చంద్రమణి కోట రహస్యం (అనువాద నవల) - 33
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
ఆంగ్ల మూలం : The moonstone castle mistery
నవలా రచయిత : Carolyn Keene
@@@@@@@@@@
(అకస్మాత్తుగా కందకం వంతెన పైకి లేవటంతో, నాన్సీ, జార్జి మెలికపడ్డ ఆ కందకం వంతెన గొలుసును సరిచేసి, నాన్సీ కారులో ఇవతల పక్కకు వస్తారు. బ్రాస్ కిటిల్ దగ్గర భోజనాలకు వచ్చిన అమ్మాయిలకు , మిస్టర్ సీమన్ ఆ ఊరి శివార్లలో ఉన్న మిసెస్ విల్సన్ అనే వృద్ధమహిళ ఇంట్లో పని చేస్తున్నట్లు తెలుసుకుంటుంది. అక్కడ పరిస్థితులను క్షుణ్ణంగా తెలుసుకున్న నాన్సీ ఆ ప్రాంతానికి వెళ్ళి, శోధించాలనుకుంటుంది. తరువాత......)
@@@@@@@@౨౨౨౨౨
ముగ్గురు అమ్మాయిలు తాము భోజనం చేసి సెలవు తీసుకొంటామని మిసెస్ హేంస్టెడ్ కి చెప్పారు. కుర్చీల్లో కూర్చుని, భోజనానికి ఆర్డరిచ్చిన వెంటనే, బెస్, జార్జి ల వైపు తిరిగి, తమ భోజనమై పోగానే తిన్నగా విల్సన్ యింటికి వెళ్ళదలుచుకొన్నట్లు నాన్సీ చెప్పింది.
సుమారు ఒక గంట తరువాత నాన్సీ తన కారుని విల్సన్ యింటి సమీపానికి నడిపించింది. ఆమె తన కారుని రోడ్డు పక్కన ఉన్న చెట్ల వెనుక దాచాలని నిర్ణయించుకొంది.
"విల్సన్ యింటి వరకు కాలి నడకన వెళ్దాం. మనమెవరమో బయట పడకుండా ఉండటానికి ప్రయత్నిద్దాం" అని ఆమె హెచ్చరించింది.
అదృష్టవశాత్తూ, వాళ్ళ బండి పెట్టిన బాట దగ్గర ఒక మలుపు ఉండటమే గాక, చుట్టూ చెట్ల సముదాయం, గుబురుగా ఉన్న పొదలు ఉన్నాయి.
"చూడండి. సరిపోలని టైరు గుర్తులు. అచ్చం మనం కోట దగ్గర చూసిన వాటిలాగే ఉన్నాయి" అకస్మాత్తుగా జార్జి ఆశ్చర్యాన్ని వ్యక్తపరచింది. వాటిని పరీక్షించటానికి అమ్మాయిలు వంగారు.
మూడు టైర్లకు పొడవైన కమ్మీలు, కానీ కుడి వైపు వెనుక చక్రం మాత్రం వజ్రాల ఆకారాన్ని పోలిన గుర్తులు ఉన్నాయి.
"మనం దేన్నో వెతికే ప్రయత్నంలో ఉన్నాము. సరే!" బెస్ వ్యాఖ్యానించింది. "అయితే మనంతట మనం దొరికిపోయేలా చేయొద్దు."
వాళ్ళు రోడ్డు పక్కన వెతకటం ప్రారంభించారు. ముందుగా ఏదైనా కారు చెట్లు, పొదల చాటున దాచటానికి సిద్ధంగా ఉందేమో చూడాలి. లేదా ఎవరైనా మనిషి కనిపిస్తాడేమో!
వాళ్ళు రోడ్డు మీద నుంచి ఒక యింటి ప్రాంగణంలోకి అడుగుపెట్టే ప్రాంతం వద్దకు చేరుకొన్నారు.
వాళ్ళు కంగారుగా రోడ్డు పక్కకి నడిచి, ఆ దారిలో కారేమైనా వచ్చినా, మనుషులెవరైనా కనపడినా అక్కడున్న చెట్లు, పొదల చాటున నక్కటానికి సిద్ధంగా ఉన్నారు. అలా నడుస్తూ వారు రోడ్డు చివరకు చేరుకొన్నారు. అక్కడనుంచి చెట్ల సమూహాలు అంతమై పొడవైన పచ్చిక బయలు కొంత దూరం విస్తరించి ఉంది.
"అమ్మాయిలూ!" నాన్సీ ఉద్విగ్నతతో మెల్లిగా చెప్పింది. ఆమె తన ఎడమచేతివైపు తిరిగింది. అక్కడకు చంద్రమణి కోట బురుజు స్పష్టంగా కనిపిస్తోంది. "ఎవరైనా యిక్కడ నిలబడితే, ఆ బురుజు నుంచి జేక్ సగ్స్ పంపే సంకేతాలను చూడవచ్చు."
"ఓహ్!" బెస్ చెప్పింది. "నేను చూడాల్సినదంతా చూసాను. ఇక వెనక్కి పోదాం."
"లేదు" నాన్సీ అంది. "ఈసారి మనకు అసలైన క్లూ దొరికింది." ఆమె ఒక చెట్టు వెనుకనుంచి ముందు ఉన్న యింటి తలుపు దగ్గరకు నడిచింది. ధైర్యంగా తలుపుకి ఉన్న యిత్తడి గొళ్ళాన్ని పైకెత్తి తలుపుకేసి కొట్టింది.
@@@@@@@@@@
ఎంత కొట్టినా జవాబు రాకపోయేసరికి, నాన్సీ మరొకసారి ప్రయత్నించింది. అయినా మిసెస్ విల్సన్ యింటి తలుపు తెరవటానికి ఎవరూ రాలేదు.
నిరాశతో వెనుదిరగబోయిన నాన్సీ వద్దకు బెస్ ఆత్రంగా పరుగెత్తుకొచ్చింది. ఆమె యింటికి వెనుక పక్క కొద్ది దూరంలో నిలబడి, కిటికీల వైపు రెప్ప వేయకుండా చూస్తోంది. ప్రస్తుతం తట్టుకోలేని ఉద్విగ్నతతో వాళ్ళ దగ్గర మెల్లిగా గొణిగింది : "ఇంట్లో ఎవరో ఉన్నారు. రెండవ అంతస్తులోని ఒక కిటికీలోంచి మధ్య వయసు స్త్రీ బయటకు తొంగిచూడటం నేను గమనించాను."
"మధ్య వయసా?" జార్జి పునశ్చరణ చేసింది. "ఆమె మిసెస్ విల్సన్ కాగూడదు."
"అది నిజమే!" నాన్సీ ఒప్పుకొంది. "నేను తలుపు కొడుతూంటే, ఆమె ఎందుకు జవాబు యివ్వదు?"
"ఆమెకు చెవుడు ఉందేమో?" జార్జి సందేహాన్ని వ్యక్తపరిచింది.
వెంటనే యింటి గుమ్మం దగ్గర నుంచి యింటి వెనుక వైపు పరుగెత్తి చూసింది. మళ్ళీ ఎవరైనా కిటికీలోంచి తొంగిచూస్తే, తాను స్పష్టంగా ఆ వ్యక్తిని చూడవచ్చు.
ఈలోపున నాన్సీ తలుపుకున్న గొళ్ళాన్ని పట్టుకొని, అదేపనిగా తలుపును తన శక్తి కొద్దీ బాదేయసాగింది. ఎవరూ వచ్చి బదులీయలేదు.
"వాళ్ళు మనలను చూడాలనుకోవటం లేదనటానికి యిదే ఋజువు" బెస్ చెప్పింది.
వాళ్ళు రాకపోవడానికి కారణం పిలవని వాళ్ళు వచ్చారనా, లేక ఎవరినీ యింట్లోకి రానీయకూడదనా? ఇదే అంశంపై ముగ్గురు అమ్మాయిలు చర్చించుకొన్నారు. ఎలాంటి అభిప్రాయానికి వాళ్ళు రాలేకపోయారు.
"మనం వెళ్ళిపోతున్నట్లు ఎందుకు నటించకూడదు?" నాన్సీ అడిగింది. "మనం రోడ్డు మీద కొంత దూరం వెళ్ళి, వెనక్కి తిరిగి చెట్ల మాటు నుంచి తిరిగి వద్దాం."
ముగ్గురు అమ్మాయిలు ఈ పధకాన్ని అనుసరించి పది నిమిషాలు చాటుగా దాక్కున్నారు. దాక్కున్న చోటునుంచి వాళ్ళు ఆ యింటిని స్పష్టంగా చూడగలుగుతున్నారు. వాళ్ళకు కిటికీల దగ్గర ఎవరూ కనబడలేదు, ఎవరూ వచ్చి తలుపు తీయలేదు.
"మనం వెళ్ళిపోవటం మంచిది" అంది బెస్.
"ఇంకా లేదు" అని నాన్సీ అర్ధించింది. "మనం వాళ్ళకు కనిపించకుండా ఆ యింటికి వెళ్ళే మార్గాన్ని చూస్తున్నాను. సాధారణంగా దొంగచాటుగా వినటం నాకు యిష్టం లేదు. కానీ ఈ కేసులో అది సమర్ధనీయమని నేను భావిస్తున్నాను."
యువ గూఢచారి చెట్ల వెనుక నుంచి, పొదల మధ్య నుంచి దారి చేసుకొని, ఒక తెర కట్టిన కిటికీ దగ్గరకు చేరగలిగింది. తెరిచి ఉన్న ఆ కిటికీ, యింటి ముందు తలుపుకి ఎంతో దూరంలో లేదు. ఆమె ఆ కిటికీ కింద చాలీచాలని ప్రాంతంలో సర్దుకొని, కిటికీలోంచి వచ్చే మాటలను వినాలని ప్రయత్నిస్తోంది. అదే సమయంలో రోడ్డు మీద ఒక కారు ఆ యింటి వాకిలి వైపు వస్తోంది.
