బంగారు ద్వీపం - 12 - అచ్చంగా తెలుగు

 "బంగారు" ద్వీపం (అనువాద నవల) -12

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton 




@@@@@@@@
(, పడవను దిగాక, సంద్రంలో కొట్టుకొని పోకుండా,  గట్టుపైకి లాగి కడతారు.  తరువాత పిల్లలంతా ద్వీపం చుట్టూ తిరిగి చూడటానికి వెళ్తారు.  ఇంతలో ఉరుములు, మెరుపులతో వాన మొదలవుతుంది. ఊహించిన దాని కన్నా, ముందుగా వాన మొదలై, కడలిలో నీటి అలల ఉధృతి పెరుగుతుంది.  తరువాత......)
@@@@@@@@@@@౨౨

  నిజంగానే అలలు చాలా ఎత్తుకు లేస్తున్నాయి.  వెంటనే వాటిలో వచ్చిన మార్పును చూడటానికి విచిత్రంగా ఉంది.  వేగంగా అవి పొంగి, కొండరాళ్ళను సమీపించగానే విరుచుకుపడి,  దీవి తీరం వెంబడి  పెద్దగా గర్జిస్తూ పరుగులు తీస్తున్నాయి.

  "పడవను యింకా పైకి లాగితే మంచిదని నేను అనుకొంటున్నాను" అకస్మాత్తుగా జార్జి అంది.  "ఇది నిజంగానే చాలా దారుణమైన తుఫాను అవుతుంది.  కొన్నిసార్లు అకస్మాత్తుగా వచ్చే ఈ వేసవి తుఫానులు శీతాకాలం వాటి కన్నా ఘోరంగా ఉంటాయి."

  ఆమె, జూలియన్ ద్వీపంలో పడవను వదిలిన వైపుకి పరిగెత్తారు.  వాళ్ళలా వెళ్ళటం మంచిదే అయింది.  ఎందుకంటే పెద్ద అలలు అప్పటికే పడవ సమీపానికి పరుగులు తీస్తున్నాయి.  ఆ యిద్దరు పిల్లలు పడవను దాదాపుగా చిన్న కొండలా ఉన్న గుట్ట పైకి లాగారు.  జార్జి దాన్ని పచ్చని పూలతో పెరుగుతున్న దృఢమైన పొదకు కట్టేసింది.

  అప్పటికి వాన కురవటం మొదలవటంతో జార్జి, జూలియన్ తడిసిపోయారు. 

 "పైకప్పు, గోడలు ఉన్న ఆ గదిలో మిగిలినవాళ్ళు తెలివిగా తల దాచుకొన్నారని నేను నమ్ముతున్నాను" అంది జార్జి.

  మిగిలిన వాళ్ళు గదిలో ఉన్నారు కానీ చలితోను, భయంతోను ఉన్నట్లు కనిపించారు.  ఆ గదిలో చాలా చీకటిగా ఉంది.  కాకుంటే ఆ గదికి కిటికీల్లా కనిపించే కన్నాలనుంచి,  ముందర ఉన్న చిన్న ప్రవేశద్వారం నుంచి కొద్దిగా కాంతి లోనికి పడుతోంది. 

  "మనకు కొంచెం ఉల్లాసం కలగటానికి మంటను వెలిగించగలమా?" అంటూ  జూలియన్ చుట్టూ చూసాడు.  "మనకు కొన్ని పొడిగా ఉన్న పుల్లలు ఎక్కడ దొరుకుతాయని నేను ఆలోచిస్తున్నాను."

  వారి ప్రశ్నకు సమాధానం యిస్తున్నట్లుగా జాక్డా కాకుల చిన్న గుంపు తుఫానులో ప్రదక్షిణ చేస్తూ గట్టిగా అరుస్తున్నాయి.  "చాక్! చాక్!" 

  "ఆ బురుజు దగ్గర నేల పైన కావలసినన్ని ఎండు పుల్లలు పడి ఉన్నాయి!" జూలియన్ ఉత్సాహంగా అరిచాడు.  "జాక్డాల గూడు ఎక్కడో నీకు తెలుసా?  అవి చాలా పుల్లలను కిందకు పడేసాయి."

    అతను వర్షంలోకి దూకి బురుజు వైపు పరుగెత్తాడు. అతను చేతులనిండా పుల్లలను పట్టుకొని పరుగున  వెనక్కి వచ్చాడు.  

  "మంచిది" చెప్పింది జార్జి.  "మనం వాటితో మంచిగా మంటను వేసుకోగలం.  దాన్ని వెలిగించటానికి ఎవరి దగ్గరైనా కాగితం గానీ,  అగ్గిపుల్లలు గానీ ఉన్నాయా?"

  "నా దగ్గర కొన్ని అగ్గిపుల్లలు ఉన్నాయి" చెప్పాడు జూలియన్.  "కానీ ఎవరి దగ్గరా కాగితం లేదు."

