బామ్మగారూ బర్త్‌డే కేకూ - అచ్చంగా తెలుగు

బామ్మగారూ బర్త్‌డే కేకూ

Share This
బామ్మగారూ బర్త్‌డే కేకూ
పి.వి.శేషారత్నం

('అచ్చంగా తెలుగు" 2023 వినాయకచవితి హాస్య కథల  పోటీల్లో మొదటి  బహుమతి గెల్చుకున్న కథ)  
 


‘ఇదిగో ఏమండోయ్‌...ఓసారి ఇలా వస్తారా?’ వంటింట్లోంచి భార్య బాలాత్రిపురసుందరి కేక వినబడగానే చెప్పులేసుకుని బయటికి పారిపోబోతున్న సుబ్బరాజుగారి గుండెల్లో రాయి పడిరది.‘కొంపదీసి  బాలాత్రిపురసుందరి మళ్లీ బర్త్‌డే కేకు గాని చెయ్యలేదుకదా!ఏంటో ఢల్లీి మనవలు సెలవులకి వస్తున్నారనగానే దీనికి ఉన్న మతి కాస్తా పోయినట్టేవుంది.’అనుకున్నాడు మనసులోనే...

ఆయనకి ముందు రోజు బర్త్‌డే కేకు పేరుతో పెళ్లాం చేసిన పేరు తెలియని ముద్ద తిని రాత్రంతా ఒకటే విరేచనాలు పట్టుకున్న అనుభవం గుర్తొచ్చింది. ‘ఇదిగో మిమ్మల్నే...ఇది తిని ఎలావుందో చెప్పండి.’ అంది బాలాత్రిపురసుందరి మిలమిలా మెరిసే స్టీలు ప్లేటుని ఆయన చేతికందిస్తూ...

‘ఏమిటే ఇది...’ ప్లేట్లోని నల్లని పదార్ధంకేసి  భయంగా చూసారు సుబ్బరాజుగారు.

‘బర్త్‌డే కేకు అండి.మనవలకిష్టంకదాని...మొన్న వరలక్ష్మీ వ్రతానికి పేరంటానికొచ్చిన కరణంగారి పట్నం కోడల్ని కనుక్కుని మరీ చేసాను తెలుసా? ఈ బాలా త్రిపుర సుందరి తలచుకున్నది సాధించిగాని వదలదు.’

‘అఘోరించలేకపోయావ్‌...‘బావనే పెళ్లి చేసుకుని తీరతాను’ అని సత్యభామలా పట్టుబట్టి నూట ఎనిమిది వ్రతాలు చేసి రెండు కుటుంబాలమధ్య ఉన్న పాత తగువుల కోటని పగలగొట్టించి నన్ను సాధించుకున్నావ్‌ చాలదా?’ మాటల్ని మనసులోనే నొక్కేసి ఆయన ‘ఏదీ మనవలింకా రాలేదుకదే?నీకంతా తొందరెక్కువ.’ అన్నారు. పిల్లికి చెలగాటం ఎలక్కి ప్రాణసంకటంలా ఉంది ఆయన పరిస్థితి.తినకపోతే మనవలమీద ప్రేమ లేదంటుంది. తింటే ఈవయసులో అడ్డమైనవీ హరాయించుకోవడం మహాకష్టంగాఉంది.

‘ఆ... వాళ్లు రావడానికి నాలుగురోజులెంతలో గడుస్తాయి.అయినాగాని...ఏదో ఏ చెగోడీలో  అయితే ఎడం చేత్తో అవలీలగా చేసి పారేస్తాను. పల్లెటూరివాళ్లకి బర్త్‌డే కేకులు ఏం తెలుస్తాయి?’అందావిడ దీర్ఘం తీస్తూ.

‘అయినా ఢల్లీి మనవలకోసం నేర్చుకుంటున్నానంటావ్‌...’

‘అవునండీ...ఎప్పుడో  వాళ్లు చిట్టిచిట్టి అడుగులు వేసే వయసులో చూసాం.ఏడేళ్ల తర్వాత వస్తున్నారాయె.వాళ్లకిష్టమైన బర్త్‌డే కేకు చేసిపెట్టకపోతే కోడలన్నట్టు వచ్చిన మూడోరోజునే తిరుగు ప్రయాణమయిపోరూ?’