దాన్ని చూసి ఒక్కసారిగా బెస్ భయంతో వణికిపోయింది. "ఇప్పుడు మనం దొరికిపోతామే!" జార్జి తో అందామె.
"ష్!" ఆమె బంధువు హెచ్చరిస్తూ, బెస్ ని చెట్టు వెనుక గొంతుక్కూర్చునేలా లాగింది. "నాన్సీ కనబడని చోటే నక్కింది. ఎవరూ ఆమెను చూడరని నాకు ఖచ్చితంగా తెలుసు."
కజిన్లిద్దరూ దాక్కున్న ప్రాంతాన్ని కారు దాటి వెళ్తుంటే, దానిలో డ్రైవర్ని వాళ్ళు స్పష్టంగా చూసారు. కారులో అతనొక్కడే ఉన్నాడు. అతను రివర్ హైట్స్ లో నాన్సీని, డీప్ రివర్లో జార్జి ని వెంటపడ్డ వ్యక్తి.
"అతను మననిక్కడ పసికట్టి ఉండొచ్చు" బెస్ ఆందోళనతో అంది. "అదే జరిగితే, నాన్సీ దొరికే వరకూ అతను మనని వేటాడుతాడు!"
జార్జి తన కింద దౌడను చేత్తో పక్కకు నొక్కింది. "అతనలా చేస్తే, మనిద్దరం ఆమెకు సాయం చేయటానికి ముందుకు ఉరుకుదాం!"
ఆ వ్యక్తి తన కారును యింటి ముందు ఆపి, గుమ్మం దగ్గరకు వెళ్ళాడు. అతను తన జేబులోంచి తాళం చెవి తీయటం చూసి యిద్దరు అమ్మాయిలు ఆశ్చర్యపోయారు. తరువాత అతను యింటిలోకి దూరాడు.
ఇదంతా నాన్సీ స్పష్టంగా గమనించింది. అదృష్టవశాత్తూ ఆమె అతని కళ్ళ బడలేదు. అపరిచితుడు యిక్కడ ఉంటున్నాడా అని చకితురాలైంది. అంతేగాక, ఆమె మనసులో మరొక ఆలోచన వచ్చింది. "ఈ మనిషిని తాను ఎక్కడో చూసింది." తానెక్కడ చూసినట్లు అని ఆమె తీవ్రంగా ఆలోచిస్తుండగా, పొంచి ఉన్న ఆమెకు పై గదిలోంచి మాటలు వినిపించాయి.
"రూడీ రాస్పిన్!" మరొక మగ గొంతు ఆశ్చర్యంతో ధ్వనించింది. "పగటిపూట నువ్వు యిక్కడకు ఎందుకొచ్చావు? మన సమావేశాలన్నీ రాత్రిపూటే జరగాలని నిర్ణయించుకొన్నాం కద!"
"ఒమన్! వినండి" రాస్పిన్ అంటున్నాడు, "నాకు ఆదేశాలు యివ్వొద్దు. పరిస్థితులు సరిగా లేవు. ఇక్కడనుంచి మన దుకాణం ఎత్తేయటం మంచిది!"
"ఏమి జరిగింది?" అంటూ స్త్రీ కంఠస్వరం ధ్వనించింది.
రాస్పిన్ సమాధానం చెప్పే లోపే, ఒమన్ అడ్డుకున్నాడు. కానీ అతను మాట్లాడటం ప్రారంభించే లోపునే, ఆడమనిషి అతణ్ణి ఆజ్ఞాపించింది, "బెన్! మీరు మాట్లాడకండి. రూడీ చెప్పేది వినండి."
"క్లారా! నువ్వు సాధించే భార్యవి, గయ్యాళివి" ఒమన్ అసంతృప్తిని వ్యక్తపరిచాడు.
నాన్సీ హృదయం ఉత్సాహంతో కొట్టుమిట్టాడుతోంది. ఒమన్! అమ్మమ్మ హోర్టన్ ఇంట్లో కనుగొనబడ్డ పోస్ట్‌కార్డ్‌లో ఉన్న పేరు! అలాగే బెన్ ఒమన్ కంఠస్వరాన్ని పోల్చిన నాన్సీ అతను ఖచ్చితంగా సీమన్ అని నిర్ధారించింది. అంటే ఆ వ్యక్తి మారుపేరు కూడా వాడుతున్నాడన్నమాట!
రాస్పిన్ చెప్పసాగాడు, "జేక్ సగ్స్ ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అతను నోరు విప్పాడు!"
(సశేషం)
No comments:
Post a Comment