అన్నీ మంచి శకునములే… - అచ్చంగా తెలుగు

అన్నీ మంచి శకునములే…

Share This

అన్నీ మంచి శకునములే…

రవిప్రసాద్ 

('అచ్చంగా తెలుగు" 2023 వినాయకచవితి హాస్య కథల  పోటీల్లో రెండవ బహుమతి గెల్చుకున్న కథ)  


బాల్కనీలో కూర్చుని సూర్యాస్తమయాన్ని ఆస్వాదిస్తున్న సుబ్బారావు చేతిలో టీ కప్పు  పెట్టి వెళ్ళిపోయింది అతని భార్య. ఎంతో ఆశతో అందుకున్న ఆ టీని రుచి చూడగానే తన  ఆనందం అంతా ఆవిరైపోయింది. పసుపు వర్ణంలో ఉన్న ఆకాశాన్ని చూస్తూ, ఉసూరుమంటూ లేత పసుపు వర్ణంలో ఉన్న “గ్రీన్ టీ”  తాగుతూ ఉండగా ఇంతలో  ఫోన్ రింగ్ అయింది.

ఫోన్లో అక్క రాధమ్మ ఫోన్ నెంబర్ కనపడగానే ఆనందంతో ఫోన్ లిఫ్ట్ చేశాడు సుబ్బారావు.

"అక్కా ఎలా ఉన్నావ్! అందరూ బాగానే ఉన్నారా? " అని ఇంకా ఏదో చెప్ప బోయే అంతలో. 

"ఆ! నేను బాగానే ఉన్నాను కానీ నువ్వు అర్జెంటుగా మా ఊరుకి రావాలిరా తమ్ముడు" కంగారుగా అంది రాధమ్మ.

ఆ మాటలు విని, " ఏమైంది అక్క అంత కంగారుగా ఉన్నావు, అంతా ఓకేనా" అని ఇంకా ఏదో చెప్పబోతుంటే, "నువ్వు ముందు రారా వచ్చాక అన్ని చెబుతాను" అని ఫోన్ పెట్టేసింది సుబ్బారావు అక్క.

అసలు విషయం చెప్పకండా అలా అర్ధాంతరంగా ఫోన్ పెట్టేటప్పటికి కాళ్ళూ చేతులూ ఆడలేదు సుబ్బారావుకి.

ఇంక ఆలస్యం చేయకుండా వెంటనే కారులో నిడదవోలు బయలుదేరాడు సుబ్బారావు.
ఇంటికి వెళ్లగానే, అక్క భయంతో తలుపు తీసింది.  “ఏమైంది అక్కా అంత అర్జెంటుగా పిలిచావు” అంటూ లోపలికి అడుగు పెట్టాడు సుబ్బారావు. 

“ముందు నువ్వు లోపలికి రారా” అంటూ లోపలికి లాక్కెళ్ళింది రాధమ్మ.  

లోపల తన బావ కనబడక పోయేటప్పటికీ సుబ్బారావుకి కంగారు పడి " ఇంతకీ బావగారు ఏరక్కా" కంగారుగా అడిగాడు. 

“మీ బావగారు బెడ్ రూములో దాక్కున్నారు” చెప్పింది రాధమ్మ. ఆశ్చర్య పోవడం సుబ్బారావు వంతైంది!

“చాలా దూరం నుంచి వచ్చావు ముందు  ఈ టీ తాగు” అని టీ కప్పు చేతికందించింది రాధమ్మ.  ఆ టీ ఘుమ ఘుమలు ముక్కుపుటాలను తాకగానే అసలే "టీ" కరువులో ఉన్న సుబ్బారావు కి ప్రాణం లేచి వచ్చింది.  టీ తాగడం మొదలు పెట్టగానే ఎప్పుడో చచ్చుబడిపోయిన నవనాడులన్నీ శక్తిని పుంజుకొని మెదడు ఉత్తేజితం అయ్యింది.

"ఇప్పుడు చెప్పు ఎం జరిగిందో " అడిగాడు సుబ్బారావు.    

“ఊరికి దూరంగా ఉన్నా ప్రశాంతంగా ఉంటుందని ఈ ఇల్లు కొనుక్కున్నామా! ప్రశాంతత లేకపోగా ఇప్పుడు అదే పెద్ద శాపం అయ్యింది.మా పక్కింట్లో వెంకట రెడ్డి అనే పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి ఉంటాడు. ఇంట్లోనే అతని ఆఫీస్ కూడాను.  మహా చాదస్తుడు అనుకో, ప్రతీ పనికీ శకునాలు చూస్తాడు. దానికి తోడు మహా కోపిష్టి, హై బీపీ పేషంటూ. చీటికీ మాటికీ అందరి మీదా అరుస్తాడు”. 

“అయితే దానికీ బావ దాక్కోవడానికీ సంబంధం ఏమిటే” అడిగాడు సుబ్బారావు.

“ఏమి చెప్పనురా తమ్ముడూ! ఈ కొత్త ఇంటికి వచ్చినప్పటినుండి మీ బావకి  ఒకటే తుమ్ములు. ఒక్కసారి మొదలయ్యాయా అంటే ఆగకుండా కనీసంలో కనీసం నాలుగైదు తుమ్ములు వరసగా తుమ్ముతారు. పైగా అయన తుమ్మితే బ్రహ్మాండం బద్దలయ్యిందా అన్నట్టు తుమ్ముతారు. చెప్పుకుంటే సిగ్గు చేటు. ఇక్కడికి వచ్చిన కొత్తలో అయితే ఈయన  తుమ్మినప్పుడల్లా మాకు ఏమయ్యిందో అని చుట్టుపక్కల వాళ్ళు వచ్చి చూసి పోయేవారు. సిగ్గుతో తలెత్తుకోలేక పోయేదాన్నంటే నమ్ము.  ఈ కొత్త ఇల్లు పెయింట్లు పడకో ఏమో, ఈ మధ్య అదే పనిగా తుమ్ముతున్నారు.  రాను రాను ఈ పక్కింటి వాళ్ళు కూడా మాట్లాడ్డం కూడా మానేశారు. వాళ్ళ పనమ్మాయి చెప్పితేనే కానీ మాకు అసలు విషయం బోధపడలేదు. పక్కింటాయన లావాదేవీలు చేసినప్పుడల్లా ఈయన తుమ్మడం, ఆ లావాదేవీలు ఆగిపోవడంతో, ఈయన తుమ్ము వాళ్ళ ఇంటిలో చెడు శకునం అయికూర్చుందట. మొన్నటికి మొన్న సరిగ్గా అయన కూతురుకి తాంబూలాలు ఇచ్చుకున్నప్పుడు ఈయన తుమ్ము వినబడిందట. ఆ తరువాత ఆ సంబంధం తప్పి పోయిందట.. ఇలా ఒకటా రెండా అడుగడుగునా ఈయన తుమ్ములతో నష్టపోయి అయన బెంగపడి మంచాన పడ్డాడట. 

ఇది తెలిసి మాకు కూడా బాధ అనిపించి ఈయన్ని డాక్టర్ కి చూపిస్తే, ఏవో మందులు ఇచ్చాడు కొన్నాళ్ళు తగ్గాయి. ఎదో వాళ్ళ ఆవిడతో నాకు పరిచయం ఉండబట్టి వాళ్ళకి  ఏదో సర్ది చెప్పాను.  

