ఒకటైపోదామా... ఊహల వాహినిలో! - 6
కొత్తపల్లి ఉదయబాబు
(విరాజ్, హరిత ప్రేమికులు. పెళ్ళికి ముందు తనకు బిడ్డను కనివ్వాలని, ఆ తర్వాతే ఆమెను పెళ్లి చేసుకుంటానని అడుగుతాడు విరాజ్. ఇక చదవండి.)
అతన్ని
గుర్తుపట్టనట్టే అడిగింది.''
మీరెవరు? నాదారికి అడ్డంగా బైక్ ఎందుకు ఆపారు?''
''అరె అప్పుడే మరచిపోయారా...మూడు రోజుల క్రితమే కదండీ మా కాలేజీకి వచ్చి మీ
పాటకి మీకు మొదటి బహుమతి అందించాను.'' అన్నాడు
గుర్తుచేస్తున్నట్టు.
''ఓహ్..సారీ. ఏమీ అనుకోకండి సర్. వెంటనే గుర్తుపట్టలేకపోయాను. పైగా
సినిమాలోలా ఇలా దారికి అడ్డంగా బైక్ ఆపితే ఏ పోకిరి వెధవో అనుకున్నాను. మీవంటి
గొప్పవారి చేతులమీదుగా బహుమతిని అందుకోవడం నా అదృష్టం.నాతో ఏదైనా పని ఉందా సర్?''
అడిగింది ఆమె.
''మీతో మాట్లాడాలని చెప్పానుగా...'' అన్నాడతను
''రండి అయితే.'' ఆమె గిరుక్కున వెనక్కు తిరిగింది
''ఎక్కడికి వెళదాం ?''
''మా ఇంటికి. ఇలా అంటున్నానని ఏమీ అనుకోకండి. నేను జీవితంలో ఇలా రోడ్డుమీద
ఒక మగవాడితో మాట్లాడటం ఇదే మొదటిసారి. నేను ఎవరితో మాట్లాడినా మా అమ్మగారిముందే
మాట్లాడతాను.''
''అమ్మో..పెద్దవాళ్ళముందా?''
''వాళ్లకు తెలియకుండా మీరు నాతో మాట్లాడే విషయాలు ఏముంటాయి? మీకిష్టమైతేనే రండి. లేకపోతే నా దారిన నన్ను కాలేజీకి వెళ్లనివ్వండి.
ఇంకెప్పుడూ ఇలా రోడ్డు మీద మాత్రం ఆపి మాట్లాడే ప్రయత్నం చేయకండి సర్. వస్తున్నారా?''
ఆమె మాట పూర్తి అవకుండానే...అతను
ఒక్క ఉదుటున బైక్ ఎక్కి ముందుకు ఉరికించాడు.
నవ్వుకుని
కాలేజీ దారి పట్టింది హరిత.
***
రాజ్ ఒక
బంగారం షాపు ఓనర్ కొడుకు. వాళ్ళనాన్నగారు
వాళ్ళ ఏరియాలో అతి పెద్ద కోటీశ్వరుడు. పెద్దకొడుకు తనకు వ్యాపారం వద్దని, పై చదువులన్నీ అమెరికాలో చదువుకునే
వంకతో వెళ్ళిపోయి అక్కడే ఉద్యోగం సంపాదించుకుని అమెరికా పౌరసత్వం సంపాదించడమే కాదు
, సొంత ఇల్లు కూడా కొనేసుకున్నాడు. పెళ్లి మాత్రం తండ్రి
చూసిన సాంప్రదాయపు అమ్మాయిని చూసి పెళ్లి చేసేసుకున్నాడు.
ఇక విరాజ్
ఎం.బి.ఏ. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేసాకా తన తర్వాత వ్యాపారం చూసుకోవాల్సిందేనని
ఖరాకండిగా చెప్పేసాడు తండ్రి. తనకిష్టమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి
చేసుకోవడానికి అనుమతిస్తేనే వ్యాపారానికి సహకరిస్తానని నియమం పెట్టాడు విరాజ్.
కుర్రవయసు...
