ధ్వజ స్తంభము
అంబడిపూడి శ్యామసుందర రావు
మనము ఏ గుడికి వెళ్లిన గుడిలో దేవుని దర్శనాని కన్నా ముందు ధ్వజస్తంభానికి మొక్కి ప్రదక్షిణ చేసిన తర్వాత గుడిలో ప్రవేశిస్తాము. ఆలయంలో మూలవిరాట్టు ఎంత ముఖ్యమో ధ్వజస్తంభం కూడా అంతే ముఖ్యం.ధ్వజస్తంభం ఉంటేనే
దేవాలయానికి ఆలయత్వం ఉంటుంది. ఒకప్పుడు అడవిలో దారి తప్పిన బాటసారులకు ఎత్తుగా కనిపించే ధ్వజస్తంభదీపాలే దారి చూపించేవి. వీటి ఆధారంగా, ఏ గుడినో, పల్లెనో చేరుకొని ప్రజలు అక్కడ తలదాచుకొనేవారు. ఇప్పుడు ఆ అవసరం లేకపోయినా, కార్తీకమాసములో ప్రజలు ధ్వజస్తంభం మీద ఆకాశదీపం వెలిగించి మహాదాత మయూరధ్వజుని స్మరించుకుంటారు.
ఇంటి ముందు ఎవరైనా అడ్డంగా నిలబడితే, ఏమిటి అలా ధ్వజస్తంభంలా నిల్చున్నావు అంటుంటారు. ఆలయమనే దేహానికి గర్భాలయాన్ని ముఖంగాను, ధ్వజస్తంభాన్ని హృదయం గాను పోలుస్తారు.ఆలయ ప్రాకారాలు చేతుల వంటివి. నిత్య హారతులు జరిగే దేవాలయాలలో షోడశోపచార పూజా విధానం జరగాలంటే ధ్వజస్తంభం తప్పనిసరి.దీపారాధనలు, నైవేద్యం వంటి ఉపచారాలు ధ్వజస్తంభానికి కూడా చేయాలి.దేవాలయాలలో నిర్మలమైన వాతావరణం, భగవద్ధ్యానం వంటివి మానసిక ప్రశాంతత కలిగిస్తాయి.
మూల విరాట్టు దృష్టికోణానికి ఎదురుగా దేవాలయాలలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. బాగా చేవ కలిగిన కొన్ని రకాల వృక్ష శాఖలు మాత్రమే ధ్వజస్తంభానికి ఉపయోగిస్తారు.వీటిని ప్రతిష్ట చేసే ముందు ఈ దారువు (చెక్క) ను కూడా నీళ్లలో, ధాన్యం లో ఉంచి ఆ తరువాత ప్రతిష్ఠ చేస్తారు. ధ్వజస్తంభ ప్రతిష్ఠ కూడా విగ్రహ ప్రతిష్ట తో సమానమే. మూలవిరాట్టుకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో ధ్వజస్తంభానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. మూల విరాట్టు గర్భాలయంలో ఉంటే ధ్వజస్తంభం దేవాలయానికి ముందు భాగంలో బయట ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించకుండా మూలవిరాట్టును చూడకూడదు. ధ్వజస్తంభం లేని దేవాలయాలకు స్వాములు, సన్యాసులు దేవాలయం గుర్తింపు ఇవ్వరు. ధ్వజస్తంభానికి "జీవ ధ్వజం" అని మరో పేరు ఉంది. దీనిని దారు బేరం అని కూడా అంటారు. విగ్రహాల అనుష్ఠాన, అర్చనల వల్ల భగవంతుని చూపు ఈ ధ్వజస్తంభానికి తగులుతుంది. అందువల్ల ఈ స్తంభానికి పవిత్రత తో పాటు, శక్తి కూడా లభిస్తుంది. ధ్వజస్తంభానికి కూడా బలిహరణలు, అర్చన జరుగుతుంటాయి. పాడైపోయిన, ఛిద్రమైన, వేరే పనుల కోసం వినియోగించే వృక్షాలను దీనికి వాడకూడదు. ధ్వజస్తంభం పొడవు విమాన చక్రం అంత ఎత్తు ఉన్నది మాత్రమే తీసుకురావాలి. ధ్వజస్తంభానికి కింద కూర్మయంత్రం వేయాలి.
వైష్ణవాలయాలలో పైన పతాకంలాగ మూడు వరుసల్లో జెండా ఎగురుతున్నట్టు ఉంటుంది. ఇలా మూడు బద్దలు గా ఉన్న భాగాన్ని మేఖల అంటారు. దానికి చిరుగంటలు ఉండి చిరుగాలికి సవ్వడి చేస్తుంటాయి. ధ్వజస్తంభం నిడివి 12 అంగుళాల నుంచి 24అంగుళాల వరకు ఉండచ్చు. చెక్కతో తయారు చేసిన ఈ ధ్వజస్తంభానికి ఇత్తడి తొడుగు వేస్తారు. కొన్ని కొన్ని దేవాలయాలో వెండితో, బంగారంతో కూడా తొడుగు చేయిస్తారు.కొన్ని దేవాలయాల్లో రాతి ధ్వజస్తంభం కూడా ఉన్నాయి.ఇంత విశిష్టమైన ధ్వజస్తంభం ఎలా ఏర్పడిందో తెలుసుకుందాం.
మనము దాతల్లో కర్ణుడు, శిబి చక్రవర్తి గురించి చెప్పుకుంటారు కానీ మహా దాత అయిన మయూరధ్వజుని గురించి అయన చేసిన గొప్ప(శరీరంలో సగ భాగాన్ని) దానం గురించి చాలా మందికి తెలియదు శ్రీ కృష్ణ పరమాత్ముడు ఇచ్చిన వరం కారణంగా మయూర ధ్వజుడు ప్రతి దేవాలయములో ధ్వజస్తంభం రూపములో పూజింప బడుతున్నాడు.
శ్రీకృష్ణుడు ఏ సందర్భములో మయూరధ్వజుని ఈ వరం ఇచ్చాడో తెలుసుకుందాము. కురుక్షేత్ర యుద్ధం అనంతరం పాండవులలో పెద్దవాడు ధర్మరాజు సింహాసనాన్ని అధిష్టించి ధర్మ బద్దముగా పాలన చేస్తూ ధర్మమూర్తిగా గొప్ప దాతగా పేరు సంపాదించాలి అన్న కోరికతో విరివిగా దానధర్మాలు చేస్తుంటాడు. ఇదంతా గమనిస్తున్న శ్రీకృష్ణుడు ధర్మరాజుకు అశ్వమేధ యాగం చేసి శత్రు రాజులను జయించి, రాజ్యాన్ని విస్తరించి దేవతలను బ్రాహ్మణులను తృప్తిపరచి రాజ్యాన్ని సుభిక్షము చేయమని చెపుతాడు. ధర్మరాజు శ్రీకృష్ణుని మాట శిరసావహించి అశ్వమేధయాగానికి సన్నాహాలు చేసి యాగ అశ్వనికి సంరక్షకులుగా నకుల సహదేవులను సైన్యముతో పంపుతాడు.
ఈ జైత్ర యాత్రలో రాజ్యాలను జయిస్తూ మయూర ధ్వజుడు పాలిస్తున్న మణిపుర రాజ్యానికి చేరుతారు. మయూరధ్వజుడు మహా పరాక్రమవంతుడు,గొప్ప దాతగా పేరుగాంచిన వారు. ఆయన కుమారుడైన తామ్ర ధ్వజుడు పాండవుల యాగాశ్వాన్ని బంధిస్తాడు.తామ్రధ్వజునితో యుద్ధము చేసిన నకుల సహదేవులు ఓడిపోతారు. అప్పుడు భీమార్జునులు కూడా వచ్చి యుద్ధము చేసి ఓడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న ధర్మరాజు తానే స్వయంగా యుద్దానికి బయలుదేరుతుండగా శ్రీకృష్ణుడు వారించి " భీమార్జునులు అతనితో యుద్ధము చేసి ఓడిపోయారు కాబట్టి అతడిని యుద్ధము చేసి ఓడించటం నీకు వీలు కాదు. కాబట్టి ఏదైనా మాయోపాయంతో ఓడించాలి" అని చెపుతాడు.
