"బంగారు" ద్వీపం (అనువాద నవల) -14
అనువాదం : గొర్తి వేంకట సోమనాథ శాస్త్రి (సోమసుధ)
Original : Five on a treasure Island (1942)
Wrier : Enid Blyton
(గోడపై నిలబడి తుఫాను సముద్రాన్ని గమనిస్తున్న జూలియన్ నల్లని పెద్ద వస్తువేదో ఉవ్వెత్తున ఎగిసిన అలలపై తేలుతూ, గట్టుకి కొట్టుకు రావడం గమనిస్తాడు. వెంటనే పరుగున వెళ్ళి, మిగిలిన పిల్లలను తీసుకొస్తాడు. అది ఇంతకాలం సముద్రంలో అడుగున ఉన్న తమ ఓడేనని, తుఫాను అలల వల్ల గట్టున ఉన్న రాళ్ళగుట్టపైకి చేర్చబడిందని జార్జి చెబుతుంది. తరువాత......)
@@@@@@@@@@@@
"సరే, ఈ విషయం మనం ఎవరికీ చెప్పవద్దు!" డిక్ అన్నాడు.
"పిచ్చిగా మాట్లాడకు" అంది జార్జి. "మత్స్యకారుల్లో ఎవరో ఒకరు తమ ఓడలో సముద్రంలో వెళ్ళేటప్పుడు దీన్ని తప్పకుండా చూస్తారు. ఈ వార్త త్వరలోనే బయటకు వస్తుంది."
"అయితే ఇక్కడ మరెవ్వరూ చేరకముందే, మనం ఈ ఓడను పూర్తిగా అన్వేషిద్దాం" ఆత్రుతగా చెప్పాడు డిక్. "దీని గురించి ఇంకా ఎవరికీ తెలియదు. ప్రస్తుతం మనకు మాత్రమే తెలుసు. అలల ఉధృతి తగ్గిన వెంటనే దాన్ని శోధించలేమా?"
"మనం ఆ బండరాళ్ళ మీద నడవలేము, అదేగా నువ్వు చెప్పేది!" అంది జార్జి. "మనం అక్కడకి పడవలో చేరుకోవచ్చు. కానీ అలలు పెద్దగా ఉన్న యిప్పుడు మనం తెగించలేము. అవి ఈరోజు శాంతించవన్నది ఖచ్చితం. గాలి ఇంకా చాలా బలంగా ఉంది."
"సరె! రేపు ఉదయం పెందరాళే?" జూలియన్ చెప్పాడు. "దాని గురించి ఎవరూ తెలుసుకోకముందే అయితే? మొదట మనం ఓడలోకి ప్రవేశించగలిగితే, అక్కడ ఏదైనా దొరుకుతుందని నేను పందెం వేస్తున్నాను!"
"అవును. మనం సాధించగలమనే ఆశిస్తున్నాను" అంది జార్జి. "గజ ఈతగాళ్ళు సముద్రంలో ములిగి, తమకు సాధ్యమైనంత మేర ఈ ఓడను అన్వేషించారని యిదివరకు నేను మీకు చెప్పాను. కానీ నీటిలో ఆ పని చేయటం చాలా కష్టం. వాళ్ళు వదిలేసినదేదో మనం కనుక్కోవచ్చు. ఓ! ఇది ఒక తీయని కల. శిధిలమైన నా పాత ఓడ సముద్రం అడుగునుంచి యిలా పైకి వచ్చిందన్న నిజాన్ని నేను నమ్మలేకపోతున్నాను!"
క్రమేపీ సూర్యుడు పైకి రావటంతో, ఆ సూర్యరశ్మిలో వాళ్ళ తడిసిన బట్టలు ఆరాయి. ఎండలో నిలబడ్డ వారి శరీరాలనుంచే కాదు, టిం కి వేసిన కోటు నుంచి కూడా నీటి ఆవిరి పైకి లేచింది. తనకి శిధిలమైన ఓడ అంటే యిష్టం లేనట్లుంది, అందుకే అదే పనిగా గుర్రుమంటున్నాడు.