‘అదీ నిజమేలే...అయినా నువ్వుకూడా ఇలా కూర్చుని ఈ నల్ల అప్పడాన్ని నాతోబాటు రుచి చూడకూడదూ?’

‘నిక్షేపంలాంటి బర్త్‌డే కేకుని పట్టుకుని నల్ల అప్పడమంటారేంటి?అయినా చదవేస్తే ఉన్నమతికూడా పోయిందని...ఈ యాభైయేళ్ల సంసారంలో మీరు తినకుండా నేనెప్పుడయినా ఏదన్నీ తిన్నానా?’

‘అవునులే...ముందు నామీద ప్రయోగించి బ్రతికున్నానో లేదో పరీక్షించి ఆనక అది బాగుంటేనే తినడం అలవాటాయె’ ఆయన గొణుగుడుని పట్టేసిందా ఇల్లాలు.‘ఏమిటి గొణుగుడు?’

‘అబ్బే ఏంలేదు.మనవలంటే నీకు ఎంతప్రేమో...ఊరంతా తిరిగి ఎవరికి అయినా బర్త్‌డే కేకు చెయ్యడం వచ్చేమో కనుక్కుని మరీ చేస్తున్నావని నిన్ను మెచ్చుకుంటున్నాను.’

‘సరే తిని చెప్పండి.రుచి బాగుందంటే రేపుకూడా చేస్తాను. పిల్లల పుట్టినరోజునాడు అవలీలగా  చేసి పెట్టొచ్చు.’ ఆయన గుండెల్లో మళ్లీ రాయిపడిరది.

మళ్లీ రేపుకూడానా? మనవలొచ్చేదాకా తనకీ హింస తప్పదు కాబోలు. ‘బాగుందీ’ అంటే రేపు మళ్లీ చేస్తుంది. బాగాలేదంటే...మళ్లీ ఎవరినో కనుక్కుని ఇంకో దిక్కుమాలిన ప్రయోగం చేస్తుంది.ముందునుయ్యి వెనక గొయ్యిలావుంది తన పని...అనుకుంటూనే ఇంక తప్పదని బర్త్‌డే కేకు పేరుతో చేసిన నల్లని పదార్ధాన్ని నోట్లో పెట్టుకున్న సుబ్బరాజుగారు గావుకేక పెట్టారు.

‘అయ్యో ఏమయిందండీ?’ నోట్లో వేళ్లు పెట్టుకుని డోక్కుంటున్న భర్తని చూసి కంగారుపడిరదావిడ.

‘ఏంటో ఘాటుకి ఒక్కసారిగా తలతిరిగినట్టుంటేనూ...’

‘ఉండదూ...ఢల్లీి మనవలతో ఆడుకోడానికి అని మీ వయసు కూడా మరిచిపోయి ఊరిచివరకెళ్లి రోజూ క్రికెట్టు ఆడుతున్నారాయె.నాకు తెలియదనుకోకండి.మొన్న మోకాళ్లకి  దెబ్బ తగిలించుకుని నిన్న పొలం గట్టుమీద పడిపోయాను అని అబద్ధం ఆడినంతమాత్రాన నా కళ్లని కప్పలేరండోయ్‌.’

‘ఆసంగతి ఇపుడెందుకు గానీ...బాలాత్రిపుర సుందరీ... బర్త్‌డే కేకు అంటే ఇలా కాదేమోనే చెయ్యడం...’

‘మీకిష్టం లేకపోతే తినకండి. అంతేగాని నా మనవలకిష్టమైన బర్త్‌డే కేకుని నాకు చెయ్యడం రాదంటే మాత్రం ఊరుకోను’  లోపలికెళ్లిపోయిందావిడ విసురుగా.

###

పోస్ట్‌మేన్‌ అబ్బులు బాలాత్రిపురసుందరమ్మగారితో నవ్వుతూ అన్నాడు.

‘అబ్బే బర్త్‌డే కేకు అంటే ఏంలేదు బామ్మగారూ రెండు రొట్టెముక్కల మధ్యలో ఉల్లి పాయలు, సన్నగా తరిగిన కూరగాయల ముక్కలు పెట్టి దానిని అదేదో కరెంటు బాక్సులో పెట్టేయడమే... నేనోసారి పట్నం వెళ్లినపుడు తిన్నాను. ఏం రుచి అనుకున్నారు.ఇంకోసారి తిందామని వెళ్లేసరికి బేరాల్లేవు కాబోలు షాపు ఎత్తేసాడు.ఎందుకడుగుతున్నారు. మీకూ కేకు తినాలనుందికదూ!’

‘నా తలకాయ...ఈ వయసులో నాకు కేకు ఎందుకు నాయనా?  ఢల్లీినుంచి మా మనవలువస్తున్నారులే. వాళ్లకి రోజూ పిజ్జాతొబాటు కేకుముక్కలు కూడా ఉండాల్సిందేనని మాకోడలు అంటేనూ..నేర్చుకుందామని...’

‘మనవలంటే ఎంత ప్రేమ బామ్మగారూ!చదరంగం ఆడే తాతగారయితే మనవలకి క్రికెట్‌ ఇష్టమని రోజూ ఊరిబయట రెండు కర్రలనికలిపి మేకులు కొట్టించి  క్రికెట్‌ బ్యాట్‌లాగా చేయించి ఊళ్లోని కుర్రాళ్లతో ఆడుకుంటున్నారు.’

‘నాకు తెలుసులేవయ్యా...రోజూ సాయంత్రంఅయినా అవకుండా ఏదో పెద్ద పనుందంటూ బయటికి పోతుంటే ఎపుడో కనిపెట్టేసా...చూపిస్తాను మా మనవలకి బామ్మ ఎక్కువ ఇష్టమవుతుందో తాత ఎక్కువ ఇష్టమవుతారో...వెర్రి నాగన్నలు... ఇంకెంత రెండు రోజులే ఉంది వాళ్లు రావడానికి ...ఈలోగా బర్త్‌డే కేకుతోబాటు పిజ్జా కూడా నేర్చుకు తీరాలి.పట్నంలో చదువుకున్న పిల్లేగాఅని మనవూరికి కొత్తగా వచ్చిన నాజూకు పంతులమ్మని అడిగానా?వాళ్ల బామ్మ దగ్గర పెరిగిందిట. అన్నీ పల్లెటూరి వంటలే తప్ప పట్నం రుచులు ఎక్కువగా తెలియవు పొమ్మంది.అయినా నువ్వు చెప్పావుగా.ఇవాళే చేసేస్తాను.’

హుషారుగా ఇంట్లోకి అడుగుపెట్టిన సుబ్బరాజుగారు కులాసాగా నవ్వుతూ అడిగారు....భర్త ప్రాణంకోసం వెంటబడిన మహాపతివ్రత సావిత్రికి ఆఖరి వరం కోరుకోమని అడిగేటపుడు పరాకులోపడి ‘నీ పతి ప్రాణంబు తప్ప’ అనడం మరిచిపోయిన యమధర్మరాజులా...‘ఏమిటి బాలాత్రిపురసుందరీ ‘చేసేస్తాను చేసేస్తాను’ అంటున్నావ్‌...మనవలొస్తున్నారని చెగోడీలు...కజ్జికాయలూనా?’

‘కాదండీ...కేకు...దాంతోబాటు పిజ్జా...?పోస్ట్‌మేన్‌ కుర్రాడు  అరటిపండొలిచి చేతిలో పెట్టినట్టే చెప్పాడు సుమండీ...ఎంత... అరగంటలో చేసిపారెయ్యనూ!’

తన నేస్తం సుబ్బారావు మేష్టారి కొడుకుతో ఇప్పటిదాకా ఆడిన క్రికెట్‌ మత్తు అంతా వదిలిపోయిందాయనకి.రాత్రిళ్లు దీనికి కలలో కూడా ఆ దిక్కుమాలిన కేకే కనిపిస్తోందో ఏమో...వాళ్లూ వీళ్లని లేదు...అందరినీ అడగడం ప్రయోగాలు చెయ్యడం...ఇపుడు పిజ్జా కూడా చేసేస్తాను అంటోంది.నిజంగా ఈ బాలాత్రిపురసుందరి చేసిన పిజ్జాలు కేకులు తిని మనవలు క్షణం కూడా ఇంట్లో ఉండరు...

ఆవిడ అన్నట్టు అరగంటలోనే ఆయనకి బర్త్‌డేకేకుతోబాటు పిజ్జా తినడంకోసం పిలుపొచ్చింది ...మనసులోనే వెయ్యి దేవుళ్లకి మొక్కుకున్నారు...ఈసారి పిజ్జా అయినా బాగా కుదిరేలా అయినా చెయ్యండి లేకపోతే దాని రుచి  తెలియకుండా నాకు ఒంటిమీద తెలివయినా పోయేలా చెయ్యండి దేవుళ్లారా’అని...దేవుళ్లు రెండోదే తేలికనుకున్నారో ఏమో ఈసారి బాలాత్రిపురసుందరి చేసిన పిజ్జా తిని ఆయనకి స్పృహ తప్పింది.

###

ఢల్లీినుంచి మనవలు వచ్చిన దగ్గరనుంచీ బాలాత్రిపురసుందరమ్మకి రొటీన్‌గా ఉండే మోకాళ్లనొప్పులు, గుండెదడ అన్నీ మాయమైపోయాయి.ఇంతకు ముందు ...తెల్లారి లేచిందగ్గర్నుంచీ రోజెలా గడుస్తుందా అని నిమిషాలు, గంటలు లెక్కపెట్టే  సుబ్బరాజుగారికీ ఇప్పుడు మనవల సందడితో గడియారంలోని రెండుముళ్లూ పోటీపడుతూ పరిగెడుతున్నాయనిపిస్తోంది.

మన ప్రాచీన సంస్కృతీ సౌరభాలను, సంప్రదాయపు విలువలను  ముద్దు ముచ్చట్ల ద్వారా  మనవలకి  అందించ వలసిన సుబ్బరాజు దంపతులు కొడుకులు కూతుళ్ల దగ్గర అటు పట్నాల్లో ఇమడలేక ఇటు పల్లెటూరు వదల్లేక వానప్రస్థ జీవితాన్ని బరువుగా ఈడుస్తున్న దంపతులు.

బామ్మ బాలాత్రిపురసుందరి వంటిల్లు సర్దుకుని వచ్చేదాకా బలవంతాన నిద్ర ఆపుకుని కూర్చున్నారు ఢల్లీి మనవలు బుజ్జితల్లి రోజీ, చిట్టి తండ్రి బాబీ.ఢల్లీిలో తల్లిదండ్రులదగ్గర ఉన్నప్పుడు రాత్రి పదకొండయినా కార్టూన్‌ సినిమాలు చూస్తూ పడుకునేవారే కాదు.కాని ఇక్కడ రోజూ ఎనిమిదయేసరికల్లా బామ్మ  రుచిరుచిగా అన్నీ చేసిపెడుతుంటే నిద్ర ఊపేస్తోంది.కానీ ఇక్కడున్నన్ని రోజులూ రాత్రిళ్లు బామ్మ చెప్పే కథలు వదులుకోవడం ఇష్టం లేదు వాళ్లకి.

‘బామ్మా ఇవాళ అగస్త్యుడి కథ చెప్తానన్నావుగా.’ అంది బుజ్జితల్లి.

మనవలిద్దరినీ చెరోపక్కా కూర్చోబెట్టుకుని అగస్త్యుడి కథను కళ్లకి కట్టినట్టు చెప్పి ‘ అప్పటినుంచీ కూడా ప్రతి తల్లీ తనబిడ్డ అగస్త్యుడి మాదిరిగా తిన్నది అరిగించుకుని దినదినాభివృద్ధి చెందుతూ ఆరోగ్యవంతుడై, ఆయుష్మంతుడై సుఖంగా ఉండాలని కోరుకుంటూ పిల్లలకు ఉగ్గు పాలు పట్టాక వాతాపిజీర్ణం అంటూ బొజ్జ నిమురుతుందన్నమాట.’ అని ముగించింది బామ్మగారు బాలాత్రిపురసుందరమ్మ.

అంతవరకు ఉగ్గబట్టుకుని బామ్మ చెప్పిన కథ విన్న పిల్లలకి అద్భుత లోకంలో విహరించిన అనుభూతి కలిగింది.‘ఎంత మంచి కథ చెప్పావు బామ్మా...’ అన్నాడు తృప్తిగా చిట్టితండ్రి బాబీ.

‘మన పురాణాల నిండా ఇలాంటి మహిమగల ఎందరో ఋషులు ఉన్నారు నాన్నా...’

‘మేం ఢల్లీి తిరిగి వెళ్లేలోగా ఇలాంటి మంచి కథలు, పద్యాలు బోల్డు నేర్పిస్తావుగా...’

ఆ చిన్నారి మనసుల్లో ఏవేవో ఆలోచనలు సుడులు తిరగడం ఆవిడ దృష్టిని దాటిపోలేదు.పిల్లలకి నేరుగా నీతులు చెబితే తలకెక్కవు. కథల రూపంలో అయితే హృదయంలో నాటుకుంటాయని ఆవిడకి అనుభవైకవేద్యం.ఏది ఏమయినా మెత్తని నేలలో విత్తనం త్వరగా నాటుకుంటుంది. ఇక మానవత్వపు మొలకలకు లోటేముంటుంది?

 ‘తప్పకుండాను...ఇంక పడుకోండి నాన్నా..’అంటున్న బామ్మని భయంతో చుట్టేసింది మనవరాలు రోజీ.

‘బామ్మోయ్‌...అదిగో అటుచూడు...నల్లగా.....అక్కడెవరో ....ఉ...న్నా...రు.’

పిల్లలు రాక్షసుల కథ విని భ్రమపడుతున్నారనుకుని ముందు కొట్టిపారేయబోయినా తేరిపారజూసిన ఆవిడకీ ఎవరో అక్కడ ఉన్నట్టే తోచి...గట్టిగా అదిలిస్తూ...‘ఎవరూ...ఎవరది?’అంది.అన్నదేగాని ‘ఏ దొంగ వెధవో’ అని ఆవిడకీ మనసులో భయంతో రక్తం కాస్త గడ్డకట్టుకుపోతున్నట్టయింది.

‘నేనేనే బాలాత్రిపురసుందరీ!’ అన్నారు సుబ్బరాజుగారు  శీర్షాసనంవదిలి సరిగ్గా లేచి నించుంటూ.

బాబీ ముఖంలో ఆశ్చర్యం ‘తా...త...య్య ...తాతయ్య...నువ్వు తిరగేసి ఎలా నించున్నావు?’

‘మీయిల్లు బంగారంగానూ... ఇక్కడున్నది మీరా? అయినా చీకట్లో శీర్షాసనా లేమిటండీ...ఇంకా నయం...ఎవరో దొంగనుకుని నేను రోకలిబండతో నాలుగు వడ్డిస్తే ఏమయ్యేది?’ బాలాత్రిపురసుందరి గదమాయిస్తున్నట్టుగా అంది.

‘రేపు నీ ఢల్లీి మనవలకి నేర్పాలని ఆసనాలను అభ్యాసం చేస్తున్నా!’

 రోజీ, బాబీ... తాతయ్య ఆమాటలంటున్న తీరుకి పకపకా నవ్వారు. సరదాగా

‘ఇప్పుడే నేర్పించు తాతయ్యా...’అన్నారు.

‘తిన్నాక ఆసనాలు వేయకూడదర్రా...దానికీ నియమాలున్నాయి....రేపు నేర్పిస్తాగా..’

‘అయింది చాలుగానీ మీరు భోజనానికి లేవండి.’ పిల్లలకి సన్నటి దుప్పటి కప్పి లేచింది బామ్మగారు.

‘ఏవోయ్‌ బాలాత్రిపురసుందరీ! రేపు నీకు అసలైన పరీక్ష ఉంది గుర్తుందా?’ అన్నారు సుబ్బరాజుగారు మజ్జిగా అన్నంలో ఆవకాయ పెచ్చు నంచుకుంటూ.

‘ఇదిగో ముందే హెచ్చరిస్తున్నా సుమా!నీ కవల మనవలు అసాధ్యులు...రేపు వాళ్ల పుట్టినరోజు.బర్త్‌డే కేకుగానీ చేసి పెట్టకపోయావంటే తెలుసుగా...’తనమీద ప్రయోగాలు తప్పిపోయాయనే ఆయన హుషారు.ఆవిడ ముసిముసిగా నవ్వింది.