శ్రీకృష్ణుడు, ధర్మరాజు లిద్దరూ వృద్ధ బ్రాహ్మణ రూపంలో మణిపురం చేరారు. వారిని చూసిన మయూరధ్వజుడు వారిని ఏమి కావాలో కోరుకోండి అని అంటారు. అందుకు శ్రీకృష్ణుడు,"రాజా తమ దర్శనార్ధమై మేము వస్తున్న దారిలో ఒక సింహం అడ్డు వచ్చి ఈతని కుమారున్ని పట్టుకుంది. బాలుని విడిచి పట్టవలసింది అని ప్రార్థించగా అందుకు సింహం మానవ భాషలో మీ కుమారుడు మీకు కావాలంటే మణిపుర రాజ్యాధిపతి మయూరధ్వజుని శరీరంలో సగభాగాన్ని నాకు ఆహారంగా ఇప్పించమని కోరింది. ప్రభువులు మా యందు దయదలచి తమ శరీరంలో సగభాగం దానమిచ్చి బాలుని కాపాడండి" ఆని కోరుకుంటారు. వారి మాటలు విని మయూరధ్వజుడు ఏ మాత్రం సంకోచించకుండా అందుకు అంగీకరించిన మీదట కృష్ణుడు, మయూరధ్వజుని భార్య పుత్రులు స్వయంగా కోసి, సగభాగం ఇవ్వాలనే నియమాన్ని కూడా విధించాడు. అందుకు తగిన ఏర్పాట్లు చేయించి భార్య సుతులు అతని శరీరాన్ని సగంగా కోయటం చూచిన ధర్మరాజు అతని దాన గుణానికి నివ్వెరపోయాడు. ఇంతలో మయూరధ్వజుని ఎడమకన్ను నుంచి నీరు రావటం గమనించిన ధర్మరాజు "తమరు కన్నీరు కారుస్తూ ఇచ్చిన దానం మాకు వద్దు గాక వద్దు అన్నాడు. అందుకు మయూరధ్వజుడు ,"మహత్మా తమరు పొరపాటు పడ్డారు నేను బాధపడి నా శరీరాన్ని మీకివ్వటం లేదు. నా కుడి భాగం పరోపకారానికి ఉపయోగపడింది; ఆ భాగ్యం నాకు కలుగలేదు కదా అని ఎడమ కన్ను మిగుల బాధపడుతోంది" అంటూ వివరిస్తాడు. మయూరధ్వజుని దానశీలతకు మెచ్చిన శ్రీకృష్ణుడు తన నిజరూపాన్ని చూపి మయూరధ్వజుని ఏదైనా వరం కోరుకోమన్నాడు.
"పరమాత్మా! నా శరీరం నశించినా నా ఆత్మ పరోపకారార్థం ఉపయోగపడేలా నిత్యం మీ ముందు ఉండేటట్లు దీవించండి" అని కోరుకోగా. అందుకు శ్రీకృష్ణుడు తథాస్తు అని," మయూరధ్వజా నేటి నుంచి ప్రతి దేవాలయం ముందు గుర్తుగా నీ పేరున ధ్వజస్తంభాలు వెలుస్తాయి. వాటిని ఆశ్రయించిన నీ ఆత్మ, నిత్యం దైవ సాన్నిధ్యంలో ఉంటుంది. ముందు నిన్ను దర్శించి ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించిన తర్వాత ప్రజలు తమ ఇష్టదైవాలను దర్శించుకుంటారు. ప్రతినిత్యం నీ శరీరాన దీపం ఎవరు ఉంచుతారో వారి జన్మ సఫలం అవుతుంది. నీ నెత్తిన ఉంచిన దీపం రాత్రులందు బాటసారులకు దారి చూపే దీపం అవుతుంది" అంటూ అనుగ్రహించాడు. ఆనాటి నుంచి ఆలయాల ముందు ధ్వజస్తంభాలు విధిగా ప్రతిష్ఠించడం ఆచారమయింది.
***
No comments:
Post a Comment