బంగారు ద్వీపం - అనువాద నవల- 13వ భాగం - అచ్చంగా తెలుగు

బంగారు ద్వీపం - అనువాద నవల- 13వ భాగం

Share This

"బంగారు" ద్వీపం (అనువాద నవల) -13

అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton 


(తుఫాను మొదలైనదని గ్రహించిన పిల్లలు పడవను ఒక గుట్టపైకి లాగుతారు.  కోడలోఒక చీకటి గదిలో కూర్చున్న వాళ్ళు కాంతి, వెచ్చదనాల కోసం మంటను వెలిగించి, భోజనాలు ముగిస్తారు. మంట తగ్గిపోవడం గమనించి వంతుల వారీగా బయటకు వెళ్ళి, పుల్లలు ఏరి తెస్తారు. తన వంతు రాగానే బయటకు వెళ్ళిన జూలియన్ శిధిలమైన కోట గోడనెక్కి కల్లోలమైన సముద్రాన్ని చూస్తుంటాడు.  తరువాత........)
@@@@@@@@@@@@

భయంకరమైన తాకిడికి తన పాదాల కింద ఉన్న గోడ కంపిస్తున్నట్లు జూలియన్ భ్రమ పొందాడు.  సముద్రాన్ని తదేకంగా చూస్తున్న కుర్రాడికి. తను చూస్తున్న అద్భుత దృశ్యానికి అబ్బురపడ్డాడు.  ఆ సముద్రం ఈ ద్వీపాన్ని పూర్తిగా కబళించేస్తుందా అని ఒక అర క్షణం పాటు అతను ఆశ్చర్యపోయాడు! అలా జరగదని అతనికి బాగా తెలుసు.  ఎందుకంటే నిత్యం తుఫానుల తాకిడికి లోనయ్యే దీవి ఎప్పుడో సముద్రంలో కలిసిపోయేది.  తీరాన్ని బలంగా తాకుతున్న భారీ అలలను చూస్తున్న అతని కళ్ళకు ఏదో వస్తువు  విచిత్రంగా కనిపించింది.

అలలు, కొండరాళ్ళే కాకుండా ఆ సముద్రంలో ఏదో వస్తువు ఉంది.  నల్లగా, పెద్దగా, చెలరేగుతున్న అలల మధ్యన పక్కకు ఒరిగిపోతూ, తిరిగి స్థిరంగా నిలబడుతూ అతనికి కనిపించింది.  అదేమై ఉండొచ్చు?

"అది ఓడ కాదు" జూలియన్ తనలో అనుకొన్నాడు.  అతని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది.  నీటి తుంపర, వాన మధ్యలో నుంచి దాన్ని చూస్తూంటే, కళ్ళు నొప్పి పెడుతున్నాయి.

"కానీ దాని వాలకాన్ని చూస్తూంటే, మిగిలినవాటి కన్నా ఓడలాగే కనిపిస్తోంది.  అది ఓడ కాగూడదనే నేను ఆశిస్తున్నాను.  ఈ భయంకరమైన రోజున ఎవరైనా దానిలోంచి బయటపడటం అసాధ్యం."

  అతను కొద్దిసేపు అలాగే నిలబడి చూసాడు. ఆ నల్లని ఆకారం కళ్ళముందుకి వచ్చి తిరిగి మాయమౌతోంది.   జూలియన్ వెళ్లి ఇతరులకు చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అతను మంట ఉన్న గదికి తిరిగి పరిగెత్తాడు. 

  "జార్జి! డిక్! ద్వీపానికి అవతల ఉన్న రాళ్ళపై ఏదో ఉంది" తారాస్థాయిలో అరుస్తూ చెప్పాడతను.  "అది ఓడలాగ కనిపిస్తోంది, కానీ అది కాకపోవచ్చు.  వచ్చి చూడండి!"

  మిగిలిన వాళ్ళు అతన్ని తెల్లబోయి చూస్తూ, ఒక్కుదుటున లేచి నిలబడ్డారు. జార్జి మంట ఆరిపోకుండా ఉండటానికి కంగారుగా కొన్ని కట్టెలను మంటలో వేసింది.  ఆపైన ఆమె, మిగిలినవాళ్ళు జూలియన్ వెనుక వర్షంలోకి వెళ్ళారు.  

తుఫాను ఇప్పుడు కొంచెం తగ్గినట్లు అనిపించింది. వర్షం అంత జోరుగా పడటంలేదు. ఉరుములు అంతగా లేవు, మెరుపులు కూడా అంత తరచుగా మెరవటం లేదు. జూలియన్ సముద్రంలోకి చూడటానికి తాను ఎక్కిన గోడ వద్దకు వెళ్ళాడు.   