"నువ్వు తమాషా చేస్తున్నావు టిం!" కుక్క మెడపై సున్నితంగా తట్టుతూ అంది జార్జి. "అది నీకు ఎలాంటి హాని చేయదు. అదేమిటని అనుకొంటున్నావు?"
"బహుశా అది తిమింగలమని అనుకొంటున్నాడేమో!" అన్నె నవ్వుతూ అంది. "ఓ జార్జి! ఇది నా జీవితంలో అత్యంత ఉత్తేజకరమైన రోజు. ఓహ్! మనం పడవను తీసుకొని ఆ శిధిలమైన ఓడను చేరుకోగలమేమో ప్రయత్నించలేమా?"
"లేదు, మనం చేరలేము" జార్జి చెప్పింది. "మనం మాత్రమే చేయగలమని నేనూ అనుకొంటున్నాను. కానీ అది పూర్తిగా అసాధ్యం అన్నె! మరొక విషయమేమిటంటే, ఆ ఓడ పూర్తిగా రాళ్ళపై స్థిరపడిందని నేను అనుకోవటం లేదు. ఆటుపోట్లు పూర్తిగా తగ్గేవరకూ అది అక్కడ ఉండకపోవచ్చు. మరొక పెద్ద అల వచ్చి దాన్ని మరింత ముందుకు నెట్టుతుందని చూస్తున్నాను. అప్పుడే అది పూర్తి స్థిరత్వంతో నిలబడుతుంది. ప్రస్తుతం దానిలోకి వెళ్ళటం ప్రమాదకరం. ఇంకొక విషయం ఏమిటంటే, నా పడవ రాళ్ళకు కొట్టుకొని ముక్కలవటం నాకు యిష్టం లేదు. అలా జరిగితే మనమంతా కల్లోలమైన సముద్రపు నీటి పాలవుతాం. ప్రస్తుతం మనం సాహసిస్తే జరిగేదదే! మనం రేపటి వరకూ వేచి ఉండాలి. అయితే పెందరాళే యిక్కడకు రావాలి. ఎదిగిన పెద్దలు ఎంతోమంది దీనిని అన్వేషించడం తమ వ్యాపారం అని భావిస్తారని నేను అనుకుంటున్నాను."
పిల్లలు కొద్దిసేపు శిధిలమైన ఓడను చూస్తూ గడిపారు. తరువాత మళ్ళీ ద్వీపాన్ని చుట్టి రావటానికి వెళ్ళారు. అది ఖచ్చితంగా చాలా పెద్ద దీవి కాదు కానీ చూడటానికి ఉత్తేజకరమైనది. చిన్నదైన రాతి తీరం, పడవను నిలిపి ఉంచిన సన్నటి జలమార్గం, శిధిలమైన కోట, దాని చుట్టూ ఎగిరే జాక్డా సముద్రపు కాకులు, చివరగా దీవిలో ప్రతిచోటా పరుగులు తీసే కుందేళ్ళతో చూడముచ్చటగా ఉంది.
"నేను దీన్ని ప్రేమిస్తున్నాను" అంది అన్నె. "నిజంగానే యిష్టపడుతున్నాను. ఇది నిజమైన ద్వీపంలా అనుభూతినిచ్చే చిన్న ప్రదేశం. చాలా దీవులు పెద్దగా ఉండటం వల్ల అవి దీవులన్న భావనే కలుగదు. ఉదాహరణకు బ్రిటన్ ఒక ద్వీపం. కానీ దానిలో నివసించే వాళ్ళకు అది ఒక ద్వీపమని చెబితే తప్ప తెలియదు. కానీ యిది నిజంగా దీవి అన్న అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే దీనిపై మనం ఎక్కడ నిలబడినా ఈ ద్వీపం యొక్క రెండవ అంచును చూడగలం. అందుకే నేను దీన్ని ప్రేమిస్తున్నాను."
జార్జి చాలా ఆనందంగా ఉంది. గతంలో ఆమె ఈ ద్వీపానికి చాలాసార్లు వచ్చింది. కానీ టిం తప్ప ఆమె యిక్కడ ఒంటరిగానే గడిపేది. ఎప్పుడూ, ఎప్పటికీ ఎవరినీ యిక్కడకు తీసుకు రాకూడదని ఆమె ప్రతిజ్ఞ చేసింది. ఎందుకంటే దానివల్ల ఆమె యిష్టపడే ఆమె ద్వీపం పాడు కావచ్చు. కానీ అది ప్రస్తుతం పాడైపోలేదు. మరింత అందంగా తయారైంది. ఆనందాలను యితరులతో పంచుకొంటే, తన ఆనందాన్ని రెట్టింపు చేస్తుందని జార్జికి మొదటిసారిగా అర్ధమైంది.
"అలలు కొద్దిగా తగ్గేవరకూ ఆగుదాం. అప్పుడు మనం తిరిగి యింటికి వెళ్తాం" చెప్పిందామె. "మరి కొంత వర్షం పడుతుందని నేను అనుకొంటున్నాను. దానిలో వెళ్తే, మనం పూర్తిగా తడిసిపోతాం. టీ సమయానికి మనం వెనక్కి వెళ్ళలేం. ఎందుకంటే వెనక్కి వచ్చే అలల తాకిడికి వ్యతిరేకంగా పడవను నిలవరిస్తూ చాలా శ్రమపడాల్సి ఉంటుంది.”
పిల్లలందరికీ ఉదయం ఉన్నంత ఉత్సాహం లేక కొద్దిగా అలసిపోయినట్లు అనిపించింది. వాళ్ళు పడవలో యింటికి వెళ్ళే దారిలో చాలా తక్కువ మాట్లాడారు. ఎగసిపడే అలలకు ఎదురు వెళ్తూ, బలహీనురాలైన అన్నె తప్ప మిగిలినవారంతా వంతుల వారీగా పడవను నడిపారు. అలా వెళ్తూ తాము వదిలిపెట్టిన దీవిని ఒకసారి చూసారు. బహిరంగ సముద్రానికి అభిముఖంగా, దీవికి అవతల వైపు ఉంది గనుక శిధిలమైన ఓడ వారికి కనిపించలేదు.
"అది అక్కడే ఉంది" అన్నాడు జూలియన్. "ఇంకా ఎవరూ దాన్ని చూడలేదు. చేపల కోసం పడవ వెళ్తేనే అది కనిపిస్తుంది. ఏదైనా పడవ అక్కడకు వెళ్ళటానికి ముందుగానే మనం అక్కడ ఉండాలి. అందుకే తెల్లవారుఝామునే లేవాలని నేను తీర్మానించుకొన్నాను."
"అది మరీ పెందరాళే అవుతుంది" అంది జార్జి. "అంత పొద్దునే మీరు లేస్తారా? నేను తరచుగా తెల్లవారుజామున బయటికి వస్తాను. కానీ మీకు ఆ అలవాటు లేదుగా!"
"మేము ఖచ్చితంగా నిద్ర లేస్తాం" అన్నాడు జూలియన్. "సరె! మనం తీరానికి తిరిగి చేరుకొన్నాం. నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ చేతులు బాగా అలసిపోయాయి. ఆకలి కూడా బాగా ఉంది. ప్రస్తుతం నేను మొత్తం ఒక దుకాణాన్నే తినేయగలను."
"ఊఫ్!" టిం కూడా సమ్మతిస్తున్నట్లు మూలిగింది.
"నేను టింని ఆల్ఫ్ దగ్గరకు తీసుకెళ్ళాలి" పడవలోంచి కిందకు దూకి జార్జి చెప్పింది. "జూలియన్! నువ్వు పడవను ఒడ్డు పైకి లాగే ప్రయత్నం చేయి. కొద్ది నిమిషాల్లో నేను మిమ్మల్ని కలుస్తాను."
