అనసూయ ఆరాటం - 27
చెన్నూరి సుదర్శన్
రజిత కండ్లల్ల నీళ్ళు ఇంకిపోయినై కావచ్చు.. జరిగిందంతా చెప్పినా కండ్లు తడి
కాలేదు.
బుచ్చయ్య,
వీరమ్మలు రెప్పలు కొట్టకుంట రజితనే సూడబట్టిండ్లు.
సుస్మిత
దినాలెల్లినంక.. ములుగుల దుకానం ఆగమైతాందని బుచ్చయ్య.. సంటి పిల్ల తల్లి
ఒక్కదానికి కట్టమైతదని వీరమ్మ.. రమేషు తిరిగి ములుగు వచ్చిండ్లు.
ములుగు
వచ్చినట్టే గాని బుచ్చయ్య పానమంతా రవీందర్ మీదనే కొట్టుకొంటాంది. బిడ్డను
తల్సుకుంట కొడుకు ఇంకా ఎంత ఏడ్తాండో అని మన్సుల మనాది పెట్టుకున్నడు. బైటికి
మాత్రం నాకేమైంది.. బాగనే ఉన్నా అన్నట్టు పనులు సేసుకుంటాండు కాని పని మీద ధ్యాస
తప్పుతాందని సూసేటోల్లకే తెల్తాంది.
గట్లనే బి.పి
గోలీలేసుకునుడు అప్పుడప్పుడు మర్సిపోతాండు.
వీరమ్మ యాది
సేసి.. యాది సేసి గోలీలియాల్సి వత్తాంది.
సుస్మిత నెల
మాసికం దగ్గరికత్తాంది. మల్ల హైద్రాబాదు పోయి వచ్చేలోగ దుకాన్ల ఖాతాలు సొమ్ము
వసూలు చేసుకోవాలని రమేషు, తను పద్దులు సూసుకున్నరు. ములుగు
ఊల్లె కంటే పక్క పల్లెటూల్లల్ల వసూలు కావాల్సిన పైసలే ఎక్కువున్నై. జగ్గన్నగూడెంల
రావాల్సిన బాకీలు మరీ పేరుక పోయినై. ముందుగాల
జగ్గన్నగూడెం పోవాలనుకున్నడు.
అనుకున్న
తెల్లారే పొద్దుగాల్నే తయారై లూనా ఇస్కూటీ మీద జగ్గన్నగూడెం బైలెల్లిండు. బి. పి గోలీ
ఏసుకునుడు మర్సిపోయిండు.
జగ్గన్నగూడెం
ఊరి పొలిమేర వత్తాందనంగ చక్కరచ్చింది. బండి బ్యాలెన్సు తప్పింది. కింద పడ్డడు.
తొవ్వపొంటి
నడ్సుకుంట పోయేటాయన ఉర్కచ్చి బుచ్చయ్య మీద పడ్డ బండి లేబట్టిండు.
“ఎవ్వలయ్యా..నువ్వు” అని అడిగిండు. “నేను కూనంపడ్తలేను”
బుచ్చయ్యకు
కండ్లు తిరుగుతానై.. చక్కరత్తాంది.
“నా పేరు
బుచ్చయ్య. ములుగు మేన్‌రోడ్డు మీద దుకానమున్నది” అని బండి లేపినాయనకు చెప్తాంటే
కండ్లు మూసుక పోయినై.
ఎంత లేపినా
లేత్తలేడు. బండిలేపినాయనకు బగ్గ బుగులైంది.
జగ్గన్నగూడెం
నుండి సైకిలు మోటరు మీద వచ్చేటాయన సూసి ఆగిండు. ఇసయం తెల్సుకున్నడు. సక్కంగ ములుగు
పోయి రమేషుకు సెప్పిండు.
రమేషు ఆగమాగం
దుకానం బందు సేసి కారు కిరాయికి మాట్లాడుకొని బుచ్చయ్య పడ్డ కాడికి పోయిండు. నీల్ల
బాటిల్ల మొత్తం కుమ్మరిచ్చినా బుచ్చయ్య కదలకచ్చిండు.
బుచ్చయ్యను
కార్ల ఎన్క సీట్ల పండపెట్టుకొని ములుగు పైవేటు దవాఖానకు తీస్కచ్చిండ్లు. డాక్టరు
బుచ్చయ్యను కార్లనే పరీచ్చ సేసిండు. తన వల్ల కాదని హైద్రాబాదుకు తీస్క పొమ్మన్నడు.
రమేషు అట్లనే
కార్ల ఇంటికి పోయి రవీందర్‌కు ఫోన్ సేసిండ్లు. రవీందర్ నిమ్స్ దవాఖానకు
తీస్కరాండ్లి.. నేను ఇటునుండి ఇటే వత్త.. అని సెప్పిండు.
వీరమ్మను తీస్కోని అదే కార్ల హైద్రాబాదు పంజగుట్టల ఉన్న నిమ్స్ దవాఖానకు
తీస్కచ్చిండ్లు.
రవీందర్ నాయ్న సూసి బావురుమన్నడు.
బుచ్చయ్య కోమాల ఉన్నడు.. రెండు రోజులు పొతే గాని ఏమీ చెప్పలేమన్నరు.
వారం గడ్సింది. నడినాత్రి బుచ్చయ్య సాస్వతంగ కన్ను మూసిండు.
రవీందర్ సుట్టాలందరికి ఫోన్ సేసిండు. సురేందర్.. ఆదిరెడ్డికి సుత సవాన్ని
ములుగు తీస్కపోతానమని సెప్పిండు.
ములుగు చేరేటాల్లకు పొద్దుగాల ఎనిమిదయ్యింది. పద్మనగర్ కాలనీల ఎవ్వల పొయ్యీ
ఎల్గలేదు.
పదయ్యేటాల్లకు వచ్చేటోల్లంతా వచ్చిండ్లు.
సురేందర్ బస్సుల..ఆదిరెడ్డి, అనసూయను
తీస్కోని కార్ల వచ్చిండు.
దానమయ్యేటాల్లకు పదకొండు దాటింది.
లింగారెడ్డి తోనే దుకానం కళ తప్పిందని.. ఆయన పోయిండు.. వీళ్లకు సుడి
సుట్టుకుందని.. ఊరంత అనుకున్నరు.
***
సుస్మిత
యాడాది మాసికందగ్గరికత్తాంది..
ఊకె ఇంట్లనె
కూకుంటే బిడ్డ మానాది తోని మనిషి ఇదైపోతడని ఏదైనా కంప్యూటర్ కంపెనీల పనిచెయ్యు
మని.. రవీంద్ర ఎంబడి పడ్డది రజిత.
పాత పనికేమో.. సుస్మిత కాలం సేసినప్పుడే.. పాతరేసిండు.
రవీందర్‌కు పాత అలవాటెంబడి పిల్లలకు పాఠాలు సెప్పాలని.. నిర్ణయం
తీసుకున్నడు. దాంట్లో పడితే ధ్యాస మర్లి తోడెం మన్సుకు సాంతి దొర్కుతదనుకున్నడు.
ఉస్మానియా యూనివర్సిటీ ఏరియాల ఒక పైవేటు కోచింగు సెంటర్ల జాయినయ్యిండు.
బి.టెక్. మొదటి సంవత్సరం సదివే పిల్లలకు పాఠాలు సెప్పుడు సురు సేసిండు. పొద్దుగాల
ఇంట్లకెల్లి పోతె పొద్దుమూకి ఇంటికచ్చుడు.. నాత్రంతా రేపు సెప్పెబోయే పాఠాల కోసరం
నోట్సు రాసుకుంట తయారగుడు.
రవీందర్ పనిల పడేటాల్లకు రజిత పానం తోడెం నిమ్మలమైంది.
అవాల నిత్తె వచ్చే యాల్లకు రవీందర్ రాకపోయేటాల్లకు తల్లడం బిల్లడం
కబట్టింది రజిత.
సలికాలం... సాత్ బజేనే బగ్గ చీకటయ్యింది. రజిత తాప, తాపకు బాల్కనీ ముందలకు పోయి సూడబట్టింది. ఇంతల ఫోను మోగేటాల్లకు గజ్జున
వన్కింది. ఉర్కి పోయి ఫోనెత్తింది.
“హలో.. “ అన్నది భయం.. భయంగ.
“అక్కా.. నేను ప్రకాశాన్ని”
“చెప్పురా.. ఏం సంగతులు.. శాన రోజులకి సేత్తానవేంరో ఫోను..
అక్కను మర్సిపోయినావురా..” అనుకోకుండా తన తమ్ముడు ప్రకాశం మాట్లాడేటాల్లకు
తబ్బిబ్బైతాంది రజిత.
“అక్కా నేను సెప్పేది ప్రసాంతంగా ఇను. టెన్సన్ పడకు”
“ఏమైందిరా..”
“బావకు ఆక్సిడెంటయ్యింది. పెద్ద ప్రమాదమేమీ లేదు. దవఖాన్ల
షరీకు సేసినం”
“ఏ దవఖాన.. ఇప్పుడెట్లున్నడు..”
“ఏం ప్రమాదం లేదన్ననా.. కొంచెం తలకు దెబ్బ తాకింది.
బేవోసయ్యిండు. తెల్లారెటల్లకు మల్ల మామూలు మనిషైతడని డాక్టరు సెప్పిండు. నువేం
భయపడకు”
“దవాఖానెక్కడ్నో సెప్పురా.. నేనత్త”
“నువ్వు వచ్చి ఏం సేత్తవ్ సెప్పు. నేనున్న గదా.. కావాలంటే
రేపద్దువుగాని” అని ఫోను పెట్టేసిండు.
అది పబ్లిక్ మాట్లాడే ఫోన్.. మల్ల ప్రకాశంకు ఫోన్ సేద్దామంటే.. ఎట్ల..
ఏమైందో.. ఏమో..! దవఖాన ఎక్కడనో సెప్పక పాయె.. ఎక్కడికని పోదు.. అని
తండ్లాడబట్టింది.
నాత్రంత జాగరణ సేసింది.
తెల్లారటాల్లకే గేటు ముందల ఆంబులెన్సు అగేటాల్లకు రవీందర్‌ను
తీస్కచ్చిండ్లని కిందికి ఉర్కింది.
రవీందర్ శవాన్ని దించబట్టిండ్లు.
కెవ్వున కీకేసింది రజిత. కిందపడబోతాంటే ప్రకాశం పట్టుకున్నడు.
శవాన్ని సల్లంగ ఉండే పెట్టెల పెట్టిచ్చిండు ఆదిరెడ్డి.
రజిత అమాంతం పెట్టె మీద వాలి పోయింది.. చాతంత గుద్దుకుంట.
సెనంల ఫ్లాట్లల్ల ఉన్నోల్లందరికి తెల్సింది. రవీందర్ ఇంట్ల ఒకలెన్క ఒకలు
పోతాంటే.. ఇదేం సాపమో.. అని కండ్ల నీళ్ళు పెట్టుకోబట్టిండ్లు.
“సుజయ్ వచ్చేదాకా ఉంచుదామా అక్కా..” అని ప్రకాశం
అడిగేటాల్లకు ఉంచుదామన్నట్టు తలాడిచ్చింది రజిత. సుజయ్‌కు ఫోన్ సేద్దామని ఇంట్లకు
పోయిండు.
ప్రకాశం అమెరికాకు ఫోను కలిపి మాట్లాడి కిందికి ముఖమేసుకొని వచ్చిండు.
ప్రకాశాన్ని
సూసి “ఏమైంది అంకుల్.. సుజయ్ ఎప్పుడత్తడన్నడు” అని అడిగిండు ఆదిరెడ్డి.
ప్రకాశం తోడెం సేపు తటపాయించిండు.. చెప్పాల్నా ..
వద్దా.. అన్నట్టు. కాని చెప్పక తప్పదని.. “నేను వచ్చి సేసేదేమున్నది. మీరే
కానియ్యుండ్లి. నాకు వచ్చుడు కుదరదు. ప్రాజెక్టు సబ్మిషన్ డేట్ దగ్గరపడ్డది”
అన్నడు.
సావుకాడికి వచ్చినోల్లంత ఇచ్చంత్రపోయిండ్లు.
“నేను ములుక్కు నాత్రే ఫోన్ సేసిన. తోడెం సేపైతే వీరమ్మ
వాల్లు వత్తరు గావచ్చు. వచ్చినంక ఇసారిద్దాం” అన్నడు ఆదిరెడ్డి.
పది గంటల వరకు అనసూయను తీస్కోని ఆదిరెడ్డి తమ్ముడు అనిమిరెడ్డి వచ్చిండు.
వాల్ల ఎన్కాల అన్నట్టే.. వీరమ్మ, రమేషులు ఆటోల
దిగిండ్లు.
వీరమ్మ రాంగనే ఏడ్పులు మరింత పెరిగినై. వీరమ్మకు మోకాలు నొప్పులై సరింగ
నడువత్తలేదు. కాని ఆపతికి నొప్పులు మాయమైనట్టు పెద్దె పెద్ద అంగలేసుకుంటచ్చి
కొడుకు సెవం పెట్టెను అమాంత కావలిచ్చుకున్నది. అనసూయ వీరమ్మ మీద పడి ఏడ్వబట్టింది.
వాతావరణమంతా.. ఏడ్పుల మయమే..
ఆదిరెడ్డి సెవం దానానికి అన్ని ఏర్పాట్లు సేసిండు.
మనుమడు వత్తలేడని తెల్సుకొని.. “నా కొడుక్కు
నేనే నిప్పు పెడ్తా” అని సెప్పింది వీరమ్మ.
ఆ వైసుల కన్న కొడుక్కు నిప్పు పెట్టే గతి ఏ తల్లికీ రావద్దని అనసూయ
దేవునికి మొక్కబట్టింది.
దింపుడు
కల్లం దగ్గర రవీందర్ సెవం సెవుల “కొడుకా రవీందరూ..! కొడుకా రవీందరూ..! నా కొడుకా
రవీందరూ..!” అని పిలుత్తాంటే.. అంతా ఘొల్లుమన్నరు.
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment