అనసూయ ఆరాటం - 28 - అచ్చంగా తెలుగు

                                                         అనసూయ ఆరాటం - 28  

చెన్నూరి సుదర్శన్





ఆదిరెడ్డి సాయంతోటి రవీందర్‌ కాట్టం సుట్టు మూడు సార్లు తిరిగి కొడుక్కు తలగొరివి  పెట్టింది వీరమ్మ.

*** 

అవ్వాల ఐతారం.


          పొద్దుగాల్నే టిఫిన్ చేసి చాయె తాగి ఆదిరెడ్డి ఇంటికి బండిమీద బైలెల్లిండు సురేందర్. సరింగ ఎనిమిది సుత కాలేదు.. కాని  ఎండ భగ, భగమంటాంది. నెత్తికి హెల్మెట్ పెట్టుకున్నట్టే గాని చెమ్టలు చెంపల పొంటి కారుతానై. కూకట్‌పల్లి నుండి నాచారం చేరడానికి కమస్కం గంటన్నర పడ్తది.


          సురేందర్ బండి స్టాండేసి ఆదిరెడ్డి ఇంట్ల అడుగు పెట్టేటాల్లకు ఆడ కనబడ్డ సీను సూసి సెనం సేపు బీర్పోయిండు.    


          అనసూయ ఆరాంగ సోఫాల కూకోని గోడ సీన్మ అంత పెద్ద టి.వి. సూత్తాంది. చేతిల రిమోటున్నది. ఏసీ ఉండుడు ఇల్లంత సల్లగున్నది.


          సురేందర్ పెదువుల మీద సన్నని నవ్వు మొల్సింది. గట్ల అనసూయక్కను సూత్తనని జన్మల అనుకోలేదు. కూలి కైకిలు సేసిన అనసూయకు.. ఇప్పటి అనసూయకు జమీన్.. ఆస్మానంత ఫరకున్నది.


          సురేందర్‌ను సూడంగనే రిమోటు పక్కకు పెట్టి పానం లేచచ్చినట్టు ఎదురుంగచ్చింది అనసూయ.


           “తమ్ముడూ.. అంతా బాగేనా.. ఎన్నాండ్లాయె నిన్ను సూడక.. దా.. కూకో..” అని తనే ముందుగాల మందలిచ్చింది.


          సురేందర్ సోఫాల కూకుంట “ అంతా బాగే అక్కా.. నువ్వెట్లున్నవ్” అని అడిగిండు. వచ్చేటప్పుడు తెచ్చిన సేపుల కవరు చేతికిచ్చిండు..  తీస్కోని టీపాయ్ మీద పెట్టింది అనసూయ.


          “కొంచెం కాల్ల నొప్పులు వచ్చినై. కాని పానం అల్కగనే ఉంటాంది. ఏంది తమ్మీ.. బొత్తిగా నల్లపూసైనవ్. ఆక్కను మర్సిపోయినవా.. పమీల .. పిల్లలు అందరు బాగున్నరా”


          అన్నిటికీ తల్కాయె ఊపిండు సురేందర్.


          ఇంతల ఎవలో వచ్చిండ్లని వంటింట్లకెల్లి తొంగి సూసి పోయింది సరిత. ఆమె ఎన్కాల చీరె కుచ్చిల్ల దాక్కున్న సుశాంత్‌రెడ్డి,  సురేందర్‌ను సూడంగనే సిగ్గు పడుకుంట తలుపు సాటుకు దాక్కున్నడు.


          “సుశాంత్.. ఇటు రా.. రా.. తాతయ్య వచ్చిండు” అని పిల్సింది.


        “సరితా.. సురేందరచ్చిండు. చాయె తీస్కరా.. వంట సుత చెయ్యి తిని పోతడు” అన్నది అనసూయ.


          “అక్కా.. నేను బువ్వయాల్లకు ఇంటికి పోత.. చాయె సాలు” అన్కుంట.. “సుశాంత్ ఇటురా..” అని పిల్సిండు సురేందర్.


        “అదేంది తమ్ముడూ.. శాన రోజులకు వచ్చినౌ.. తినకుంట పోనిత్తనా..” అని ఎంతో గారువంగ అన్నది అనసూయ.


          “ఆదిరెడ్డి బైటికి పోయిండా..”  అని వచ్చిన పని చెప్పాలని సూసిండు సురేందర్.


          “ఫోను సేసి రానుంటివి. ఇప్పుడే పోయిండు. ఇవ్వాల ఐతారం కదా.. నాత్రి శాన పొద్దు పోయినంక వత్తడు. జాగల బిజినెస్  చేత్తాండు కదా.. నీకు తెలుసనుకుంట. శంషాబాదుల ఇంకో ఆఫీసు పెట్టిండు. ఇంకో కారు కొన్నడు పాత కారుకు ఒక డ్రైవరును పెట్టిండు.. పబ్లిక్‌ను తీస్కపోయి ప్లాట్లు సూయించుకత్తడు”  


          సరిత కొడుకును సంకలేసుకొని చాయె తీస్కచ్చి సురేందర్‌కిచ్చుకుంట "బాగున్నరా.. అప్పయ్యా” అని అడిగింది. చాయె కోపు తీస్కోని బాగున్నం అన్నట్టు తల్కాయె ఊపిండు సురేందర్. కోపు పక్కకు పెట్టి సుశాంత్‌ను తీసుకుందామని చేతులు సాపితే సరిత సంకలకెల్లి జర్రున జారి మల్ల వంటింట్లకుర్కిండు. 


          “కొత్త కదా.. సిగ్గుపడ్తాండు. కొంచెం అలవాటైతే మాగత్తడు” అని అనసూయ తన దగ్గరకు రమ్మన్నట్టు పిల్సింది.


          చాయె తాగిన కోపును తీస్కోని పోయింది సరిత.


          “తమ్ముడూ. చెప్పవ్.. ఆదిరెడ్డి తోని ఏమన్న చెప్పాల్నా” అని అడిగింది అనసూయ.


          “అక్కా.. నా పిల్లలు సుత పెద్దోలైండ్లు.. పెద్ద సదువులు పట్టిండ్లు. కర్సులు పెరుగుతానై. కొంచెం పైసలకు తక్లీబున్నది”  


        “అయ్యో తమ్ముడూ.. గట్లనా.. నువ్వు మాకెంతో సాయం చేసినవ్.. ఇవ్వాల మేము గిట్లున్నమంటే.. నీ సేతి సలువనే కదా తమ్ముడూ. మన్సులమన్నాక ఒకలకొకలు ఆదుకోవాలె. నీకు ఎంత గావాల్నో  చెప్పు. నీ బ్యాంకి అకౌంటి నంబరిచ్చినా సరే.. అండ్ల  ఏయుమని సెప్త” అన్నది అనసూయ.


          “నాకియ్యాల్సిన పైసలే అక్కా.. ఇన్నాల్లు అల్లునికి సుత కర్సెన్క కర్సత్తాందని అడుగలేదు. చెయ్యి తిప్పుకున్నంక ఇత్తడులే అనుకున్న”


          ఒక్కసారే సెనం సేపు బీర్పోయి సూసింది అనసూయ.


          “ఏందీ.. ఆదిరెడ్డి నీకు బాకి ఉన్నడా.. ఎప్పుడనక పోతివీ.. ఎంత ఇయ్యాలె“


          “పది లక్షలు..”


          “ఆ..” నోరెల్లబెట్టింది అనసూయ. “ఇదేం పాపమవ్వా.. వీనికేమైంది.. పచ్చగనే ఉన్నడు కదా.. ఎప్పుడు తీసుకున్నడు తమ్ముడూ..“


          “తొలుత ఓ-జెనెరల్ కంపిని పెట్టినప్పుడు ధరావత్తు కోసం అడిగితే ఇచ్చిన. మీకు తెలిత్తే బాధ పడ్తరను చెప్పలేదు. నిజంగ అప్పుడు నాతాన అన్ని పైసలు లేవు. ప్రమీల తన ఒంటి మీది బంగారమంతా ఇచ్చింది అది అమ్మిన. కొంత మాదోస్తుల తాన బదలు తీస్కోని ఆదిరెడ్డికిచ్చిన”


          “తమ్ముడూ.. నిజంగ  దేవుడవు. మరదలు తన ఒంటి మీది నగలిచ్చిందంటే.. అది మామూలు మాటా.. నా కండ్లముందల ఉంటే కాళ్ళు మొక్కేదాన్ని” అని పైకి సూసుకుంట దేవునికి దండంపెట్టింది.