పదిమంది అమ్మాయిలతో తిరిగి వాడి బుల్బాటం వదిలించుకున్నాక చివరకు మంచి సంబంధం చూసి
పెళ్ళిచేయవచ్చని ఓ నిర్ణయానికి వచ్చిన ఆ తండ్రి పిల్లవాడు ఎక్కెడెక్కడ ఎవరితో ఎలా
తిరుగుతున్నాడో గమనించడానికి తన పరిధిలో మనుషుల్ని పెట్టుకున్నాడని విరాజ్ కి
తెలియదు.
అయితే ఒకరోజు
పబ్ లో విరాజ్ ని ఒక పంజాబీ అమ్మాయి బాగా తాగి 'తన ముచ్చట' తీర్చమని
గదిలోకి తీసుకువెళ్లి రేప్ చేయబోయింది. విరాజ్ 'ఛీ' కొట్టి బయటకు వచ్చేయడంతో అతని స్నేహితులందరూ అతన్ని ఆ అమ్మాయి ముందు
గేలిచేశారు. ''పెళ్ళికి
ముందే కోరి వచ్చిన ఆడదాన్ని అనుభవించని వాడివి 'నువ్వు అసలు
మగాడివే' కాదన్నారు.
ఆమాటతో
విరాజ్ కి చాలా కోపం వచ్చింది.
''పిచ్చివాళ్ళల్లారా...ఆడది కోరి మగాడి దగ్గరకి వచ్చిందంటే అది అంతకు ముందు
ఎంతమందితో తిరిగిందో ...అలాంటి నీతీ జాతీ లేని ఆడదానిదగ్గర మగాడిని అని
నిరూపించుకోవడం కాదు నాకు ముఖ్యం. మనస్ఫూర్తిగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య
దగ్గర మగాడు మగాడిలా ఉండాలి. అంతేగానీ
డబ్బు, అందం చూసి మీద పడే ఆడది వ్యభిచారికన్నా ఏమీ తక్కువ
కాదు.'' అని వాదించాడు.
దాంతో వారికి, విరాజ్ కి అక్కడే పెద్ద వాగ్వివాదం
జరిగింది. అది చూసి అక్కడే ఉన్న విరాజ్ బాల్యస్నేహితుడు విరాజ్ తండ్రికి ఫోన్
చేయడం, ఆయన తన
మనుషులను అక్కడకి పంపించడం, వాళ్ళు విరాజ్ కి రక్షణకవచంగా ఏర్పడి అక్కడనుంచి తీసుకువెళ్లిపోయారు.
ఇంటికివెళ్లాకా తండ్రికి జరిగింది చెప్పాడు
విరాజ్. దానికి ఆయన అతనితో -
''ఈరోజుల్లో ఒక ఆడది తనంత తానుగా నీ దగ్గరకు వచ్చింది అంటే అది ఖచ్చితంగా నీ
వెనుక ఉన్న డబ్బును చూసే. నేను నీకు ఒక పరీక్ష పెడతాను. నువ్వు నీకిష్టమైన
అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించు. ఆ అమ్మాయి కూడా నిన్ను మనస్ఫూర్తిగా
ప్రేమిస్తోంది అని నువ్వు నమ్మాకా, పెళ్లి కాకుండా నీతో
బిడ్డని కనీ తనకు ఇమ్మని, ఆ తరువాత కూడా ఆమె మీద నీకు ప్రేమ
కొనసాగితే అపుడు ఖచ్చితంగా నేనే మీఇద్దరికీ పెళ్లి చేస్తాను'' అన్నాడు.
"అంటే
కాలం మారిన ఈ రోజుల్లో కూడా ఆడపిల్ల అంటే అంత చులకన భావం ఉందా మీకు? మీ ప్రపోజల్ అభిమానం ఉన్న ఏ
అమ్మాయి ముందైనా పెడితే ఆలోచించకుండా
నన్ను లాగిపెట్టి ఒకటి కొట్టి మరీ
వెళ్ళిపోతుంది.''
''ఓరే పిచ్చివాడా... ఇవి పూర్వకాలం రోజులు కాదురా....ఈ భూమిమీద పుట్టిన ఏ
మనిషైనా బ్రతికి బట్ట కట్టాలంటే ముందుగా కాలే కడుపు నిండాలి. అందుకోసం ఆరోజుల్లో
అభిమానానికి కట్టుబడి తిండి లేకపోయినా తప్పు పనిమాత్రం చేయలేక ఆకలితో మాడి
మరణించేవాళ్ళు.
కాలం ఎప్పుడూ
ఒకలాగే ఉందిరా...అవసరాలకు తగ్గట్టు మనుషులే క్షణ క్షణానికి మారిపోతున్నారు. ఈ
రోజుల్లో తిండి లేకపోతే మగాడన్నా మాడిపోయి
చస్తాడేమోగానీ...ఆడది చావదు. ఎందుకంటే మగాడు కడుపు నిండటం కోసం ఏ వెధవ పని
చేయడానికైనా కష్టపడాలి. కానీ ఆడది అయిదు
నిముషాలు శరీరం తనది కాదు అనుకుంటే చాలు. అందుకని నీ ప్రొపోజల్ కి ఒప్పుకునే
ఆడపిల్ల తప్పకుండా ఎక్కడో ఉండే ఉంటుంది. ప్రయత్నించు.''అన్నాడాయన.
''సరే..ఒకవేళ మీ ప్రపోజల్ కి ఒప్పుకుంది అనుకుందాం. అలా జరిగాకా ఆ అమ్మాయిని
నాకిచ్చి పెళ్లి చేస్తారని నమ్మకం ఏమిటి?"అడిగాడు విరాజ్.
ఆయన
ఆశ్చర్యపోయాడు.
"అంటే కన్నతండ్రిని కూడా నమ్మవా నువ్వు? "
"
ఎందుకు నమ్మను నాన్న? నమ్ముతాను. 'నేనేం చేసినా నీ శ్రేయస్సు కోరే
చేస్తాను కదా' అంటారు. దానికి నేను ఒప్పుకుంటాను. కానీ మీరు
నాకు పెళ్లి చేయబోయేది తన పుట్టింటివాళ్ళని శాశ్వతంగా వదిలి నాతో జీవితాంతం
ఉండడానికి వచ్చే ఒక చదువుకున్న అమ్మాయి.
ఆడపిల్లలు మర
బొమ్మలు కాదు. మనం కావాల్సిన విధంగా ఆ అమ్మాయి ఉండాలని మనం ఎలా అనుకుంటున్నామో, వాళ్లకి కావాల్సినట్టుగా మనం ఉండాలని
వాళ్లు కోరుకుంటున్నారు.
ఈరోజుల్లో
ఆడపిల్లల ఆశలు, అభిప్రాయాలు,
కలలు అన్ని వేరే విధంగా ఉంటాయి . మన విషయంలో తేడా రానంతవరకు చక్కగా
సంసారం చేస్తారు.
ఏ కొద్ది తేడా వచ్చినా సెలబ్రిటీల పిల్లలే రాజీపడకుండా సంసారం వదిలేసి
కోర్టుకెక్కుతున్నారు.
మీరు చెప్పిన
పథకంలో ఈ పెళ్లి జరగడానికి మరో మూడు ఏళ్లు పట్టొచ్చు. ఈవేళ మీరన్న ఈ నిర్ణయం మీదే
ఆనాడు మీరు ఉండడం కోసం.. అంటే జస్ట్ జ్ఞాపకం కోసం... మీరన్న అదే విషయాన్ని
ఎగ్రిమెంట్ కింద రాసుకుందాం. ఏమంటారు?
" అడిగాడు విరాజ్.
ఎప్పుడు
మట్టి ముద్దలా ఉండే కొడుకు తాను చెప్పిన చిన్న విషయాన్ని అంతలా విశ్లేషించేసరికి
నిజంగానే ఆశ్చర్యపోయాడు. కొంపదీసి
పెళ్లికి ముందే కడుపు చేయించుకుని బిడ్డని కని ఇచ్చే ఆడపిల్లనే వీడు చేసుకుంటాడా?
(ఇంకా ఉంది)
No comments:
Post a Comment