పురాణ కధలు- బసవ పురాణం - 33
పి.యస్.యమ్. లక్ష్మి
33. శివ వెంకట మంచయ్య కథ
పూర్వం కాశీ పట్టణంలో శివ వెంకట మంచయ్య అనే గొప్ప శివ
భక్తుడుండేవాడు. ఆయన ప్రతి రోజూ మూడు
పూటలా శివ పూజా సమయంలో తన చేతుల పది వేళ్ళనూ ఖండించి శివునికి సమర్పించి, మరల
వాటిని ఎప్పటిలాగే పొందేవాడు. ఇంత మహిమగల
ఈయన అనేక మంది వేరే మతాలవారిని తన వాదనలతో గెలిచి వేరే దైవములు లేరనీ, శివుడొక్కడే
దైవమనీ, ఏనుగుపై జెండా ఎగురవేస్తూ ఊరేగింపులు చేసేవాడు. ఇది చూసి సహించలేని ఇతర మతస్తులు ఒక
విష్ణ్వాలయం దగ్గర చేరి మంచయ్యను వాదనకు రమ్మని కబురు పంపించారు. వాదనకు పిలిచినప్పుడు వెళ్ళకపోతే పరాజయాన్ని
అంగీకరించినట్లే అని తలచిన మంచయ్య వాదనకు వెళ్ళి అనేక విషయాలలో వారితో వాదించి
గెలిచి తన సత్తా చూపించాడు. అయినా
అంగీకరించని వారు ఈ వాదనలు కాదు, మాకేదన్నా నిదర్శనం చూపిస్తే నమ్ముతాము
అన్నారు. దానికి మంచయ్య, ఏమి నిదర్శనం
చూపించను మీ విష్ణు దేవుడు వచ్చి మా
శివుడికి సాష్టాంగ నమస్కారం చేస్తాడు,
చాలా అని అడిగాడు. దానికి వారంతా
చిన్నబోయిన ముఖాలతో మాట్లాడకుండా వూరుకుంటారు.
తర్వాత మంచయ్య శివ ధ్యానము చేసి, శ్రీ విష్ణుని వుద్దేశించి ఓ కృష్ణా, సర్వ జగదాధారుండును, సర్వ
జగద్భర్తయునగు సర్వమంగళా భర్తకు
నమస్కరించుటకు వేగముగా లేచి రమ్మా అని ఒక కేక వేయునంతలో విష్ణుగుడిలోంచి బిందు
మాధవ స్వామి అందరూ చూస్తూ వుండగా తన ప్రత్యక్ష రూపంలో వక్షస్ధల స్ధితయగు
లక్ష్మితోడను, సమస్తాభరణములతోడనూ వచ్చి ముందుగా మంచయారాధ్యులకు నమస్కరించి పిమ్మట
శివాలయమునకు బోయి విశ్వేశ్వరునికి సాష్టాగ నమస్కారము గావించెను. అందరూ పరమాశ్చర్యము చెందారు. ఈ విధముగా సాక్షాత్తూ విష్ణువు శివ భక్తులయందు
తనకుగల గౌరవము కనబర్చి, "శివ భక్తః
ప్రభుర్మమ" అనెడు లోకోక్తిని
స్ధిరపరచెను. "దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు
దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమదేవతా" అని బ్రాహ్మణుల విషయములో నిజము తానే చెప్పెను.
ఒకసారి లక్ష్మీదేవి విష్ణువునడిగిందట, "స్వామీ సమస్త జగములకు నీవే కర్తవు, భర్తవు అయి
వుండగా సకల ప్రాణులు నీ ధ్యానమే చెయ్యవలెను కదా! నీకన్నా వేరే దైవము లేదు కదా!! మరి మీరెవరికోసం సమాధిస్ధితిలో వుండి జపము
చేస్తూ వుంటారు!?" అని.
దానికి విష్ణువు లక్ష్మికిలా సమాధానమిచ్చాడు, "దేవీ, నా ఇష్టదైవమెవరో చెప్పమందువా? సర్వదా నేనా పరమేశ్వరుడైన శివుని ధ్యానించుచూ
వుంటాను. ఆ శివుని మహిమ చెప్పటానికి
వెయ్యి నోళ్ళు కూడా సరిపోవు. ఇంత దేనికి? పధ్ధెనిమిది పురాణాలలో పది పురాణాలు కేవలం
శివుని మహాత్యం గురించే చెప్తున్నాయి. వాయు పురాణము, పద్మ పురాణము, అగ్ని పురాణము
మొదలయినవి ఆయా దేవతలగూర్తి, వారే సర్వోత్కృష్ట దైవాలని బోధించుచు ఆయా మతోద్ధారకులకు ఆధారాలైనాయి. ఇన్ని పురాణములలో నా ప్రశంసగలవి రెండు
మూడున్నాయిగానీ ఎక్కువ లేవు. అదీగాక నేను
కర్మకు లోనైవున్నవాడిని. అవతార భేదములవల్ల
జనన మరణములకు లోనై వున్నాను. అయితే నా తపోబలమువల్ల
నేను ఎప్పుడెప్పుడు, ఎందునిమిత్త ఏయే అవతారాలెత్తానో నాకు తెలుసు. మనుషులకది తెలియదు. అందుకే నేను మానవులకు దేవుడనయ్యాను. జనన మరణములు లేకుండా, ఆద్యంతశూన్యుడై, సర్వదా
ఏక శివ స్వరూపమున వెలుగుచున్నవాడుగనుకే ఈశ్వరుడు దేవులకు దేవుడు, కనుక
పరమేశ్వరుడయ్యాడు".
అందుకే విష్ణువు కాశీ విశ్వేశ్వరుని ఆలయంలోకి అందరూ చూచుచుండగా వచ్చి
స్వామికి సాష్టాంగపడి మరి లేవక అలాగే వుండిపోయాడు. ఇప్పటికి విశ్వేశ్వరాలయంలో లింగమూర్తి ఎదురుగా
సాష్టాగ నమస్కారం చేసి మరి లేవక అలాగే వున్న విష్ణుమూర్తి విగ్రహము కనిపిస్తుంది,
చూడచ్చు అంటారు.
No comments:
Post a Comment