చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ వుంటుందోయీ
శ్రీమతి కలవల గిరిజారాణి
('అచ్చంగా తెలుగు" 2023 వినాయకచవితి హాస్య కథల పోటీల్లో రెండవ బహుమతి గెల్చుకున్న కథ)
“తాతయ్యా! తాతయ్యా!” గట్టిగా అరుస్తూ ఇంట్లోకి వచ్చాడు కౌశిక్.
ఆ అరుపులకి వంటింట్లోనుంటి తల్లి కుముద, బెడ్ రూమ్ లో నుండి తండ్రి విహారి, పూజగదిలోనుండి బామ్మ వర్ధనమ్మ, ‘ఏంటిరా? ఏమైంది?’ అంటూ గబగబా హాల్లోకి వచ్చారు కానీ….
అక్కడే, హాల్లో పడక్కుర్చీలో ఆశీనులైన తాత గోవర్ధనం గారిలో మాత్రం గోరంత కూడా ఉలుకూ పలుకూ లేదు. పెద్ద సౌండుతో, ‘ఓటీవీ’ ఛానల్ లో పశువుల పెంపకం ప్రోగ్రాం, ‘ఊటీవీ’ ఛానెల్ లో పందుల పోషణ ప్రోగ్రాములు రెంటినీ, రిమోట్ తో టకటకా నొక్కుతూ, ఛానెళ్లు మారుస్తూ టీవీ చూడడంలో నిమగ్నమయిపోయి వున్నారు.
అది చూసి కౌశిక్ పటపట పళ్ళు నూరుతూ, “తాతయ్యా! నిన్నే పిలిచేది. వినపడ్డం లేదా?” టివీ మెయిన్ స్విచ్ ఆపి, గట్టిగా పిలిచాడు.
“అదేంట్రా? మాంచి రసవత్తరమైన ప్రోగ్రాం వస్తుంటే టీవీ ఆపేసావు? “ అన్నారు గోవర్ధనం గారు.
“పశువులు, పందుల పెంపకం రసవత్తరమా?” అసహ్యంగా ముక్కు మూసుకుని కోపంగా తాత వేపు చూసాడు.
“ఏంటి? కౌశిక్! ఏం జరిగింది? ఎందుకలా నిప్పు తొక్కిన కోతిలా ఎగిరి పడుతున్నావు? ఈరోజు హర్షిత దగ్గర నుంచి ఫోను రాలేదా?” అల్లరిగా నవ్వుతూ కుముద అడిగింది.
“స్టాపిట్ అమ్మా!” విసుగ్గా అన్నాడు కౌశిక్.
మేటర్ ఏదో సీరియస్ కాబోలు అనుకుని, ఏమడగవద్దని సైగ చేసాడు విహారి.
“ఏమైంది నాన్నా!” మార్దవంగా అడిగింది వర్ధనమ్మ.
“ఏమైందో, మీ ఆయన్ని అడుగు బామ్మా! ఆయన చేసిన పనికి నాకు హర్షి వాళ్ళ పేరెంట్స్ ముందు ఎంత సిగ్గు వేసిందో? ఆయన్నే అడిగి తెలుసుకో!” విసురుగా వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు కౌశిక్.
హాల్లో ఏసీ ఆన్ లో వున్నప్పటికీ, కౌశిక్ ఆగ్రహానికి రూమ్ అంతా వేడిగా వున్నట్లు అనిపించింది అందరికీ.
ఇదేం పట్టనట్టు గోవర్ధనం గారు మాత్రం చిద్విలాసంగా పడక్కుర్చీలో ఊగసాగారు.
“ఏంటండీ? వాడేదో అడుగుతూంటే మీరు ఉలకరు పలకరు. ఏమైందో మర్యాదగా చెప్పండి.” అంది వర్ధనమ్మ.
“దేని గురించో నాకేం తెలుసే?” అన్నారు గోవర్ధనం గారు.
“హర్షిత వాళ్ళ నాన్నగారికి ఫోన్ చేసి, మాతో పాటుగా మీకు, బామ్మకి కూడా ఫోటోషూట్ చేయించమని చెప్పారట. వాళ్ళేమైనా అనుకుంటారని కూడా లేదు ఈయనకి.” అన్నాడు కౌశిక్.
“ఔను. అడిగాను. అందులో తప్పేంటీ? ఆడ పెళ్ళి వారు ఎటూ ఫోటో గ్రాఫర్ ని మాట్లాడారు. మీరిద్దరూ ఎలాగూ చెట్లమ్మటా, పుట్లమ్మటా, ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించికుంటున్నారు. అందులోనే భాగంగా మేమిద్దరం కూడా తీయించుకుందామనుకుని మీ కాబోయే మామగారికి ఫోన్ చేసాను” బుర్రమీసాలు తిప్పుకుంటూ అన్నాడు గోవర్ధనం.
ఆ మాటలకి, విహారి, కుముద ముఖాముఖాలు చూసుకున్నారు.
వర్ధనమ్మ మాత్రం ముసిముసిగా నవ్వుతూ, ఏమెరుగని పత్తిత్తులా , వత్తులు చేసుకుంటూ కూర్చుని మాటలన్నీ వినసాగింది.
“అదే నేనూ అడిగేది. ఇంకెవరితోనైనా నీ షూట్లు తీయించుకోకుండా, అంకుల్ కుదిర్చిన ఫోటోగ్రాఫర్ నే ఎందుకు మాట్లాడాలి? ఈ ఖర్చంతా వాళ్ళ నెత్తిన పడుతుంది.” అన్నాడు కౌశిక్.
“అదా? నీ బాధ? అతను ఇలాంటివి చాలా బాగా తీస్తాడని, మీ మామగారు చెప్పారని, అతన్ని మాట్లాడానురా! నా బిల్లు నేనే పే చేసుకుంటాను. కంగారు పడకు.” అన్నారు గోవర్ధనంగారు.
ఏం చెప్పినా, తాత వినేలా లేడని… తనలో తనే గొణుక్కోసాగాడు కౌశిక్.
“ఇప్పుడు మీకు వీడియో షూట్ ఏంటి నాన్నా? ఎలాగూ పెళ్ళిలో గ్రూప్ ఫోటోలలో మీరూ, అమ్మా వుంటారు కదా? కావాలంటే మీ ఇద్దరికీ విడిగా తీయించుకుందురుగాని.” అన్నాడు విహారి.
“అలా బిగుసుకుపోయి, నీలుక్కునే ఫోటోలు కాదురా! లైవ్లీగా, లవ్లీగా మేమిద్దరం, చేయీ చేయీ పట్టుకుని, పంట పొలాల గట్ల మీద పాటలు పాడుతూ వీడియో తీయించుకోవాలనేది నా కోరిక. మా పెళ్లి సమయంలో ఈ ఫోటోలూ లేవు, షూట్లూ లేవు. నాకు, మీ అమ్మకీ ఆ మోజు తీరలేదు. మొన్నటికి మొన్న ఒకాయన తన భార్యతో, అమితాబ్ బచ్చన్, మౌసమీ ఛటర్జీ లాగా బొంబాయి లో, సేమ్ అవే ప్లేసులలో, అలాగే నటిస్తూ ఎంత బాగా చేసారో కదా! ఆ వీడియో ఎంతగా వైరల్ అయిందో తెలుసుగా! ఇప్పుడు నేనూ, మీ అమ్మా కూడా అలాగే, ‘చిటపట చినుకులు పడుతూ వుంటే’ పాటకి వీడియో షూట్ చేయించుకుని, యూట్యూబ్ లో పెడదామనుకుంటున్నాను.” అనేసరికి,
“అయితే ఇప్పుడు మీరిద్దరూ అక్కినేని, బి.సరోజ అయిపోతారా మామయ్యా!” అంది కుముద.
“అంతేగా మరి. ఇదిగో వర్ధనం! మనం రిహార్సల్స్ బాగా వేసుకోవాలి. ఆ పాటలో వాళ్ళు ఎలా చేసారో అచ్చు అలానే చేయాలి.” అన్నాడు.
“అమ్మా! ఏంటే ఇది?” కాళ్ళు నేలకేసి కొడుతూ అన్నాడు కౌశిక్.
“ఎవరి పిచ్చి వారికానందం. ఏం? నువ్వూ, హర్షితా మాత్రం ఫోటో షూట్ చేయించుకోవడం లేదా ఏంటి? పిచ్చి పిచ్చి కాస్ట్యూమ్స్ తో, ఛంఢాలపు ఫోజులతో తీయించుకుంటున్నారు కదా? అదేమైనా మహా గొప్పగా వుందా? దానికోసం పనిమాలా కాశ్మీరూ, కేరళా వెడుతున్నారుగా? అలాగే తాతయ్య, బామ్మ కూడా వీడియో షూట్ చేయించుకుంటారు.తప్పేం లేదు. నా ఓటు వాళ్ళకే.” అంది కుముద.
“థాంక్స్ అమ్మాయ్! నువ్వయినా నాకు సపోర్ట్ చేస్తున్నావు. సాయంత్రం మా ఇద్దరికీ డాన్సు స్టెప్పులు నేర్పించడానికి కొరియోగ్రాఫర్ వస్తాడు. మీ అత్తయ్యకి రెండు జడలు వేసి, వాటినిండా పూలమాలలు చుట్టి, నెత్తికి జేబురుమాలు కట్టి బి. సరోజ లాగా మేకప్ చేయించు. ఈ లోగా నేనూ నెత్తికి కలర్ వేయించుకుని వస్తాను.” అంటూ లేచారు గోవర్ధనం గారు.
***
మర్నాడు, ఫోటోగ్రాఫర్ ఉదయ్ వస్తూనే, ‘తాతగారూ! రెడీయేనా? లొకేషన్ కి బయలుదేరదామా? “అంటూ తన అసిస్టెంట్ తో వచ్చాడు.
“వర్ధనం! ఇంకా నీ మేకప్ పూర్తవలేదా? ఈ ఫోటోలబ్బాయి వచ్చేసాడు. త్వరగా రావాలి మరి.” నాగేశ్వరరావు స్టైల్ లో చొక్కా సవరించుకుంటూ గోవర్ధనం భార్యని కేకేసాడు.
అత్తగారికి వేసిన రెండు జడల పొడవునా దిట్టంగా, పూలమాలలు చుట్టబెడుతోంది కుముద.
“హేంటోనే కుముదా! మీ మావగారి గోల పడలేక ఒప్పుకోవలసి వచ్చింది కానీ… ఈ వయసులో ఈ పాటలూ, డాన్సులూ, ఫోటోషూట్లూ ఏంటీ? నాకు చచ్చేంత సిగ్గుగా వుంది బాబూ!” కట్టుకున్న పూలసిల్కు చీర కొంగును మునిపంట పట్టి, సిగ్గుపడిపోతూ అంది వర్ధనం.
“ఇందులో సిగ్గెందుకు అత్తయ్యా! అక్కడ పాట మొదలవగానే, కొరియోగ్రాఫర్ చెప్పిన స్టెప్పులు గుర్తున్నాయిగా! అలా చేసేయండి. అంతే! “ అత్తగారి మేకప్ కి తుదిమెరుగులు దిద్దుతూ అంది కుముద.
ఇదంతా చూస్తున్న కౌశిక్ కి వళ్ళంతా కారం పూసుకున్నట్టు అనిపించింది. అసలు ప్రీ వెడ్డింగ్ షూట్ చేయించుకోవలసిన తామిద్దరం కూడా ఇంతలా చేయలేదు కానీ… ఈ ముసలి జంటకి మాత్రం దసరా పండుగలా వుందని అనుకున్నాడు.
విహారి మాత్రం చదువుతున్న పేపర్ లో నుంచి తల పైకెత్తలేదు.
ఉదయ్ తో పాటు వృద్ధ జంట బయలుదేరారు.
బెంగళూరు హైవే మీద వున్న ఒక రిసార్ట్లో , అక్కడ వున్న గార్డెన్ లో కృత్రిమంగా ఒక చిన్న జలపాతం, అక్కడ వర్షం కురిసేటట్టు, ఆకాశంలో ఉరుములు, మెరుపులు గ్రాఫిక్ వర్క్ తో ఏర్పాటు చేసాడు ఉదయ్.
ఆ వర్షంలో, తడుస్తూ… గోవర్ధనంగారు అక్కినేని లాగా బుష్ పేంటూ చొక్కాతోనూ, సిల్కు చీరా రెండుజడలతో వర్ధనం గారు బి.సరోజలాగా, పాటకి, అభినయం మొదలెట్టారు.
‘చిటపట చినుకులు పడుతూ వుంటే.. చెలికాడే సరసన వుంటే… చెట్టా పట్టగ చేతులు కలిపి, చెట్టు నీడకై పరిగెడుతూంటే’. నేలంతా బురద బురద అయిందేమో… పాపం బి. సరోజ కాస్తా అదే వర్ధనమ్మ గారు కాస్తా… అసలే భారీకాయమేమో… దబ్బున జర్రున జారి పడి, ‘చచ్చాన్రోయ్ దేవుడా!’ అని అరిచారు. అదృష్టం కాలు విరగలేదు.
‘కట్..కట్..’ ఉదయ్ గట్టిగా అరిచాడు.
ఆవిడ బెణికిన కాలుకి ఆయింట్ మెంట్ రాసి, కాస్త మర్ధనా చేసాక మళ్ళీ మొదలెట్టారు.
‘ఉరుములు పెళ పెళ ఉరుముతు వుంటే, మెరుపులు మిల మిల మెరుస్తు వుంటే, చెలి కన్నులలో మెరిసే కాంతులు చూడడానికి చేసే ప్రయత్నంలో, ముందుకు వంగేసరికి, గోవర్ధనంగారి నడుం కలుక్కుమంది.
కాళ్ళు, చేతులు, నడుములు, మెడలు ఎన్ని పట్టేసినా, బెణికినా ఏ మాత్రం తొణక్కుండా… వాననీటిలో జారుతూ, పడుతూ, లేస్తూ…
అచ్చం ఎఎన్నార్, సరోజలని తామిద్దరిలో దింపేసి, వీడియో షూట్ ని దిగ్విజయంగా పూర్తిచేసారు.
***
కళ్యాణ మంటపం లో కౌశిక్, హర్షితల పెళ్ళి రంగరంగ వైభవంగా జరుగుతోంది. ఫోటోగ్రాఫర్ ఉదయ్… వధూవరులకి, వచ్చిన ఆహూతులకి రకరకాల ఏంగిల్స్ లో ఫోటోలు తీయడం లో మునిగిపోయాడు. చివరగా గ్రూప్ ఫోటోకి రెండు కుటుంబాలవారూ వచ్చారు. అందరి మధ్యలో రెండు వీల్ ఛైర్ లలో… నడుం బెల్టుతో గోవర్ధనం గారు, కాలికి బేండేజ్ తో వర్ధనమ్మ గారు ఫోజులు పెట్టారు.
సరిగ్గా అప్పుడే… పెళ్ళి హాలులో ఏర్పాటుచేసిన పెద్ద టివీ లో , ‘చిటపట చినుకులు పడుతూ వుంటే’ పాటలో … చెంగు చెంగున ఎగురుతూ గోవర్ధనంగారు, వర్ధనమ్మ చెట్టా పట్టగ చేతులు కలుపుతు చెట్టు నీడకై పరుగెడుతున్న దృశ్యాలని చూసి అతిథులందరూ చప్పట్లు కొడుతూ అభినందనలు తెలుపుతూంటే… విజయగర్వంతో గోవర్ధనం, ముసిముసి సిగ్గులతో వర్ధనం… ‘చెప్పలేని ఆ హాయీ ఎంతో వెచ్చగ వుంటుందోయీ!’ అనుకుంటూ మురిసిపోయారు.
“అన్ని తిప్పలు పడి, కాళ్ళకి చేతులకి దెబ్బలు తగిలించుకుని ఫోటోషూట్, వీడియో షూట్ తీయించడం అంత అవసరమా తాతయ్యా! ఇప్పుడు చూడండి… మా పెళ్ళి టైమ్ కి వీల్ఛైర్ లో కూర్చోవలసి వచ్చింది.” అన్నాడు కౌశిక్.
“అదేం మాట కౌశిక్? ఈ వయసులో వారి ఉత్సాహం ముందు మనమేం మాత్రం పనికిరాము. తాతగారు, అమ్మమ్మ గారు ఎంత బాగా ఆ పాటలో నటించారో? ఈ వీడియో సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయిపోయిందో? కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి. వారికి బోలెడు మంది అభిమానులు ఏర్పడ్డారు. ఇక నుంచి నా యూట్యూబ్ ఛానెల్ లో వీళ్ళిద్దరి వీడియోలు, ముచ్చట్లు అప్ లోడ్ చేసి పెడతాను.” అంది పెళ్ళి కూతురు హర్షిత.
హతవిధీ! అంటూ తల పట్టుకున్నాడు కౌశిక్.
***
No comments:
Post a Comment