‘బ్రహ్మాండంగా చేసి నా మనవలచేత శభాషనిపించకపోతే అప్పుడడగండి.’

‘అదీ చూస్తాగా...’చిదానందంగా ఆయన పీటమీంచి లేచాడు సుబ్బరాజుగారు చెయ్యి కడుక్కోవడానికి.

‘అత్తయ్యా! మీ పట్నం గడుగ్గాయి కవల మనవలతో ఈ వయసులో  వేగడం ఎంత కష్టమో మీకు తెలియదు!మేమే రోజూ ఎన్ని అవస్థలు పడుతున్నామో...వాళ్లకి అన్నాలు అక్కర్లేదు.రోజూ పిజ్జాలు కేకులు ఐసుక్రీములు కావాలి.లేకపోతే ఇల్లుపీకి పందిరేసేస్తారు.ఇక్కడయితే తెల్లవార్లూ నిశాచరుల్లా టీవీ చూస్తారు. బారెడు పొద్దెక్కినా లేవరు. ఇద్దరికీ ఒక్క క్షణం పడి చావదు. ఎప్పుడూ పోటీలు పడుతూ పోట్లాడుకుంటూనే ఉంటారు.మేమిద్దరం ఆఫీసులనుంచి తిరిగి వచ్చేసరికి ఇల్లు రణభూమిలా ఉంటుందంటే నమ్మండి.ఎందుకయినా మంచిది. బర్త్‌డే కేకు ఎలా చెయ్యాలో చెప్తాను గుర్తుపెట్టుకోండి.’అంటూ మనవలు ఇక్కడికి వచ్చే ముందురోజు కోడలు ఫోన్‌లో చెప్పిన కేకు తయారీ విధానమంతా శ్రద్ధగా గుర్తు తెచ్చుకున్న బాలాత్రిపుర సుందరమ్మ  ఆరాత్రి  పడుకునేలోగా బర్త్‌డే కేకు గురించి ఓ బలమైన నిర్ణయానికొచ్చింది.

###      

ఆ సాయంత్రం రోజీ, బాబీ బామ్మ కొంగు పట్టుకుని తిరుగుతున్నట్ట్టుగా వెన్నంటే ఉంటూ ఆవిడ బర్త్‌డే కేకు  ఎలా చేస్తున్నదీ ఆసక్తిగా  గమనిస్తున్నారు.అయినా బాలాత్రిపురసుందరి తెలివిగా తను చేస్తున్న బర్త్‌డే కేకు వాళ్ల కంట పడీ పడకుండా జాగ్రత్త పడుతోంది.అటూ ఇటూ తిరగేస్తూ...ఎర్రగా కాలుతున్న పదార్ధం వాసనకి...బాబీ ముక్కుపుటా లెగరేసి ఉత్సాహంగా అరిచాడు.‘బామ్మా...అబ్బ...ఎంత మంచి వాసన వస్తోందో... దీని పేరు బామ్మ  బర్త్‌డే కేకు...’ రోజీకి కూడా నోట్లో నీళ్లూరాయి.

 బామ్మగారు  వాళ్లనిచూసి నవ్వింది. ‘ఈ బామ్మ బర్త్‌డే కేకు పల్లెటూరిది కదా.చూడ్డానికి ఎలా ఉంటుందో చెప్పుకోండి చూద్దాం’

‘ఎర్రగా ఉండచ్చు...కదా బామ్మా...’ బాబీకి  ముక్కుపుటాలదిరిపోతున్నాయి కమ్మని వాసనకి.

‘హమ్మో...అయితే నీకు మా బర్త్‌డే కేకు చేయడం వచ్చన్నమాట..నీకు బర్త్‌డే కేకుచెయ్యడం వచ్చని తెలిస్తే ఎప్పుడు సెలవులొచ్చినా ఇక్కడికే వచ్చేసేవాళ్లంకదా..మరి అమ్మ అలా చెప్పిందే’ అంటూ రోజీ సంబరపడిపోయింది.