  "అవును" అన్నె హఠాత్తుగా అంది. "శాండ్విచ్ లు కాగితంలోనే చుట్టి ఉన్నాయిగా! ఆ పొట్లాలు విప్పి, ఆ కాగితాన్ని మనం నిప్పు కోసం వాడుకొందాం." 

  "మంచి ఆలోచన" అంది జార్జి.  వాళ్ళు శాండ్విచ్ పొట్లాలు అన్నింటినీ విప్పి,  పరిశుభ్రంగా తుడిచిన ఒక విరిగిన రాతిపలకపై వాటిని సర్దారు. తరువాత ఆ కాగితానికి అడుగున నిప్పు అంటించి, దాని మీద చుట్టూ గజిబిజిగా పుల్లలను పేర్చారు. 

వారు కాగితాన్ని వెలిగించగానే చాలా సరదా అనిపించింది.  పుల్లలు చాలా పాతవి, బాగా ఎండినవి కావటంతో మంట ఒక్కసారిగా చుట్టూ అంటుకొని పైకెగసింది.  వెంటనే శిధిలమైన ఆ చిన్న గదిలో అగ్ని కీలలు నాట్యమాడసాగాయి.  కోట బురుజుని తాకేంత కిందుగా దట్టమైన మేఘాలు వ్యాపించటంతో బయట బాగా చీకటిగా ఉంది!  ఆ మేఘాలు ఎలా పోటీ పడుతున్నాయో!  వాటి వెనుక సముద్ర ఘోషలా గట్టిగా గర్జిస్తూ, గాలి ఆ మేఘాలను ఈశాన్యదిక్కుకు నెట్టేస్తోంది.  

" సముద్రం యింత భయంకరంగా చప్పుడు చేయటం నేనెప్పుడూ వినలేదు" అంది అన్నె.  "ఎప్పుడూ!  ప్రస్తుతం అది తన స్థాయికి మించి గట్టిగా అరుస్తున్నట్లుంది."

  ఆ చిన్న ద్వీపం చుట్టూ గర్జిస్తున్న గాలి శబ్దానికి, విరిగిపడే సముద్ర అలల ఘోష బాగా పెరిగిపోవటంతో, పిల్లలు తమ మాటలను తామే వినలేకపోతున్నారు.  వాళ్ళు ఒకరితో ఒకరు గట్టిగా అరుస్తూ మాట్లాడుకోవలసి వచ్చింది.  

  "మనం తిందాం" విపరీతమైన ఆకలి వేస్తున్న డిక్ గట్టిగా చెప్పాడు.  "ఈ తుఫాను ఉన్నంతసేపు మనం ఏమీ చేయలేము."

  "అవును.  తిందాం" తినుబండారాల వైపు చూసి లొట్టలేస్తూ అంది అన్నె.  "ఈ పాత గది చీకట్లో మంట చుట్టూ కూర్చుని పిక్నిక్ చేసుకోవటం చాలా సరదాగా ఉంది.  ఇక్కడ మనుషులు కూర్చుని భోజనాలు చేసి ఎంతకాలం అయిందో అని ఆలోచిస్తున్నాను.  నేను వాళ్ళను చూడాలని అనుకొంటున్నాను."

"సరె! నాకు అలాంటి కోరికేమీ లేదు" అన్నాడు డిక్.  గతంలో అక్కడ ఉన్నవాళ్ళు ఎవరన్నా తమతో పిక్నిక్కుని పంచుకోవటానికి వస్తారేమో అన్న ఊహతో సగం భయపడుతూ, అతను చుట్టూ చూస్తున్నాడు.  "అలాంటివేవీ జరగకూడదని కోరుకొనే చిత్రమైన రోజు కదూ యిది!"

  శాండ్విచ్ లు తిని అల్లం బీర్ తాగాక, వారికి ఆహ్లాదంగా అనిపించింది.  మరిన్ని పుల్లలు అంటుకోవటంతో మంట యింకా పెద్దదై, చాలా ఆహ్లాదకరమైన వెచ్చదనాన్ని యిస్తోంది.  ప్రస్తుతానికి గాలి బలంగా మారటంతో, ఒక్కసారిగా వాతావరణం బాగా చల్లగా అయిపోయింది.  

  "ఇప్పుడు మనం వెళ్ళి పుల్లలు తెచ్చుకోవాలి" అంది జార్జి.  కానీ ఒంటరిగా వెళ్ళటానికి అన్నె యిష్టపడలేదు.  తను తుఫానులో వెళ్ళటానికి భయపడుతున్నట్లు బయటకు కనిపించకూడదని శాయశక్తులా ఆమె ప్రయత్నిస్తోంది.  భద్రంగా ఉన్న గదినుంచి ఆ తుఫాను, ఉరుముల మధ్యకు వెళ్ళటం ఆమె శక్తికి మించిన పని.

