శారదాంభోజ శక్తి ప్రసాదితే..శరన్నవరాత్రి రూపాలు!
-సుజాత.పి.వి.ఎల్,
సైనిక్ పురి, సికిందరాబాద్.
వసంత కాలం మరియు శరదృతువులలో వాతావరణం సౌర ప్రభావపరంగా ఉంటుంది. అందుకే ఈ కాలం చాలా ముఖ్యమైన సంధి కాలమనే చెప్పాలి. దుర్గామాతను పూజించడానికి ఈ రెండు కాలాలు చాలా పవిత్రమైన కాలాలుగా భావిస్తారు. దుర్గాదేవి శక్తి రూపంలో వెలసిన దేవత. మహిషాసురమర్దిని అయిన దుర్గామాతను పూజించే పండుగే దసరా. దుర్గాదేవిని తొమ్మిది రోజులపాటు పూజించడాన్ని దుర్గా నవరాత్రులు అంటారు.
దశహర అంటే దశకంఠుడైన రావణాసురుణ్ని శ్రీ రామచంద్రుడు వధించిన రోజు. ఇది వాడుక భాషలో దసరా అయింది. నవరాత్రి పండుగ అంటే తొమ్మిది రాత్రుల పండుగ. చివరి రోజు విజయదశమిని కలుపుకొని పది రోజుల పండుగ అయింది. ఈ పది రోజులు మహిషాసురమర్దిని అయిన దుర్గామాతను రోజుకో రూపంలో కొలుస్తారు. నిజానికి నవరాత్రుల్ని సంవత్సరoలో ఐదు సార్లు జరుపుకుంటారు. వసంత నవరాత్రి, ఆషాఢ నవరాత్రి, శారదా నవరాత్రి , పౌష్య నవరాత్రి మరియు మాఘ నవరాత్రులు.
వసంత నవరాత్రి: వసంత ఋతువులో తొమ్మిది రూపాల శక్తిమాతను ఆరాధించే తొమ్మిది రోజుల పండుగ. దీన్ని చైత్ర నవరాత్రులు అని కూడా అంటారు.
ఆషాడ నవరాత్రి: ఈ ఆషాడ నవరాత్రి చాలామందికి తెలియకపోవచ్చు అందుకే దీన్ని గుప్త నవరాత్రి పేరిట పూజిస్తారు. ఆషాడ మాసంలో అమ్మవారిని తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో ఆరాధిస్తారు. ఆషాడ శుక్ల చంద్రుడు పూర్ణ బింబాన్ని సంతరించుకునే కాలం. అందుకే ఈ మాసంలో అమ్మవారికి ఆషాడ నవరాత్రులు చేస్తారు.
శరన్నవరాత్రులు: అన్ని నవరాత్రులలో ఇవి అతి ముఖ్యమైనవి. శరత్ ఋతువులో( అంటే శీతాకాలం ప్రారంభం సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో) తొమ్మిది రోజులపాటు అమ్మవారిని తొమ్మిది రూపాలుగా పూజిస్తారు.
పౌష్య నవరాత్రి: పుష్య మాసంలో చంద్రుడు పౌష్య శుక్ల పక్షంలో పూర్ణ బింబాన్ని సంతరించుకునే కాలం. ఈ నవరాత్రిని తొమ్మిది రోజులపాటు తొమ్మిది రూపాల్లో దుర్గా మాతను పూజిస్తారు.
మాఘ నవరాత్రి: మాఘ మాసంలో మాఘ నవరాత్రిని మాఘ శుక్ల పక్షంలో చంద్రుడు పూర్ణ బింబాన్ని సంతరించుకునే సమయంలో జరుపుకుంటారు.
మనం ఒక సముద్రం దగ్గరకు వెళ్ళి చూస్తే అందులో నీటి నుండి గాలికి ఒక అల లేవడం ఎలాగో గమనించే ఉంటాం. ఆ అల ఒడ్డుకు చేరుకునేలోగా మరొక అల దాని వెంట ఉంటుంది. ఇలా అలలు ఒకదాని వెంట మరొకటి వస్తూనే ఉంటాయి, ఒడ్డుకు చేరుకుంటూనే ఉంటాయి. దీన్ని విచీ తరంగ న్యాయ మంటారు .