        “ఏండ్లు గడ్సినై కాని నీ బాకి తీర్సలే..”


          “ఓరకంగ తీర్సినట్టే తీర్సిండు. కాని నాకు ఫాయిద లేదక్కా.. ఇంకా తలనొప్పై కూకున్నది” అన్నడు సురేందర్.


          “అదేంది తమ్ముడూ.. అసలు సంగతి చెప్పు నాకు సమఝ్‌గాకచ్చింది”


          “అక్కా.. అల్లుడు ఒక సారి మామయ్యా.. నీకు పైసలియ్యలె గదా.. దాని బదులు ఒక మంచి ప్లాటిత్తనని ఫోన్ సేసిండు.. అది శంషాబాదు మేన్ రోడ్‌ల ఉన్నది. అని ఒక రోజు తీస్కపోయి సూయించిండు. ప్లాటు నాకు నచ్చింది. సరే అన్న. అయితే చిన్న లిటిగేషన్ ఉన్నది మామయ్యా.. లోకల్ కోర్టుల కేసేసినం. లక్ష రూపాయలకు ఏదైనా బ్యాంకు చెక్కియ్యి కర్సులకు. మూన్నెల్లల్ల రిజిస్టర్ చేత్త. ఒక వేళ కాకుంటే మొత్తం పైసలు వాపసిత్త. మంచి ప్లాటు రేపటికల్ల యాబై లచ్చలు చేత్తదన్నడు. అల్లుని మాటలు నమ్మి ఇంకో లక్షకు చెక్కిచ్చిన. అది కర్సులకు పోయినా.. నా పది లక్షలు నాకియ్యాలె గదా.. అటు ప్లాటూ లేదు. ఇటు పైసలూ ఇయ్యలేదు. సెల్లుకు ఫోన్ చేత్తే ఎత్తుత లేడు. నేను ఎప్పుడు రమ్మంటే అప్పుడత్త. కొంచెం ఆదిరెడ్డికి చెప్పు నేను వచ్చిపోయినట్టు ”


          అనసూయ ముక్కు మీద ఏలేసుకొని బీర్పోయి సూడబట్టింది. సురేందర్ లేచి నిలబడ్డడు.


          “కూకో తమ్ముడు. ఎండల బడి వచ్చినవ్. మల్ల ఎండల పోవుడేంది. ఎండ దెబ్బ తాకుతది. పగటీలి చెయ్యి కడుక్కోని కొంచెం ఎండ సల్ల బడ్డంక పోతువు గాని..కూకో..” అని బలవంత పెట్టింది.


          “లేదక్కా.. నాకు శాన పనులున్నై. ఎండకాలం సెలవుల్ల ఇంట్ల ట్యూషన్ చెబుతాన. మల్ల రమ్మన్నప్పుడు వత్త. ఆక్కా.. ఒక చిన్న మాట. ఆదిరెడ్డి నీయతి తప్పిండని.. పేరు చెడ గొట్టుకుంటాండని.. అందరు అనుకుంటాండ్లు. అనిమిరెడ్డికే ఇప్పుడు మంచి పేరున్నది.


ఆదిరెడ్డి ఏమైనా.. పైసల్ యావ తోటి ఉర్కుతాండు. బీద బిక్కికి చెయ్యి అందిత్త లేడు. నేను ఒకపాలి ఒక పిలగాన్ని పంపిన. అల్లుని కంపినిల ఏదైనా చిన్న పని ఇప్పిత్తడని. లేదు పొమ్మని ఎల్లగొట్టిండు” అని ఎన్కకు సూడకుంట కండ్లల్ల ఊరిన నీళ్ళు కనబడకుంటే బయట పడ్డడు సురేందర్.

***

No comments:

Post a Comment

Pages