అంతా సర్దుకుంది  అనుకునే సమయంలో వాళ్ళు మృత్యుంజయ హోమం చేయించడం, ఆ హోమం పొగ మా ఇంటిలోకి వచ్చి ఆ ఘాటుకి మరలా ఈయనికి తుమ్ములు మొదలయ్యాయి. అదేం ఖర్మో ఏమో సరిగ్గా అదే సమయానికి ఆ వెంకటరెడ్డిని పూజారులు "శతమానం భవతి" అని దీవిస్తున్నారట. అంతే ఈయనగారి తుమ్ములు విని అతనికి బీపీ పెరిగి హాస్పటిల్ లో జాయిన్ అయ్యాడట. 

వాళ్ళ అబ్బాయి అసలే రౌడీ వెదవ. మన ఇంటికి వచ్చి నానా రభస చేసి వెళ్ళాడు. మా నాయనకి ఏదైనా అయితే మీరిద్దరూ ఎలా బతికి బట్టకడతారో చూస్తా అంటూ వార్నింగ్ కూడా ఇచ్చి వెళ్ళాడు. అదిగో అప్పటినుండి మీ బావ  ఆ బెడ్ రూమ్ దాటి వస్తే ఒట్టు!. నాకూ ఏమి చేయాలో పాలు పోక నీకు ఫోన్ చేసాను!. ఈ గండం నుండి నువ్వే బయట పడెయ్యాలిరా తమ్ముడూ” అంటూ అసలు రహస్యం చెప్పింది రాధమ్మ.

"పోనీ ఇద్దరూ ఏ టాక్సీ పట్టుకుని నా దగ్గిరకే వచ్చేలేకపోయారా" అన్నాడు సుబ్బారావు 
"ఆ రౌడీ చచ్చినోడు మా మీద కక్షగట్టి గడప దాటి బయటకు అడుగు పెట్టకూడదు అనే హుకుం కూడా జారీ చేసాడు. మన ఇంటి చుట్టూ వాడి మనుషులే. అదిగో అప్పటినుండి మీ బావగారు 104 డిగ్రీలు జ్వరం వచ్చిన వాడిలా వణుకుతూ ఆ బెడ్ రూములో దాక్కున్నారు. నేనేమో హాస్పిటల్ లో ఉన్న ముసలాయన క్షేమంగా ఉండాలని మొక్కని దేవుడు లేడు" అంది దీనంగా రాధమ్మ. 

"అయినా నా తుమ్ము వాడి చావుకి, వాడి మృత్యంజయ హోమం నా చావుకొస్తుందని అనుకున్నానా" అంటూ బెడ్ రూములోంచి మెల్లగా బయటకు వచ్చారు సుబ్బారావు బావ కృష్ణారావు. 


"హమ్మ బావా!  తుమ్ముకి కూడా ఇంత దమ్ముంటుందని ఇప్పుడే తెలిసింది. అయినా బావా అంత గట్టిగా తుమ్మకపోతే మెల్లగా తుమ్ముకోవచ్చుగా ఈ గొడవేమీ ఉండేదికాదు" అన్నాడు సుబ్బారావు. 

"బాగుంది వరస ఆయనే ఉంటె బోడి గుండెందుకని, ఆపుకోలేకే కదా. అప్పటికీ ఇంటిలో ఉన్నప్పుడు సౌండ్ ప్రూఫ్ గా ఉంటుందని హెల్మెట్ పెట్టుకునే తుమ్ముతున్నాను. కానీ అన్నివేళలా అదే పెట్టుకుని తిరగలేము కదా! అయినా నాకేం తెలుసు, పక్కింటి వెంకటరెడ్డిది తుమ్మితే ఊడిపోయే ప్రాణమని" అన్నాడు కృష్ణారావు.

"ఇదిగో ఈ వితండవాదంతోటే ఇంటిదాకా తెచ్చుకున్నారు. ఈయనతో ఒక సినిమాకి వెళ్లాలన్నా, షికారుకెళ్లాలన్నా ఎక్కడ తుమ్ముతారో అని భయం. ఈయన తుమ్ము విని జడుసుకొని చచ్చేవాళ్ళు కొందరైతే, మేమేదో గోడపడుతున్నాము  అనుకుంటూ సర్ది చెప్పడానికి వచ్చేవాళ్ళు కొందరు. ఇంకా శుభకార్యాల మాటంటావా, ఏ తాళి కట్టేటప్పుడు తుమ్ముతారో అని భయం. నువ్వే ఎలాగో ఈ గండం నుంచి గట్టెక్కించాలిరా తమ్ముడూ" అని దీర్గాలు తీశారు రాధమ్మగారు. 

అంతా విని దీర్ఘంగా నిట్టూర్చి ఎదో ఉపాయం తట్టినట్టు  “సరే ఎవరైనా వచ్చి అడిగితె నేను మీకు స్నేహితుడనే చెప్పండి” అన్నాడు సుబ్బారావు. ఇంతలో ఎవరో అదేపనిగా కాలింగ్ బెల్ నొక్కడంతో తలుపు తీసి చూసాడు సుబ్బారావు. 

పెద్ద పెద్ద మీసాలతో మాడిపోయిన పనసకాయలాంటి గంట్లు మొహంతో భీకరంగా నిలుచున్నాడు వెంకటరెడ్డి కొడుకు అచ్చిరెడ్డి. 

"ఎవడ్రా నువ్వు ఈళ్ళకి చుట్టానివా...అయితే నీకు కూడా మూడినట్టే" అన్నాడు అచ్చిరెడ్డి. 

"అబ్బే నేను వీళ్ళ స్నేహితుడికి స్నేహితుడినండి. దూరపు స్నేహితుడినండి. నేనో కొత్త వ్యాపారం పెట్టాను.  కృష్ణారావుగారి చేయి చాలా మంచిదని అయన చేత్తోనే  ప్రారంభించాలని అడగడానికి వచ్చానండి" అన్నాడు సుబ్బారావ్. 

 "ఈయనా! ఈయన శకునం గురించి ఇంకా నీకు తెలీదు అనుకుంటా. శని గ్రహాన్ని మించిన చెడ్డ శకునం.  ఈయన తుమ్ము చాలు నీ వ్యాపారం ఆరిపోవడానికి. మేం ఎంత నష్టపోయామో నీకేం తెలుసు"  అన్నాడు అచ్చిరెడ్డి. 

"ఓహ్ అదా! మొదట్లో నేను కూడా ఈయన తుమ్ము అపశకునం అనుకున్నాను. కానీ ఆలోచిస్తే జరిగినవన్నీ నా మంచికే అని తరువాత తెలిసింది. అప్పటినుంచి అన్నీ మంచే జరుగుతున్నాయి. మీరు కూడా కొంచెం ఆలోచిస్తే..... " భయం భయం గానే ఓ సలహా పారేసాడు సుబ్బారావు. 

వెంటనే అచ్చిరెడ్డి పక్కన ఉన్న అతని అనుచరుడు "అవును అన్నా! అయ్యగారు ఈరోజు ఎక్కవలసిన యాత్రా బస్సుకి పెద్ద ఆక్సిడెంట్ అయ్యిందట. ఆ బస్సులో ఉన్నాళ్లందరూ పోయారట. అన్నీ బాగుంటే అయ్యగారు ఆ బస్సులో ప్రయాణం చేయవల్సిన వారే కదా" చెవిలో చెప్పాడు.

"ఏందిరా గంగులూ" ఆశ్చర్యంగా అన్నాడు అచ్చిరెడ్డి. 


చీకట్లో వేసిన బాణం బాగానే తగిలింది అనుకున్న సుబ్బారావు వెంటనే అందుకుని "నేను చెప్పానా .. ప్రతీదీ మన మంచికే జరుగుతుంది” అన్నాడు. 

"మరి మా చెల్లి పెళ్లి తప్పిపోయింది దానికేమంటావ్" అన్నాడు అచ్చిరెడ్డి. 

"ఏమో దానివల్ల మీ చెల్లికి ఏమి ప్రమాదం తప్పిందో, ఎవరికి తెలుసు. అదికూడా తొందర్లోనే మీకు తెలుస్తుంది. పైగా ఈయన దేవీ ఉపాసకుడు. ఈయన్ని భాదపెడితే ఆ ఉసురు పిల్లలకు తప్పకుండా తగులుతుంది" అన్నాడు సెంటిమెంట్ బాణం వదులుతూ.

సుబ్బారావు మాటలకి నమ్మకం కుదిరిన అచ్చిరెడ్డి ఏమి మాట్లాడాలో తెలీక అక్కడి నుండి వెళ్ళిపోయాడు. 

కాసేపటికి వెంకటరెడ్డి కూడా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేసాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  

అందరూ కబుర్లు చెప్పుకుంటూ ఉండగా మరలా కాలింగ్ బెల్ మోగింది.

రాధమ్మ గారు భయంతో తలుపు తీశారు. వెంకట రెడ్డి భార్య, కొడుకు కోడలు గుమ్మంలో నించున్నారు. 

రాధమ్మ భయంతో వణికి పోతుంటే వెనుకే సుబ్బారావు వచ్చాడు. 

వెంకట రెడ్డి భార్య అలివేణి మాట్లాడుతూ "రాధమ్మగారూ మమ్మలిని క్షమించండి. అన్నయ్యగారి తుమ్ము అపశకునం అనుకున్నాం గాని మమ్మలిని ఆపదలనుండి రక్షించింది అనుకోలేదు. ఈ రోజు మా అయన ఆ బస్సులో వెళ్లక పోబట్టి నా పసుపు కుంకాలు ఇంకా నిలబడ్డాయి" అంటూ తన వెంట తెచ్చిన కానుకలను అందివ్వపోతే అందరినీ లోపలికి ఆహ్వానించింది రాధమ్మ గారు.  

ధైర్యం తెచ్చుకున్న కృష్ణారావు గారు సుబ్బారావు ఆడిన అబద్దం నిజం చేస్తూ దేవీ ఉపాసకుడిలా తన వేషం మార్చుకుని వాళ్ళ ముందుకు రాగానే అందరూ అయన కాళ్ళమీద సాష్టాంగ పడ్డారు. తనలో తానే నవ్వుకున్నాడు సుబ్బారావు. పక్కింటి వాళ్ళు పెట్టిన భయం వల్లో ఏమో కృష్ణారావు గారికి తుమ్ములు కూడా ఆగిపోయాయి. 

అందరూ వెళ్ళిపోయాక "ఒరేయ్ తమ్ముడూ, ఆ అచ్చిరెడ్డిని చూడగానే అన్ని అబద్దాలు అతికినట్టు ఎలా చెప్పావురా" ఆశ్చర్యపోతూ అడిగారు రాధమ్మ. 

“నేను మీ ఇంటికి వచ్చేటప్పడు మీ వీధి చివర కిళ్ళి బడ్డీ దగ్గర ఆగాను. అప్పుడు అచ్చిరెడ్డి మనుషులు మాట్లాడుకున్నవి విన్నాను. ఇంటికి వచ్చిన తరువాత నువ్వు కూడా చెప్పింది విన్నాక అలా అప్పటికప్పుడు నాకు తోచింది చెప్పానంతే! మన అదృష్టం కొద్దీ మనం చీకట్లో వేసిన బాణం తగిలింది. ఇక స్వేచ్ఛగా, నిస్సంకోచంగా బావ తుమ్ముకోవచ్చు. ఇక అన్నీ మంచి శకునాలే” అని సుబ్బారావు అన్నాడో లేదో కృష్ణారావు మరలా గట్టిగా తుమ్మాడు. అంతే మరలా అక్కడ నవ్వులు వెల్లివిరిసాయి.

 ****  

No comments:

Post a Comment

Pages