    టింకి కూడా ఆ తుఫాను నచ్చినట్లు లేదు.  ఆ కుక్క జార్జిని అంటిపెట్టుకు కూర్చుని చెవులను రిక్కించి వింటూ, ఉరుము ఉరిమినప్పుడల్లా గుర్రుమని మూలుగుతోంది.  తనకు ఆకలిగా ఉండటం వల్ల, పిల్లలు తమ తిండిలో కొద్దిగా ముక్కలు వేయగానే, అది ఆత్రుతగా వాటిని తిన్నది.  

  పిల్లల దగ్గర తలో నాలుగు బిస్కట్లు ఉన్నాయి.  "నా వాటా టింకి యిచ్చేయాలనుకొంటున్నాను" అంది జార్జి.   "తన కోసం కుక్క బిస్కట్టులను నేను తీసుకురాలేదు.  తనకు బాగా ఆకలేస్తున్నట్లు కనిపిస్తోంది." 

"వద్దు.  అలా చేయొద్దు" జూలియన్ అన్నాడు.  "మనమంతా తలొక బిస్కట్టు దానికి ఇద్దాం.  అప్పుడు తనకు నాలుగు బిస్కట్లు అవుతాయి.  మనందరి దగ్గర యింకా తలొక మూడు ఉంటాయి.  అవి మనకు సరిపోతాయి."

టిం లేచి అందరినీ నాకుతూ వారికి గిలిగింతలు పెట్టింది.  తరువాత అది నేల మీద దొర్లుతూ వీపు మీద పడుకొంటే, జూలియన్ అతన్ని చక్కిలిగింతలు పెట్టాడు.   
 
  పిల్లలంతా ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళి పుల్లలను పట్టుకొచ్చి మంటలో వేస్తూ అది ఆరిపోకుండా చూస్తున్నారు.  చివరగా జూలియన్ వంతు రాగానే, అతను గదిలోనుంచి తుఫానులోకి అదృశ్యమయ్యాడు.  అతను బయట నిలబడి చుట్టూ చూస్తుంటే, వాన అతని తలను తడిపేస్తోంది.  

  ప్రస్తుతం తుఫాను పతాకస్థాయిలో సాగుతోంది.  మెరుపులు అదే పనిగా మెరుస్తూంటే, అదే సమయంలో ఉరుములు విరుచుకు పడుతున్నాయి.  జూలియన్ తుఫానుల గురించి కొంచెం కూడా భయపడే రకం కాదు, కానీ అతను ఈ తుఫానుకి మాత్రం చాలా భయపడ్డాడు.  ఇది చాలా తీవ్రంగా ఉంది.  ప్రతి నిమిషం ఒక మెరుపు వచ్చి ఆకాశాన్ని దాదాపుగా చించేస్తోంది.  ఏవో పర్వతాలు కూలిపోతున్నట్లు భీకరంగా శబ్దం చేస్తూ, ఉరుములు విరుచుకుపడుతున్నాయి. 
 
  ఉరుము శబ్దం ఆగిన వెంటనే సముద్ర ఘోష వినిపిస్తోంది.  అది కూడా వినగానే భయం పుట్టించే స్థాయిలో ఉంది.  సముద్రపు నీటి తుంపర ఉవ్వెత్తున గాలిలోకి లేచి, శిధిలమైన కోట మధ్యలో నిలబడ్డ జూలియన్ని తడిపేస్తోంది.  

  "అలల తీవ్రత ఎలా ఉందో నేను చూడాలి" అనుకొన్నాడా కుర్రాడు.  "నీటి తుంపర యిక్కడ నిలబడ్డ నా వరకు వచ్చిందంటే, వాటి తీవ్రత బ్రహ్మాండంగా ఉండి ఉండాలి!"

అతను కోట బయటకెళ్ళి, ఒకప్పుడు చుట్టూ రక్షణగా కాపు కాసి ప్రస్తుతం కొంతమేర శిధిలమైన కోట గోడను ఎక్కాడు.  అతను దాని మీద నిలబడి విశాలమైన సముద్రం వైపు చూసాడు.  ఎలాంటి అద్భుత దృశ్యం అతని కళ్ళకు కనిపించింది!

  అలలు బూడిద-ఆకుపచ్చల సమ్మిళితమైన గోడలుగా లేచి నిలుచున్నాయి.  అవి ద్వీపం చుట్టూ ఉన్న రాళ్ళపై విరుచుకొని పడుతున్నాయి.  దాని నుంచి నీటి తుంపర పైకి లేచి, తుఫాను కమ్మిన ఆకాశంలో తెల్లని గోడల్లా మెరుస్తున్నాయి.  అవి తీరం వరకు అలాగే కదిలి, దాన్ని బలంగా ఢీ కొడుతున్నాయి.  ఆ భయంకరమైన తాకిడికి తన పాదాల కింద ఉన్న గోడ కంపిస్తున్నట్లు జూలియన్ భ్రమపడ్డాడు. 

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages