ని మనసులో
మననం చేసుకుంది. దారిలో కట్టె పుల్లల మోపు నెత్తిన పెట్టుకుని వెళుతున్న ఇద్దరు
చిన్నపిల్లలను చూసి ఆమె మనసు ఒక్కసారి కలుక్కుమంది. "జగ్గయ్య తాత ఉండేది
ఎక్కడ..." అంది నవ్వుతూ. వాళ్లు నవ్వుతూనే కొంచెం దూరంగా ఉన్న చిన్నకొండ వైపు
వేలుతో చూపించారు. చిరునవ్వుతో చెయ్యిఊపింది. కొండ దగ్గరగా స్కూటీ పార్క్ చేసి
నడవసాగింది. చిన్నగా చినుకులు మొదలయ్యాయి. వడివడిగా నడుస్తూ ఆ కొండమీద ఉన్న ఒకే
ఒక్క ఇంటిని చేరుకుంది. పంచవటిలా ఉన్న ఆ ఇంటి వైపు ముచ్చటగా చూసింది.
వర్షం పెద్దది అవడంతో వాకిలి దగ్గరున్న చూరుకిందనిలబడింది. వాకిలి వారగా
వేసిఉండడంతో లీలగా మాటలు వినిపిస్తున్నాయి. "ఇంకొంచెం తినయ్యా... ఆడ నువ్వు ఏంతింటావో ఏటో. అయ్యకి ఓపాలి కనపడి
పో. నీమీద పేనాలు పెట్టుకున్నాడు..." అభ్యర్ధనగా అంటోంది ఒక ఆడమనిషి గొంతు.
ఇంతలో అక్కడికి పరిగెత్హుకుంటూ నలుగురు మనుషులు ఒక బిడ్డని ఎత్తుకుని
వచ్చారు. "జగ్గయ్యా!!! …" అని బిగ్గరగా అరుస్తూ. చప్పున ఒక పెద్దావిడ
బయటకి వచ్చింది. "జోగులమ్మా!!! బిడ్డని ఏదో కుట్టినాది. జగ్గయ్య ఏడమ్మా” ఏడుస్తూ బిగ్గరగా అన్నారు.
"వస్తాడు అడవికి..." అని ఆమె మాట
పూర్తిచేసేలోపు గుడిసెలోంచి ఒక యువకుడు చప్పున బయటకొచ్చాడు. బిడ్డని లాక్కున్నంత
పనిచేసి ఒళ్ళంతా తడిమి చూసాడు. వాళ్ళని ప్రశ్నలు వేస్తూ చక చకా ఒక అంచనాకి
వచ్చాడు. అక్కడ గుబురుగా ఉన్న ఒక చెట్టుదగ్గరకి వెళ్లి ఆకులు తుంపాడు. లోపలికి పరుగెత్తి
ఇంకో బెరడు పట్టుకొచ్చాడు. వాటితో బిడ్డకి వైద్యం మొదలుపేట్టాడు. కొంచెంసేపు
అయ్యాకా "ఇంక భయంలేదు. కుట్టింది విషపుపురుగు కాదు, వెళ్ళండి" అన్నాడు. వాళ్లు కన్నీళ్ళతోనే నవ్వుతూ
దణ్ణం పెట్టివెళ్లిపోయారు. జోగులమ్మ అప్పుడు నవ్వింది తన బిడ్డవైపు చూసి. అక్కడ
నిలబడి అంతా ఆశ్యర్యంగా చూస్తున్న మానసను అప్పుడు చూసారు వాళ్లిద్దరూ. వాళ్ళ
చూపులకి సమాధానంగా చప్పున "నా పేరు మానస. ఇక్కడ స్కూల్లో కొత్తగా వచ్చిన
టీచర్ ని. జగ్గయ్య తాతని కలవాలి."
అంది. యువకుడు ఏమీ అనకుండా లోపలికి వెళ్ళిపోయాడు. జోగులమ్మ
తేరుకుని " నా పేనివిటేనమ్మా... వానకి సిక్కుకునుంటాడు, వస్తాడు..." అని
కూర్చోమన్నట్టు అక్కడున్న గట్టు చూపించి లోపలికివెళ్ళిపోయింది. అక్కడ చుట్టుపక్కల
అంతా పరికించి చూడసాగింది మానస...
వాన
తగ్గుముఖం పట్టింది.
కొండ
ఎక్కుతూ మెల్లగా వస్తున్న జగ్గయ్యను చూడగానే మానస పెదవులమీద చిరునవ్వు పూసింది. పంచకట్టులో
నుదుటన విభూది, కుంకుమలతో, భుజాన కండువాతో
వన ధన్వంతరిలా ఉన్నాడతను. మానసను దగ్గరగా చూసి ఎక్కడో చూసాను అనుకున్నాడు జగ్గయ్య.
గుర్తుకురాగానే ఆప్యాయంగా "నువ్వా అమ్మా? ఇక్కడ మా గుడెంలో..." అన్నాడు.
"గుర్తుపట్టారా జగ్గయ్యతాతా... నేను మానసను. ఆశ్రమంలో చూసారునన్ను"
గబగబా అంది. అవును అన్నట్టు చిరునవ్వుతో తలవూపాడు. "ఇక్కడ స్కూల్లో టీచర్ గా
చేరాను. మిమ్మల్ని కలుద్దామని వచ్చాను" అంది మానస. ఆశ్రమంలో అందరితో
కలుపుగోలుగా ఉంటూ, అందరిని జాగ్రత్తగా చూసుకునే మానస జగ్గయ్య మనసులో మెదిలింది.
జగ్గయ్య ఏదో అనబోయేంతలో జోగులమ్మ బయటకు వచ్చింది. అప్పుడు ఆమెను సరీగా చూసింది
మానస.
కచ్చాపోసిన
చీరకట్టుతో మొహాన పసుపు, పెద్ద కుంకంబొట్టుతో గ్రామదేవతలా ఉంది ఆమె.
కొంచెం
కంగారుగా ఉన్న ఆమె మొహంలోకి ప్రశ్నర్థకంగా చూసాడు జగ్గయ్య... "ఒక చిన్నపాపని
ఇప్పుడే మీ వైద్యం కోసం ఎవరో తీసుకొచ్చారు, ఏదో పురుగు కుట్టింది అనుకుంటా" చిన్నపిల్లలా
గబగబా చెప్పింది మానస. "సమయానికి మీ అబ్బాయే అనుకుంటా... వెంటనే మందువేశారు.
పాపకి బాగయ్యి వాళ్ళు వెళ్లిపోయారు కూడా " పాపకి బాగయిందన్న ఉత్సాహంలో
తొందరతొందరగా చెప్పింది. ఒక్కసారి జగ్గయ్య కళ్ళు విచ్చుకున్నాయి. "రాజా
వచ్చాడా..." అని మాత్రం అన్నాడు భార్యవైపు తిరిగి, ఏ భావమూ లేకుండా.
"ఎలాగుందమ్మా మా గూడెం... పిల్లోళ్ళు బడికెళ్ళేది కొంచెం తక్కువే
ఈడ" క్లుప్తంగా అన్నాడు. మాటలు త్రాసులోవేసి మాటాడతాడా అన్నట్టుంది జగయ్య
మాట. కళ్ళతోనే ఎదో సైగ చేసింది జోగులమ్మ. ఇప్పుడే వస్తానంటూ లోపలికి వెళ్ళాడు
జగ్గయ్య ,జోగులమ్మతో.
"ఈడ్నే ఉండాడు... ఎల్లిపోనాడు" గొంతుకు ఏదో
అడ్డంపడ్డట్టు అంది జోగులమ్మ. "సర్లే, పద. ఆయమ్మ కి ఏమైనా ఇచ్చిండావా" అన్నాడు
మాటమారుస్తూ. "లేదయ్యా... లోనికి రమ్మను" అంది నొచ్చుకుంటూ.
వాళ్ళిద్దరిని కూర్చోమని రెండు పళ్ళాల్లో పళ్ళు పెట్టి ఇచ్చింది జోగులమ్మ. తింటూ
నెమ్మదిగా చెప్పింది మానస "ఇక్కడ మీరు ఆయుర్వేదం మందులతో ఎంతోమందికి
వైద్యంచేస్తున్నారు. ఈ విద్య ఇంకొంతమందికి నేర్పితే ఇంకా బాగుంటుంది కదా. మీ
పిల్లలు కూడా నేర్చుకున్నట్టున్నారు. ప్రభుత్వం తరఫున గ్రాంట్ కూడా
తీసుకురావొచ్చు. ఎంతో మందికి ఉపాధికూడా కల్పించవచ్చు." అవునన్నట్టు తలవూపాడు జగ్గయ్య.
"అవునూ మీ అబ్బాయి ఎక్కడ..." అంది చప్పున. "ఏదో పనిబడ్డది బిడ్డకి"
అంది జోగులమ్మ. ఇంక మాటలు పొడిగించక నెమ్మదిగా తిని లేచింది మానస.
“వెళ్ళొస్తాను” అని చెప్పి బయలుదేరింది. ఇంటికి వెళుతూనే శ్రావణికి అన్ని
విషయాలు చెప్పింది . "ఆ అబ్బాయి ఎంత త్వరగా వైద్యం చేసాడో తెలుసా అమ్మా! క్షణాల్లో
పాపకి నయం చేసాడు. చదువుకున్న వాడిలా ఉన్నాడు. అతని పేరు రాజా అనుకుంటా." ఆమె
అన్న మాటలు ఆ ఇంట్లో శ్రావణికి సాయంగా ఉన్న గూడెం పిల్ల లచ్చి విన్నది. "రాజా
అన్నల్లో కలిసిపోనాడుగదమ్మా. ఏడ సూసినావు?" అంది ఆరాగా. “కొంచెం మంచినీళ్లు
తీసుకురా లచ్చి..." అని మాటమార్చి ఆలోచనలోపడింది మానస. అంత గుట్టుగా జోగులమ్మ
ఎందుకు ఉందో అప్పుడు అర్ధం అయ్యింది. అంత విద్య చేతిలో ఉన్న రాజా ఎందుకు ఆలా
అయిపోయాడు అన్న ప్రశ్న ఆమెను నెమ్మదిగా ఉండనీయలేదు.
లచ్చితో కొంచెం సేపు కబుర్లు చెప్పి, మాటల్లో మాటగా రాజా గురించి
తెలుసుకుంది మానస. చక్కగా చదువుకున్నాడని, తండ్రితో సమానంగా మూలికలతో వైద్యంచెయ్యగలడని
గ్రహించింది. అడవిలో అన్నలకు చేదోడుగా వెళ్లిపోయాడని, అప్పలనాయుడు మనుషులు చేసే అన్యాయాలను
ఎదిరించేవాడని లచ్చి కళ్ళకు కట్టినట్టు చెప్పింది. కొద్దికొద్దిగా మానస మదిలో ఒక
ఆలోచన రూపు దిద్దుకుంది.
ఆ
రోజు రాత్రి అనిరుధ్ కి ఫోన్ చేసింది.
"మానసా... అమ్మ, అడవి, నువ్వూ అందరూ బావున్నారా" అన్నాడు నవ్వుతూ.
"అంతా బావుంది అనిరుధ్, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి" అని తాను
జగ్గయ్య ఇంటికి వెళ్లడం, అక్కడ చూసిన మనుషులగురించి ముఖ్యముగా రాజా గురించి తాను చూసిన, తెలుసుకున్న విషయాలు పూసగుచ్చినట్టు చెప్పింది.
"రాజా లాంటి తెలివైన వాడు, ముఖ్యంగా గూడెం గురించి అంతా తెలిసినవాడు తప్పకుండా గూడానికి అన్నివిధాలా
మంచిచెయ్యగలడు. బయటనుంచి వచ్చిన మన కన్నా గూడెంలో జరిగిన, జరుగుతున్న విషయాలు బాగా తెలిసినవాడు. జరగబోయే
మంచిపనులకి పునాది అవ్వగలడు అనిపిస్తోంది. దారితప్పిన వాగుకి అనుకూలంగా గట్టు
కట్టలేమా?" అంది మానస.
"నువ్వన్నది నిజమే మానసా. సుశీలమ్మగారు అన్యాయం
జరిగిన గిరిజన ప్రజలకు తనవంతు న్యాయం చేయాలనుకుంటున్నారు కదా. భూముల పంపకం వంటి
విషయాల్లో అతని సాయం ఈ అడవి బిడ్డలకి అవసరం. తనవాళ్ళని ముందుకు తాను ముందుండి
నడిపించగలడు. అదే జరిగితే జగ్గయ్య కుటుంబం కూడా చాలా సంతోషిస్తుంది. తను నేర్పిన
విద్య, తన పెంపకం తన ఇంటికి, గూడానికి వెలుగుని ఇస్తే అంతకన్నా జగయ్యకి
సంతోషమేముంది? కాకపోతే అది అంత సులువైన పని కాదు. బలమైన కారణాలు అతనికి అడవిలో మరో
అడవిని పరిచయం చేసాయి. అతనికి పరిస్థితులు, ప్రభుత్వం మీద పోయిన నమ్మకం మళ్ళీ పుట్టాలి. ఈ విషయంలోదినేష్, కృషీవలరావు గారి సాయం మనకి అవసరం ఉంది. ఎన్నో
చుక్కలు కలపాలి మనం."
అనిరుధ్
తో మాట్లాడాకా మానస ఆలోచనలకి ఒక రూపం, బలం వచ్చాయి. సముద్రాలు దాటిన ఆంజనేయుని
ప్రయాణం కూడా ఒక బలమైన అంగతోనే మొదలయ్యింది కదా. ఆ అంగ వేయడానికి అతడు మనసులోనే వేల యోజనాల ఎత్తు అధిగమించాడు...
No comments:
Post a Comment