శ్రీభద్రకాళీ శతకము - గొట్టెముక్కల రామభద్ర భూపాలవర్మ
పరిచయం: దేవరకొండ సుబ్రహ్మణ్యం
కవి పరిచయం: గొట్టెముక్కల రామభద్ర భూపాలవర్మకవి గోదావరీ తీరప్రాంతము నందలి ఈతకోట గ్రామ నివాసులు. శ్రీశిష్టు కృష్ణమూర్తి గారి శిష్యులు. తండ్రి నృసింహ రాజు. ఈకవి శతకాంతమున తనను గురించి ఈ విధంగా చెప్పికొనినాడు.
సీ. గురు ధనంజయ గోత్ర గొట్టెముక్కలకుల
శింధుచంద్ర శ్రీనృశింహచుతుడ
విజయగోపాల భూవిభునకు పౌతృడ
విజయగోపాల భూభుజుననుజుడ
కాకర్లపూడి సుఖ్యాతి సుబ్బనృపతి
దౌహితృడను కావ్యదక్షమతిని
బాపిరాజు కనిష్ట భాగినేయుండను
రామభద్ర నృపాలనామధరుడ
గీ. నీదు ప్రేరణజేసితి నీశతకము
గాననాకు భరంబేమిగలుగదిందు
సుకవులిందు గుణంబులజూచిమెచ్చ
భక్తుననుబ్రోవు మెప్పుడు భద్రకాళి!
ఈకవి ఉభయభాషా ప్రవీణులు. వీరి వంశములోని వారందరు పండితులు కవులుగా తోచుచున్నది. అయితే వీరి గురించి గానీ వీరి పూర్వీకుల గురించి ఎటువంటి ఇతర వివరాలు తెలియటం లేదు.
శతక పరిచయం: భద్రకాళి శతకము భక్తిరస ప్రధానమైన కందపద్య శతకము. గోదావరి మండలములోని అమలాపురము తాలూకాలోని మురుమళ్ళ అనే గ్రామమున వెలిసిన భద్రకాళి పేరున ఈశతకము చెప్పబడినది. కవిగారు తాము శ్రీలలితోపాసకులు. అందుచేత లితాంబికకు భధ్రకాళికి అభేధముగా ఈశతకము నందు వర్ణించినారు. ఈశతకమునందు కవి మూడు రకముల మకుటము వాడియున్నారు.
ప్రారంభపద్యములందు "శ్రీ లలితాంబా" అనియు మధ్యభాగమువరకు "శ్రీరాజిత! భద్రకాళి! శ్రితసురపాళీ!" అనియు తరువాత భాగమంతయు " మురుమళ్ళ సుభద్రకాళి ముదిరసురాళీ! అనే మకుటములను ఉపయోగించారు . ప్రథమ పద్యాలు తప్ప మిగిలిన పద్యాలలో చివరి పాదం మకుటం అవ్వటం వలన శతకం ఏకప్రాస (రకార) కందశతకంగా రచింపబడిందిగా భావించవచ్చు.
కొన్ని పద్యాలను చూద్దాము.
కం. వందనమిది కరిముఖునకు
సుందర వదనోపగుహశోభితునకు బా
లేందు కృతశేఖరునకును
శింఢురజిద్గతి కదంబ శ్రీలలితాంబా!
కం. చేకొని వాల్మీకిని సు
శ్లోకుదలతు నాదికవిని శుభమతి గవితా
సాకల్యంజ్ఞానమునకు
శ్రీకరమఖచంద్రబింబ శ్రీలలితాంబా!
కం. శ్రీరుచిర కనకకమలా
పారసరోవరనివాస బంభరకులఝుం
కారముదిత శ్రుతిపాళీ
శ్రీరాజితభద్రకాళి శ్రితసురపాళీ!
కం.శ్రీరాజిత మణిసదనా
భారాజిత చంద్రవదన భాసురవదనా
సారజితాసురకదనా
శ్రీరాజితభద్రకాళి శ్రితసురపాళీ!
కం. సారకరుణాలవాలా
నారదవీణావిలోల నతజనపాలా
శరదశశిముఖలీలా
శ్రీరాజితభద్రకాళి శ్రితసురపాళీ!
కం. శారదనీరదనారద
హారదరసితాబ్జచంద్ర హరదేవఝరీ
వారసమకీర్తిపాళీ
శ్రీరాజితభద్రకాళి శ్రితసురపాళీ!
కం. గురురుచి ముకురకపోలా
సురరుచిబాలా శశిఫాలా సుందరచేలా
వరకల్పక సుమమాలా
మురుమళ్ల సుభద్రకాలీ ముదితసురాళీ!
కం గురుతర మణిమయభూషా
సురుచిర వేశ్యాదిగాన శోభితనాట్యా
స్ఫురితముఖ మంటపాళీ
మురుమళ్ల సుభద్రకాళీ ముదితసురాళీ
కం. వరపద్మ రాగమౌక్తిక
గురుతర వైఢూర్యవజ్ర గోమేధికపా
ళ్యురురచిత మకుటపాళీ
మురుమళ్ల సుభద్రకాళీ ముదితసురాళీ
కం. వరనీలాలక చుంబిత
గురుతరముక్తా కలాప కోమల ఫాలా
స్ఫురిత శశి సుముఖ పాళీ
మురుమళ్ల సుభద్రకాళీ ముదితసురాళీ
అత్యంత భక్తి ప్రధానమైన ఈ భద్రకాళి శతకము అందరు చదవదగిన శతకము. మీరు చదవండి. మీ మిత్రులచే చదివించండి.
***
No comments:
Post a Comment