   అందరూ సముద్రం వైపు చూసేందుకు పైకి ఎక్కారు.  విపరీతమైన కుదుపులతో బయటపడ్డ బూడిద-ఆకుపచ్చ వర్ణపు సముద్రపు నాచుతో కలిసి ఉవ్వెత్తున  లేస్తున్న అలలే వాళ్ళకు ప్రతీచోట కనిపిస్తున్నాయి.  ఆ కెరటాల పైభాగం అడ్డు వచ్చిన కొండరాళ్ళను ఢీకొని విరిగిపోతుంటే,  అవి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని మింగేయాలని ద్వీపం వైపు పరుగులు తీస్తున్నాయి. అన్నె అప్రయత్నంగా జూలియన్ చేతిని పట్టుకొంది.   ఆమె మిగిలినవాళ్ళ కన్నా ఎక్కువగా భయపడింది. 

"నువ్వు బాగానే ఉన్నావు అన్నె!" జూలియన్ గట్టిగా అన్నాడు.  "ఇప్పుడు చూడు-ఒక్క నిమిషంలో నువ్వొక చమత్కారాన్ని చూడబోతున్నావు." 

  వాళ్ళంతా ఆసక్తిగా చూస్తున్నారు.  మొదట్లో వారికేమీ కనిపించలేదు.  అలలు బాగా ఎత్తుగా లేవటంతో, దాని వెనకాల ఏముందో కనిపించకుండా దాస్తున్నాయి.  అకస్మాత్తుగా జూలియన్ మాటల్లోని అంతరార్ధం ఏమిటో జార్జి చూసింది.  

  "అంతా వాడి దయ!" అంటూ కంగారుగా అరిచింది.  "అది ఒక ఓడ! అవును! అదే! అది కొండకు కొట్టుకొని నాశనమవుతుందా? అది ఒక పెద్ద ఓడ!  అది మామూలు పడవ కాదు.  చేపలను పట్టే దొన్నె కూడా కాదు."  

  "అయ్యో! అందులో ఎవరైనా ఉన్నారా?" అన్నెకి ఏడుపొచ్చింది.

   నలుగురు పిల్లలు దాన్ని చూసారు.  విశాలమైన సముద్రంలో ఎగిసిపడే అలల మధ్య కొట్టుమిట్టాడుతున్న నల్లని ఆకారాన్ని చూసి టిం మొరగసాగింది.  సముద్రం ఓడను తీరానికి దగ్గరగా తీసుకొచ్చింది.  

  "అది ఆ రాళ్ళను గుద్దుకోబోతోంది" అకస్మాత్తుగా జూలియన్ అన్నాడు.  "చూడండి.  అటువైపే అది వెళ్తోంది."

  అతను చెబుతుండగానే బలంగా గుద్దుకొన్న శబ్దం, దాని వెనుకనే బద్దలైన చప్పుడు వినిపించాయి.  ఓడలా కనిపిస్తున్న ఆ నల్లని ఆకారం, ఆ దీవి నైఋతి దిక్కున ఉన్న ప్రమాదకరమైన కొండరాళ్ళ సూది మొనలపై స్థిరపడింది.  పెద్దగా ఉన్న అలలు దాని కింద దూరటంతో, అది మరింత ముందుకు కదిలి మరింత ఎత్తైన రాళ్ళపైకి చేరింది.  

  "అది అక్కడ చిక్కుకుంది" అన్నాడు జూలియన్.  "అది యింక కదలదు.  త్వరలోనే సముద్రపు నీరు కిందకు తగ్గుతుంది.  దానితో ఆ ఓడ రాళ్ళ మధ్యన కదలకుండా పడి ఉంటుంది."

     అతనిలా చెబుతుండగా, ఒక సన్నని సూర్యకిరణం పలచబడ్డ మేఘాల మధ్య సందులోంచి బయటకొచ్చింది.   ఆ కిరణం అంతలోనే మాయమైంది.  "మంచిది" పైకి చూస్తూ అన్నాడు డిక్.  "సూర్యుడు త్వరలోనే మళ్ళీ బయటికి వస్తాడు, ఆ ఎండలో మనం , వానలో తడిసిన మనల్ని ఆరబెట్టుకోవచ్చు.  ఆ దురదృష్టకరమైన ఓడ వివరాలను తెలుసుకోవచ్చు.  ఓ జూలియన్!  ఆ ఓడలో ఎవరూ లేరనే నేను నమ్ముతున్నాను.  వాళ్ళంతా ఎప్పుడో దానిలోనుంచి దిగిపోయి పడవల్లో ఎక్కి, దగ్గరలో ఉన్న తీరానికి చేరుకొని ఉంటారు."

    మేఘాలు మరింత పలచబడ్డాయి.  గాలి కూడా గర్జించటం మానేసి సాధారణ స్థాయికి పడిపోయింది.  సూర్యుడు ఎక్కువసేపు కాంతిని వెదజల్లాడు.  పిల్లలు దాని వెచ్చదనాన్ని అనుభవించారు.  వాళ్ళంతా కొడరాళ్ళపై ఉన్న ఓడ వైపు చూసారు.  సూర్యకాంతి దానిపై పడి మెరుస్తూ కనిపించింది.  

  "ఏది ఏమైనా, అది ఏదో విచిత్రంగా కనిపిస్తోంది" జూలియన్ గొణిగినట్లు చెప్పాడు.  "ఏదో భయంకరంగానే కనిపిస్తోంది.  ఇలాంటి ఓడను యింతవరకూ నేను చూడలేదు."

  కన్నార్పకుండా దానినే చూస్తున్న జార్జి కళ్ళలో అసాధారణ భావమేదో తొణికిసలాడింది.  ఆమె ముగ్గురు పిల్లల వైపు తిరిగింది. ఆమె నీలి కళ్ళలో ప్రకాశవంతమైన మెరుపును చూసి వారు ఆశ్చర్యపోయారు. ఆమె నోట మాట రానంత ఉద్వేగంలో ఉంది.  

  "ఏమిటది?" ఆమె చేతిని పట్టుకొని జూలియన్ అడిగాడు.  

   "జూలియన్! ఓ జూలియన్!  అది శిధిలమైన మా ఓడే!" ఆమెలో ఉత్సాహం ఉరకలెత్తింది. "ఏమి జరిగిందో మీరు చూడలేదా! సముద్రపు అడుగున ఉన్న ఓడను  పైకి ఎత్తి, ఈ తుఫాను ఆ రాళ్ళపై ఉంచింది.  ఇది శిధిలమైన మా ఓడే!"

   ఆమె చెప్పింది నిజమేనని మిగిలిన వాళ్ళకు రూఢి అయింది.  అది శిధిలమైన పాత ఓడే!  దానిలో ఆశ్చర్యపోవలసినది ఏమీ లేదు.  అది చాలా పాతదానిలా, నల్లగా ఉంది. దాని వింత ఆకారానికి ఆశ్చర్యపోనక్కర్లేదు.  సముద్రపు అడుగున పడి ఉన్న శిధిలమైన ఆ ఓడ బాగా పైకి ఎత్తబడి, సమీపంలో ఉన్న రాళ్ళపై ఉంచబడింది.  

  "జార్జి! మనం యిప్పుడు పడవలో వెళ్ళి  శిధిలమైన ఆ ఓడ లోపలకు చేరుకోగలము" జూలియన్ అరిచాడు.  "అంతేగాక దానిని ఆ చివరి నుంచి ఈ చివరకు  పూర్తిగా శోధించగలం.  బంగారం ఉన్న పెట్టెలను కనుక్కోగలం కూడా!  ఓహ్ జార్జ్!"

కొద్ది క్షణాలు నలుగురు పిల్లలు ఆశ్చర్యంలో ములిగిపోయారు.  ఉద్వేగంలో ఉన్న వారికి ఒకటి, రెండు నిమిషాలు నోటమ్మట మాట కూడా రాలేదు.  వాళ్ళు శిధిలమైన నల్లని ఓడ స్థూలరూపాన్ని చూస్తూ, దానిలో తాము ఏమి కనుక్కోబోతున్నారో ఎవరికి వాళ్ళు ఊహించుకొంటున్నారు.  ఉన్నట్లుండి పక్కనున్న జార్జి చేతిని పట్టుకొని జూలియన్ నొక్కాడు.

  "ఇది అద్భుతం కదా?" అడిగాడతను.  "ఓ జార్జ్! ఇది అసాధారణమైన సంఘటన కాదంటావా?"

  దానికి జార్జి బదులేమీ యివ్వలేదు.  కన్నార్పకుండా శిధిలమైన ఆ ఓడ వైపే చూస్తోంది.  ఆమె మనసులో అన్ని రకాల ఆలోచనలు పరుగుదీసాయి.  కొద్ది క్షణాలయ్యాక ఆమె జూలియన్ వైపు తిరిగింది.

  "ఈ శిధిలమైన ఓడ యిప్పటికీ నాదే, అయితే ప్రస్తుతం అది సముద్రంలోనుంచి పైకి విసరివేయబడింది!" అందామె.  

"పోగొట్టుకొన్న నిధిలాగ, ఈ పాడైపోయిన ఓడ కూడా రాణికో లేదా మరెవరికో చెందుతాయేమో నాకు తెలియదు.  అయితే ఈ ఓడ మా కుటుంబానికి చెందినది.  ఇది సముద్రపు అడుగున పడి ఉన్నప్పుడు దీని గురించి ఎవరూ పెద్దగా బాధపడలేదు.  కానీ యిప్పుడిలా నీటి పైకి విసరివేయబడింది గనుక దీన్ని నేను స్వంతం చేసుకొంటే ఈ ప్రజలు 'తనదే గనుక తీసుకోవచ్చు ' అని ఒప్పుకొంటారా?" 

 "సరే, ఎవరికీ చెప్పవద్దు!" డిక్ అన్నాడు.

(ఇంకా ఉంది)

No comments:

Post a Comment

Pages