‘బామ్మా ఇంక ఆగలేం  త్వరగా పెట్టెయ్‌...ఆకలి...’అంటూ గంతులెయ్యడం మొదలెట్టాడు బాబీ...

మనవల విన్యాసాలకి అక్కడే ఉన్న సుబ్బరాజుగారికి నవ్వొచ్చింది.‘అదేమిట్రా చిన్నా...ఇందాక నేనడిగితే ఇద్దరూ అసలు ఆకలే లేదన్నారు...వంటింట్లోకి వచ్చేసరికి ఆకలి పరిగెత్తు కొచ్చిందేమిటి?ఏం బాలాత్రిపురసుందరి తల్లీ ఏం మంత్రం వేసావేంటి నీ మనవలకి?’

‘ఆ...అక్కడికి మీ మనవలు కాదన్నట్టు...పదండి మీ పుట్టినరోజుకదర్రా...మన ఊరి పిల్లలందరినీ పిలిచాను. ఆగండి అదిగో పిల్లకాయలందరూ రానే వచ్చేసారు. మీ కేకు మన మండువాలోకి పట్టుకొస్తాను.’ అందావిడ చేతులు తిప్పుతూ.

‘హమ్మయ్య బామ్మా...ఊ రానియ్‌ రానియ్‌...తొరగా...’ పిల్లల ఆరాటానికి ఆవిడకి నవ్వొచ్చింది.

‘ఈ నూనె కుందులేమిటి బామ్మా! కొవ్వొత్తులు పెట్టాలిగా బర్త్‌డే కేకుమీద...’ రెండు పెద్ద కుందుల్లో ఏడేసి పెద్ద వత్తులు వేస్తున్న బామ్మని అడిగింది రోజీ.

‘పిచ్చిపిల్లల్లారా పుట్టినరోజు అంటే దీపాలార్పడం కాదు. దీపాలు వెలిగించాలా. మీకు ఏడేళ్లు కదా అందుకని ఏడేసి వత్తులు తయారు చేసి ఉంచాను.ఇలా రండి ఈ బర్త్‌డే కేకుని చక్కగా ఎలా కొయ్యాలో నేర్పిస్తాను.ఇదిగో బాబీ...ఇద్దరూ ఈ అగరొత్తుతో దీపాలు వెలిగించండి...’ బర్త్‌డే కేకుని నేర్పుగా  అందంగా ముక్కలు చేయించి పిల్లలిద్దరితోబాటు తక్కిన పిల్లలకీ అరటాకుల్లో  పెట్టి, తేనె పోసి ఇచ్చింది.దాని కమ్మని వాసనకి మతులు పోయిన రోజీ, బాబీ ఒక్కసారిగా బర్త్‌డే కేకుమీదకి లంఘించారు.

బాబి దానిని రుచి చూసి ‘బామ్మా...సూపర్‌....ఈ బామ్మబర్త్‌డే కేకు ఎంత బావుందో...’ అంటూ లొట్టలేసాడు.

‘నాకూ నచ్చింది బామ్మా....’ వత్తాసు పలికింది రోజీ.పిల్లలకి ఎప్పుడూ  సిటీలో మేక్‌డొనాల్డ్‌కి వెళ్లి రోజూ తినే కేకులు పిజ్జాకంటే అద్బుతంగా అనిపించింది.వాలుకుర్చీలో పడుకుని ఓరగా మనవల హావభావాలు పరికిస్తున్న సుబ్బరాజుగారు ఆశ్చర్యపోయారు.ఎంతయినా ఈ బాలాత్రిపురసుందరి ఘటికురాలే. కోడలు ఫోన్‌లో చెప్పగానే బర్త్‌డే కేకు  నేర్చేసుకోవడమేకాకుండా సిటీలో బర్త్‌డే కేకుని మరిపించేలా చేసిందంటే....హమ్మో’

‘ఏవోయ్‌ ఇదిగో నాకూ కొంచెం పెట్టకూడదూ!’ ఆయనకీ నోరూరింది పిల్లలు పడిపడీ తినడం చూసి...

‘ముందు వీళ్లని కానివ్వండి. తర్వాత మనిద్దరం తిందాం.’అంది ఆవిడ పిల్లల్ని తృప్తిగా చూస్తూ...గుంభనగా నవ్వుతూ...