వాళ్ళు ఇంట్లో టీ బల్ల దగ్గరకు చేరటానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఫానీ పిన్ని తాజా స్కోన్(రొట్టె) లను కాల్చింది. అంతేగాక నల్ల బెల్లంతో అల్లం కేకును చేసింది. అది ముదురు గోధుమరంగులో తినేటప్పుడు వేళ్ళకు అంటుకొనేలా ఉంది. పిల్లలు వాటన్నింటిని తిని, తాము యింతవరకూ రుచి చూసిన వాటిలో యిదే అత్యుత్తమైనదని అన్నారు.
"ఈరోజు ఉత్తేజంగా గడిచిందా?" అడిగిందామె.
"ఓ! బాగా. . ." అన్నె ఆత్రంగా చెప్పింది. "బ్రహ్మాండమైన తుఫాను. అది ఏమి విసిరిందంటే. ."
జూలియన్, డిక్ బల్ల కిందనుంచి ఆమెను కాలితో తన్నారు. ఆమె జార్జికి అందలేదు కానీ లేదంటే తాను కూడా మరింత గట్టిగా తన్ని ఉండేది. అన్నె కళ్ళలో నీళ్ళతో కుర్రాళ్ళ వైపు కోపంగా చూసింది.
"విషయం ఏమిటి?" ఫానీ అడిగింది. "అన్నె! ఎవరైనా నిన్ను తన్నారా? చూడండి. బల్ల కింద యిలా తన్నుకోవటం ఆపాల్సి ఉంటుంది. పిచ్చి అన్నె ఒళ్ళంతా దెబ్బలే! చెప్పమ్మా! సముద్రం దేన్ని విసిరింది?"
"అది . . . సముద్రం . . . పెద్ద పెద్ద అలలను పైకి విసిరింది" మిగిలిన పిల్లల వైపు నిర్లక్ష్యంగా చూస్తూ చెప్పింది అన్నె. సముద్రం పగిలిపోయిన ఓడ శకలాలను విసిరినట్లు చెబుతుందేమోనని వాళ్ళు భావించినట్లు ఆమె గ్రహించింది. కానీ వాళ్ళ ఆలోచన తప్పు! ఆమెను వాళ్ళు కారణమేమీ లేకుండానే తన్నారు!
"నిన్ను తన్నినందుకు క్షమించు అన్నె!" అన్నాడు జూలియన్. "పొరపాటున నా కాలు నీకు తగిలింది."
"నాది కూడా . . . అలాగే జరిగింది" అన్నాడు డిక్. "పిన్నీ! అది ఆ ద్వీపంలో ఒక అద్భుతమైన దృశ్యం. అలలు ఆ చిన్ని దీవిని వేగంగా వచ్చి చుట్టుముట్టాయి. పడవను మేము దాదాపుగా తక్కువ ఎత్తు గల కొండ పైకి మోసుకుపోవలసి వచ్చింది."
"నిజం చెప్పాలంటే, నేను తుఫాను గురించి అంతగా భయపడలేదు" చెప్పింది అన్నె. "వాస్తవానికి, నేను అంతగా భయపడలేదు. ఆ టి. . "
అన్నె తిమోతీ గురించి మాట్లాడబోతోందని వాళ్ళంతా గ్రహించారు. అందుకే ఆమె మాటలకు అడ్డు తగులుతూ, చాలా బిగ్గరగా మాట్లాడారు. జూలియన్ మరొకసారి ఆమెను కాలితో తన్నాడు.
"ఊ!" అంటూ అన్నె బాధతో మూలిగింది.
"కుందేళ్ళు చాలా చనువుగా మసులుతున్నాయి" జూలియన్ గట్టిగా చెప్పాడు.
(సశేషం)
No comments:
Post a Comment