అలాగే ఒక శబ్దం పుట్టి దాని స్పందన మన చెవి వద్దకు చేరగానే దాని వెంట మరొక స్పందన దాని వెంట మరొకటి ఇలా స్వచ్ఛందంగానే వచ్చి చెవికి తగులుతూ ఉంటాయి. ఒక మాల కూర్చబడిన అనేక రకాల పూల మొగ్గలను కదంబ మొగ్గలు అంటారు. ఈ మాలలో అన్నీ ఒకేసారి విచ్చుకుంటాయి. అదే కదంబమాల. దీనినే కదంబ ముకుళ న్యాయం అంటారు. మొదటి న్యాయములో ఒకదాని వెంబడి మరొకటి వస్తూంటుంది రెండవ దానిలో జరిగేది ఒకేసారి జరుగుతుంది. అంటే మొదటి న్యాయo మనకు రెండవది విపరీతం అవుతుంది. ఆకాశంలో శబ్ద స్పందనలు ఎన్నో ఈ కదంబ మొగ్గల వలే ఒకేసారి పడతాయి. ఈ శబ్దములనే అక్షరాలని, మాతృకలు అని అంటారు. ఆ మాతృకా స్వరూపిణియే అంబిక. కాళిదాసు శ్యామలా దండకము జగన్మాతను సర్వ వర్ణాత్మికే అని, జగన్మాతృకే అని స్తుతించాడు మనకు శారదా రూపముగా విజ్ఞానం ఇచ్చేది అంబయే.
సకల రోగ నివారిణిగా రాక్షస భాదను తొలగించిన లోకోపకారిణిగా, సకల విజ్ఞానదాయకంగా ఆ జగజ్జనని ఆవిర్భవించిన ఈ శారదా నవరాత్రులు పరమ పవిత్రమైన రోజులు అందుచేతనే నవరాత్ర పూర్వకముగా ఆ దేవిని మనము ఆరాధిస్తాం. తొమ్మిది రోజుల ఆరాధన అనంతరం ‘దశమి రోజున ఏదైనా ఒక పనిని ప్రారంభిస్తే తప్పక విజయం చేకూరుతుంది’ అని భారతీయుల విశ్వాసం. శ్రీ రామచంద్రుడు ఈ మాసమున ఒకచోట శుద్ధమైన పీఠమును ఏర్పరచి, అందు దేవిని ప్రతిష్టించి శాస్త్ర సమ్మతంగా పూజలు చేసిన తర్వాతనే లంకకెళ్ళి రావణ వధ గావించాడని రామాయణంలో చెప్పబడింది.
దుర్యోధనాదులు పాండవుల అజ్ఞాతవాస భంగము గావించుటకు ఉత్తర గోగ్రహణము కావించగా అర్జునుడు ఉత్తరుని రథసారథిగా చేసుకొని, పాండవులు ఆయుధములుంచిన శమీ వృక్షము వద్దకు వచ్చి, ఆ వృక్షమునకు ప్రదక్షిణ నమస్కారములు చేసి తన ఆయుధము ( గాండీవము) ను తీసుకొని కౌరవులనందరినీ తానొక్కడే జయించి గోవులను నగరములకు మరల్చాడు అర్జునుడికి విజయం ఈ దశమి రోజున కలిగినందున ఆయన పేరు మీదనే ఆశ్వయుజ శుద్ధ దశమికి విజయదశమి అనే పేరు వచ్చిందని పెద్దలు చెబుతుంటారు. అందుచేత ఈ విజయదశమి రోజున ప్రారంభించిన పనులకు, విజయం చేకూరుతుందనే విశ్వాసం అందరికీ ఏర్పడింది. అర్జునుడు ముందుగా శమీవృక్షమునకు ప్రదక్షిణ గావించి నమస్కరించి పూజించినందువల్లనే విజయము కలిగినదని ఈ దశమి రోజున శమీ పూజ చేయుట కూడా ప్రత్యేక విశేషంగా చెప్పబడుతుంది.
No comments:
Post a Comment