‘ఇందులో  రక్త పుష్టి కలిగించే ధాతువుందర్రా...మీలాంటి పిల్లల ఎదుగుదలకి అది ఎంతో అవసరం. ఇంక ఈ తేనె  బలవర్ధకమైన సంపూర్ణ ఆహారం....సర్వరోగ నివారిణి...రెండూ కలిపి తింటే రుచితో బాటు రోగాలూ దరి చేరవన్నమాట.’

‘నిజంగా బామ్మ బర్త్‌డే కేకు సూపర్‌ డూపర్‌ తాతయ్యా...అదిరింది.మా జన్మలో ఇంత టేస్టీ కేకు తినలేదు.’

ఆయన పొంగిపోయాడు.‘ఆగండాగండి...అపుడేనా ...ఇంకా మీ బామ్మ మీకోసం జంతికలు, నువ్వులుండలు, మినపసున్నులు... అరిసెలు... చక్కిలాలు...బొబ్బట్లు...ఆవడలు, మీరు ఢల్లీి  వెళ్లేలోగా మీకు చేసిపెట్టాలని ఎంత లిస్టు తయారు చేసుకుందో...’

‘బామ్మా...నీచేత్తో ఏం   చేసినా చాలా బాగుంటాయని మా డాడీ ఎపుడో చెప్పారులే మాకు...’ రోజీ బామ్మగారికి కితాబిచ్చింది.పెద్దకొడుకు  గుర్తొచ్చి ఆవిడకి కళ్లు చెమ్మగిల్లాయి.కొంగుతో కళ్లద్దుకుని ‘ఏంటో మీరంతా బదిలీల పేరుతో దూరంగా వెళ్లిపోయారుగాని రోజూ చేసిపెట్టేదాన్ని కాదూ!’ అంది.

‘బాధపడకు బామ్మా...ఇకమీదట ప్రతి ఏడూ సెలవులకి ఇక్కడికే వస్తాంగా.’తర్వాత భార్య తనకి పెట్టిన బర్త్‌డే కేకుముక్కని చూసి ఆశ్చర్యంతో నోరు తెరిచాడాయన. ‘హమ్మ బాలాత్రిపురసుందరీ!’

‘మరేంచెయ్యను? ఎంత కిందామీదా పడినా కోడలు చెప్పినట్టు ఆ కేకులు అవీ చెయ్యడం నాకు చేతకాలేదు.అందుకే ఈ బామ్మగారి బర్త్‌డే కేకు చేసి పెట్టాను.’ఆయనకూడా బూర్లెమూకుడులో ఎర్రగా కాల్చిన మినపరొట్టెని...కాదు కాదు బామ్మగారి బర్త్‌డే కేకుని  తేనెలోను, ఆవకాయలోను అటూఇటూ ముంచుకుని తింటూ యాభైయేళ్లుగా అలవాటయిన ఆ కమ్మని రుచిని ఆస్వాదిస్తూ తన్మయత్వంలో కళ్లు మూసుకున్నారు.

‘మరి పిజ్జా మాటేమిటి బాలా త్రిపుర సుందరీ?’ బామ్మని కవ్విస్తున్న తాతగారికి చేతిలోని బొబ్బట్టుని చూపించింది లొట్టలేస్తూ మనవరాలు.‘ఇదిగో ఈ బామ్మ చేసిన పిజ్జా కూడా నాకెంతో మాకెంతో నచ్చేసింది.’

సెలవులయిపోయాక మనవలు ఢల్లీిచేరిన రాత్రే దంపతులకి కోడలినుంచి ఫోనొచ్చింది.‘అత్తయ్యగారూ! ఆ బామ్మగారి బర్త్‌డే కేకు ...బామ్మ పిజ్జా ఎలా చెయ్యాలో చెబుదురూ... పిల్లలిద్దరూ రోజూ అదే చేసిపెట్టమని  నా ప్రాణాలు తోడేస్తున్నారు.’ కోడలి మాటలకి ముసిముసిగా నవ్వుకుంటున్న భార్యను చూసి తనూ శృతి కలిపాడు సుబ్బరాజు.

******

No comments:

Post a Comment

Pages