మానసవీణ – 49
దాసు శ్రీహవిష
అప్పలనాయుడు ఆ గూడానికి
నియంత లాంటివాడు. గూడెం ప్రజలకి ప్రభుత్వం ద్వారా అందే ఏ పథకాన్ని, సొమ్ముని వాళ్లకి చేరకుండా తినేసేవాడు. అంతే
కాదు, అడవి సంపదని కొల్లగొట్టి, దొంగ
వ్యాపారాలు చేస్తుంటాడు. తన వ్యవహారాలకు అడ్డు చెప్పిన వాళ్ళని మట్టుపెట్టి నిజాలు
దాచడానికి బలమైన రౌడీలతో ఒక సైన్యాన్ని ఏర్పరుచుకున్నాడు.
ప్రజలు చదువుకుంటే తన ఆగడాలు సాగేవేమోలోనని బడికి నియమించపడే పంతుళ్ళని బెదిరించి పంపేవాడు. దానితో ఆ బడిలో పని
చేయడానికి వొచ్చే ఏ టీచర్ ఎక్కువ కాలం ఉండే వారు కాదు. భార్య సుశీలమ్మ కూడా మంచి
మాటలు చెప్పబోతే వినేవాడు కాదు. తన పనులకి ఆమె అడ్డు అని గూడానికి దూరంగా టౌన్ లో
పెట్టాడు.
సుశీలమ్మ
తన భర్త చేసే పాపాల వల్లే పిల్లలు కలగలేదని బాధపడేది. అలా టౌన్ కి మకాం మార్చాక, అప్పుడప్పుడు అనాధ
శరణాలయాలకు వెళ్లి ఎంతో కొంత సాయం చేస్తూ ఉండేది. ఆ క్రమంలోనే హేమలత ఆశ్రమం, అందులో చురుగ్గా అన్నీ చక్కపెట్టే మానస పరిచయం
అయింది.
మానస చురుకుతనాన్ని చూసి, “మా గూడెంలో కూడా పిల్లలు ఎంతో తెలివిగలవాళ్ళు.
సరై న విద్య అందితే ఎంతో ప్రగతిని సాధించగలరు. కానీ, ఆ గూడెం లో పుట్టడం వారి శాపం” అని వాపోయేది. అలా మానస ఆ గూడెం గురించి
తెలుసుకున్నాక, అలాంటి గూడెంలో పిల్లలకి విద్య నేర్పాలని చిన్నతనంలోనే అనుకున్నది.
అలా బాల్యంలోనే తనకు టీచర్ ని అవ్వాలని, అలాంటి గూడెంలో పిల్లలకి చదువు
చెప్పాలని, మరీ ముందుగా, సుశీలమ్మ గారి గూడెంలో పిల్లల భవితని మార్చాలని
నిర్ణయం తీసుకుంది. ఆ కారణం చేతనే ఆ గూడెంలో పోస్టింగ్ కోసం ప్రయత్నించి అక్కడకి
చేరింది మానస. ఇవేవి తెలియని అనిరుధ్, కావాలంటే వేరే టౌన్ కి ఎక్కడికైనా పోస్టింగ్
వేయిస్తా అంటే కూడా సున్నితంగా తోసి పుచ్చింది. కానీ తన ఈ నిర్ణయానికి బీజం ఏనాడో
పడింది అని చెప్పలేదు. అందుకే ఇక్కడకి వచ్చే ముందే తనకి ఎలాంటి ఆపద అయినా
జరోగొచ్చు అని ముందే ఊహించి, అన్నిటికి సిద్ధపడే వొచ్చింది మానస.
చదువు
మనిషిలో విచక్షణ జ్ఞానాన్ని పెంచుతుందని నమ్ముతుంది మానస. అన్నల్లో కూడా ఎందరో చదువుకున్నవారు
ఉన్నారు కానీ వారు జ్ఞానాన్ని కాకుండా, క్షణికావేశాన్ని మేల్కొల్పి వారి జీవితాలను
అడవుల పాలు చేసుకున్నారు. ఉడుకు వయసు యువతను వారి మాటలతో ఉద్రేకపరిచి, సమాజాన్ని వారి
కోణంలో మాత్రమే చూపిస్తూ, చెడగొడుతున్నారు. అదే విషయం మానస వాళ్ళకి అర్ధం అయ్యేలా చెప్పాలని
అనుకుంది. “సమాజంలో మార్పు కోసం మీరు ఎంచుకున్న పద్దతితో కనీసం ఒక గూడాన్ని కూడా రక్కసుల
చేతి నుండి కాపాడలేకపోయారు. మీ కోపాన్ని ఆలోచనతో జోడిస్తే మీ మీద ఉన్న ముద్ర తొలిగి
పోయి, ప్రజలు మీ మాటని గౌరవంగా వింటారు.
ఒక్కసారి ప్రయత్నిస్తే తప్పులేదు కదా, నేను గవర్నర్ తో, ఇంకా ఇతర పెద్దలతో మీ విషయం మాట్లాడాను.
వారు నా మాట మన్నించి మీకు ఒక అవకాశం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. మీరు సమాజంలో
గౌరవంగా జీవించడానికి సహాయం కూడా చేస్తామన్నారు. అడవుల్లో ఉండి మీరు అనుకున్నది సాధించలేక, అభద్రతా భావంతో బ్రతకడం కంటే మీరు సమాజంలో వుండి
ఎంతో చేయొచ్చు,” అన్న మానస మాటలు తూటాల్లా పనిచేసాయి. రాజా దళపెద్దలని కలిసిన మొదటి రోజే
మానస లాంటి చిన్నపిల్ల ఆలోచన వినిపించి, దళ సభ్యుల మనసు మార్చగలిగాడు. తమలో ఈ మార్పుకి
కారణం అయిన మానసకి లోలోపలే కృతజ్ఞతలు చెప్పుకున్నారు అందరూ.
గూడెంలో
మిషన్ -1 విజయవంతంగా పూర్తి చేసుకున్న సంబరం కంటే కూడా ఆలోచన ఎక్కువైంది మానసలో. ఇక మిషన్-2 అప్పల నాయుడు సంగతి తేలిస్తే తప్ప గూడెం లో పిల్లలకి
చదువు చేరువ అవ్వదు.
అటవీ
సంపద కొల్లగొట్టడం అప్పల నాయుడు చీకటి వ్యాపారాల్లో ఒకటి. అడివిలోకి చీమ వచ్చినా
అప్పల నాయుడుకి తెలిసి పోతుంది. ఆ అడవి అరుదైన ఔషధ మొక్కలకు నిలయమని జగయ్య తాత
చెప్పగా గుర్తు. జగ్గయ్య తాత, సుశీలమ్మగారు చెప్పిన ప్రతి విషయాన్నీ వాడుకొని తన ప్రణాళిక వేసుకుంటోంది.
ఇప్పటి
వరకు అంత సవ్యంగానే సాగింది, కానీ ఇక మీదట తాను చేయాలనుకునే ప్రతిదీ పెద్దలతోనూ, అనిరుధ్ తోనూ చెప్పి చేస్తే మంచిదని, వారి
సలహాలు తీసుకోవాలని అనుకుంది. రాజా అన్న, జగ్గయ్య తాత సహాయం కూడా అవసరం అవ్వొచ్చు. రేపు
ఉదయం అనిరుధ్ తో మాట్లాడాలి అనుకుంది. ఆ రాత్రి అలా ఆలోచిస్తూ ఎప్పుడు నిద్ర లోకి జారుకుందో
తెలీదు.
అనిరుధ్
ఒచ్చి, "శుభోదయం టీచర్ గారు” అనే వరకు మెలుకువ రాలేదు. ఇద్దరూ కాఫీ తాగుతూ ఉండగా, మానస చెప్పిందంతా విని అనిరుధ్, "ఇదంతా ఒక్కదానివే చేయాలనుకోవడం తప్పు కాదు మానస, కానీ నీకేమన్నా అయితే మేమందరం ఎంత బాధపడే
వాళ్ళమో ఆలోచించావా? ఇప్పటికైనా నాతో చెప్పి మంచి పని చేసావు, ఆ అప్పల నాయుడు అంత మంచివాడు కాదు. వెంటనే నాన్నతో
మాట్లాడుదాం. అప్పటి వరకు కాస్త జాగ్రత్త గా ఉండు. నీ దుడుకుతనం కాస్త తగ్గించి, నీకోసం
ఆలోచించే కుటుంబం ఒకటి ఉందని, నీ కోసమే బ్రతికే నేను ఒకడిని ఉన్నానని మర్చిపోకు.” అన్నాడు.
No comments:
Post a Comment